Jump to content

జ్వాలా తోరణం

వికీపీడియా నుండి
(జ్వాలా తోరణము నుండి దారిమార్పు చెందింది)

ఎగసి పడే మంటలను జ్వాలా తోరణం అంటారు. ఉదాహరణకు అగ్ని పర్వతాల నుంచి ఎగసి పడే మంటలు. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎగసి పడే మంటలను జ్వాలా తోరణం అంటారు. జ్వాలా తోరణం పదం పురాణ ప్రసిద్ధమైంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలము ఉద్భవించింది. ఇది లోకములను సర్వ నాశనము చేసే ప్రమాదము ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించ వలసినదని మహాశివుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి, మహాశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగటానికి సిద్ధ పడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పై లోకాలను, కడుపు లోనికి వెడితే అధో లోకాలను దహించివేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠ మద్యములో నిక్షేపించాడు. ఈ దృశ్యాన్ని చూసి, పార్వతీ దేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. మహాశివునికి ప్రమాదము జరుగలేదు. కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములలో, ఎండు గడ్డితో చేసిన తోరణమును, రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి, దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రింది నుంచి శివ, పార్వతుల పల్లకీని మూడు సార్లు మోసుకొని వెడతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని "జ్వాలా తోరణం" అంటారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, పూర్వ కవి, శ్రీనాథుడు వ్రాసిన పద్యం:

 మ్రింగెడిది గరళమని తెలిసి
 మ్రింగెడివాడు ప్రాణవిభుడని, మేలని ప్రజకున్
 మ్రింగుమనె సర్వ మంగళ
 మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో

ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పడం కూడా అవసరం. హాలాహలమును కంఠ మద్యములో ఉంచిన కారణంగా, మహాశివుని శరీరములో మంట బయలు దేరింది. ఈ మంటను అదుపు చేయడానికి, శివునికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకిస్తుంటారు. ఆ విధంగా, శివుడు అభిషేకప్రియుడు అయ్యాడు.
ఆధునిక కాలంలో కూడా జ్వాలాతోరణం ఒక కాంతిని, వినోదంగా ఇచ్చే వస్తువు. దీపావళి నాడు జనం వినోదంగా కాల్చే వస్తువులలో మతాబులు, కాకరపువ్వొత్తులు, అగ్గిపెట్టెలతో పాటు మందుతో కూరిన, "జ్వాలా తోరణం" అని పిలువబడే ఒక తాడును కూడా కాలుస్తారు. ఈ తాడును కాలుస్తున్నప్పుడు, అది వెలువరించే కాంతి, మతాబులు, కాకరపువ్వొత్తులు కాల్చినప్పుడు వచ్చే కాంతివలె ఉండి, పిల్లలకు వినోదాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.