అక్షాంశ రేఖాంశాలు: 14°44′N 78°33′E / 14.73°N 78.55°E / 14.73; 78.55

ప్రొద్దుటూరు

వికీపీడియా నుండి
(Proddatur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 14°44′N 78°33′E / 14.73°N 78.55°E / 14.73; 78.55
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంప్రొద్దుటూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం18.78 కి.మీ2 (7.25 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం1,63,970
 • జనసాంద్రత8,700/కి.మీ2 (23,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003
ప్రాంతపు కోడ్+91 ( 8564 Edit this on Wikidata )
పిన్(PIN)516360 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న పట్టణం. ఇక్కడ ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి దేవాలయం వలన ప్రముఖ యాత్రాస్థలం. బంగారు, వెండి నగలు, బట్టల వ్యాపారాలకు కేంద్రం.

జనగణన గణాంకాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,63,970.

పట్టణ పరిపాలన

[మార్చు]

ప్రొద్దుటూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

వై. ఎస్. ఆర్. ఇంజనీరింగ్ కళాశాల.

ఉత్పత్తులు

[మార్చు]

ఈ పట్టణం, చుట్టుపక్కల పల్లెలందు వరి, జొన్న, ప్రత్తి, ప్రొద్దు తిరుగుడు, శనగ, కుసుమ, పసుపు, వేరు శనక్కాయలు, కంది, అలసంద ఎక్కువగా పండిస్తారు. ఎండా కాలములో కర్బూజ, కలింగర, దోసకాయలు పండిస్తారు. పాల కోసము బర్రెలు ఎక్కువగా పెంచుతారు.

పరిశ్రమలు

[మార్చు]
  • వేరు శనక్కాయల నుంచి నూనె తీయు గానుగలు
  • నల్ల రాయిని రాతి గనులనుండి వెలికితీయటం, సానబెట్టటం

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
ప్రొద్దుటూరు రైలు సముదాయం

ముక్తి రామేశ్వరం

[మార్చు]

ముక్తి రామేశ్వరాలయం పెన్నా నదిగా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది.

స్థల పురాణం

[మార్చు]

పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుకతో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (ఇసుక లింగం)గా పేరుగాంచింది.

కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు.

చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది దినాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.

ఆలయ చరిత్ర

[మార్చు]

శాసనాల ప్రకారం శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద ఐదు అంతస్తుల గోపురం నిర్మించాడు. గోపురం చుట్టూరా చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆ నాటి శిల్పుల పనితనాన్నీ, సామర్థ్యాన్నీ చెప్పకనే చెబుతాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు.

రామలింగేశ్వర ఆలయం

[మార్చు]

ఈ క్షేత్ర దైవం లింగరూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు. ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముడు. అందుకే దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది. హన్మంతుడు కాశీ నుంచి తీసుకు వచ్చిన శివ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. శ్రీ రామలింగేశ్వర ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు పూజించిన "శ్రీ చక్ర యంత్రం" ఉంది. ఈ చక్ర ప్రభావం వల్లే ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని ప్రొద్దుటూరు వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పూజించిన వారికి కోరికలన్నీ తీరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకముంది.

శిల్పకళ

[మార్చు]

ముక్తి రామలింగేశ్వరాలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలతో అలరారే ఐదంతస్థుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులతో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గా దేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీదుండే విష్ణువు, కాళీయ మర్ధనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వ కాలపు శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి.

అగస్త్యేశ్వరాలయం

[మార్చు]

ఈ ఆలయాన్ని నందిచోళుడు నిర్మించాడు. సాళువ నరస నాయకుడు అభివృద్ధి చేశాడు. ఈ ఆలయం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమ్మలకు కాణాచిగా ఉండేది. మహా కవి పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ ఆలయంలోనే 'శివతాండవం' కావ్యాన్ని వ్రాశాడు. ఈ ఆలయానికి ఎత్తైన ప్రాకారాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అగస్త్యేశ్వరుడు, రాజరాజేశ్వరి, భీమలింగేశ్వరుడు, సుందరేశ్వరుడు, కోదండరామస్వామి ఆలయాలున్నాయి. అగస్త్యేశ్వరుడు మూడడుగుల లింగాకారంలో ఉన్నాడు. అంతరాలయంలో వీరభద్రుడు, కార్తికేయుడు, గణపతి ఉన్నారు. అలయానికి ముందు పుష్కరిణి ఉండేది. దానిని పూడ్చి మార్కెట్ కాంప్లెక్సు నిర్మించారు. ప్రతి సంవత్సరం అగస్త్యేశ్వర స్వామికి వైశాఖ శుద్ధ సప్తమి నుంచి పది దినాల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరీ దేవికి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

కన్యకా పరమేశ్వరీ ఆలయం

[మార్చు]
ఆలయ గోపురం, అమ్మవారు[2]

ప్రొద్దుటూరు నగర కీర్తికి తలమానికం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారు వైశ్య కుల దేవత అయినా హిందువులందరూ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. సా.శ. 1890లో ఈ దేవాలయాన్ని స్థాపించారు. కామిశెట్టి కొండయ్య అనే వైశ్యునికి అమ్మవారు కలలో కనిపించి తన కోసం దేవాలయం నిర్మించవలసిందిగా ఆదేశించింది. ఆయన, మరికొందరు వైశ్య ప్రముఖులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి దినము అమ్మ వారి ఊరేగింపునకు సుమారుగా 2 లక్షల మంది భక్తులు వస్తారు. దసరా ఉత్సవాలలో మైసూరు తర్వాత ప్రొద్దుటూరునే చెప్పుకోవాలి. ఆలయానికి ఎత్తైన గాలిగోపురం ఉంది. ముఖ ద్వారాలు శిల్పకళతో విరాజిల్లుతున్నాయి. పురాణగాథలు తెలిపే శిల్పాలు మనోహరంగా ఉంటాయి. అమ్మవారి జన్మ వృత్తాంతం తెలిపే ఛాయాచిత్రాలున్నాయి. మహాత్మా గాంధీ (1929 లో), శృంగేరీ పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు మొదలగు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించారు.

దసరా ఉత్సవాలు

[మార్చు]

1890లో నిర్మించిన వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానంలో 1895 నుండి అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు స్థానిక ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా విజయదశమి దినమున జరిగే గ్రామోత్సవం, తొట్టి మెరవని అత్యంత ప్రధానమైనవి.

అయ్యప్ప స్వామి ఆలయం

[మార్చు]

ప్రొద్డుటూరుకు కొత్త శోభ పెన్నా నదీ తీరంలో నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడి ప్రకృతి అందాలు ఒళ్ళు పులకరింప జేస్తాయి. 1991 లో విగ్రహాన్ని పంచలోహాలతో నిర్మించారు. ఈ విగ్రహం 21 అంగుళాల ఎత్తు, 110 కిలోగ్రాముల బరువు ఉంది.తిరుపతి సమీపంలోని తిరుచానూరు వాస్తవ్యులైన తిరుమలాచార్యులనే శిల్పి ఈ విగ్రహన్ని తయారు చేశాడు. శిల్ప కళా నైపుణ్యంతోనూ, గాలిగోపురాలతోనూ దేవాలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు.మన రాష్ట్రంలో భారీ వ్యయంతో నిర్మించిన అయ్యప్ప దేవాలయాల్లో ఇదొకటి. (నిర్మాణ వ్యయం 60 లక్షలు.) ఆలయ ప్రాంగణంలో 22 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో శివుని శిరస్సు నిర్మించారు.రాష్ట్రంలోని యాత్రికులు ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల యాత్ర చేస్తారు.

శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయం

[మార్చు]

ప్రొద్దుటూరుకు సమీపంలో రామేశ్వరం, ఆర్టీపీపీ రోడ్డు, పెన్నానది తీరంలో నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయం,

కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం పవిత్ర పెన్నానది తీరాన వెలసిన శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయ సముదాయ ఆశ్రమమును కీ॥శే॥ పూర్వపు గురూజీ శ్రీ భగవాన్ నారాయణ స్వాములవారి ఆశీస్సులతో

స్థల దాత శ్రీ తెల్లాకుల శివయ్యశ్రేష్ఠి, గారి కుటుంబీకులు, నిర్మాణ దాత, ఆశ్రమ ధర్మకర్త కీ॥శే॥ కొట్టూరు యల్లారెడ్డి గారు, శిష్యులు, భక్తుల ఆర్థిక సహాయ సహకారములతో కళ్యాణ మండపం, ఇతర నిర్మాణములను నిర్మించారు. గత 31 సంవత్సరములుగా శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవములను

భక్తుల ఆర్థిక సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతముగా నిర్వహించుచున్నాము. ఇందులో భాగముగా వివిధ ఊర్లనుండి, ప్రొద్దుటూరు, ఐజ, కర్నాటక నుండి భక్తులు పాల్గొని స్వాములవారి అనుగ్రహము పొందియున్నారు. ఐజ, కర్నాటక నుండి భక్తులు పాల్గొని స్వాములవారి అనుగ్రహము పొందియున్నారు. కావున ఈ సంవత్సరం ప్రస్తుత గురూజీ బ్రహ్మపథ, బ్రహ్మ యోగానంద డా|| శ్రీ కృష్ణమాచార్యులు గురువు గారి పర్యవేక్షణలో జరుగు ఆరాధన మహోత్సవములలో పాల్గొని తమ ఆర్థిక సహాయ సహకారములను అందించి స్వాములవారి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాము.

శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి ఆలయం

[మార్చు]

ఈ అలయం ప్రొద్దుటూరు పట్టణంలోని వై.ఎం.ఆర్. కాలనీలో ఉంది.

శ్రీ గీతాశ్రమం

[మార్చు]

ప్రొద్దుటూరు శివాలయం కూడలిలోని ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు నామా ఎరుకలయ్య. 2020,నవంబరు-15న, ఈ ఆశ్రమంలో, నామా ఎరుకలయ్య, కమలాక్షమ్మల ఆరాధనోత్సవాలు ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, గ్రామస్థులు, భక్తులు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఉత్సవాలు 23-11-2020 వరకు నిర్వహించెదరు.[3]

ఇతర ఆలయాలు

[మార్చు]
  • ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నానుకుని ఉన్న బొల్లవరం గ్రామంలో విజయనగర రాజులు నిర్మించిన వెంకటేశ్వర, చెన్న కేశవ, వేణుగోపాల, ఆంజనేయ స్వామి ఆలయాలు, రామాలయం ఉన్నాయి. ప్రొద్దుటూరులో చాలా వరకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయాలు ఊన్నాయి.
  • ప్రొద్దుటూరు (రామేశ్వరం) - ఆర్.టి.పి.పి. రహదారిలోని అష్టభుజి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో, శ్రీ చౌడేశ్వరి విగ్రహ మూర్తి 50 అడుగుల ఎత్తయినది.
  • నరసింహాపురం గ్రామం ప్రొద్దుటూరు పట్టణానికి పడమర దిశలో, ప్రొద్దుటూరు - జమ్మలమడుగు రహదారి లో, ప్రొద్దుటూరు నుండి 6 కిమీ ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఒకటి ఉంది. గుడియందలి శిల్ప కళని గమనించినట్లయితే విజయనగర రాజుల చివరి కాలంలో అనగా 17వ శతాబ్దం చివరలో నిర్మించినట్లుగా అనుకోవచ్చు. నరసింహాపురంకి పడమటి దిశలో పొలాలలో ఒక పురాతన శివాలయము ఉంది. ఇందులోని శివలింగముని ఆంజనేయుడు ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటారు

ఇతర విశేషాలు

[మార్చు]

1929లో జాతిపిత మహాత్మా గాంధీ, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెళ్ళిన మార్గాన్ని గాంధీ రోడ్డుగా పిలుస్తారు. ఇది ప్రొద్దుటూరులో ఒక ముఖ్య వాణిజ్య మార్గము.

ఇవీచూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "::Welcome to Sreevasavamba.com,Proddatur::". web.archive.org. 2007-10-09. Retrieved 2023-10-22.
  3. ఈనాడు కడప జిల్లా;2020,నవంబరు-16,4వపేజీ .

వెలుపలి లింకులు

[మార్చు]