హాలండ్
హాలండ్
| |
|---|---|
| దేశం | నెదర్లాండ్స్ |
జాబితా
| |
| ప్రాంతం | |
• మొత్తం
|
7,511 కిమీ 2 (2,900 చదరపు మి) |
| • భూమి | 5,476 కిమీ 2 (2,114 చదరపు మి) |
| జనాభా (1 నవంబర్ 2019) [1]
| |
• మొత్తం
|
6,583,534 |
| • సాంద్రత | 1,203/ కిమీ² (3,120/చదరపు కిమీ²) మి) |
| డెమోనిమ్ | హాలండర్ |
| జీడీపీ | |
| • మొత్తం | €448.623 బిలియన్లు (2023) |
| సమయ మండలం | UTC+1 ( CET ) |
| • వేసవి ( DST ) | UTC+2 ( CEST ) |
హాలండ్ అనేది నెదర్లాండ్స్ పశ్చిమ తీరంలో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం, పూర్వపు ప్రావిన్సు.[3] 10వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు, హాలండ్‌ను కౌంట్‌లు పాలించే ఒక కౌంటీగా ఉండేది. 17వ శతాబ్దం నాటికి, హాలండ్ ప్రావిన్స్ ఒక సముద్ర శక్తిగా, ఆర్థిక శక్తిగా ఎదిగి, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన డచ్చి రిపబ్లిక్‌లోని ఇతర ప్రావిన్సులపై ఆధిపత్యం చెలాయించింది.
పూర్వపు హాలండ్ కౌంటీ ప్రాంతం, దాన్ని విభజించగా ఏర్పడిన రెండు డచ్చి ప్రావిన్సులైన ఉత్తర హాలండ్, దక్షిణ హాలండ్‌లతో దాదాపుగా సమానంగా ఉంటుంది. ఈ రెంటిలో కలుపుకుని నెదర్లాండ్స్ లోని మూడు అతిపెద్ద నగరాలు ఉన్నాయి: రాజధాని నగరం (ఆమ్‌స్టర్‌డామ్), ఐరోపా లోని అతిపెద్ద ఓడరేవు ఉన్న (రోటర్‌డామ్), ప్రభుత్వ పీఠం ( ది హేగ్). 2019 నవంబరు నాటికి హాలండ్ జనాభా 65,83,534. జన సాంద్రత 1203/ కిమీ² .
హాలండ్ అనే పేరును నెదర్లాండ్స్ దేశం మొత్తాన్ని సూచించడానికి తరచుగా అనధికారికంగా, తప్పుగా ఉపయోగించారు. ఈ సాధారణ వాడుక ఇతర దేశాలలో సర్వసాధారణంగా ఆమోదించబడింది. చాలా మంది డచ్చి ప్రజలు కూడా దీనిని ఉపయోగిస్తారు.[4] అయితే, నెదర్లాండ్స్‌లోని కొందరు ప్రజలు (ముఖ్యంగా హాలండ్ వెలుపల లేదా పశ్చిమ ప్రాంతాల వెలుపల ఉన్న ప్రాంతాల వారు) దేశం మొత్తానికి ఈ పదాన్ని ఉపయోగించడం అవాంఛనీయమని, అది తప్పుగా సూచిస్తుందనీ భావిస్తారు. [5] 2020 జనవరిలో, నెదర్లాండ్స్ దేశం మొత్తానికి హాలండ్ అనే పదానికి తన మద్దతును అధికారికంగా ఉపసంహరించుకుంది. ఇందులో "హాలండ్"ను "NL"గా మార్చిన లోగో పునఃరూపకల్పన కూడా ఉంది.[6]
చరిత్ర
[మార్చు]మొదట్లో హాలండ్, పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో ఓ సుదూర ప్రాంతంగా ఉండేది. క్రమంగా ప్రాంతీయంగా దాని ప్రాధాన్యత పెరిగింది. తరువాత అది నెదర్లాండ్స్ చరిత్రపై నిర్ణయాత్మక ప్రభావం చూపింది. చివరకు ఆధిపత్య స్థాయికి చేరుకుంది.
హాలండ్ కౌంటీ
[మార్చు]
12వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రస్తుత హాలండ్ ప్రాంత ప్రజలను ఫ్రిసియన్లు అని పిలిచేవారు. ఈ ప్రాంతం మొదట ఫ్రిసియాలో భాగంగా ఉండేది. 9వ శతాబ్దం చివర్లో వెస్ట్-ఫ్రిసియా పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో ప్రత్యేక కౌంటీగా మారింది. 896 నుంచి 931 వరకు పాలించిన డిర్క్-I గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అతని తరువాత హాలండ్ వంశానికి చెందిన అనేక కౌంట్లు పాలన కొనసాగించారు. అయితే 1101 వరకు వారిని “ఫ్రిసియా కౌంట్లు”గానే పిలిచేవారు.
1299లో జాన్-I సంతానం లేకుండా మరణించాడు. దాంతో హాలండ్ కౌంటీ, హైనాట్‌కు చెందిన జాన్-II ఆధీనంలోకి వెళ్లింది. విలియమ్-V కాలానికి (1354–1388) హాలండ్ కౌంట్, హైనాట్, జీలాండ్ ప్రాంతాల కౌంట్ హోదాలను కూడా చేపట్టాడు.
1287లో జరిగిన సెయింట్ లూసియా వరదల తరువాత జుయిడర్‌జీ పశ్చిమ భాగంలోని వెస్ట్ ఫ్రీస్‌లాండ్‌ను హాలండ్ ఆక్రమించింది. ఆ తరువాత ఐదు శతాబ్దాలకు పైగా “హాలండ్ అండ్ వెస్ట్ ఫ్రిసియా” అనే సంయుక్త పరిపాలనా పేరు వాడుకలో కొనసాగింది. ఇదే కాలంలో “హుక్ అండ్ కాడ్ యుద్ధాలు” ప్రారంభమయ్యాయి. 1432లో హాలండ్ కౌంటెస్ జాకోబా (జాక్వెలిన్) హాలండ్‌ను బర్గండీ పాలకుడు ఫిలిప్-III (“ఫిలిప్ ది గుడ్”)కి అప్పగించాల్సి వచ్చింది.
1432 లో హాలండ్, బర్గండియన్ నెదర్లాండ్స్‌లో భాగమైంది. 1477 తరువాత హాబ్స్‌బర్గ్ పాలనలోని పదిహేడు ప్రావిన్సుల్లో చేరింది. 16వ శతాబ్దానికి హాలండ్ ఐరోపాలో అత్యంత పట్టణీకరణ చెందిన ప్రాంతంగా మారింది. జనాభాలో పెద్ద భాగం పట్టణాల్లో నివసించింది. బర్గండియన్ నెదర్లాండ్స్‌లో ఉత్తర ప్రాంతాల్లో హాలండ్ ప్రధాన శక్తిగా ఎదిగింది. ఆ ప్రాంతంలో బర్గండియన్ ఆధిపత్యాన్ని హాలండ్ రాజకీయ ప్రభావమే నిర్ణయించింది. హాలండ్ చివరి కౌంట్ ఫిలిప్-III ను ఎక్కువగా స్పెయిన్ రాజు ఫిలిప్-II పేరుతో గుర్తిస్తారు. 1581లో “యాక్ట్ ఆఫ్ అబ్జ్యురేషన్” ద్వారా అతడిని అధికారం నుంచి తొలగించారు. అయినప్పటికీ 1648లో మ్యూన్‌స్టర్ ఒప్పందం వరకు స్పెయిన్ రాజులు “హాలండ్ కౌంట్” బిరుదును కొనసాగించారు.
డచ్చి రిపబ్లిక్
[మార్చు]
ఎనభై ఏళ్ల యుద్ధ సమయంలో హాబ్స్‌బర్గ్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన డచ్చి తిరుగుబాటులో “వాటర్‌గ్యూజెన్” అనే తిరుగుబాటు నౌకాదళ బలగాలు 1572లో బ్రిల్ పట్టణంలో తమ తొలి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తరువాత హాలండ్, విస్తృత డచ్చి సమాఖ్యలో స్వతంత్ర రాష్ట్రంగా మారి తిరుగుబాటు కేంద్రంగా ఎదిగింది. 17వ శతాబ్దంలో, అంటే డచ్చి స్వర్ణయుగ కాలంలో, హాలండ్ సంయుక్త ప్రావిన్సుల సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రంగా నిలిచింది. ఆ సమయంలో డచ్చి రిపబ్లిక్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. స్పెయిన్ రాజును హాలండ్ కౌంట్ హోదా నుంచి తొలగించిన తరువాత కార్యనిర్వాహక, శాసన అధికారాలు “స్టేట్స్ ఆఫ్ హాలండ్” చేతుల్లోకి వెళ్లాయి. “గ్రాండ్ పెన్షనరీ” అనే రాజకీయ నాయకుడు ఈ వ్యవస్థకు నాయకత్వం వహించాడు.
డచ్చి రిపబ్లిక్‌లోని అతిపెద్ద నగరాలు హాలండ్ ప్రావిన్సులోనే ఉండేవి. వాటిలో ఆమ్‌స్టర్‌డామ్, రాటర్‌డామ్, లైడెన్, ఆల్క్మార్, ది హేగ్, డెల్ఫ్ట్, డోర్డ్రెక్ట్, హార్లెమ్ ముఖ్యమైనవి. హాలండ్ మహా నౌకాశ్రయాల నుంచి వ్యాపార నౌకలు ఐరోపా అంతటా ప్రయాణించేవి. ఐరోపా నలుమూలల వ్యాపారులు ఆమ్‌స్టర్‌డామ్ గిడ్డంగుల్లో, ఇతర వాణిజ్య పట్టణాల్లో వ్యాపారం చేసేవారు.
చాలా యూరోపియన్లు “సెవెన్ యునైటెడ్ ప్రావిన్సెస్ రిపబ్లిక్” కంటే ముందుగా “హాలండ్” అనే పేరునే గుర్తించేవారు. హాలండ్ గురించిన బలమైన అభిప్రాయం ఇతర యూరోపియన్లలో ఏర్పడి, తరువాత అది మొత్తం రిపబ్లిక్‌పై ప్రతిబింబించింది. రిపబ్లిక్‌లోని ఇతర ప్రావిన్సులలో కూడా క్రమంగా సాంస్కృతిక మార్పులు చోటుచేసుకున్నాయి. దీనివల్ల “హాలండీకరణ” ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణ హాలండ్ మాండలికం క్రమంగా ప్రామాణిక భాషగా మారింది.
ఫ్రెంచి పాలనలో
[మార్చు]
ఫ్రెంచ్ విప్లవ ప్రభావంతో బటావియన్ రిపబ్లిక్ ఏర్పడింది. దీనివల్ల కేంద్రీకృత పరిపాలన బలపడింది. హాలండ్ స్వతంత్ర ప్రావిన్సు స్థాయి కోల్పోయి ఏకీకృత రాష్ట్రంలోని భాగమైంది. 1798 పరిపాలనా సంస్కరణలలో హాలండ్ భూభాగాన్ని అనేక విభాగాలుగా విభజించారు. వాటిలో ఆమ్‌స్టెల్, డెల్ఫ్, టెక్సెల్, అలాగే స్కెల్డే ఎన్ మాస్‌లోని భాగాలు ఉన్నాయి.
1806 నుంచి 1810 వరకు నెపోలియన్ తన సోదరుడు లూయీ నెపోలియన్ పాలనలో “కింగ్‌డమ్ ఆఫ్ హాలండ్” అనే అనుబంధ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కొంతకాలం లూయీ కుమారుడు నెపోలియన్ లూయీ బోనపార్ట్ కూడా పాలన నిర్వహించాడు. ఈ రాజ్యంలో ఆధునిక నెదర్లాండ్స్‌లోని చాలా ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఆ కాలానికి “హాలండ్” అనే పేరు మొత్తం బెల్జియం కాని నెదర్లాండ్స్‌కు సమానార్థకంగా మారిందని ఇది చూపిస్తుంది.[7]
1810 నుంచి 1813 వరకు లో కంట్రీస్ ప్రాంతం నేరుగా ఫ్రెంచ్ సామ్రాజ్యంలో విలీనం అయింది. ఆ సమయంలో హాలండ్‌ను “జుయిడర్‌జీ”, “బూష్-ద-లా-మ్యూస్” అనే డిపార్ట్‌మెంట్‌లుగా విభజించారు. 1811 నుంచి 1813 వరకు చార్లెస్-ఫ్రాన్స్వా లెబ్రన్, డ్యూక్ డి ప్లైజాన్స్ గవర్నర్-జనరల్‌గా పనిచేశాడు. అతనికి ఆంటోయిన్ డి సెల్స్, గోస్విన్ డి స్టాసార్ట్, ఫ్రాన్స్వా జీన్-బాప్టిస్ట్ డ్‌అల్ఫోన్స్ సహకరించారు.[8] 1813లో డచ్చి ప్రముఖులు “సావరిన్ ప్రిన్సిపాలిటీ ఆఫ్ ది యునైటెడ్ నెదర్లాండ్స్” స్థాపనను ప్రకటించారు.
నెదర్లాండ్స్ రాజ్యం
[మార్చు]1815లో హాలండ్ మళ్లీ “యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ ది నెదర్లాండ్స్”లో ప్రావిన్సుగా ఏర్పడింది. 1830 బెల్జియన్ విప్లవం తరువాత 1840లో హాలండ్‌ను ప్రస్తుత ఉత్తర హాలండ్, దక్షిణ హాలండ్ ప్రావిన్సులుగా విభజించారు. ఈ విభజన IJ జలమార్గం ఆధారంగా ఉన్న చారిత్రక విభజనను ప్రతిబింబించింది. అప్పట్లో దక్షిణ భాగాన్ని “జుయిడర్‌క్వార్టియర్”, ఉత్తర భాగాన్ని “నోర్డర్‌క్వార్టియర్” అని పిలిచేవారు.[9] అయితే ప్రస్తుత విభజన పాత సరిహద్దులతో పూర్తిగా సరిపోలదు. 1850 తరువాత నెదర్లాండ్స్‌లో జాతీయ నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుంది. ఆధునికీకరణ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్ర రూపం దాల్చింది. సాంస్కృతిక ఏకీకరణ కూడా బలపడింది. ఈ ప్రక్రియకు హాలండ్ పట్టణాలు కేంద్రాలుగా నిలిచాయి.[10]
భౌగోళిక శాస్త్రం
[మార్చు]

హాలండ్ నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలో ఉంది. ఇది సముద్రతీర ప్రాంతం. ఉత్తర సముద్రం తీరాన, రైన్ నది, మ్యూస్ నది (మాస్) ముఖద్వారాల వద్ద విస్తరించింది. ఈ ప్రాంతంలో అనేక నదులు, సరస్సులు ఉన్నాయి. విస్తృత అంతర్గత కాలువలు, జలమార్గాల వ్యవస్థ కూడా కనిపిస్తుంది. దక్షిణాన జీలాండ్ ప్రాంతం ఉంది. తూర్పున ఐజ్‌సెల్‌మీర్ సరస్సు, నెదర్లాండ్స్‌కు చెందిన నాలుగు ప్రావిన్సులు సరిహద్దులుగా ఉన్నాయి.
తీరం పొడవునా ఉండే ఇసుక దిబ్బలు హాలండ్‌ను సముద్రపు అలల నుంచి రక్షిస్తాయి. సముద్రమట్టానికి సుమారు 55 మీటర్ల ఎత్తులో ఉన్న స్కోర్ల్స్ డ్యూనెన్ (Schoorl Dunes) హాలండ్‌లోని అత్యంత ఎత్తైన స్థలం. ఇసుక దిబ్బల వెనుకనున్న భూభాగంలో పెద్ద భాగం పోల్డర్ భూభాగంగా ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా సముద్రమట్టానికి చాలా దిగువన ఉంటుంది. ప్రస్తుతం హాలండ్‌లో అత్యంత నిమ్న స్థలం రాటర్‌డామ్ సమీపంలోని ఒక పోల్డర్. అది సముద్రమట్టానికి సుమారు 7 మీటర్ల దిగువన ఉంది.
వరదలు రాకుండా నిరంతర నీటి తొలగింపు అవసరం అవుతుంది. గత శతాబ్దాల్లో ఈ పనికి గాలిమరలు ఉపయోగించారు. హాలండ్ అంతటా అనేక గాలిమరలు కనిపించేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అవి కనిపిస్తాయి. కాలక్రమంలో గాలిమరలు హాలండ్‌కు ప్రతీకగా మారాయి.
భూమి, జలభాగం కలిపి హాలండ్ విస్తీర్ణం 7,494 చ.కి.మీ. ఇది మొత్తం నెదర్లాండ్స్ విస్తీర్ణంలో సుమారు 13 శాతం. కేవలం భూభాగాన్ని మాత్రమే పరిగణిస్తే, దాని విస్తీర్ణం 5,488 చ.కి.మీ. 2018 నాటికి ఈ ప్రాంత జనాభా సుమారు 65 లక్షలు.
హాలండ్ ప్రధాన నగరాలు ఆమ్‌స్టర్‌డామ్, రాటర్‌డామ్, ది హేగ్. ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్‌కు రాజధాని. అలాగే అతిపెద్ద నగరం కూడా. రాటర్‌డామ్ నౌకాశ్రయం యూరప్‌లో అతిపెద్దదీ, అత్యంత ముఖ్యమైనదీ. ది హేగ్ నెదర్లాండ్స్ ప్రభుత్వానికి పీఠం. ఈ నగరాలు, ఉట్రెక్ట్ వంటి ఇతర పట్టణాలతో కలిసి “రాండ్‌స్టాడ్” అనే మహానగర సముదాయం ఏర్పరుస్తాయి.
రాండ్‌స్టాడ్ ప్రాంతం యూరప్‌లో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటి. అయినప్పటికీ అదుపు తప్పిన పట్టణ విస్తరణ ఇక్కడ తక్కువగానే కనిపిస్తుంది. ఇందుకు కఠిన భూవినియోగ చట్టాలు కారణం. జనాభా ఒత్తిడి చాలా ఎక్కువ. ఆస్తి విలువలు కూడా అధికంగా ఉంటాయి. పట్టణాల అంచుల్లో కొత్త గృహ నిర్మాణాలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే ప్రావిన్సులో అధిక భాగం ఇప్పటికీ గ్రామీణ రూపంలోనే ఉంది. మిగిలిన వ్యవసాయ భూములు, సహజ ప్రాంతాలను ప్రజలు ఎంతో విలువైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వం వాటిని రక్షిస్తుంది. సాగుభూమిలో పెద్ద భాగం అధిక సాంద్రత వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఉద్యానవనం, గ్రీన్‌హౌస్ వ్యవసాయ వ్యాపారాలు ముఖ్యంగా అభివృద్ధి చెందాయి.
భూమి పునరుద్ధరణ
[మార్చు]
ప్రస్తుత హాలండ్ భూభాగం చరిత్రపూర్వ కాలం నుంచి స్థిరంగా లేదు. పశ్చిమ తీరరేఖ కొన్ని ప్రాంతాల్లో సుమారు 30 కిలోమీటర్ల మేర తూర్పు వైపుకు మారింది. తుఫాను అలలు తరచూ తీరంలోని ఇసుక దిబ్బలను ఛేదించాయి. మొదట ప్రధాన భూభాగానికి కలిసివున్న ఫ్రీసియన్ దీవులు తరువాత ఉత్తరాన విడిపోయి వేరే దీవులుగా మారాయి. రైన్, మ్యూస్ నదులకు తరచూ వరదలు వచ్చేవి. అవి తమ ప్రవాహ మార్గాలను అనేకసార్లు మార్చుకున్నాయి. ఈ మార్పులు కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో జరిగాయి.
హాలండ్ ప్రజలు అస్థిరమైన, నీటితో నిండిన వాతావరణంలో జీవించారు. నెదర్లాండ్స్ తీరంలోని ఇసుక దిబ్బల వెనుక భాగంలో భారీ పీట్ మైదానం ఏర్పడింది. అది సముద్రపు అలల నుంచి సహజ రక్షణగా నిలిచింది. ఈ ప్రాంతంలో పెద్ద భాగం బురద నేలలు, చిత్తడులతో నిండిపోయింది. 10వ శతాబ్దంలో ప్రజలు ఈ భూమిని సాగుకు అనుకూలంగా మార్చడం ప్రారంభించారు. నీటిని తొలగించి భూమిని ఎండబెట్టారు. కానీ ఈ ప్రక్రియ కారణంగా నేల తీవ్రమైన కుదింపుకు లోనైంది. కొన్నిచోట్ల భూమి ఉపరితలం సుమారు 15 మీటర్ల వరకు కుంగింది.
హాలండ్ దక్షిణాన జీలాండ్ ప్రాంతంలోనూ, ఉత్తరాన ఫ్రీసియాలోనూ ఈ పరిణామాలు ఘోర తుఫాను వరదలకు దారితీశాయి. పీట్ పొరలు విడిపోవడంతో, వరదనీరు మొత్తం ప్రాంతాలను కొట్టుకుపోయింది. ఫ్రీసియా వైపు నుంచి సముద్రం తూర్పు ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చింది. క్రమంగా హాలండ్ వెనుక భాగాన్ని కొరికి జుయిడర్‌జీని (ప్రస్తుత ఐజ్‌సెల్‌మీర్) రూపొందించింది. ఈ అంతర్గత సముద్రం దక్షిణాన ఉన్న “మునిగిపోయిన జీలాండ్ భూములతో” కలిసే ప్రమాదం ఏర్పడింది. అలా జరిగి ఉంటే హాలండ్ సన్నని ఇసుక దిబ్బల దీవుల సమూహంగా మారిపోయేది. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం పెద్దయెత్తున జోక్యం చేసుకోవడం హాలండ్‌ను రక్షించింది. హాలండ్ కౌంట్లు, పెద్ద మఠాలు ముందడుగు వేశాయి. ముఖ్య ప్రాంతాల రక్షణ కోసం భారీ అత్యవసర ఆనకట్టలు నిర్మించారు. తరువాత “వాటర్‌స్కాపెన్” అనే స్వతంత్ర జల పరిపాలనా సంస్థలు ఏర్పడ్డాయి. నీటి నిర్వహణపై నియమాలు అమలు చేసే చట్టబద్ధ అధికారం వీటికి లభించింది. ఈ సంస్థలు తరువాత విస్తృత ఆనకట్టల వ్యవస్థ నిర్మించాయి. తీరప్రాంతం, పోల్డర్ల చుట్టూ రక్షణ కట్టలు నిర్మించడంతో సముద్రపు చొరబాట్లు తగ్గాయి.
16వ శతాబ్దం నుంచి హాలండ్ ప్రజలు భూమిని పునరుద్ధరించే పనులు ప్రారంభించారు. సరస్సులు, బురద నేలలు, సముద్ర తీర మట్టి భూములను పోల్డర్లుగా[గమనిక 1] మార్చారు. ఈ ప్రక్రియ 20వ శతాబ్దం వరకు కొనసాగింది. అందుకే మధ్యయుగాల, తొలి ఆధునిక కాలపు హాలండ్ మ్యాపులకూ ప్రస్తుతం కనిపించే మ్యాపులకూ పోలికలు చాలా తక్కువగా ఉంటాయి.
భాషలు
[మార్చు]హాలండ్‌లో ప్రధానంగా డచ్చి భాష మాట్లాడుతారు. హాలండ్ ప్రజలు కొన్నిసార్లు డచ్చి భాషను సాధారణంగా వాడే “నెడర్‌లాండ్స్” (Nederlands) అన్న పదం బదులు “హాలండ్స్” (Hollands) అని పిలుస్తారు.[11] బెల్జియం ప్రజలు, అలాగే నెదర్లాండ్స్‌లోని ఇతర ప్రావిన్సుల ప్రజలు “హాలండ్స్” అన్న పదాన్ని హాలండ్ మాండలికం లేదా బలమైన హాలండ్ ఉచ్చారణ అర్థంలో వాడుతారు.
ప్రామాణిక డచ్చి భాష చారిత్రకంగా హాలండ్ కౌంటీ మాండలికంపై ఎక్కువగా ఆధారపడింది. అయితే అప్పట్లో మరింత శక్తివంతమైన డచీ ఆఫ్ బ్రాబంట్, కౌంటీ ఆఫ్ ఫ్లాండర్స్ మాండలికాల ప్రభావం కూడా దానిలో కలిసింది. లో కంట్రీస్ ప్రాంతం అంతటా ఇప్పటికీ బలమైన మాండలిక వైవిధ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అసలు హాలండ్ మాండలికాలు అత్యల్పంగా వినిపించే ప్రాంతం హాలండ్‌నే. అనేక ప్రాంతాల్లో వాటి స్థానంలో ప్రామాణిక డచ్చి పూర్తిగా స్థిరపడింది. రాండ్‌స్టాడ్ ప్రాంతం ప్రామాణిక డచ్చి అభివృద్ధిపై అత్యధిక ప్రభావం చూపుతోంది. అయితే బెల్జియంలో మాట్లాడే డచ్చి ఈ ప్రభావానికి కొంత భిన్నంగా ఉంటుంది.[12]
ప్రామాణిక డచ్చికీ, రాండ్‌స్టాడ్ డచ్చికీ మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ హాలండ్‌లోనే అనేక స్థానిక భాషా వైవిధ్యాలు కనిపిస్తాయి. అవి ప్రామాణిక డచ్చి కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ప్రతి ప్రధాన నగరానికి తనదైన ఆధునిక పట్టణ మాండలికం ఉంది. భాషా శాస్త్రవేత్తలు వాటిని సామాజిక మాండలికాలుగా పరిగణిస్తారు. ప్రత్యేకంగా ఆమ్‌స్టర్‌డామ్ ఉత్తర ప్రాంతాల్లో కొంతమంది ఇప్పటికీ అసలు హాలండిక్ మాండలికాన్ని మాట్లాడుతున్నారు. ఈ మాండలికం ఉత్తర ప్రాంతాల్లోని వోలెండామ్, మార్కెన్, వెస్ట్ ఫ్రీస్‌లాండ్, జాన్‌స్ట్రీక్ ప్రాంతాల్లో వినిపిస్తుంది. అలాగే ఉత్తర బ్రాబంట్, ఉట్రెక్ట్ ప్రావిన్సుల సరిహద్దులకు సమీపంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. దక్షిణాన గూరీ-ఓవర్‌ఫ్లాకీ దీవిలో జీలాండిక్ మాండలికం మాట్లాడుతారు.[13]
గమనికలు
[మార్చు]- ↑ పోల్డరు అంటే నీరు నిలిచే సహజమైన పల్లపు ప్రాంతం. సముద్రమట్టం కంటే తక్కువ ఉండే పల్లపు ప్రాంతం ఇది. పోటు సమయంలో వత్తిడికి నీరు పోల్డరు లోకి చేరుతుంది. పాటు సమయంలో స్లూయిస్‌లను తెరిచి నీటిని బయటికి పంపిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "CBS Statline". Archived from the original on 2017-08-03. Retrieved 2020-01-10.
- ↑ "CBS StatLine".
- ↑ G. Geerts & H. Heestermans, 1981, Groot Woordenboek der Nederlandse Taal. Deel I, Van Dale Lexicografie, Utrecht, p 1105
- ↑ Netherlands vs. Holland Archived 2020-11-24 at the Wayback Machine, Netherlands Board of Tourism & Conventions
- ↑ "Holland or the Netherlands?". Dutch Embassy in Sweden. Archived from the original on 27 October 2016. Retrieved 15 December 2012.
- ↑ Romano, Andrea (January 7, 2020). "The Netherlands Will No Longer Be Called Holland". Travel + Leisure (in ఇంగ్లీష్). Retrieved 2022-02-05.
- ↑ Willem Frijhoff, "Hollands hegemonie" in Thimo de Nijs and Eelco Beukers (eds.), 2002, Geschiedenis van Holland, Vol.
- ↑ C.F. Gijsberti Hodenpijl (1904) Napoleon in Holland, pp. 6–7.
- ↑ G. Geerts & H. Heestermans, 1981, Groot Woordenboek der Nederlandse Taal.
- ↑ Hans Knippenberg and Ben de Pater, "Brandpunt van macht en modernisering" in Thimo de Nijs and Eelco Beukers (eds.), 2003, Geschiedenis van Holland, Vol.
- ↑ Dutch: An Essential Grammar, p. 15 Archived 2015-05-20 at the Wayback Machine, William Z. Shetter, Esther Ham, Routledge, 2007
- ↑ Sijs, Nicoline van der, 2006, De geschiedenis van het Nederlands in een notendop, Amsterdam, Uitgeverij Bert Bakker, pp. 127–128
- ↑ E.J. van den Broecke-de Man, D.K. Soldaat-Poortvliet & F. Heerschap, 1988, Dialect op Goeree-Overflakkee, Zeeuwsche Vereeniging voor Dialectonderzoek, Ouddorp, 271 pp