Jump to content

ది గార్డియన్

వికీపీడియా నుండి
(The Guardian నుండి దారిమార్పు చెందింది)
ది గార్డియన్
డిసెంబర్ 26, 2025 సంచిక మొదటి పేజీ
రకంవార్తాదినపత్రిక
రూపం తీరు
  • బ్రాడ్‌షీట్ (1821–2005)
  • బెర్లినర్ (2005–2018)
  • కాంపాక్ట్ (2018 నుండి)
యాజమాన్యంగార్డియన్ మీడియా గ్రూప్
వ్యవస్థాపకులుజాన్ ఎడ్వర్డ్ టైలర్
ప్రచురణకర్తగార్డియన్ మీడియా గ్రూప్
భాషఇంగ్లీష్
కేంద్రంకింగ్స్ ప్లేస్, లండన్
దేశంయునైటెడ్ కింగ్‌డమ్
Circulation105,134 (as of జూలై 2021)[1]
ISSN0261-3077 (print)
1756-3224 (web)
OCLC number60623878
జాలస్థలి

ది గార్డియన్ అనేది బ్రిటన్‌కు చెందిన ఆంగ్ల భాషా దినపత్రిక. ఇది 1821 మే 5న ది మాంచెస్టర్ గార్డియన్ పేరుతో స్థాపించబడింది. 1959లో దీనికి ది గార్డియన్ అనే పేరు పెట్టారు.[2] అనంతరం ప్రధాన కార్యాలయాన్ని లండన్‌కు మార్చారు. ప్రస్తుతం ఇది గార్డియన్ మీడియా గ్రూపుకు చెందిన వార్తాపత్రికగా వెలువడుతోంది. ఈ సంస్థకు యజమాన్యం స్కాట్ ట్రస్ట్ లిమిటెడ్ వద్ద ఉంది.[3] ఈ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం పత్రిక యొక్క ఆర్థిక, సంపాదకీయ స్వాతంత్ర్యాన్ని శాశ్వతంగా పరిరక్షించడం.

ప్రస్తుతం పత్రిక ప్రధాన సంపాదకురాలు క్యాథరీన్ వైనర్.[4][5] పత్రిక ప్రధాన కార్యాలయం లండన్‌లోని కింగ్స్ ప్లేస్‌లో ఉంది. ఇది ప్రధానంగా ఆంగ్ల భాషలో ప్రచురించబడుతుంది.

చరిత్ర

[మార్చు]

ది గార్డియన్‌ను 1821లో పత్తి వ్యాపారీ, జర్నలిస్టూ అయిన జాన్ ఎడ్వర్డ్ టైలర్ స్థాపించాడు.[6] అప్పట్లో ఇది "ది మాంచెస్టర్ గార్డియన్" పేరుతో ప్రచురించబడేది. ఇంగ్లాండ్ ఉత్తర ప్రాంత ప్రజలకు సంబంధించిన రాజకీయ, సామాజిక, వాణిజ్య అంశాలపై దృష్టి సారిస్తూ ఈ పత్రిక ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది బ్రిటన్‌లో ప్రముఖ జాతీయ దినపత్రికగా ఎదిగింది.

1959లో పత్రిక పేరు ది గార్డియన్‌గా మార్చబడింది.[7] అనంతరం 1964లో ప్రధాన కార్యాలయాన్ని మాంచెస్టర్ నుండి లండన్‌కు తరలించారు. అయినప్పటికీ, పత్రిక తన చారిత్రక మూలాలను మాంచెస్టర్‌తో కొనసాగిస్తూ వచ్చింది.

యాజమాన్యం

[మార్చు]

ది గార్డియన్ ప్రస్తుతం గార్డియన్ మీడియా గ్రూప్ ద్వారా ప్రచురించబడుతోంది. ఈ మీడియా సమూహం యాజమాన్యం స్కాట్ ట్రస్ట్ లిమిటెడ్ వద్ద ఉంది.[8] ఈ ట్రస్ట్ 1936లో స్థాపించబడింది. దాని ప్రధాన ఉద్దేశ్యం పత్రికను రాజకీయ లేదా వాణిజ్య ఒత్తిళ్ల నుండి స్వతంత్రంగా కొనసాగించడం. దీనివల్ల ది గార్డియన్ సంపాదకీయ స్వేచ్ఛను కాపాడుకుంటూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

రాజకీయ వైఖరి

[మార్చు]

ది గార్డియన్ సాధారణంగా మధ్య-వామపక్ష రాజకీయ దృక్పథానికి చెందిన పత్రికగా పరిగణించబడుతుంది. చారిత్రకంగా ఇది బ్రిటన్‌లోని లిబరల్ రాజకీయ సంప్రదాయాలతో అనుబంధాన్ని కలిగి ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దీని సంపాదకీయ వైఖరి క్రమంగా లేబర్ పార్టీకి, విస్తృత వామపక్ష భావజాలానికి దగ్గరైంది. అయితే, స్కాట్ ట్రస్ట్ ప్రకారం, ది గార్డియన్ ఏ రాజకీయ పార్టీకి అధికారిక అనుబంధం లేకుండా, స్వతంత్ర జాతీయ వార్తాపత్రికగా కొనసాగడం తన ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొంటుంది.

ప్రచురణ ఆకృతి

[మార్చు]

ప్రారంభ కాలంలో ది గార్డియన్ బ్రాడ్‌షీట్ ఆకృతిలో ప్రచురించబడేది. 2005లో ఇది బెర్లినర్ ఆకృతిని స్వీకరించింది.[9] 2018 నుండి కాంపాక్ట్ ఆకృతిలో ప్రచురించబడుతోంది.[10]

ఆన్‌లైన్ మాధ్యమం

[మార్చు]

ది గార్డియన్ 1990ల చివరినాటికే డిజిటల్ జర్నలిజంపై దృష్టి సారించింది. 1999లో guardian.co.uk పేరుతో తన వెబ్‌సైట్‌ను విస్తృతంగా అభివృద్ధి చేసింది. అనంతరం ఈ వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదవబడే ఆంగ్ల వార్తా వెబ్‌సైట్లలో ఒకటిగా ఎదిగింది. 2013లో అన్ని డిజిటల్ సేవలను theguardian.com అనే ఏకీకృత వెబ్‌సైట్‌లో విలీనం చేసింది. వార్తలతో పాటు విశ్లేషణలు, ప్రత్యక్ష కవరేజ్, అభిప్రాయ వ్యాసాలు, డేటా జర్నలిజం, మల్టీమీడియా కథనాలు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వార్తాలేఖలు, పోడ్‌కాస్ట్‌లు, ఇంకా పరస్పర చర్యలకు అనువైన ప్రత్యేక డిజిటల్ ఫీచర్లను గార్డియన్ అందిస్తోంది. ఈ సంస్థ యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యూరప్, ఇంకా అంతర్జాతీయ సంచికలను నిర్వహిస్తోంది.

పోడ్‌కాస్ట్‌లు

[మార్చు]

ది గార్డియన్ పలు అంశాలపై పోడ్‌కాస్ట్‌లను రూపొందిస్తోంది. రాజకీయాలు, ప్రపంచ వ్యవహారాలు, విజ్ఞానం, సాంకేతికత, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, సినిమా, క్రీడలు వంటి విభిన్న రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు వీటిలో ఉంటాయి. "టుడే ఇన్ ఫోకస్" వంటి దైనందిన వార్తా పోడ్‌కాస్ట్‌లు విశేష ప్రజాదరణ పొందాయి.[11] గార్డియన్ పోడ్‌కాస్ట్‌లు అంతర్జాతీయంగా పలు పురస్కారాలను కూడా అందుకున్నాయి.

గార్డియన్ ఫిల్మ్స్

[మార్చు]

2003లో ది గార్డియన్ గార్డియన్ ఫిల్మ్స్ అనే డాక్యుమెంటరీ నిర్మాణ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జర్నలిస్టు మ్యాగీ ఓ'కేన్ నాయకత్వం వహించాడు. ఈ విభాగం ప్రధానంగా టెలివిజన్ కోసం పరిశోధనాత్మక డాక్యుమెంటరీలను రూపొందించింది. గార్డియన్ ఫిల్మ్స్ నిర్మించిన ది బాగ్దాద్ బ్లాగర్:సలాం పాక్స్‌కు 2005లో రాయల్ టెలివిజన్ సొసైటీ అవార్డు లభించింది. బాగ్దాద్: ఎ డాక్టర్స్ స్టోరీ అనే డాక్యుమెంటరీకి 2007లో "ఎమ్మీ అవార్డు" లభించింది.[12] అదనంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మీడియా అవార్డులు, బ్రాడ్‌కాస్ట్ అవార్డులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రసార పురస్కారాలను కూడా ఈ విభాగం గెలుచుకుంది

సాధారణ విభాగాలు

[మార్చు]

ది గార్డియన్‌లో ప్రతిరోజూ జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు కింది అంశాలపై ప్రత్యేక విభాగాలు ప్రచురించబడతాయి.

  • రాజకీయాలు
  • వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు
  • ప్రపంచ వార్తలు
  • విజ్ఞానం
  • సాంకేతికత
  • పర్యావరణం
  • ఆరోగ్యం
  • విద్య
  • క్రీడలు
  • కళలు, సంస్కృతి
  • పుస్తక సమీక్షలు
  • సినిమా
  • సంగీతం
  • జీవనశైలి
  • అభిప్రాయాలు

ప్రత్యేక సందర్భాల్లో అనుబంధ పత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలను, ప్రత్యేక కథనాలను కూడా ప్రచురిస్తుంది.

సంపాదకులు

[మార్చు]

ది గార్డియన్ చరిత్రలో పలువురు ప్రముఖులు సంపాదకులుగా వ్యవహరించారు. వారిలో ముఖ్యులు:

  • జాన్ ఎడ్వర్డ్ టేలర్ (స్థాపకుడు)
  • సి. పి. స్కాట్
  • ఏ. పి. వాడ్స్‌వర్త్
  • ఆలస్టెయిర్ హేతరింగ్టన్
  • పీటర్ ప్రెస్టన్
  • అలన్ రస్‌బ్రిడ్జర్
  • కాథరిన్ వినర్ (2015 నుండి)

సి. పి. స్కాట్ సంపాదకత్వ కాలంలో గార్డియన్ బ్రిటన్‌లో అత్యంత ప్రభావవంతమైన లిబరల్ వార్తాపత్రికలలో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం కాథరిన్ వినర్ నాయకత్వంలో డిజిటల్-ఫస్ట్ జర్నలిజంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ప్రముఖ కంట్రిబ్యూటర్లు

[మార్చు]

గార్డియన్‌లో వివిధ కాలాల్లో అనేక మంది ప్రసిద్ధ రచయితలు, రాజకీయ విశ్లేషకులు, కాలమిస్టులు, సాహితీవేత్తలు, జర్నలిస్టులు రచనలు చేశారు. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ మార్పు, మానవ హక్కులు, విజ్ఞానం, సాంస్కృతిక అంశాలపై వీరి వ్యాసాలు విశేష ఆదరణ పొందాయి.

పురస్కారాలు

[మార్చు]

ది గార్డియన్ తన పరిశోధనాత్మక జర్నలిజం, డిజిటల్ ఆవిష్కరణలు, పర్యావరణ వార్తా కథనాలు, క్రీడా లేఖనాలకు సంబంధించి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. 2014లో ప్రభుత్వ నిఘా కార్యక్రమాలపై చేసిన కథనాలకుగాను బ్రిటిష్ ప్రెస్ అవార్డ్స్‌లో "న్యూస్ పేపర్ ఆఫ్ ది ఇయర్", "వెబ్‌సైట్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను గెలుచుకుంది. అదనంగా, పర్యావరణ జర్నలిజానికి సంబంధించిన "సీల్ ఎన్విరాన్మెంటల్ జర్నలిజం అవార్డ్స్", "స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్" వంటి అనేక గౌరవాలను కూడా దక్కించుకుంది.

పరిశోధనాత్మక జర్నలిజం

[మార్చు]

ది గార్డియన్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందిన అనేక పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా 2013లో అమెరికా జాతీయ భద్రతా సంస్థ నిర్వహిస్తున్న విస్తృత నిఘా కార్యక్రమాలకు సంబంధించిన పత్రాలను మాజీ గూఢచారి కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ అందించగా, వాటిని ప్రచురించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చకు దారి తీసింది. అలాగే వికీలీక్స్ వెల్లడించిన దౌత్య రహస్య పత్రాల ప్రచురణలో కూడా కీలక పాత్ర పోషించింది. ఈ కథనాలు ప్రభుత్వ పారదర్శకత, వ్యక్తిగత గోప్యత, పత్రికా స్వేచ్ఛలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలకు కారణమయ్యాయి.

విమర్శలు, వివాదాలు

[మార్చు]

ది గార్డియన్ తన సుదీర్ఘ చరిత్రలో పలు విమర్శలు, వివాదాలను కూడా ఎదుర్కొంది.

  • ఇజ్రాయెల్–పాలస్తీనా సంఘర్షణపై ప్రచురించిన కథనాల్లో పక్షపాతం ప్రదర్శించిందని కొన్ని వర్గాలు ఆరోపించాయి.
  • కొన్ని వార్తా కథనాల వాస్తవికత, మూలాల విశ్వసనీయతపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
  • 2018లో పాల్ మానాఫోర్ట్, జూలియన్ అసాంజ్ మధ్య జరిగినట్లు ప్రచురించిన సమావేశ వార్తకు తగిన ఆధారాలు లేవని విమర్శకులు పేర్కొన్నారు.[13]
  • సోషల్ మీడియా & డిజిటల్ వార్తల ప్రచారంలో సంపాదకీయ ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కూడా కొన్ని సందర్భాల్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ప్రజాసంస్కృతిలో

[మార్చు]

ది గార్డియన్ బ్రిటిష్ ప్రజాస్వామ్యం, రాజకీయాలు, సాహిత్యం, ప్రజాసంస్కృతిలో ప్రముఖ స్థానం సంపాదించింది. అనేక నవలలు, చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ఇతర మాధ్యమాల్లో ఈ పత్రిక ప్రస్తావన కనిపిస్తుంది. పరిశోధనాత్మక జర్నలిజం, స్వతంత్ర సంపాదకీయ విధానం కారణంగా, డిజిటల్ వార్తా రంగంలో చేసిన ఆవిష్కరణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

సర్య్కులేషన్, పాఠకాదరణ

[మార్చు]

2021 జూలై నాటికి ది గార్డియన్ ముద్రిత సర్య్కులేషన్ 105,134 ప్రతులు.[14] ముద్రిత పత్రికల ప్రపంచవ్యాప్త ధోరణికి అనుగుణంగా ది గార్డియన్ ముద్రిత సర్య్కులేషన్ గత కొన్ని దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టింది. అయితే, డిజిటల్ వేదికలపై ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఆంగ్ల వార్తా సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులు ప్రతి నెలా దీని వెబ్‌సైట్, మొబైల్ అనువర్తనాలు, వార్తాలేఖలు, పోడ్‌కాస్ట్‌ల ద్వారా వార్తలను అనుసరిస్తున్నారు. 2021 నుండి సంస్థ తన ముద్రిత ప్రసార గణాంకాలను బహిరంగంగా ప్రకటించడం నిలిపివేసింది.

మూలాలు

[మార్చు]
  1. Tobitt, Charlotte; Majid, Aisha (25 January 2023). "National press ABCs: December distribution dive for freesheets Standard and City AM". Press Gazette. Archived from the original on 25 April 2023. Retrieved 15 February 2023.
  2. "collection (The University of Manchester Library)". www.library.manchester.ac.uk. Archived from the original on 28 April 2021. Retrieved 12 March 2021.
  3. "'Guardian' newspaper trust keeps journalism at top of its agenda". The Irish Times (in ఇంగ్లీష్). Archived from the original on 4 November 2021. Retrieved 12 March 2021.
  4. "Guardian appoints Katharine Viner as editor-in-chief". The Guardian. 20 March 2015. Archived from the original on 20 July 2017. Retrieved 6 March 2016.
  5. Rusbridger, Alan (29 May 2015). "'Farewell, readers': Alan Rusbridger on leaving The Guardian after two decades at the helm". The Guardian. Archived from the original on 29 May 2015. Retrieved 29 May 2015.
  6. Wainwright, Martin (13 August 2007). "Battle for the memory of Peterloo: Campaigners demand fitting tribute". The Guardian. London. Archived from the original on 5 July 2013. Retrieved 26 March 2008.
  7. "Key moments in The Guardian's history: a timeline". The Guardian. 16 November 2017. Archived from the original on 27 April 2021. Retrieved 3 April 2018.
  8. Conlan, Tara (8 October 2008). "Guardian owner the Scott Trust to be wound up after 72 years". The Guardian. London. Archived from the original on 13 April 2014. Retrieved 10 October 2008.
  9. Brooks, Josh (29 June 2004). "Guardian to switch to Berliner format". PrintWeek (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2021. Retrieved 31 December 2020.
  10. Sweney, Mark (13 June 2017). "The Guardian and The Observer to relaunch in tabloid format". The Guardian. Archived from the original on 18 January 2019. Retrieved 13 June 2017.
  11. "Today in Focus: The Guardian's daily news podcast". Campaign British Publishing Awards. Guardian News & Media. 22 May 2019. Archived from the original on 3 November 2019. Retrieved 3 November 2019.
  12. Salih, Omar; Summers, Ben (28 January 2008). "Excerpt from Baghdad: A Doctor's Story". The Guardian. London: Guardian News and Media. Archived from the original on 1 September 2013. Retrieved 25 May 2010.
  13. Pompeo, Joe (27 November 2018). ""It Might Be the Biggest Get This Year": How The Guardian's Bombshell Set Off Its Own Little Media World War". Vanity Fair. Archived from the original on 1 December 2018. Retrieved 16 December 2018.
  14. Tobitt, Charlotte (19 February 2026). "Most National Newspaper Sales Figures Now Secret as Reach Takes Auditing Private". Press Gazette. Archived from the original on 20 February 2026. Retrieved 20 March 2026.