Jump to content

అదృష్ట దేవత

వికీపీడియా నుండి
అదృష్ట దేవత
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం జి. రామకృష్ణ,
రాజశ్రీ,
విజయలలిత,
సత్యనారాయణ,
రేలంగి,
కాంతారావు
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ శ్రీ విజయలలితా పిక్చర్స్
భాష తెలుగు

కథా సంగ్రహము

[మార్చు]

వినయనగర సామ్రాజ్యానికి రాజు విక్రమవర్మ. అతని కొడుకు నాగన్న శాపవశాత్తు పిరికివాడు. ఆ రాజు తమ్ముని సంతానంలో పెద్దవారైన మహానందుడు, సదానందుడు రాజ్యాన్ని తామే పొందాలని కుట్రలు పన్నుతూ వుంటారు. కాని చిన్నవాడైన సోదరుడు చిదానందుడు, చెల్లెలు స్వయంప్రభలకు మాత్రం వీళ్ళ ఉద్దేశ్యాలు నచ్చక, పరోక్షంగా యువరాజు నాగన్నకు సహాయం చేస్తుంటారు. మంత్రి కొడుకు గుణసాగరుడు కూడా యువరాజును ఎప్పుడూ కనిపెట్టుకుని వుంటూ, అతన్ని ఆపదలలో రక్షిస్తూ వుంటాడు. యువరాజుకు వివాహం, పట్టాభిషేకం జరపాలని మహారాజు అనుకుంటాడు. అయితే ఆస్థాన జ్యోతిష్కుడు పెళ్ళయిన రాత్రే భార్య చనిపోతుందని చెబుతాడు. ఈ వార్త అంతటా ప్రాకి యువరాజుకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. పిల్లనిచ్చినవారికి ధన కనక వస్తువాహనాలు ఇస్తామని చాటింపు వేయిస్తాడు మహారాజు. యుద్ధంలో అవిటివాడై, ఏ పరిస్థితులూ అనుకూలించక, దారిద్ర్యంతో సతమతమవుతూ వుండే రణధీర్‌కు ముగ్గురు కుమార్తెలు వుంటారు. వాళ్ళల్లో అత్యంత సద్గుణవతి, తెలివైనదైన మల్లమ్మ, పువ్వులమ్ముతూ, కుటుంబానికి సహాయపడుతూ వుంటుంది. దారిన పోయే జ్యోతిష్కుడొక్కడు ఆమె మహారాణి కాగలదని చెప్పగా, ఆమె బాల్య స్నేహితురాలు, నర్తకీ అయిన రాగిణి, రోషంతో తానే ఎప్పటికైనా మహారాణి నౌతానంటూ ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోతుంది. కుటుంబం కోసం, దేశం కోసం తాను బలైనా ఫరవాలేదని, తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా యువరాజు నాగన్నను వివాహం చేసుకోవడానికి మల్లమ్మ అంగీకరిస్తుంది. మల్లమ్మకూ, నాగన్నకూ వివాహం జరిగిన రాత్రి పాలల్లో విషం కలిపి, వాళ్ళను అంతం చేయాలని విద్రోహులు ప్రయత్నిస్తారు. కాని చిదానందుడు వాళ్ళను యుక్తిగా తప్పిస్తాడు. అబద్ధం చెప్పిన ఆస్థాన జ్యోతిష్కుణ్ణి బెదిరించి, మల్లమ్మ నిజం తెలుసుకోబోతుండగా అతన్ని ఎవరో హత్య చేస్తారు. యువరాజును శాపవిముక్తుణ్ణి గావించి, మహావీరునిగా చేస్తానని మామగారికి మాట ఇస్తుంది మల్లమ్మ. నర్తకిగా రాజభవనానికి చేరిన రాగిణి మల్లమ్మ స్థానాన్ని చూసి ఈర్ష్య పడుతుంది. యుక్తిగా మహానందుణ్ణి మచ్చిక చేసుకుని రాజ్యం కబళించడంలో అతని పథకాలకు సహాయపడుతూ తాను మహారాణి కావాలని ఎదురు చూస్తుంటుంది. మల్లమ్మ చెల్లెళ్ళు రంగ, గంగ - నిక్షేప రాయుళ్ళు 'బుద్ధి', 'జ్ఞానం' అనే ఇద్దర్ని పెళ్ళి చేసుకుని - వాళ్ళూ రాజభవనం లోనే చేరతారు.మల్లమ్మ, యువరాజులను హత్య చేయడానికి కుట్రలు, ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి. మంత్రి కుమారుడు గుణసాగరుడు వాళ్ళను రక్షిస్తూ స్వయంప్రభ హృదయాన్ని చూరగొంటాడు. ఇరువురూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు.

ఇది ఇలా వుండగా 'కపాల కుండల' అనే మాంత్రికురాలు తాను నిత్యయవ్వనవతి కావాలని 'భైరవి'ని ప్రసన్నం చేసుకుంటుంది. అరచేతిలో మత్స్యరేఖ వున్న స్త్రీకి జన్మించిన బిడ్డను అంబకు అర్పిస్తే తన కోరిక నెరవేతుందని ఆమె తెలుసుకుంటుంది. ఆ స్త్రీ ఎవరో కాదు. మల్లమ్మ! ఆమె తన మంత్రతంత్రాలతో కార్యం సాధించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. కాని ఆమె భర్త 'శృంగభంగుడు' అన్నిటికీ అడ్డు తగులుతూ వుంటాడు. కపాలకుండల బారి నుండి మల్లమ్మను రక్షించి భర్తను శాపవిముక్తి గావించే 'నాగమణి'ని పొందడానికి ఆమెకు సహాయపడతాడు. కపాలకుండల కారణంగా వినయనగర సామ్రాజ్యంలో పరిస్థితులు తారుమారవుతాయి. కాని దుష్టశక్తులు ఫలించక, దుష్టులు పతనం చెంది మంచివారే విజయం సాధిస్తారు. కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

[మార్చు]
  • కాంతారావు
  • రేలంగి
  • రామకృష్ణ
  • సత్యనారాయణ
  • త్యాగరాజు
  • ధూళిపాళ
  • మిక్కిలినేని
  • అల్లు రామలింగయ్య
  • బాలకృష్ణ
  • అశోక్‌కుమార్
  • కాశీనాథ్ తాతా
  • ప్రసాద్
  • రాజశ్రీ
  • విజయలలిత
  • గీతాంజలి
  • జ్యోతిలక్ష్మి
  • లక్ష్మీకాంతమ్మ
  • పుష్పకుమారి మొదలైనవారు.

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. కాలం కలసివస్తే - ఘంటసాల - రచన: వీటూరి

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)