ఆర్.పిచ్మణి అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజగోపాలన్ పిచ్చుమణి అయ్యర్
వ్యక్తిగత సమాచారం
జననం(1920-05-18)1920 మే 18
నాగపట్నం
మరణం2015 డిసెంబరు 24(2015-12-24) (వయసు 95)
చెన్నై, భారతదేశం
వృత్తివైణికుడు

ఆర్.పిచ్చుమణి అయ్యర్ ఒక కర్ణాటక సంగీత వైణిక విద్వాంసుడు.[1]

విశేషాలు[మార్చు]

ఇతడు 1920, మే 18వ తేదీన ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో తమిళనాడు రాష్ట్రం, నాగపట్నంలో జన్మించాడు. ఇతడు తన 10వ ఏటి నుండి జలర్ గోపాల అయ్యర్ వద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించాడు. తరువాత తిరుచ్చి కుప్పణ్ణ వద్ద వీణావాదనం నేర్చుకున్నాడు. ఇతడు తిరుచిరాపల్లిలోని నేషనల్ కాలేజీలో ఎస్.ఎస్.ఎల్.సి.వరకు చదివాడు.[2] తన 15వ యేట నేషనల్ కాలేజీ నిర్వహించిన కర్ణాటక గాత్ర సంగీత పోటీలలో బహుమతి గెలుచుకున్నాడు.

తరువాత ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయంలో చేరి వీణలో "సంగీత భూషణం" పట్టాను సంపాదించాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో మహామహులైన టైగర్ వరదాచారి, కె.ఎస్.నారాయణస్వామి, వి.ఎస్.గోమతి శంకర అయ్యర్ వంటి విద్వాంసుల వద్ద శిష్యరికం చేశాడు. 1940 నుండి ఇతడు వేలాది కచేరీలు దేశవిదేశాలలో అనేక సభలలో, ఆకాశవాణిలో చేశాడు.[3]

సినిమా దర్శకుడు కె.సుబ్రమణ్యం ఇతడిని తన సినిమాపాటలలో వీణ వాయించడానికి మద్రాసుకు తీసుకువచ్చాడు. ఇతడు 1941లో జుపిటర్ స్టూడియోలో వీణ కళాకారుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో ఇతడు ఎందరికో వీణలో పాఠాలు చెప్పాడు. వారిలో ఎ.వి.ఎం. స్టూడియో అధినేత ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి భార్య రాజేశ్వరి కూడా ఉంది. ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి ఇతడి ప్రతిభను గుర్తించి తన స్టూడియోలో పర్మనెంటు ఉద్యోగం ఇచ్చాడు. తరువాత ఇతడు ఎ.వి.ఎం. నిర్మించిన అనేక సినిమాల పాటలలో వీణావాదనను చేశాడు.

ఇతడు స్వరకర్తగా కొన్ని స్వరజతులను, తిల్లానాలను, వర్ణనలను స్వరపరిచాడు. వసంత కైశికి అనే కొత్త రాగాన్ని సృష్టించాడు.[4]

ఇతడు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ గ్రేడు ఆర్టిస్టుగా అనేక జాతీయ కార్యక్రమాలలో, సంగీత సమ్మేళనాలలో పాల్గొన్నాడు.

కొలంబియా గ్రామఫోన్ కంపెనీ 78 ఆర్.పి.ఎం. రికార్డులలో, హెచ్.ఎం.వి. ఎల్.పి.రికార్డులలో, ఆడియో కేసెట్లలో ఇతని వీణా కచేరీలు అనేకం రికార్డు చేయబడ్డాయి.

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

  • 1970లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడికి కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది.
  • 1988లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
  • కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా నియమించబడ్డాడు.
  • కంచి పరమాచార్య ఇతడిని "వీణా నాదమణి" బిరుదుతో సన్మానించాడు.
  • 1980లో తిరువయ్యారు త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు కార్యదర్శిగా పనిచేశాడు. తరువాత మరణించే వరకూ ట్రస్టీగా ఉన్నాడు.
  • ఇతడు షణ్ముగ వైద్వు అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాడు.
  • మద్రాసు సంగీత అకాడమీనుండి టి.టి.కె. స్మారక అవార్డును పొందాడు.
  • 1991లో మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ "సంగీత కళానిపుణ" బిరుదును ఇచ్చింది.
  • ఇంకా ఇతనికి వీణా ప్రవీణ, "వీణ విదగర్", "వీణై ఇసై విదగర్", "నాద కణల్" మొదలైన బిరుదులు లభించాయి.

శిష్యులు[మార్చు]

ఇతడు అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని మంచి వైణికులుగా తయారు చేశాడు. వీరిలో ఆర్.ఎస్.జయలక్ష్మి, వసంత కృష్ణమూర్తి, వసంతకుమార్, బి.కన్నన్, అయ్యర్ బ్రదర్స్ (రామనాథ్ అయ్యర్, గోపీనాథ్ అయ్యర్), బి.రామన్, ఆర్.విశ్వేశరన్, సురేష్ కృష్ణ మొదలైన వారున్నారు. అయ్యర్ బ్రదర్స్ ఆస్ట్రేలియా దేశం మెల్‌బోర్న్‌లో తమ గురువు పేరుతో "ఆర్.పిచ్చుమణి స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్" అనే విద్యాసంస్థను నెలకొల్పి వీణను నేర్పిస్తున్నారు.[4]

మరణం[మార్చు]

ఇతడు 2015, జూన్ 20వ తేదీన తన 95వ యేట చెన్నై నగరంలో మరణించాడు.[2] ఇతని శతజయంతి ఉత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం తపాలాశాఖ 2020 డిసెంబర్ 24వ తేదీన ఒక ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది.[5]

మూలాలు[మార్చు]

  1. web master. "R. Pichumani Iyer". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 26 March 2021.[permanent dead link]
  2. 2.0 2.1 Team MyTimes (1 July 2015). "Tribute : R. Pichumani Iyer". మైలాపూర్ టైమ్స్. Retrieved 26 March 2021.
  3. P. VASANTH KUMAR (1 August 2015). "R. Pichumani Iyer" (PDF). SRUTI MAGAZINE: 50. Retrieved 26 March 2021.
  4. 4.0 4.1 web master. "R PICHUMANI IYER". Iyer Brothers Veena. Iyer Brothers. Retrieved 26 March 2021.
  5. web master. "India:Special Cover on Centenary of Veena R.Pichumani Iyer". Phila Mirror. Retrieved 26 March 2021.