హెచ్. దేవదానము
హెచ్. దేవదానము | |
---|---|
జననం | హెచ్. దేవదానము 1902 హనుమనగుత్తి, యర్రగుంట్ల మండలం,కడప జిల్లా, |
మరణం | 1954, నవంబరు 29 |
ప్రసిద్ధి | కవి, రచయిత |
మతం | హిందూ |
పిల్లలు | ఐదుగురు కుమారులు |
హెచ్. దేవదానము (1902 - 1954, నవంబరు 29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. సమాజ సేవకుడిగా ప్రసిద్ధి చెందాడు.[1]
జననం, కుటుంబం
[మార్చు]దేవదానము 1902లో కడప జిల్లా, యర్రగుంట్ల మండలంలోని హనుమనగుత్తిలో జన్మించాడు. ఇతను క్రైస్తవ మతానికి చెందినవాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]దేవదానముకి ఐదుగురు కుమారులు. వారి పెద్ద కుమారుడు హెచ్. విజయరత్నం జోసఫ్ బి.ఎ. (ఆనర్సు) అనంతపురం కళాశాలలో 1907లో పనిచేశాడు, 'దీనాలాపము' అనే సాంఘిక నాటకాన్ని రచించి ప్రచురించారు. 1910లో దేవదానము భార్య చనిపోయింది, 'స్వప్న వల్ల భుఁడు' కావ్యాన్ని ఆమెకు అంకితం చేశాడు.
ఉద్యోగం
[మార్చు]1927 నుండి 1934 వరకు బళ్ళారిలోని నెంటు ఫిలామినసు హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేశాడు. బళ్ళారిని విడిచిన తరువాత కడప జిల్లాలోని బద్వేలుకు చేరుకొని అక్కడ టోరు హైస్కూలులో ప్రధానాంధ్రోపాధ్యాయులుగా పనిచేశాడు.
సాహిత్య ప్రస్థానం
[మార్చు]క్రైస్తవ నాటకాలు
[మార్చు]హిందూ పురాణాలు, శాస్త్రాలపై విశేషమైన ఆసక్తి కనబరిచాడు. బాల్యం నుండే యేసునామ సద్గురు సేవలో నిమగ్నమైన దేవదానము క్రైస్తవ మత భక్తిని ప్రతిబింబించే అనేక నాటకాలు, ఇతర గ్రంథాలను రచించాడు. ఇతని నాటకాలు రాయలసీమలోని క్రైస్తవ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి, ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ప్రదర్శించబడేవి. అయితే, ఆ నాటకాలు ముద్రించబడలేదు.
ముఖ్య రచనలు
[మార్చు]దేవదానము అనేక రచనలు చేశాడు, వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
- ప్రేమసుందరి (ఈ నవల రెండు భాగాలుగా శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల ద్వారా ముద్రించబడి, మంచి ఆదరణ పొందింది)
- మృత్యుంజయ స్మృతి (ఇది యేసునాథుని చరిత్రను తెలిపే ఒక కావ్యం. ఇందులో దాదాపు రెండు వందల పద్యాలు ఉన్నాయి)
- దీనాలాపములు (సమాజంలోని కొందరు వ్యక్తులు అనుభవించే కష్టాలను, వారి దీనత్వాన్ని తెలిపే ఒక ఖండిక)
- ఆకటిచిచ్చు (భారతదేశంలోని దారిద్ర్యం, ఆహార కొరత, కుల మత భేదాలు మొదలైన సమస్యలను వివరిస్తూ గాంధీ మహాత్మునికి అంకితమిచ్చిన పద్య కావ్యం)
- స్వప్నవల్లభుఁడు (కడప మండలంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన ఆధారంగా రచించబడిన కావ్యం. దీనిని శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల తమ 12వ పుష్పంగా ప్రచురించింది)
గ్రంథ ప్రచురణోద్యమం, శ్రీ కృష్ణ దేవ రాయ గ్రంథమాల స్థాపన
[మార్చు]దేవదానము , కల్లూరు అహోబలరావు, ఘూళీ కృష్ణమూర్తితో కలిసి రాయలసీమలో ఒక గ్రంథ ప్రచురణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ముగ్గురి కృషి ఫలితంగా 1931లో బళ్ళారిలో 'శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల' స్థాపించబడింది. దేవదానము ఈ గ్రంథమాలకు కార్యదర్శిగా వ్యవహరించారు, కడప జిల్లాలో గ్రంథమాల ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం