హరి నాగభూషణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరి నాగభూషణం (1884 - 1959) ప్రముఖ ఆంధ్ర గాయకులు మరియు వాగ్గేయకారులు. వీరు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నృసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మొదట తన తండ్రి వద్దనే సంగీతం నేర్చుకున్నారు. సాహిత్యంలో పాండిత్యాన్ని, వేదాంత శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆర్జించి, ఆంగ్ల భాష అభ్యసించి పట్టభద్రులయ్యారు. ఈయన వృత్తి రీత్యా ప్లీడరు.[1] మద్రాసులో న్యాయశాస్త్ర విద్య అభ్యసించే రోజుల్లో ప్రముఖ వాయులీన విద్యాంసులైన తిరుక్కోడికావల్ కృష్ణన్ అయ్యర్, తిరుచ్చి గోవిందస్వామి పిల్లై తదితరులను వినే అవకాశం ఈయనకు కలిగింది.[2] ఫిడేలు వాదనలో వీరు బహుళ ప్రతిష్టపొందారు.

వీరు 1911 సంవత్సరంలో మచిలీపట్నంలో త్యాగరాజ సమాజాన్ని నెలకొల్పి ప్రతి ఏటా త్యాగరాజ వర్ధంతిని జరిపి, ప్రముఖ విద్వాంసులను ఆహ్వానించి కచేరీలు జరిపి సన్మానించేవారు. వీరు త్యాగరాజ చరిత్ర, శంకరాచార్య చరిత్ర, శ్రీరామకృష్ణోపాఖ్యానం మొదలైన రచనలు చేశారు. అమృత వర్షిణి, మాధవప్రియ మొదలైన రాగాలలో 12 కృతులను వీరు రచించారు.

వీరు 1916లో బరోడా సంస్థానాధిపతి ఆహ్వానం మేరకు జరిగిన సంగీత సమావేశంలో 22 శృతులను గురించి తన వాయులీన వాదనను ప్రదర్శించి "గాయకరత్న" అన్న బిరుదును పొందారు.

వీరు 1944లో పక్షవాతం వ్యాధిబాధితులై దీర్ఘకాలం బాధపడి 1959లో పరమపదించారు. వీరి కుమారుడు హరి అచ్యుతరామ శాస్త్రి ప్రముఖ సంగీతకారుడు.

మూలాలు[మార్చు]