Jump to content

డైనోసార్

వికీపీడియా నుండి

Dinosaurs
Temporal range: Late TriassicPresent, 233.23 – 0 Mya (Range includes birds (Aves)) (Possible Middle Triassic record)
డైనోసార్ అస్థిపంజరాల చిత్రాలు. ఎడమ నుండీ సవ్యదిశలో: మైక్రోరాప్టర్' (రెక్కలున్న థెరోపోడ్), అపటోసారస్ లూసీ (పెద్ద సారోపోడ్), ఎడ్మాంటోసారస్ రెగాలిస్ (ఆర్నితోపోడ్), ట్రైసెరాటాప్స్ హారిడస్ (కొమ్మున్న సెరాటోప్సియన్), స్టెగోసారస్ స్టెనాప్స్ (పొలుసులున్న స్టెగోసార్), పినాకోసారస్ గ్రాంగేరి (కవచమున్న అంకైలోసార్)
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: Reptilia
Clade: Dracohors
Clade: Dinosauria
రిచర్డ్ ఓవెన్, 1842
పెద్ద సమూహాలు
  • ఆర్నితీశ్చియా
  • సారోపోడామార్ఫా
  • థెరోపోడా
montage of four birds
పక్షులు, ఎగిరే డైనోసార్‌లు. ఫైలోజెనెటిక్ వర్గీకరణలో డైనోసౌరియా సమూహంలో వీటిని చేర్చారు.

డైనోసారియా క్లాడ్‌లోని వివిధ సరీసృపాల సమూహమే డైనోసార్లు. [note 1] అవి భూమిపై మొదటగా 24.3 - 23.323 కోట్ల సంవత్సరాల క్రితం (కోసంక్రి), ట్రయాసిక్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిణామానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది, ఖచ్చితమైన సమయం ఏది అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. 20.13 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ట్రయాసిక్-జురాసిక్ విలుప్తి ఘటన తర్వాత అవి, నేలపై జీవించే సకశేరుకాలుగా మారాయి. నేలపై వాటి ఆధిపత్యం జురాసిక్, క్రెటేషియస్ పీరియడ్లలో కొనసాగింది. పక్షులు, ఆధునిక కాలపు రెక్కల డైనోసార్‌లే అని శిలాజ రికార్డును బట్టి తెలుస్తోంది. చివరి జురాసిక్ యుగంలో, అంతకు మునుపు ఉనికిలో ఉన్న థెరోపోడ్‌ల నుండి ఇవి ఉద్భవించాయి. దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం నాటి క్రెటేషియస్-పాలియోజీన్ విలుప్తి ఘటనలో డైనోసార్ వంశానికి చెందిన జీవుల్లో ఇవి మాత్రమే వినాశనం నుండి తప్పించుకున్నాయి. కాబట్టి డైనోసార్‌లను ఎగిరే డైనోసార్‌లు లేదా పక్షులుగాను, అంతరించిపోయిన ఎగరని డైనోసార్‌లు (పక్షులు కాకుండా ఇతర డైనోసార్‌లు) గానూ విభజించవచ్చు.

వర్గీకరణ, శరీరనిర్మాణ, పర్యావరణ దృక్కోణాల నుండి చూస్తే డైనోసార్‌లు విభిన్న జంతువుల సమూహం. 10,700 కంటే ఎక్కువ జీవించి ఉన్న జాతులు గల పక్షులు, సకశేరుకాల సమూహంలో అత్యంత వైవిధ్యమైనవి. శిలాజ సాక్ష్యాల ఆధారంగా, పురావస్తు శాస్త్రవేత్తలు 900 కంటే ఎక్కువ విభిన్న ఎగరని ప్రజాతులను, 1,000 కంటే ఎక్కువ విభిన్న జాతుల ఎగరని డైనోసార్‌లను గుర్తించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న జాతుల (పక్షులు) రూపంలో గానీ, శిలాజ అవశేషాల రూపంలో గానీ డైనోసార్‌లు ప్రతి ఖండంలోనూ ఉనికిలో ఉన్నాయి. 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో, పక్షులను డైనోసార్‌లుగా గుర్తించడానికి ముందు, శాస్త్రీయ సమాజంలో చాలామంది, డైనోసార్‌లు చల్లని రక్తంతో, మందకొడిగా ఉండేవని భావించేవారు. 1970ల నుండి నిర్వహించిన చాలా పరిశోధనల్లో డైనోసార్‌లు, చురుకైన జీవక్రియలతో, పరస్పర సామాజిక సంబంధాలతో జీవించిన జంతువులు అని తేలింది. వీటిలో కొన్ని శాకాహారులు, మరికొన్ని మాంసాహారులు. డైనోసార్‌లన్నీ గుడ్లు పెట్టేవని తెలిసింది. గూడు కట్టడం అనేది ఎగిరే, ఎగరని డైనోసార్‌లు రెండింటిలోనూ చాలావాటికి ఉన్న లక్షణమని ఆధారాలను బట్టి తెలుస్తోంది.

మొదటి డైనోసార్ శిలాజాలను 19వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. సర్ రిచర్డ్ ఓవెన్, 1841లో మొదటిసారిగా ఈ "గొప్ప శిలాజ బల్లుల"కు "డైనోసార్" ("భయంకరమైన బల్లి" అని అర్థం) అనే పేరు పెట్టాడు. అప్పటి నుండి, డైనోసార్ల అస్థిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటూ ఉన్నాయి. డైనోసార్‌లు ప్రజా సంస్కృతిలో భాగంగా మారిపోయాయి. కొన్ని డైనోసార్‌ల పెద్ద పరిమాణాలు, భయంకరంగా ఉంటుందేమో అనిపించే వాటి స్వభావం మొదలైన వాటి కారణంగా అవి జురాసిక్ పార్క్ వంటి అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలు, సినిమాలకు ఇతివృత్తమయ్యాయి. వీటి పట్ల ప్రజల్లో ఉన్న నిరంతర ఉత్సాహం కారణంగా డైనోసార్ సైన్సుకు గణనీయమైన నిధులు అందుతూ ఉన్నాయి. అలాగే క్రమం తప్పకుండా మీడియా ద్వారా కొత్త ఆవిష్కరణలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి.

నిర్వచనం

[మార్చు]

ఫైలోజెనెటిక్ నామకరణం ప్రకారం, ట్రైసెరాటాప్స్‌కూ ఆధునిక పక్షులకూ (నియోర్నిథెస్) ఉన్న అత్యంత ఇటీవలి ఉమ్మడి పూర్వీకునితో (MRCA) పాటు, దాని వారస జాతులన్నిటితో కూడిన సమూహాన్ని డైనోసార్‌లని నిర్వచిస్తారు. మెగాలోసారస్, ఇగ్వానోడాన్‌ల ఉమ్మడి పూర్వీకునికి సంబంధించి డైనోసౌరియాను నిర్వచించాలని కూడా శాస్త్రవేత్తలు సూచించారు. ఎందుకంటే రిచర్డ్ ఓవెన్ డైనోసౌరియాను గుర్తించినప్పుడు ఉదహరించిన మూడు జాతులలో ఈ రెండు ఉన్నాయి. రెండు నిర్వచనాలూ ఒకే రకమైన జంతువులను డైనోసార్‌లుగా నిర్వచించాయి: "డైనోసౌరియా = ఆర్నిథిస్చియా + సౌరిస్చియా ". ఈ నిర్వచనంలో యాంకైలోసౌరియన్‌లు (సాయుధ శాకాహార చతుష్పాదులు), స్టెగోసౌరియన్లు (ప్లేటెడ్ శాకాహార చతుష్పాదులు), సెరాటోప్సియన్‌లు (మెడ ముడతలతో కూడిన ద్విపాద లేదా చతుష్పాద శాకాహారులు), పాచీసెఫలోసౌరియన్‌లు (మందపాటి కపాలం కలిగిన ద్విపాద శాకాహారులు) ఆర్నితోపోడ్స్ (ద్విపాద, చతుష్పాద శాకాహారులు), థెరోపాడ్స్ (ద్విపాద మాంసాహారులు, పక్షులు), సౌరోపోడోమోర్ఫ్‌లు (పొడవాటి మెడలు, తోకలూ ఉన్న పెద్ద శాకాహార చతుష్పాదులు).

థెరోపాడ్ డైనోసార్లలో, పక్షులను ప్రస్తుతం మనుగడలో ఉన్న ఏకైక వంశంగా గుర్తించారు. సాంప్రదాయిక వర్గీకరణలో, పక్షులు డైనోసార్లనే ప్రత్యేకమైన సూపర్ ఆర్డర్ నుండి ఉద్భవించిన ప్రత్యేక తరగతిగా పరిగణించారు. అయితే, డైనోసార్‌లపై అధ్యయనం చేసే సమకాలీన పురావస్తు శాస్త్రజ్ఞులలో ఎక్కువ మంది సాంప్రదాయిక వర్గీకరణ పద్ధతిని తిరస్కరించి, ఫైలోజెనెటిక్ వర్గీకరణ పట్ల మొగ్గుచూపారు ఈ విధానం ప్రకారం, ఒక సమూహం సహజంగా ఉండాలంటే, ఆ సమూహంలోని సభ్యుల వారసులందరూ కూడా తప్పనిసరిగా ఆ సమూహంలో ఉండాలి. ఆ ప్రకారం పక్షులను డైనోసార్‌లుగా పరిగణిస్తారు. పక్షులు ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి కాబట్టి, డైనోసార్‌లు అంతరించిపోలేదన్నట్లే. [7] పక్షులు మనిరాప్టోరా అనే ఉప సమూహానికి చెందినవిగా వర్గీకరించారు. మనిరాప్టోరా కోయెలురోసార్‌లు, కోయెలురోసార్‌లు థెరోపాడ్‌లు, థెరోపాడ్‌లు సౌరిస్చియన్లు, సౌరిస్చియన్లు డైనోసార్‌లు.

డైనోసార్‌లు, మెసోజోయిక్ ఎరాలో, ముఖ్యంగా జురాసిక్, క్రెటేషియస్ పీరియడ్లలో నేలపై జీవించి, ఆధిపత్యస్థితిలో ఉన్న సకశేరుకాలు. ఇతర జంతువుల సమూహాలు పరిమాణం లోను, ఆవాస స్థానాల్లోనూ పరిమితంగా ఉండేవి; ఉదాహరణకు, క్షీరదాల పరిమాణం పెంపుడు పిల్లిని మించి ఉండడం అరుదు. ఇవి సాధారణంగా ఎలుకల పరిమాణంలో ఉండే మాంసాహారులే. వాటిని ఎల్లప్పుడూ చాలా వైవిధ్యమైన జంతువుల సమూహంగానే గుర్తించారు; 2018 నాటికి 900 ఎగరని డైనోసార్ ప్రజాతులను స్పష్టంగా గుర్తించారు. 2016 నాటికి శిలాజ రికార్డులో భద్రపరచబడిన మొత్తం ప్రజాతుల సంఖ్య దాదాపు 1850 అని (వీటిలో దాదాపు 75% ఇంకా కనుగొనలేదు), జాతులు 1124 అనీ అంచనా వేసారు. [8] [9] 1995 లో చేసిన ఒక అధ్యయనంలో దాదాపు 3,400 డైనోసార్ ప్రజాతులు ఏ కాలంలోనైనా ఉనికిలో ఉండేవని అంచనా వేసారు. శిలాజ రికార్డులో చేరి ఉండనివి కూడా ఇందులో చేరి ఉన్నాయి.

2016లో, మెసోజోయిక్‌లో ఉన్న డైనోసార్ జాతుల సంఖ్య 1,543–2,468 అని అంచనా. [10] [11] 2021లో, ఆధునిక పక్షుల్లో (ఎగిరే డైనోసార్‌లు) 10,806 జాతులున్నాయని అంచనా వేసారు. [12] వీటిలో కొన్ని శాకాహారులు, మరికొన్ని మాంసాహారులు -గింజలు తినేవి, చేపలను తినేవి, క్రిములను తినేవి, అన్నీ తినేవీ వీటిలో ఉన్నాయి. డైనోసార్‌ల పూర్వీకులు ద్విపాదులు కాగా (ఆధునిక పక్షులు లాగా), కొన్ని చరిత్రపూర్వ జాతులు మాత్రం చతుష్పాదులు. అంచిసారస్, ఇగ్వానోడాన్ వంటివి రెండు కాళ్ళ మీద, నాలుగు కాళ్ల మీదా కూడా తేలిగ్గా నడవగలిగేవి. తలపై ఉండే కొమ్ములు, కిరీటాల వంటివి డైనోసార్ల సాధారణ లక్షణాలు. కొన్ని అంతరించిపోయిన జాతుల జీవులకు అస్థి కవచం ఉండేది. దైనోసార్లు పెద్దపెద్ద పరిమాణాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, అనేక మెసోజోయిక్ డైనోసార్‌లు మానవుడి పరిమాణం లోనే ఉండేవి. ఆధునిక పక్షులు సాధారణంగా పరిమాణంలో మానవుడి కంటే చాలా చిన్నవి. డైనోసార్‌లు నేడు ప్రతి ఖండంలోనూ నివసిస్తున్నాయి. అందుబాటులో ఉన్న శిలాజాలను బట్టి చూస్తే, ప్రారంభ జురాసిక్ ఇపోక్ నాటికి అవి ప్రపంచ వ్యాప్తంగా ఉండేవని తెలుస్తోంది. [13] ఆధునిక పక్షులు భూగోళం నుండి సముద్రాల వరకు చాలా అందుబాటులో ఉన్న ఆవాసాలలో నివసిస్తున్నాయి. కొన్ని ఎగరని డైనోసార్‌లు (మైక్రోరాప్టర్ వంటివి) ఎగరగలిగేవని లేదా కనీసం గాల్లో తేలగలిగేవనీ చెప్పేందుకు ఆధారాలున్నాయి. స్పినోసౌరిడ్‌ల వంటివి పాక్షికంగా నీటిలో జీవించేవి.

పరిణామ చరిత్ర

[మార్చు]

మూలాలు, ప్రారంభ పరిణామం

[మార్చు]
Full skeleton of an early carnivorous dinosaur, displayed in a glass case in a museum
ట్రయాసిక్ కాలం నాటి తొలి డైనోసార్‌లు హెర్రెరాసారస్ (పెద్దవి), ఎరాప్టర్ (చిన్నవి), ప్లేటోసారస్ పుర్రె

మధ్య నుండి చివరి ట్రయాసిక్ యుగాలలో, డైనోసార్‌లు తమ ఆర్కోసార్ పూర్వీకుల నుండి వేరు పడ్డాయి. వినాశకరమైన పెర్మియన్-ట్రయాసిక్ విలుప్తి ఘటన జరిగిన 2 కోట్ల సంవత్సరాల తర్వాత మొత్తం సముద్ర జాతులలో 96%, నేలపై నున్న సకశేరుకాలలో 70% జాతులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటన దాదాపు 25.2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. తొలి డైనోసార్ జాతి అయిన ఎరాప్టర్ ను కనుగొన్న అర్జెంటీనాలోని ఇస్చిగువాలాస్టో నిర్మాణాన్ని రేడియోమెట్రిక్ డేటింగ్ చేయగా అది 23.14 కోట్ల సంవత్సరాల నాటిదని తేలింది. [14] ఎరాప్టర్ అన్ని డైనోసార్ల సాధారణ పూర్వీకులను పోలి ఉంటుంది; ఇది నిజమైతే, తొలి డైనోసార్‌లు చిన్నవని, ద్విపాదులని, వేటాడే జంతువులనీ అర్థమౌతుంది. [15] దాదాపు 23.3 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ట్రయాసిక్‌లోని కార్నియన్ ఇపోక్‌లో నేటి అర్జెంటీనా ప్రాంతంలో నివసించిన లాగోసుచస్, లాగర్‌పెటన్ వంటి ఆదిమ డైనోసార్ లాంటి ఆర్నిటోడిరాన్‌లను కనుగొనడం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. [16] వెలికితీసిన శిలాజాల విశ్లేషణలో ఈ జంతువులు నిజానికి చిన్న, ద్విపాద, వేటాడే జీవులను సూచించింది. 24.5 కోట్ల సంవత్సరాల క్రితం, ట్రయాసిక్ లోని అనిసియన్ ఇపోక్‌లో డైనోసార్‌లు మొదటిసారి కనిపించి ఉండవచ్చు. ఆ కాలం నాటి న్యాసాసారస్ జాతి అవశేషాలు దీనికి ఆధారం. అయితే, ఇప్పటివరకూ లభ్యమైన దాని శిలాజాలు చిన్నచిన్న ముక్కలుగా ఉన్నాయి. వీటిని బట్టి అది డైనోసారా లేక దాని దగ్గరి బంధువా అని చెప్పలేనంత చిన్నముక్కలవి. [17] పాలియోంటాలజిస్ట్ మాక్స్ C. లాంగర్ తదితరులు (2018) శాంటా మారియా నిర్మాణం లో లభించిన స్టౌరికోసారస్ 23.323 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని నిర్ణయించారు. ఇది ఇయోరాప్టర్ కంటే పాతది. [18]

డైనోసార్‌లు ఉద్భవించిన సమయంలో, అవి నేలపై నివసించే జంతువులలో ఆధిపత్య స్థితిలో లేవు. నేలపై ఆవాసాలను సైనోడాంట్లు, రైంకోసార్‌ల వంటి వివిధ రకాల ఆర్కోసౌరోమోర్ఫ్‌లు, థెరప్సిడ్‌లు ఆక్రమించుకుని ఉన్నాయి. వాటికి ప్రధాన పోటీదారులు డైనోసార్లు కావు; ఏటోసార్స్, ఆర్నిథోసుచిడ్స్, రౌయిసుచియన్లు వంటి సూడోసూచియన్లు. ఈ ఇతర జంతువులలో ఎక్కువ భాగం ట్రయాసిక్‌లో జరిగిన రెండు ఘటనలలో ఒకదానిలో అంతరించిపోయాయి. మొదట, సుమారు 21.5 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలో ప్రోటోరోసార్‌లతో సహా వివిధ రకాల బేసల్ ఆర్కోసౌరోమోర్ఫ్‌లు అంతరించిపోయాయి. దీని తరువాత ట్రయాసిక్-జురాసిక్ విలుప్తి ఘటన (సుమారు 20.1 కోట్ల సంవత్సరాల క్రితం), ఏటోసార్‌లు, ఆర్నిథోసుచిడ్‌లు, ఫైటోసార్‌లు, రౌయిసుచియన్‌లు వంటి ప్రారంభ ఆర్కోసార్‌ల సమూహాలు చాలా వరకు అంతమై పోయాయి. రైన్‌కోసార్‌లు, డైసినోడెంట్‌లు (కనీసం కొన్ని ప్రాంతాలలో) కనీసం ప్రారంభ-మధ్య నోరియన్, చివరి నోరియన్ లేదా ప్రారంభ రైటియన్ దశల్లో [19] మనుగడ సాగించాయి. అవి అంతరించిపోయిన ఖచ్చితమైన సమయం అనిశ్చితంగా ఉంది. ఇవి అంతరించిపోవడంతో ఇక క్రోకోడైలోమోర్ఫ్‌లు, డైనోసార్‌లు, క్షీరదాలు, టెరోసౌరియన్‌లు, తాబేళ్ల భూ జంతుజాలం మిగిలిపోయింది.తొలి డైనోసార్ల లోని కొన్ని జాతులు ట్రయాసిక్ లోని కార్నియన్, నోరియన్ స్టేజిల కాలంలో విస్తరించాయి. బహుశా అంతరించిపోయిన సమూహాల స్థానాలను ఇవి ఆక్రమించుకుని ఉండవచ్చు. ముఖ్యంగా, కార్నియన్ ప్లూవియల్ ఘటన సమయంలో విలుప్తి రేటు పెరిగింది. [20]

సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం, క్రెటేషియస్ చివరిలో క్రెటేషస్-పాలియోజీన్ విలుప్తి ఘటన సంభవించింది. ఆ ఘటనలో నియోర్నిథైన్ పక్షులు మినహా అన్ని డైనోసార్ సమూహాలు అంతరించిపోయాయి. మొసళ్ళు, డైరోసార్‌లు, సెబెకోసూచియన్‌లు, తాబేళ్లు, బల్లులు, పాములు, స్పినోడోంటియన్‌లు, కొరిస్టోడెరాన్‌లతో సహా కొన్ని ఇతర డయాప్సిడ్ సమూహాలు కూడా ఆ ఘటనలో అంతరించకుండా బయటపడ్డాయి.

ఆ ఘటనలో అంతరించకుండా మనుగడలో ఉన్న నియోర్నిథైన్ పక్షుల వంశాలు, ఆధునిక ఎలుకల పూర్వీకులు, బాతులు, కోళ్లు, వివిధ రకాల నీటి పక్షులు పాలియోజీన్ కాలం ప్రారంభంలో వేగంగా విస్తరించాయి. ఆర్బోరియల్ ఎన్యాంటియోర్నిథైన్స్, ఆక్వాటిక్ హెస్పెరోర్నిథైన్స్, నేలపై జీవించిన పెద్ద థెరోపాడ్‌లు ( గాస్టోర్నిస్, ఇయోగ్రూయిడ్స్, బాథోర్నిథిడ్స్, రాటిట్స్, జెరానోయిడ్స్, మిహిరంగ్స్, " టెర్రర్ బర్డ్స్ " రూపంలో) వంటి మెసోజోయిక్ డైనోసార్ సమూహాల అంతరించిపోవడంతో ఖాళీ అయిన పర్యావరణ వ్యవస్థల లోకి ఇవి ప్రవేశించాయి. ఆధిపత్య పోటీలో క్షీరదాలు, నియోర్నిథైన్‌లపై ఆధిపత్యం సాధించాయని భావిస్తున్నారు. అయితే ఈ సమూహాలలో చాలా వరకు సెనోజోయిక్ యుగంలో గొప్ప క్షీరద జంతుజాలంతో సహజీవనం చేశాయి. [21] టెర్రర్ బర్డ్స్, బాథోర్నిథిడ్‌లు వేటాడే క్షీరదాలతో పాటు మాంసాహార స్థానాలను ఆక్రమించాయి. [22] [23] ఎలుకలు ఇప్పటికీ మధ్య-పరిమాణ శాకాహారులుగా ఉన్నాయి; అదే విధంగా, ఇయోగ్రీడ్లు ఈయోసిన్ నుండి ప్లియోసీన్ వరకు కొనసాగాయి. కోట్ల సంవత్సరాల పాటు అనేక క్షీరద సమూహాలతో సహజీవనం చేసాక, ఇటీవలనే ఇవి అంతరించిపోయాయి. [24]

డైనోసార్‌లు, ఆర్కోసార్‌లు అనే సమూహానికి చెందినవి. ఈ సమూహంలో ఆధునిక మొసళ్లు కూడా ఉన్నాయి. ఆర్కోసార్ సమూహంలో, నడకను బట్టి డైనోసార్‌లు చాలా విభిన్నంగా ఉంటాయి. డైనోసార్ల కాళ్లు నేరుగా శరీరం క్రిందనే ఉండగా బల్లులు, మొసళ్ల కాళ్లు ఇరువైపులా శరీరం నుండి బయటికి విచ్చుకుని ఉంటాయి.

డైనోసార్‌ల క్లాడ్‌ సౌరిస్చియా, ఆర్నిథిస్చియా అనే రెండు ప్రాథమిక శాఖలుగా విడిపోయింది. ఆర్నిథిస్చియా కంటే సౌరిస్చియాలో పక్షులతో మరింత ఇటీవలి సాధారణ పూర్వీకుని పంచుకునే టాక్సాలు ఉన్నాయి. ఆర్నిథిస్చియాలో ట్రైసెరాటాప్స్‌తో మరింత ఇటీవలి ఉమ్మడి పూర్వీకుని పంచుకునే అన్ని టాక్సాలు ఉన్నాయి. కటి నిర్మాణం పరంగా ఈ రెండు సమూహాల్లో భిన్నత్వం ఉంటుంది. తొలి సౌరిస్షియన్లలో ("బల్లి-తుంటి" అని అర్థం) వాటి పూర్వీకుల తుంటి నిర్మాణమే కొనసాగింది. అనేక సమూహాలలో (హెర్రెరాసారస్, థెరిజినోసౌరైడ్స్, డ్రోమియోసౌరిడ్స్, పక్షులు) ప్యూబిస్‌ ఎముక వెనుకకు తిరగడం ద్వారా ప్రాథమిక రూపం మార్పుచెందింది. సౌరిస్చియాలో థెరోపాడ్స్ (ప్రత్యేకంగా ద్విపాదులు), సౌరోపోడోమోర్ఫ్‌లు (అధునాతన, చతుష్పాదులైన పొడవాటి మెడ గల శాకాహారులు) ఉన్నాయి.

దీనికి విరుద్ధంగా, ఆర్నిథిస్షియన్ల (“పక్షి-తుంటి” అని అర్థం) కటి ఎముక, పక్షి కటిని పోలి ఉంటుంది. పక్షుల మాదిరిగా కాకుండా, ఆర్నిథిస్షియన్ల కటికి ముందు వైపు కూడా కోసుగా ఉంటుంది. ఆర్నిథిస్చియాలో ప్రధానంగా శాకాహారులైన వివిధ రకాల జాతులు ఉన్నాయి.

"పక్షి తుంటి" (ఆర్నిథిస్చియా), "బల్లి తుంటి" (సౌరిస్చియా) అనే పదాలు ఉన్నప్పటికీ, పక్షులు ఆర్నిథిస్చియాలో భాగం కాదు. పక్షులు సౌరిస్చియాకు చెందినవి.

పాలియోబయాలజీ

[మార్చు]

డైనోసార్ల గురించిన జ్ఞానం శిలాజ ఎముకలు, మలం, ట్రాక్‌వేలు, గ్యాస్ట్రోలిత్‌లు, ఈకలు, చర్మంపై ముద్రలు, అంతర్గత అవయవాలు, ఇతర మృదు కణజాలాలతో సహా వివిధ రకాలైన శిలాజ శిలాజేతర రికార్డుల నుండి లభించింది. [25] డైనోసార్‌ల గురించిన అవగాహనకు భౌతిక శాస్త్రం (ముఖ్యంగా బయోమెకానిక్స్ ), రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భూమి శాస్త్రాలు (వీటిలో పాలియోంటాలజీ ఉప-విభాగం) సహా అనేక అధ్యయన రంగాలు దోహదం చేస్తున్నాయి. [26] డైనోసార్ల అధ్యయనంలో వీటి పరిమాణం, ప్రవర్తన అనే రెండు అంశాలు ప్రత్యేకంగా ఆసక్తి కలిగించే అంశాలు. [27]

ఐదు ప్రధాన క్లాడ్‌లలోని అత్యంత పొడవైన డైనోసార్‌లతో సగటు మానవుడిని పోల్చిన రేఖాచిత్రం:

ట్రయాసిక్, తొలి జురాసిక్, అంత్య జురాసిక్, క్రెటేషియస్ లలో డైనోసార్ల సగటు పరిమాణం మారుతూ వచ్చిందని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయి. మెసోజోయిక్ కాలంలో నేలపై జీవించిన వేటాడే థెరోపాడ్ డైనోసార్‌ల బరువు 100 నుండి 1000 కి.గ్రా. (220 నుండి 2200 పౌ.) వరకు ఉండేవి. అయితే ఇటీవలి వేటాడే మాంసాహార క్షీరదాలు 10 నుండి 100 కి.గ్రా. (22 నుండి 220 పౌ.) గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మెసోజోయిక్ డైనోసార్ బాడీ మాస్ మోడ్ 1 నుండి 10 మెట్రిక్ టన్నులు (1.1 నుండి 11.0 short tons) మధ్య ఉంటుంది. నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ అంచనా వేసిన సెనోజోయిక్ క్షీరదాల సగటు పరిమాణం సుమారు 2 నుండి 5 కి.గ్రా. (4.4 నుండి 11.0 పౌ.) తో ఇది తీవ్రంగా విభేదిస్తుంది.

అతిపెద్ద, అతిచిన్న

[మార్చు]

ఇప్పటివరకు ఉనికిలో ఉన్న అతిపెద్ద, అతిచిన్న డైనోసార్ల ఏవి అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ జంతువులలో చాలా తక్కువ శాతం మాత్రమే శిలాజాలుగా మారాయి. పైగా వీటిలో చాలా వరకు ఇంకా భూమిలోనే పూడుకుపోయి ఉన్నాయి. వెలికి తీసిన వాటిలో కొన్ని మాత్రమే సంపూర్ణ అస్థిపంజరాలు. చర్మం, ఇతర మృదు కణజాలాల ముద్రలు చాలా అరుదు. ఎముకల పరిమాణం, అవయవ నిర్మాణాన్ని సారూప్యమైన, బాగా తెలిసిన జాతులతో పోల్చడం ద్వారా పూర్తి అస్థిపంజరాన్ని పునర్నిర్మించడం ఖచ్చితమైన కళ కాదు. సజీవ జంతువు కండరాలు, ఇతర అవయవాలను పునర్నిర్మించడం, మహా అయితే ఒక తెలివైన అంచనా మాత్రమే. [28]

సగటు మానవునితో పోల్చినపుడు అర్జెంటీనోసారస్ పరిమాణం

మంచి అస్థిపంజరాల ద్వారా తెలిసుకున్నంతలో.. అత్యంత ఎత్తైన, అత్యంత బరువైన డైనోసార్ జిరాఫాటిటన్ బ్రాంకై (గతంలో దీన్ని బ్రాకియోసారస్ జాతిగా వర్గీకరించారు). దీని అవశేషాలను 1907 - 1912 మధ్య, టాంజానియాలో కనుగొన్నారు. బెర్లిన్‌లోని మ్యూజియం ఫర్ నాటుర్కుండేలో ఇప్పుడు ప్రదర్శనలో ఉన్న అస్థిపంజరంలో అనేక సారూప్య-పరిమాణ శిలాజ నమూనాల నుండి ఎముకలను చేర్చారు. ఇది 12 మీటర్లు (39 అ.) ఎత్తు, 21.8 నుండి 22.5 మీటర్లు (72 నుండి 74 అ.) పొడవు, 30000 - 60000 కిలోగ్రాముల బరువున్న జంతువుకు చెందినది. అత్యంత పొడవైన పూర్తి డైనోసార్ 27 మీటర్లు (89 అ.) పొడవైన డిప్లోడోకస్. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని వ్యోమింగ్‌లో 1907 లో లభించింది. పిట్స్‌బర్గ్ లోని కార్నెగీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. మేలైన శిలాజ పదార్థం నుండి లభించిన అత్యంత పొడవైన డైనోసార్ పటాగోటిటన్. ఇది న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉంది. ఇది 37 మీటర్లు (121 అ.) ) పొడవు ఉంది. అర్జెంటీనాలోని ప్లాజా హ్యూన్‌కుల్‌లోని మ్యూజియో మునిసిపల్ కార్మెన్ ఫ్యూన్స్ లోనిఅర్జెంటీనోసారస్ అస్థిపంజరం 39.7 మీటర్లు (130 అ.) ) పొడవు ఉంది.

ఇంకా పెద్ద డైనోసార్‌లు ఉన్నాయి గానీ, వాటి గురించిన జ్ఞానం బాగా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న శిలాజాలపై ఆధారపడి ఉంటుంది. రికార్డులో ఉన్న చాలా పెద్ద శాకాహార డైనోసార్ల నమూనాలను 1970లలో ఆ తరువాతా కనుగొన్నారు. 80000 నుండి 100000 కిలోల వరకు బరువు ఉండే భారీ అర్జెంటీనోసారస్‌లు ఉన్నాయి. ఇవి30 నుండి 40 మీటర్లు (98 నుండి 131 అ.) పొడవుండేవి. 33.5-మీటరు (110 అ.) పొడవైన డిప్లోడోకస్ హాలోరమ్ (గతంలో సీస్మోసారస్ ), 33-నుండి-34-మీటరు (108 నుండి 112 అ.) ) పొడవైన సూపర్సారస్, 37-మీటరు (121 అ.) పొడవైన పటాగోటిటన్‌లు పొడవైన వాటిలో కొన్ని. 18-మీటరు (59 అ.) ఎత్తున్న సౌరోపోసిడాన్ (ఇది ఆరవ అంతస్తు కిటికీని అందుకోగలదు) అత్యంత ఎత్తైన డైనోసార్. 1878లో వర్ణించబడి, ఇప్పుడు కోల్పోయిన పాక్షిక వెన్నుపూస వెన్నుపూసను బట్టి, అత్యంత బరువైన, పొడవైన డైనోసార్ మారపునిసారస్ అయి ఉండవచ్చు. ఈ ఎముకను బట్టి, ఈ జంతువు 58 మీటర్లు (190 అ.) పొడవు, 122400 kg ( 270000 lb) బరువు ఉండేదని తెలుస్తోంది. అయితే, ఈ పరిమాణంలో ఉన్న మరిన్ని సౌరోపాడ్‌ల ఆధారాలు ఇంకా కనబడలేదు. పైగా దీన్ని కనుగొన్న కోప్ అనే వ్యక్తి, ఇంతకు ముందు కొన్ని టైపోగ్రాఫిక్ పొరపాట్లను చేసాడు. అంచేత ఇది చాలా అతిగా వేసిన అంచనా అయి ఉండవచ్చు.

అతిపెద్ద మాంసాహార డైనోసార్ స్పినోసారస్, ఇది 12.6 నుండి 18 మీటర్లు (41 నుండి 59 అ.) ) ఉండేది. దీని బరువు 7 నుండి 20.9 మెట్రిక్ టన్నులు (7.7 నుండి 23.0 short tons) . ఇతర పెద్ద మాంసాహార థెరోపాడ్స్‌లో గిగానోటోసారస్, కార్చరోడోంటోసారస్, టైరన్నోసారస్ ఉన్నాయి. థెరిజినోసారస్, డీనోచెయిరస్ లు థెరోపాడ్‌లలో ఎత్తైనవి. అతిపెద్ద ఆర్నిథిస్షియన్ డైనోసార్ బహుశా హాడ్రోసౌరిడ్ అయిన శాంటుంగోసారస్ గిగాంటియస్, ఇది 16.6 మీటర్లు (54 అ.) పొడవుండేది. [29] వీటిలో అతిపెద్దవి 16 మెట్రిక్ టన్నులు (18 short tons) బరువు కలిగి ఉండవచ్చు. [30]

తెలిసిన అతి చిన్న డైనోసార్ బీ హమ్మింగ్‌బర్డ్, [31] దీని పొడవు కేవలం 5 సెంటీమీటర్లు (2.0 అం.), ద్రవ్యరాశి సుమారు 1.8 గ్రా. (0.063 oz) ఉంటుంది. [32] ఎగరని డైనోసార్లలో అతి చిన్నవి పావురాల పరిమాణంలో ఉంటాయి. బహుశా ఆ థెరోపాడ్‌లకు పక్షులకూ అత్యంత దగ్గరి సంబంధం ఉండి ఉండవచ్చు . ఉదాహరణకు, ఆంకియోమిస్ హక్స్‌లేయి ప్రస్తుతం తెలిసిన అతిచిన్న ఎగరని డైనోసార్. దీని బరువు 110 గ్రా. (3.9 oz) ఉంటుందని అంచనా. మొత్తం అస్థిపంజర పొడవు 34 సెంటీమీటర్లు (1.12 అ.) . అతి చిన్న శాకాహార ఎగరని డైనోసార్లలో మైక్రోసెరాటస్, వన్నానోసారస్ ఉన్నాయి. వీటి పొడవి దాదాపు 60 సెంటీమీటర్లు (2.0 అ.).

గమనికలు

[మార్చు]
  1. డైనోసార్‌లు (పక్షులతో సహా), రెప్టిలియా సమూహంలో సభ్యులు. బొచ్చు లేదా ఈకలు లేని చల్లటి రక్తపు అమ్నియోట్లతో కూడిన పాత రెప్టిలియా వర్గానికి అవి ఖచ్చితంగా అనుగుణంగా లేవు. పరిణామం, పాలియోంటాలజీ అధ్యయనాని కంటే ముందే ఆధునిక జంతువుల కోసం లిన్నియన్ వర్గీకరణ రూపొందించినందున, సాంప్రదాయ తరగతుల మధ్య ఉన్న, అంతరించిపోయిన జంతువులను లెక్కించడంలో అది విఫలమైంది.

మూలాలు

[మార్చు]
  1. Matthew G. Baron; Megan E. Williams (2018). "A re-evaluation of the enigmatic dinosauriform Caseosaurus crosbyensis from the Late Triassic of Texas, USA and its implications for early dinosaur evolution". Acta Palaeontologica Polonica. 63. doi:10.4202/app.00372.2017.
  2. Andrea Cau (2018). "The assembly of the avian body plan: a 160-million-year long process" (PDF). Bollettino della Società Paleontologica Italiana. 57 (1): 1–25. doi:10.4435/BSPI.2018.01.
  3. Ferigolo, Jorge; Langer, Max C. (జనవరి 1, 2007). "A Late Triassic dinosauriform from south Brazil and the origin of the ornithischian predentary bone". Historical Biology. 19 (1): 23–33. doi:10.1080/08912960600845767. ISSN 0891-2963. S2CID 85819339.
  4. Langer, Max C.; Ferigolo, Jorge (జనవరి 1, 2013). "The Late Triassic dinosauromorph Sacisaurus agudoensis (Caturrita Formation; Rio Grande do Sul, Brazil): anatomy and affinities". Geological Society, London, Special Publications (in ఇంగ్లీష్). 379 (1): 353–392. Bibcode:2013GSLSP.379..353L. doi:10.1144/SP379.16. ISSN 0305-8719. S2CID 131414332.
  5. Cabreira, S.F.; Kellner, A.W.A.; Dias-da-Silva, S.; da Silva, L.R.; Bronzati, M.; de Almeida Marsola, J.C.; Müller, R.T.; de Souza Bittencourt, J.; Batista, B.J.; Raugust, T.; Carrilho, R.; Brodt, A.; Langer, M.C. (2016). "A Unique Late Triassic Dinosauromorph Assemblage Reveals Dinosaur Ancestral Anatomy and Diet". Current Biology. 26 (22): 3090–3095. doi:10.1016/j.cub.2016.09.040. PMID 27839975.
  6. Müller, Rodrigo Temp; Garcia, Maurício Silva (ఆగస్టు 26, 2020). "A paraphyletic 'Silesauridae' as an alternative hypothesis for the initial radiation of ornithischian dinosaurs". Biology Letters. 16 (8): 20200417. doi:10.1098/rsbl.2020.0417. PMC 7480155. PMID 32842895.
  7. "Using the tree for classification". Understanding Evolution. Berkeley: University of California. Archived from the original on ఆగస్టు 31, 2019. Retrieved అక్టోబరు 14, 2019.
  8. (2017). "How has our knowledge of dinosaur diversity through geologic time changed through research history?".
  9. (2016). "How many dinosaur species were there? Fossil bias and true richness estimated using a Poisson sampling model".
  10. Starrfelt, Jostein. "How many dinosaur species were there? Fossil bias and true richness estimated using a Poisson sampling model".
  11. Black, Riley (మార్చి 23, 2016). "Most Dinosaur Species Are Still Undiscovered". National Geographic News. Archived from the original on మార్చి 6, 2021. Retrieved జూన్ 6, 2021.
  12. Gill, F.. "Welcome".
  13. MacLeod, Norman. "The Cretaceous–Tertiary biotic transition".
  14. . "A new herrerasaurid (Dinosauria, Saurischia) from the Upper Triassic Ischigualasto Formation of northwestern Argentina". Pensoft Publishers.
  15. . "The osteology of the early-diverging dinosaur Daemonosaurus chauliodus (Archosauria: Dinosauria) from the Coelophysis Quarry (Triassic: Rhaetian) of New Mexico and its relationships to other early dinosaurs".
  16. . "The precise temporal calibration of dinosaur origins".
  17. . "The oldest dinosaur? A Middle Triassic dinosauriform from Tanzania". Royal Society.
  18. . "U-Pb age constraints on dinosaur rise from south Brazil". Elsevier.
  19. Tanner, Spielmann & Lucas 2013
  20. "Fossil tracks in the Alps help explain dinosaur evolution". Science and Technology. The Economist. London. ఏప్రిల్ 19, 2018. ISSN 0013-0613. Retrieved మే 24, 2018.
  21. Dyke & Kaiser 2011
  22. Cracraft, Joel. "A Review of the Bathornithidae (Aves, Gruiformes), with Remarks on the Relationships of the Suborder Cariamae". American Museum of Natural History.
  23. Alvarenga, Herculano. "The youngest record of phorusrhacid birds (Aves, Phorusrhacidae) from the late Pleistocene of Uruguay". E. Schweizerbart.
  24. Mayr 2009
  25. (March 26, 1998). "Exceptional soft-tissue preservation in a theropod dinosaur from Italy". Nature Research.
  26. (November 1995). "Dinosaur Biology". Annual Reviews.
  27. Weishampel, Dodson & Osmólska 2004
  28. Paul 2010
  29. . "Zhuchengosaurus maximus from Shandong Province". Chinese Academy of Geological Sciences.
  30. Weishampel, Dodson & Osmólska 2004
  31. Norell, Gaffney & Dingus 2000
  32. "Bee Hummingbird (Mellisuga helenae)". Birds.com. Paley Media. Archived from the original on ఏప్రిల్ 3, 2015. Retrieved అక్టోబరు 27, 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=డైనోసార్&oldid=3625000" నుండి వెలికితీశారు