దేవరాజు మహారాజు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
డా.దేవరాజు మహారాజు | |
---|---|
జననం | దేవరాజు మహారాజు ఫిబ్రవరి 21, 1951 వరంగల్ జిల్లా కోడూరు |
ఇతర పేర్లు | దేవరాజు మహారాజు |
ప్రసిద్ధి | బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు,కవి, విమర్శకుడు, కథా రచయిత |
భార్య / భర్త | క్రిషి (కృష్ణకుమారి). |
దేవరాజు మహారాజు తెలుగు రచయిత, శాస్త్రవేత్త. కవిగా, కథా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా రచనలు చేశాడు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలు చేశాడు. ఆయన 2021 సంవత్సరానికి గాను ‘నేను అంటే ఎవరు?’ నాటకానికి బాల సాహిత్య పురస్కారం దక్కింది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]డా.దేవరాజు మహారాజు ఫిబ్రవరి 21, 1951 న వరంగల్ జిల్లా కోడూరు లో జన్మించారు. స్వగ్రామం వడపర్తి, భువనగిరి, హైదరాబాద్‌లలో వీరి విద్యాభ్యాసం కొన సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1975లో జంతుశాస్త్రంలో ఎంఎస్సీ, 1979లో డాక్టరేట్ అందుకున్నారు. జువాలజీ ఫ్రొపెసర్‌గా పరాన్న జీవులపై పరిశోధనలు చేస్తూ, చేయిస్తూ పిజి విద్యార్థులకు, పరిశోధన విద్యార్థులకు 28 ఏళ్లు మార్గదర్శనం చేసారు. తెలంగాణా ప్రజల భాషలో కవిత కథ చెప్పి మెప్పించి కవిగా, కథకుడిగా స్థిరపడ్డారు. భారతీయ భాషల కవిత్వాన్ని కథల్ని తెలుగులోకి అనువదించి తెలుగు కళ్లకు ఇరుగుపొరుగు దృశ్యాల్ని చూపించారు. వెండితెర కవిత్వంగా కొనియాడబడుతున్న భారతీయ సమాంతర సినిమాను విశ్లేషించారు. జానపద సాహిత్య పరిశీలన చేశారు. విజ్ఞాన గ్రంథాలను ప్రచురించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకుడిగా వ్యవహరిం చారు. భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రంథమే అయినా సంపాదకుడిగా దానిని ఐఎఎస్ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. ప్రముఖ అనువాదకులు దండమూడి మహీదర్ దేవరాజును అభినయ కొడవగంటి కుటుంబరావని కితాబునిచ్చారు. ఫ్రెంచ్ గడ్డంతో విలక్షణంగా కనిపించే ఈ తెలుగు కవికి అనేక ప్రత్యేకతలున్నాయి. వచన కవిత్వంలో తెలంగాణ జీవద్భాష ప్రవేశపెట్టడం, తెలంగాణ ప్రజల భాషలో తొలి కథల సంపుటి ప్రచురించడం, మూఢనమ్మకాల నిర్మూలనకు కలం పట్టడం వంటివున్నాయి. ఎయిడ్స్‌పై అవగాహన కోసం తెలుగులో తొలి పుస్తకం రాసి సామాజిక బాధ్యత కవికి ఉండాలని నిరూపించారు దేవరాజు జాన్ ఎర్నస్ట్ స్టెయిన్ బెక్ నవల 'దిపెరల్'ను తెలుగు పాఠకులకు 'మంచి ముత్యం'గా అదించారు.
దేవరాజు మహారాజు 150 మంది భారతీయ కవుల్ని, 50 మంది మరాఠి దళిత కవుల్ని కవితాభారతి, మట్టిడుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు. అలాగే ఒరియా మహాకవి సీతాకాంత్ మహాపాత్ర కవితల నెన్నింటినో అనువదించారు. హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్ 'మధుశాలి'ని అదే ధాటితో తెలుగులోకి తెచ్చారు. 70 మంది భారతీయ కథానికా రచయితల్ని (హరివిల్లు, ఆంధ్రప్రభ వార పత్రిక 1991-92) వారి కథలతో సహా పరిచయం చేశారు. భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథానికల్ని తెలుగు పాఠకులకందించారు. పిల్లల కోసం రాసిన చైనా జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడినాయి. భారతీయ జానపదం 1994-96లో తేట తెలుగులో అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు, పరిచయాలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి.
కథా సంపుటాలు
[మార్చు]- గుడిసె గుండె (1974),
- గాయపడ్డ ఉదయం (1990),
- కవిభారతి (1991),
- మట్టిగండె చప్పుళ్లు (1996 మరాఠి దళిత కవిత),
- రాజముద్ర (2007),
- నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది (2009)
- కవితా ప్రపంచం,
- మధుశాల (2010)
- హరివంశ్రాయ బచ్చన్ కావ్యం,
- సమయ్పర్ హస్యాక్షర్ (2010)
కథలు
[మార్చు]- కడుపుకోత (1977),
- పాలు ఎర్రబడ్డాయ్ (1991)
- దేవరాజు మహారాజు కథలు (1993)
బాలసాహిత్యం
[మార్చు]- బుజంగు (1984) గురువుకు ఎగనామం (1984),
- చిన్నోడి ప్రయాణం (2006)
రచనలు
[మార్చు]- మూఢనమ్మకాలు-సైన్సు (1991')
- కవితా భారతి
- నీకు నాకు మధ్య ఒక రంగుల నది (కవితా సంపుటి)
- లైఫ్‌టానిక్ (వైజ్ఞానిక నాటికల సంపుటి) 2007
- రాజముద్ర (కవితా సంపుటి)
- ఆధునిక యుగంలో జానపద సాహిత్యం (1987)
- స్మృతి సుగంధం (2008),
- స్త్రీదరహాసం దోచిన ఇతిహాసం (2009),
- ఆత్మ నుంచి అక్షరానికి (2010) అలాగే
- మూఢనమ్మకాల్ని వదిలిద్దాం (2006)
- లైఫ్‌టానిక్ ఇతర నాటికలు, (2007 సినిమా)
- సత్యజిత్‌రే సినిమా స్క్రిప్ట్
గౌరవాలు
[మార్చు]గాయపడ్డ ఉదయం వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన అవార్డును 1991లో పొందారు.హరివంశరాయ్ బచ్చన్ కావ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హింది ఆకాడమి వారి సౌజన్యంతో ముద్రించారు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత కథకుల కథల్ని అనువదించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, దాశరథి దంపతుల సత్కారం, తొలి ఎక్స్‌రే పురస్కారం, సురమౌళి అవార్డు, డాక్టర్ పరచుచూరి రాజారాయ్ సాహిత్య పురస్కారం వంటి పురస్కారాలనం దుకున్నారు డాక్టర్ దేవరాజు మహారాజు. తొలిదశలో కథల పోటీల్లో పలు బహుమతులు అందుకున్నారు. ఒక దశాబ్ది కాలంగా నేషనల్ బుక్ట్రస్ట్వారికి (న్యూఢిల్లి) సలహా సంఘ సభ్యులుగా యున్నారు.
దేవరాజు మహారాజు ఆగష్టు 2021లో దేవులపల్లి రామానుజరావు సాహిత్య పురస్కారం అందుకున్నాడు.[2] అదే ఏడాది, మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు?’ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం సాధించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (30 December 2021). "గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.
- ↑ Namasthe Telangana (24 August 2021). "దేవరాజు మహారాజుకు దేవులపల్లి పురస్కారం". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.
- ↑ "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్: గోరటి వెంకన్న 'వల్లంకి తాళం' కవితా సంపుటికి పురస్కారం". BBC News తెలుగు. Archived from the original on 2021-12-31. Retrieved 2024-10-25.