స్వీడిష్ భాష
స్వీడిష్ భాష (స్వెన్‌స్కా అని కూడా పిలుస్తారు) ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన ఒక నార్త్ జర్మేనిక్ భాష. దీనిని ప్రధానంగా స్వీడన్ దేశంలోనూ, ఫిన్లాండ్ లో కొన్ని ప్రాంతాలలోనూ మాట్లాడతారు.[1] సుమారు ఒక కోటి మంది ప్రజలు ఈ భాషను మాట్లాడతారు. జర్మేనిక్ భాషలలో మాట్లాడే ప్రజల సంఖ్యాక్రమంలో దీనిది నాలుగో స్థానం. నార్డిక్ దేశాలలో మాట్లాడే జర్మేనిక్ భాషలలో ఈ భాషది మొదటి స్థానం.[2]
ఇతర నోర్డిక్ భాషలలాగే స్వీడిష్ భాష కూడా వైకింగ్ యుగంలో నివసించిన స్కాండినేవియాలో నివసించిన జర్మేనిక్ ప్రజల్లో సాధారణ భాష అయిన పాత నోర్స్ భాష నుంచి వచ్చింది. స్వీడిష్ భాష నార్వేజియన్, డేనిష్ భాషలకు దగ్గరగా ఉంటుంది. మాట్లాడే యాసను బట్టి సాధారణంగా ఈ మూడు భాషల్లో మాట్లాడేవారు ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. చాలామంది స్వీడన్ జాతీయులు ప్రామాణిక స్వీడిష్ భాషను మాట్లాడుతారు. ఇది అక్కడి జాతీయ భాష. 19వ శతాబ్దంలో స్వీడన్ మధ్యప్రాంతాల యాస నుంచి ఇది పరిణామం చెంది 20వ శతాబ్దం మొదలయ్యేసరికి ప్రామాణికంగా స్థిరపడింది. ఇప్పటికీ అక్కడ వివిధ ప్రాంతాల్లో వేర్వేరు యాసలు ఉన్నాయి కానీ వాటి రాతపద్ధతి ఒకటే. ఫిన్లాండ్ లో స్వీడిష్ రెండవ అత్యధిక భాష. అక్కడ దానికి ఫిన్నిష్ సరసన సహ అధికార భాష స్థాయిని ఇచ్చారు.
ఎస్టోనియాలోని కొన్ని ప్రాంతాలలో చాలాకాలంగా ఈ భాష మాట్లాడేవారు. అయితే క్రమేణా ఈ భాష మాట్లాడేవారు కనుమరుగయ్యారు. నార్వే లాంటి బయట దేశాల్లో స్థిరపడ్డ స్వీడిష్ ప్రజలు సుమారు 50000 మంది ఈ భాషను విరివిగా వాడుతారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Svenska talas också i Finland". Svenska språket (in స్వీడిష్). 7 December 2018. Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
- ↑ "Nordic Languages: What's The Difference?". Wordminds. 25 March 2019. Archived from the original on 3 February 2023. Retrieved 3 February 2023.
- ↑ "Var tionde Oslobo är nu svensk" (in స్వీడిష్). Sverige-Norge Personalförmedling. Archived from the original on 11 October 2018. Retrieved 11 October 2018.