జగద్ధాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూసల జగద్ధాత్రి
జననం1964
మరణం2019
విశాఖపట్నం
ఇతర పేర్లుజగద్ధాత్రి
వృత్తికవయిత్రి, అనువాదకురాలు, అధ్యాపకురాలు
పిల్లలుదీప్తి

జగద్ధాత్రి తెలుగు రచయిత్రి, అనువాదకురాలు, కాలమిస్ట్

సాహితీ జీవితం[మార్చు]

జగద్ధాత్రి 1964లో జన్మించారు. భారత యువ రచయిత్రులు, జగమంత కుటుంబం, కావ్యజ్యోతి వంటి ఫీచర్స్‌తో ఆమె కాలమిస్టుగా గుర్తింపు పొందారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. హన్స్ ఇండియా పత్రికకు ఆంగ్లంలో అనేక సాహితీ వ్యాసాలు రాశారు. విద్యార్థి దశలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ (ఆంగ్లం) లో అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న జగద్ధాత్రి ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీలలో కూడా పీజీలు చేశారు. అలాగే అరబిందో చిన్ని కవితలలోని తాత్వికతపై మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ చేశారు. 1996 నుండి 2002 వరకు లిటిల్ హార్ట్స్ స్కూలుకి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆ తర్వాత విశాఖలోని ఈస్ట్ కోస్ట్ మెరిటైమ్ అకాడెమీ‌లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగానూ, డీన్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత ఎంఎస్సీ, ఎంఈడీ కోర్సులు చేసి అధ్యాపకురాలిగా సేవలందించారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సూర్య, ప్రజాశక్తి, నవ్య, చినుకు, విశాఖ సంస్కృతి, మ్యూజ్ ఇండియా ,కౌముది , విహంగ, ఇ -వాకిలి మొదలైన పత్రికలకు విరివిగా ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వ్యాసాలు రాసారు. తన సహచరుడు రామతీర్థతో కలిసి జగద్ధాత్రి మొజాయిక్ సాహిత్య సంస్థ ద్వారా శ్రీ శ్రీ శతజయంతి, కన్యాశుల్కం రెండవ ప్రచురణ వేడుకలు, గురజాడ 150 జయంతి, జనగణమన శతజయంతి, విజయనగరం కోట త్రిశత జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆకాశవాణి విశాఖపట్నంలో రామతీర్థ , జగద్ధాత్రి కలిసి ‘సాహితీ సమీరాలు’ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతని తెలియజేసే సంయుక్త ప్రసంగాలు చేశారు. 2019 మే 30 తేదిన సాహితీ మిత్రుడు రామతీర్థ గుండెపోటుతో మరణించాక, 3 నెలలు గడవక ముందే జగద్ధాత్రి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. [1]

రచనలపై అభిప్రాయాలు[మార్చు]

జగద్ధాత్రి రాసిన ఆటవిడుపు కవిత గురించి విమర్శకులు బొల్లోజు బాబా మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్, పాలస్తీనాలో పాలుగారే పసిపిల్లల బుగ్గలపైనుంచి జారే కన్నీటి చుక్కలు, అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, గోద్రా మంటలు, నందిగ్రామ్, ముదిగొండ పేలుళ్ళు వంటి సమకాలీన అంశాలను స్పృశిస్తూ, ఇవి మానవాళి శాంతిని భగ్నం చేస్తున్నాయని, వీటినుంచి ఆటవిడుపు తీసుకొని కాసేపు ఆలోచించమని- ఆటవిడుపు అంటే విరామం కాదు, ఆటగాళ్లుగా మనందరం విశ్వశాంతికై తర్ఫీదు పొందే సార్ధక సమయం అనీ రచయిత్రి భావించిందని తెలిపారు.

అలాగే జగద్ధాత్రి రాసిన సహచరణం కవితా సంపుటి గురించి మరో కవి కె.శివారెడ్డి పుస్తకానికి వ్రాసిన ఆత్మీయవాక్యాలలో “She is not a frozen Feminist” అన్నారు. జీవితంలోని అన్ని పార్శ్వాలకు తలుపులు తెరిచి, లోలోపల జనించే అలజడిని, ఆవేదనల్ని అక్షరాలలోకి వొంపిన ఆమె గొప్ప “ప్రేమమయి” అని తెలిపారు. అందుకనే ఈ కవితలలో లోకంపట్ల ప్రేమ, దయ అంతర్వాహినులుగా ప్రవహించాయన్నారు. [2]

నెచ్చెలి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోరాటాల గురించి మాట్లాడతూ జగద్ధాత్రి "అస్తిత్వ పోరాటానికైనా.. ఇంకే పోరాటానికైనా, దేనికైనా.. కావాల్సింది మళ్ళీ రాజకీయ పరిష్కారమే. ఈ చిన్న పోరాటాలన్నీ ఆ మెయిన్ స్ట్రీమ్ పోరాటంలో కలవాల్సిందే. అప్పుడే సరి అయిన దశ దిశ చేరుతాయి" అని తెలిపారు. అదే ఇంటర్వ్యూలో జ్వాలాముఖిని తన అభిమాన కవిగా పేర్కొన్నారు. జగద్ధాత్రి కవయిత్రిగానే కాకుండా కథకురాలిగా కూడా సుపరిచితులు. ఈమె రాసిన రూప వస్తువు (నవ్య), రేపటి టీచర్లు (ప్రజాశక్తి) కథలు పలు చర్చలను లేవదీశాయి. [3]

పురస్కారాలు[మార్చు]

  • వక్షస్థలే (ఆర్ ఎస్ క్రిష్ణమూర్తి కథా పురస్కారం)
  • సహచరణం (పాతూరి మాణిక్యమ్మ కవితా పురస్కారం, అజోవిభో కందాళం ఫౌండేషన్ అవార్డు)

మూలాలు[మార్చు]

  1. "ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య".
  2. "ప్రేమతో సహచరణం జగద్ధాత్రి కవిత్వం".
  3. "నెచ్చెలి పత్రికలో జగద్ధాత్రితో రచయిత సివి సురేష్ ముఖాముఖి".

యితర లింకులు[మార్చు]