హిమాయత్‌ఖాన్
హిమాయత్‌ఖాన్ | |
---|---|
పరిపాలన | 1733–1752 |
ఇంతకు ముందున్నవారు | పాలకవంశ స్థాపకుడు |
తరువాతి వారు | మునవర్‌ఖాన్ 1 |
రాజకుటుంబము | కర్నూలు నవాబులు |
తండ్రి | దావూద్ ఖాన్ |
హిమాయత్‌ఖాన్ కర్నూలు నవాబుల పాలకవంశానికి ఆద్యుడు. 19 సంవత్సరాలు నవాబుగా పరిపాలన చేసి, ముట్టడిలో ఓటమిచెందాకా ఆయన తమ్ముడు వారసుడయ్యాడు[1].
రాజకీయ నేపథ్యం
[మార్చు]హిమాయత్ ఖాన్ తండ్రి దావూద్ ఖాన్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వద్ద సేనానిగా పనిచేసేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1687లో గోల్కొండతో పాటుగా దక్షిణాన ఉన్న మరికొన్ని రాజ్యాలను జయించారు. ఆ క్రమంలో జయించిన కర్నూలుని దావూద్ ఖాన్‌కు జాగీరుగా యిచ్చారు[1].
పాలకవంశ స్థాపన-పరిపాలన
[మార్చు]తన దావూద్ ఖాన్ కేవలం జాగీరుదారుగా 1733లో మరణించగా ఆయన తర్వాత పాలనకు వచ్చినాకా హిమాయత్ ఖాన్ అల్లకల్లోలంగా ఉన్న దక్షిణ భారతదేశ స్థితిగతుల నేపథ్యంలో నవాబైనారు. తండ్రికి జాగీరు లభించిన నాటికి ఔరంగజేబు అద్వితీయంగా దక్షిణభారత విజయాలతో వెలిగిపోతుండగా, హిమాయత్ ఖాన్ పరిపాలనకు వచ్చేనాటికి ఔరంగజేబును శివాజీ అల్లకల్లోల స్థితికి తీసుకురావడం, ఆయన మరణం, ఆపైన వారసుల పోరుతో పదిహేనేళ్ళ స్వల్పవ్యవధిలో అయిదుగురు చక్రవర్తి పదవిలో మారడం, అంతర్గత కల్లోలాలతోనే కాక మరాఠా పీష్వా, గొప్ప సేనాని బాజీరావు 1 మొఘల్ భూభాగాలను చేజిక్కించుకోవడం, దక్కన్ సుబేదారు నిజాం స్వతంత్రుడు కావడం వంటి ఘటనలతో మొఘలులప్రభ అడుగంటింది. ఈ పరిణామాలకు పతాకగా 1737లో బాజీరావు 1 ఏకంగా ఢిల్లీపైనే దాడిచేసి సుశిక్షితులైన మొఘల్ సైన్యాలను దారుణంగా ఓడించారు. ఈ నేపథ్యంలో హిమాయత్ ఖాన్ జాగీర్దారు స్థితి నుంచి నవాబుగా ప్రకటించుకునేందుకు, అందుకు మొఘలులు అంగీకరించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడి కర్నూలు నవాబుల పాలకవంశం ఏర్పండేందుకు వీలుచిక్కింది[1].
ఐతే ఇతనికాలంలో నే 1740లో మరాఠీ సైన్యం వచ్చి రాజ్యాన్ని కొల్లగొట్టింది. వారి సైనిక విధానాలు, రాజకీయ లక్ష్యాలు వేరుగా ఉండడంతో ఈ పోరాటంలో వారు నవాబు రాజ్యాన్ని సామంతరాజ్యం చేసుకోవడం వంటివి చేయలేదు. ఐతే ఈ దాడిలో ప్రజలు, ప్రభుత్వం ఆర్థికంగా, సైనికపరంగానే కాక నైతిక స్థైర్యం పరంగా కూడా చాలా దెబ్బతిన్నారు. జానపదులు ఆ దాడుల గురించిన పాటలు శతాబ్దాల తరబడి పాడుతూండేవారు[1].
ఓటమి-పదవీచ్యుతి
[మార్చు]1748 ప్రాంతంలో కర్ణాటక నవాబు వారసత్వ తగాదాల విషయమై ఫ్రెంచివారు-ఆంగ్లేయుల నడుమ వివాదాలు, వివిధ కారణాలతో యుద్ధాలు జరిగాయి. బ్రిటీష్ వారు ఫ్రెంచి నౌకలపై దాడులు చేశారు. ఈ వివాదాల్లో హిమాయత్ ఖాన్ పాలుపంచుకుని ఆంగ్లేయుల పక్షాన, ఫ్రెంచివారి పక్షాన మార్చిమార్చి రాజకీయాలు నెరపారు. దీనికి ఫలితంగా 1750లో ఫ్రెంచి సేనాని బుస్సీ, సలాబత్ ఖాన్‌లు కలిసి కర్నూలును ముట్టడించారు. ఈ యుద్ధంలో ఓడిపోవడంతో హిమాయత్ ఖాన్ పరిపాలన ముగిసింది. ఫ్రెంచివారు అతని తమ్ముడైన మునవర్ ఖాన్ 1ను కర్నూలుకు నవాబును చేశారు[1].
మూలాలు
[మార్చు]
ఇంతకు ముందు ఉన్నవారు: ' |
కర్నూలు నవాబులు 1733 — 1752 |
తరువాత వచ్చినవారు: మునవర్‌ఖాన్ 1 |