అడపా రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడపా రామకృష్ణ
అడపా రామకృష్ణ
జననంఅడపా రామకృష్ణ
(1951-10-31) 1951 అక్టోబరు 31 (వయసు 72)
విశాఖపట్నం
నివాస ప్రాంతంవిశాఖపట్నం
సంస్థవిశాఖ నేవల్‌ బేస్‌
ప్రసిద్ధితెలుగు కథా రచయిత, నవలా రచయిత
భార్య / భర్తదుర్గా మహాలక్ష్మి
పిల్లలుశివకోమల్,
దీపిక
తండ్రిఅడపా అప్పారావు
తల్లిసరస్వతమ్మ

అడపా రామకృష్ణ పేరుపొందిన కథారచయిత, కవి, నవలావ్యాస రచయిత. అతని కథల్ని పరిశీలిస్తే, సమాజంపట్ల ఆయనకుగల నిశిత దృష్టి, సామాజిక, సాంఘిన జీవనంలో మార్పురావాల్సి ఉందని ఆలోచించే సీరియస్‌నెస్, మనిషి జీవిత కోణాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఆయనకున్న అధ్యయన దృక్పథం మనకు అవగతమవుతుంది.[1] ఐదున్నర దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో పలు సాహితీ ప్రతిభాపురస్కారాలు అందుకున్న రామకృష్ణ ‘విశాఖ ఆణిముత్యం’గా గుర్తింపు పొందాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అడపా రామకృష్ణ 1951 అక్టోబరు 31న అడపా అప్పారావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు. వారి స్వంత ఊరు శ్రీకాకుళం. వారు విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు. విశాఖపట్నంలో విద్యాభ్యాసం చేసాడు. అతను 10వ తరగతి చదువుతుండగానే అతనిలో సాహిత్యాభిరుచి వెలుగు చూసింది. అప్పటి నుండి కవితలు రాయడం మొదలుపెట్టాడు. అతను రాసిన కవితలు "వేదాంతభేరి" పత్రికలో ప్రచురితమయ్యేవి. అతను 1979లో బాలల దినోత్సవం నాడు రాసిన "సిన్నోడి మాట" కవిత అందరి దృష్టినీ ఆకర్షించింది. అతని కవితలు ఆకాశవాణి కేంద్రం యువవాణి కార్యక్రమాల్లో ప్రసారమయ్యేవి. 2004లో సునామీ వచ్చినపుడు అతను రాసిన కవిత హైదరాబాదు సాంస్కృతిక సంస్థ ముద్రించిన సంకలనంలో చోటు సంపాదించుకుంది.

విశాఖరచయితల సంఘం విశాఖ రచయితల సంఘంతోఅతనికి 48ఏళ్ళ అనుబంధం ఉంది. ఆ సంఘ ప్రధానకార్యదర్శిగా అనేక సాహితీకార్యక్రమాలు చేస్తున్నాడు. అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్‌ మరణించినప్పుడు ‘ఆవంత్స కవితాభ్యుదయం’ అనే పుస్తకం రాశాడు. ‘విశాఖ కథా తరంగాలు’ పేరిట 40మంది కథకుల కథల్ని రెండు భాగాలుగా సంకలనం చేసి ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 50మంది కథకుల కథల్ని ‘సింగిల్‌ పేజీ కథలు’ సంకలనంగా తెచ్చారు. బలివాడ కాంతారావు స్మారక వ్యాససంపుటి సంకలనం, ‘డా. వుప్పల లక్ష్మణరావు సాహితీస్ఫూర్తిమంత్రం’ వ్యాస సంకలనం ప్రచురించాడు.

రచయితగా[మార్చు]

విలువలకు కట్టుబడిన రచయితగా అతను "వాడిని జయించాలి" అంటూ దేశాన్ని పీడిస్తున్న అవినీతిపై కవితా శంఖారావం ప్రకటించాడు. అతను రాసిన ఈ దీర్ఘకవిత సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది. "ఉత్తరాంధ్ర చైతన్య స్వరాలు" కవితా సంకలనంలో ఈ కవిత ప్రచురించబడింది. ఈ కవితను చూసిన రచయిత అద్దేపల్లి రామమోహనరావు "వాడు" పదానికి "వర్గ శత్రువు, అవినీతిపరుల ముఠా" అనే సంకేతంగా రామకృష్ణ ఉపయోగించాడని ఆ పుస్తకం ముందుమాటలో రాసాడు. ఈ కవితలో సామ్రాజ్యవాది, పెట్టుబడిదారుడు, దోపిడిదారుడు, వాడే అవినీతికి మూలపురుషుడు, నీతికి శత్రువనీ, వాడిని జయించడం స్వేద జీవుల ప్రథమ కర్తవ్యంగా కవి పేర్కొన్నాడు. పేద మధ్యతరగతి వర్గాలను పట్టిపీడిస్తున్న అవినీతి అంశాన్ని చదువరి హృదయంలో బలమైన భావోద్వేగాలు రగిలించేలా వాస్తవిక దృక్పథాన్ని తన కవితలో కళ్ళముందు ఆవిష్కరించాడు. ఈ దీర్ఘ కవితను పారనంది నిర్మల హిందీలోకి అనువదించగా, అనంతపురానికి చెందిన కవి డా.రమేష్‌ నారాయణ ‘He is to be concord’ అనే శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించి ‘వాడిని జయించాలి’ కవితకు ఎల్లలు దాటిన వన్నె తెచ్చాడు. అతను రాసిన "ధీరోదాత్త దాశరథి" కవితను వరంగల్ తెలంగాణ సాహితీ మిత్రమండలి కవితా సంకలనంలో ప్రచురితమైంది.[2]

రచనలు[మార్చు]

కథా సంపుటాలు[మార్చు]

  1. కథాంజలి
  2. అడపా రామకృష్ణ కథలు

నవలలు[మార్చు]

  1. అందని ఆదరణ (1975) - పురిపండా అప్పలస్వామి ఆవిష్కరించాడు.
  2. దూరాలు దగ్గరవ్వాలి
  3. అనుబంధాలు
  4. అతిరథులు - ఇది ‘అతిరథి’ పేరిట హిందీలోకి అనువాదమైంది.

కవిత్వం[మార్చు]

  1. వాడిని జయించాలి (దీర్ఘకవిత)
  2. తల్లి భారతి : ఈ కవిత కన్నతల్లుల ఆవేదనకు అక్షరరూపం.
  3. 21వ శతాబ్దపు ఓటరు : ఈ కవిత ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని పిలుపునిచ్చాడు.
  4. చెట్టు పిలిచింది
  5. విశాఖ@2020 (దీర్ఘ కవిత)
  6. కవితారథం (కవితా సంపుటి)

కథలు[3][మార్చు]

ఇప్పటివరకు ఆయన రాసిన డెబ్భై కథలూ సమాజాన్ని పరిశీలించి, పరిశోధించి, అనుభవపూర్వకంగా అవగతం చేసుకుని రాసాడు. తన అన్నగారు చిదానందమూర్తి స్ఫూర్తితో బాల్యం నుంచే కథారచన చేయడం ప్రారంభించాడు. 1965లో ఆయన రాసిన తొలి కథ ‘ద్వేషించుకున్న పండితులు’ బాలబంధు మాసపత్రికలో వెలువడింది. 1966లో ‘దేశానికి కానుక’ కథ ప్రజామత పత్రికలో వచ్చింది. అప్పటినుంచీ ఆయన రాసిన కథలన్నీ ఆంధ్రజ్యోతి, నవ్య వీక్లీ, ఈనాడు, ఆంధ్రప్రభ, ఇండియాటుడే లాంటి పలు పత్రికల్లో వెలువడ్డాయి.17కథలతో 2001లో వెలువడిన ఆయన తొలి కథాసంపుటి ‘కథాంజలి’, 16 కథలతో 2011లో వెలువడిన ‘అడపా రామకృష్ణ కథలు’ మలి సంపుటికాగా, నలభై కథలున్న ‘దేశమేగతి బాగుపడునోయ్‌’ సంపుటి.[4] అతని వ్యాసాలు ‘సాహితీ ఉద్యమంలో కరదీపికలు’ పేరిట పుస్తకంగా వచ్చాయి.

  1. అడ్డుగోడలు
  2. అధికారం
  3. అనూహ్యం
  4. అవినీతి కాటేసింది
  5. అవినీతి పడగనీడలో
  6. ఆత్మాహుతి
  7. ఆధారం దొరికింది
  8. ఆమె అనుకోలేదు
  9. ఇది నిజమా
  10. ఎదగని మనసు
  11. కర్మణ్యే...
  12. కళ్ళు పచ్చబడ్డాయి
  13. కాలేజీ చదువులు
  14. గుర్తింపు
  15. చేదునిజం
  16. డబుల్ మీనింగ్
  17. తెగింపు
  18. దుర్దశ
  19. నీవే నా ప్రాణం
  20. నువ్వూ ఆడదానివే
  21. ప్రాణం ఖరీదు
  22. ప్రేమామృతం
  23. ప్రేమించేమనసు
  24. భయం
  25. మనిషి మనసు
  26. మానవ జీవితం
  27. మృత్యువుముంగిటలో
  28. రెప్పపాటు
  29. శారీ స్టోరీ
  30. శిక్షార్హుడు
  31. సంస్కారం
  32. సర్వతో జయతే

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను డిగ్రీ పూర్తిచేసి 1972లో విశాఖ నేవల్‌ బేస్‌ ఆఫీస్‌లో సూపర్‌వైజర్‌ ఉద్యోగంలో చేరి నాలుగు దశాబ్దాలు పనిచేసి 2011లో పదవీ విరమణ చేసాడు. అతని భార్త దుర్గా మహాలక్ష్మి. వారికి ఇద్దరు పిల్లలు. ముగ్గురు మనవలు. అబ్బాయి శివకోమల్‌. కోడలు దీపిక. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలో స్థిరపడ్డారు. కూతురు సునంద. అల్లుడు సుబ్రహ్మణ్యం.

మూలాలు[మార్చు]

  1. "నీతి నిజాయతీలే మన మనుగడకు మూలస్తంభాలు". 103.24.200.177. Retrieved 2020-06-04.[permanent dead link]
  2. "నీతి నిజాయతీలే మన మనుగడకు మూలస్తంభాలు". 103.24.200.177. Retrieved 2020-06-04.[permanent dead link]
  3. రచయిత: అడపా రామకృష్ణ
  4. "నీతి నిజాయతీలే మన మనుగడకు మూలస్తంభాలు". 103.24.200.177. Retrieved 2020-06-04.[permanent dead link]