జగిత్యాల
?జగిత్యాల తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°48′N 78°56′E / 18.8°N 78.93°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 28.25 కి.మీ² (11 చ.మై) |
జిల్లా (లు) | జగిత్యాల |
జనాభా • జనసాంద్రత |
96,460[1] (2011 నాటికి) • 3,415/కి.మీ² (8,845/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | జగిత్యాల పురపాలకసంఘం |
జగిత్యాల, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలానికి చెందిన పట్టణం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[3] ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంద్రం.ఇది హైదరాబాదుకు 210 కి.మీ. దూరంలో ఉంది. 1952లో 3వ గ్రేడ్ పురపాలకసంఘంగా ఏర్పడింది. 1984లో 2వ గ్రేడ్ పురపాలకసంఘంగా, 2009లో 1వ గ్రేడ్ జగిత్యాల పురపాలక సంఘంగా మార్చబడింది.[4]
విశేషాలు
[మార్చు]చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా 1747లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు. జగిత్యాల ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రం.
నిజాం పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేములవాడ (42 కి.మీ), ధర్మపురి (30 కి.మీ), కొండగట్టు (15 కి.మీ) ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన పొలాస (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది. అలాగే వీటితో పాటు చూడదగ్గ ప్రదేశం పెంబట్ల దుబ్బ రాజన్న స్వామి ఆలయం ఇది 11 కి.మీ దూరంలో ఉంటుంది., బీర్పూర్ మండల కేంద్రం అయిన 25 కి.మీ దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఉంటుంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పొలాస గ్రామములో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( అగ్రికల్చర్ పాలిటెక్నిక్ బియస్సీ & పిజి ) కళాశాలలు ఉన్నాయి.డాక్టరు వి.ఆర్.కె. ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పలు జూనియర్ & డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి జగిత్యాలలో ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కాలేజ్ పట్టణంలో ఉన్నాయి, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి. కోరుట్లలో ప్రభుత్వ పశువైద్య వెటర్నరీ కళాశాల ఉంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉంది నూక పల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో వృత్తివిద్య కళాశాల, బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ కేంద్రాలు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. సా.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు కథనం. మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా సా.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయి జాక్ సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు.
జగిత్యాల కోట
[మార్చు]జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది.[5][6] ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే సా.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది.
చెక్కు చెదరని గడీ జగిత్యాల పట్టణంలో జువ్వాడి ధర్మజలపతి రావు అనే దొర ఒక గడీని నిర్మించాడు. ఈ గడీ చల్‌గల్ గడీకి దగ్గర పోలికల్తో ఉంటుంది. ఇరుపక్కల విశాలమైన బురుజులతో, లావైన స్తంభాలతో జగిత్యాల గడీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఈ గడీలో పై అంతస్థు పైన ఉండడానికి బయట నుండే రెండు వైపుల మెట్లను నిర్మించారు.ఆ కాలంలోని ‘దువ్వం తాలూకాదార్లు’ (డిప్యూటి కలెక్టర్‌లు) ఈ గడీలోనే ఉండేవారనీ చెబుతారు.
క్లాక్ టవర్
[మార్చు]ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా ధర్మజలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తయిన క్లాక్ టవర్‌ను నిర్మించాడు. అది చూసి మెచ్చుకొని, నిజాం రాజు ఆ క్లాక్ టవర్ వెండి నమూనాను చేయించి జ్ఞాపికగా ధర్మజలపతి రావుకు బహుకరించాడు. ఈ గడీని అమ్మివేయడంతో అది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.
జగిత్యాల జైత్రయాత్ర
[మార్చు]జగిత్యాలకి ఇంతటి పేరు రావడానికి కారణం 1978 సెప్టెంబరు 9. ఆ రోజు విప్లవోద్యమానికి సంబంధించి చారిత్రాత్మకమైన ప్రస్తావనకు జగిత్యాల నాంది పలికింది. నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అనాటి ‘జైత్రయాత్ర’లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ, మల్లా రాజిడ్డి, సాహు, నల్లా ఆదిరెడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణలతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.
జగిత్యాల విశేషాలు
[మార్చు]ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉండే జగిత్యాల నేడు చుట్టుపక్కల ఉన్న ఊర్లను ఎన్నింటినో తనలో కలుపుకొని ఒక ‘పెద్ద పట్టణం’గా రూపాంతరం చెందింది. జగిత్యాలలో ప్రస్తుతం సుమారు లక్షా యాబై వేల జనాభా ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు సమాన స్థాయిలో పలుకుబడిలో ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా క్రమంగా పరివ్యాప్తం చెందుతోంది. రాష్ట్రంలోని పెద్ద పట్టణాలలో ఇది ఒకటి. రాష్ర్ట ప్రభుత్వం ద్వారా ‘అతి పరిశుభ్రమైన నగరం’గా గుర్తింపు పొందింది.జగిత్యాలకు నాలుగు వైపుల నాలుగు చెరువులు ఉన్నాయి. కండ్లపల్లి, ముప్పారపు, మోతె చెరువుల నీళ్లని వ్యవసాయానికి, ధర్మసముద్రం నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న జగిత్యాల జనాభాలో 51 శాతం పురుషుల, 49 శాతం మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 63 శాతంగా నమోదైంది. ఇది జాతీయ రేటు (59.5 శాతం) కంటే ఎక్కువ.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రం
[మార్చు]ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఇది సేవలందిస్తోంది.రైతుల దేవాలయం...పొలాస వ్యవసాయ పరిశోధనాకార్యాలయం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1980 డిసెంబర్ 2న జగిత్యాల మండలం పొలాస వద్ద పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో క్షేత్రం ఏర్పాటు కాగా, 1983 నుంచి పూర్తిస్థాయి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.పై మూడు జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నారు. Pddf వాలంతరీ ఫామ్ చలిగల్ లో కలదు.
- వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల,
- 2008లో బిఎస్‌సి అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేశారు.
జగిత్యాల సాహిత్యం
[మార్చు]‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రకటించుకున్న అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల మట్టిలో పుట్టిన మాణిక్యమే. ప్రభాకర్ గొప్ప చిత్రకారుడు కూడా. 21 ఏండ్ల వయస్సులో ‘ఎర్ర పావురాలు’ కవిత్వంతో సాహిత్యపు ప్రపంచంలో అడుగుపెట్టి 1979లో ‘మంటల జెండాలు’, 1981లో ‘చురకలు’, 1982లో హైదరాబాద్ చేరుకొని ‘రక్తరేఖ’, ‘సంక్షోభగీతం’, ‘సిటీలైఫ్’ మున్నగు సంపుటాలు వెలువరించారు. సామాజిక తత్వవేత్తగా, కథా రచయితగా, నవలా రచయితగా బి.ఎస్. రాములు సుప్రసిద్ధులు. విప్లవ దళిత, పౌరహక్కుల సంఘాల్లో భూమికను నిర్వహిస్తున్నారు.‘గతితార్కిక తత్వదర్శన భూమిక’ అనే గ్రంథాన్ని వెలువరించారు. వందకు పైగా కథలు, ఆరు నవలలు రాయటమే కాకుండా కథల బడి, కథా సాహిత్య అలంకార శాస్త్రం అనే గ్రంథాల్ని వెలువరించారు. అలాగే అమ్మ, యుద్ధం, బురదలో జాబిల్లి, నాన్న, నాతిచరామి, ఊరు, సిటీ, విభిన్న కథా సంపుటాలు, బేబి ఓ బేబి, నల్ల సముద్రం, అత్తారింటికి దారేది లాంటి నవలలు రాసిన కె.వి.నరేందర్ జగిత్యాలకు చెందినవారే. వలస కవిత్వంతో జీవితానుభవాలను రంగరిస్తున్న కవి సంగవేని రవీంద్ర అన్వేషణ, వర్లీనానీలు, లోలోన లాంటి కవితా సంపుటాలు వెలువరించారు. కె.వి.నరేందర్, సంగవేని రవీంద్రలు సంయుక్తంగా ‘తెలంగాణ గడీలు’ అనే చారిత్రాత్మక పుస్తకాన్ని కూడా వెలువరించారు.ఇంకా జగిత్యాలకు చెందిన కవి_రచయిత_ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన ఎనుగంటి వేణుగోపాల్ 'వేణుగాన శతకము'అనే పద్యపుస్తకాన్ని'అమ్మానాన్న','నవరసభరితం',‘గోపాలం'హాస్య కథలు, ‘నాలుగు పుటలు’నా మినీ కథలు','ఎనుగంటి కాలంకథలు','బుజ్జిగాడిబెంగ'పిల్లలకథలు,'వైవిద్యకథలు','నాలుగుమెతుకులు' వంటి 09 కథా సంపుటాలు మరియ'విజయానికి అన్నీమెట్లే 'వ్యక్తిత్వవికాసవ్యాసాలు ','అమ్మానాన్న పిల్లలు' పిల్లలవ్యాసాలు వంటి మరో 3 పుస్తకాలతో పాటు'అవని','ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్' వంటి 2 నవలలను కూడా పుస్తక రూపంలో వెలువరించారు. పలు కథలు రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకున్నాయి.టీవీ చానల్స్ పలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.ఎనుగంటి వేణుగోపాల్ సాహిత్యంపై 'ఎనుగంటి వేణుగోపాల్ కథలు'అనే యం.ఫిల్. గ్రంథము కూడా వెలువడింది.ఇక మరోకవి జనార్ధన్ ‘జెకమొక’ అనే కవితా సంపుటి తీసుకొచ్చారు. చరిత్ర పరిశోధకుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల చారిత్రాత్మక సంపదపై లోతైన పరిశోధనలు చేసిన చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల వాస్తవ్యులే. ఈయన రాసిన ‘టెంపుల్స్ ఆఫ్ సౌతిండియా’,‘ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ ఎ స్టడీ’అనే రెండు పుస్తకాలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించి పెట్టాయి.యాబై చారిత్రాత్మక వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమై పాఠకుల మన్ననలు అందుకున్నాయి.
జగిత్యాలపై మూడు పుస్తకాలు
[మార్చు]జగిత్యాలపై ఇప్పటి వరకు మూడు పుస్తకాలు వెలువడ్డాయి.అవి 1.జగిత్యాల జంగల్ మహల్ 2.జగిత్యాల పల్లె 3.నేను రుద్రవీణని... జగిత్యాలని. జగిత్యాల జైత్రయాత్ర జరిగిన తీరు, అంతకు ముందు దొరల వెట్టిచాకిరి, ఈ ప్రాంతం వెనుకబాటుతనం లాంటి విషయాల్ని విశ్లేషిస్తూ ‘జగిత్యాల జైత్రయాత్ర’ జరగడానికి కారణాలేమిటో చెబుతూ జగిత్యాల ‘జంగల్ మహల్’ పుస్తకం వెలువడింది. క్రాంతి ప్రచురణల పేరుతో విప్లవ రచయితల సంఘం 1981 జనవరిలో ఆరువేల కాపీలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు.జగిత్యాల జైత్రయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రముఖ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ ‘జగిత్యాల పల్లె’ పేరుతో ముప్పయి కవితల సంకలనాల్ని వెలువరించారు. అల్లం నారాయణ రాసిన కవితలే కాకుండా పాటలు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా *‘జగిత్యాల కదిలింది జంబాయిరే... ఊరూరు మండింది జంబాయిరే...’ అనే పాట ఇప్పటికీ పల్లె ప్రజల నాల్కలపై విన్పిస్తుంది.ఇక ‘నేను రుద్రవీణని...జగిత్యాలని’ శీర్షికన వచ్చిన పుస్తకం కె.వి.నరేందర్, సంగవేని రవీంద్ర రచించిన దీర్ఘ కవిత. జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యం, ఈ ప్రాంతంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని, ఫొటోలతో ప్రతిబింభిస్తూ ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్' పేరుతో ఒక విశిష్ట రూపంతో అల్లం నారాయణ కలం నుంచి వెలువడిన కవిత ఇది.
జగిత్యాల పల్లె పందిళ్లు విరుగుతయ్ బీరపాదులతో సహా సన్నీలు శరీరాల మీద దిగుతయ్ బట్టలు ఇగ్గేసీ బజారు పాలు చేస్తారు.ఎవడో ఒక అభాగ్యుడు పండ్లు గిలకరించి మూలుగుతడు.తెల్లవారుతుంది, అజ్ఞాత సూరీడు, విరిగిన, పగిలిన, చిరిగిన, చిట్లిన గుడిసె కప్పుల మీదుగా కిరణాలు ఝళిపిస్తూ తూర్పున రగుల్కొంటాడు...ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత వాసాల లక్ష్మినారాయణ జీవన గమనం, అక్షర సైన్యం, అక్షర సమ్మేళనం అనే పుస్తకాలను వెలువరించాడు .
మాతాశిశు కేంద్రం
[మార్చు]జగిత్యాల పట్టణ కేంద్రంలో 18 కోట్ల ఖర్చుతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 2022 మే 4న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఇ రమేష్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]
కలెక్టరేట్ నూతన భవన సముదాయం
[మార్చు]జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ ఆబాది స్థలం 20 ఎకరాల్లో 49.20 కోట్ల రూపాయలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2022, డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. చాంబర్‌లో కలెక్టర్ జీ రవిని సీటులో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశాడు.[8]
ఈ సముదాయంలోని ఎనిమిది ఎకరాల్లో కలెక్టర్ (6వేల చదరపు అడుగులు), అదనపు కలెక్టర్ (2,877 చదరపు అడుగులు), జిల్లా రెవెన్యూ అధికారి (2130 చదరపు అడుగులు) క్యాంపు కార్యాలయాలతోపాటు జీప్లస్ 2 పద్ధతిలో 19,300ల చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లాస్థాయి అధికారుల గృహ సముదాయాలు, ఐడీఓసీలో 32 శాఖలకు గదులు, కలెక్టర్-అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లు, విజిటర్స్ వెయింటింగ్ హాల్, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్, మూడు మినీ మీటింగ్ హాల్స్ నిర్మించబడ్డాయి.[9]
పోలీసు కార్యాలయం
[మార్చు]20 ఎకరాల విస్తీర్ణంలో 40 కోట్ల రూపాయలతో నిర్మించిన జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించబడింది. 47వేల చదరపు ఫీట్ల స్థలంలో జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించిన ఈ కార్యాలయంలో ఎస్పీ, ఏఎస్పీ, ఓఎస్‌డీలకు ప్రత్యేక గదులతోపాటు రెస్ట్ రూంలు, నేరాలను ఛేదించేలా క్రైం విభాగం, పరిపాలనా విభాగాలు, ఇంటెలిజెన్స్, డాగ్ స్క్వాడ్, డిజిటల్ ల్యాబ్‌లు, ట్రైనింగ్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, సైబర్ ల్యాబ్, పీడీ సెల్, నాలుగు సెమినార్ హాళ్ళు, ఇన్‌వార్డు, ఔట్‌వార్డు, మినీ కాన్ఫరెన్స్‌హాల్, పరేడ్ గ్రౌండ్, పార్కు ఏర్పాటుచేయబడ్డాయి.[10]
2023, అక్టోబరు 3న రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోంమంత్రి మహమూద్ అలీ కలిసి ప్రారంభించాడు.[11] మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన మహమూద్ అలీ అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించి, ఆఫీస్ రిబ్బన్ కట్ చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎస్పీ ఛాంబర్ ను సందర్శించి జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను చైర్ లో కూర్చో బెట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, టి. భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు డా. ఎమ్. సంజయ్ కుమార్, బాల్క సుమన్, సుంకె రవిశంకర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[12]
సమీకృత మార్కెట్
[మార్చు]పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో 4.50 కోట్ల రూపాయల పట్టణ ప్రగతి ప్రత్యేక నిధులతో 2 ఎకరాల స్థలంలో రెండు భారీ షెడ్లు, కౌంటర్లతో సమీకృత మార్కెట్ నిర్మించబడింది. మూడు బ్లాక్‌లుగా విభజించిన ఈ మార్కెట్‌లోని 52 స్టాళ్ళు కూరగాయల విక్రేతలకు, 30 స్టాల్స్‌ను మాంసం, చేపల విక్రేతలకు, 18 స్టాల్స్‌ను పూలు, పండ్ల వ్యాపారులకు కేటాయించబడ్డాయి. సమీకృత మార్కెట్ కూడా 2023, అక్టోబరు 3న ప్రారంభించబడింది.[13]
విద్యాసంస్థలు
[మార్చు]- జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల: 2021లో ఏర్పాటుచేయబడిన ఈ వైద్య కళాశాలకు 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది.[14] ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానల భవన నిర్మాణ పనులకు 2022, డిసెంబరు 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేసి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.[15][16] 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి.[17]
మూలాలు
[మార్చు]- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. 2016-06-15. Archived from the original on 2016-06-15. Retrieved 2022-08-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Jagital Municipality". jagtialmunicipality.telangana.gov.in. Retrieved 9 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (14 October 2016). "చారిత్రక ఖిల్లా." Archived from the original on 16 July 2018. Retrieved 17 July 2018.
- ↑ ఈనాడు. "జగిత్యాల ఖిల్లా". Archived from the original on 16 July 2018. Retrieved 17 July 2018.
- ↑ telugu, NT News (2022-05-04). "సిజేరియన్లకు ముహూర్తాలు పెట్టే మూఢనమ్మకం పోవాలి : మంత్రి హరీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.
- ↑ "జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్". EENADU. 2022-12-07. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
- ↑ telugu, NT News (2022-12-07). "జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
- ↑ "ముస్తాబైన ఎస్పీ కార్యాలయం". Sakshi. 2023-09-29. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
- ↑ "KTR Speech Jagtial Tour Today : 'జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేసే బాధ్యత నాది'". ETV Bharat News. 2023-10-03. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
- ↑ "TS: శాంతి భద్రతల సంరక్షణలో తెలంగాణ టాప్… కేటీఆర్". Prabha News. 2023-10-03. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
- ↑ telugu, NT News (2023-10-03). "సర్కారు సంకల్పం.. పేదోడి కలల సౌధం". www.ntnews.com. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-07.
- ↑ Desk, HT Telugu (2022-06-15). "తెలంగాణకు గుడ్ న్యూస్… కొత్తగా 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు". Hindustantimes Telugu. Archived from the original on 2022-07-12. Retrieved 2022-11-15.
- ↑ telugu, NT News (2022-12-07). "జగిత్యాల మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
- ↑ "మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన కేసీఆర్." Prabha News. 2022-12-07. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
- ↑ telugu, NT News (2022-11-15). "మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.