నిజాం మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజాం మ్యూజియం
స్థాపితం18 ఫిబ్రవరి, 2000
ప్రదేశంపురానీ హవేలీ, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
వెబ్‌సైటుhttp://www.thenizamsmuseum.com/

నిజాం మ్యూజియం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పురానీ హవేలీ వద్ద ఉన్న మ్యూజియం. గతంలో ఇది నిజాం రాజుల రాజభవనంగా ఉండేది.[1] హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1936లో రజతోత్సవాలను జరుపుకున్నాడు. ఈ ఉత్సవాలకోసం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌ లో ప్రత్యేకంగా జూబ్లీహాల్ నిర్మించి ఉత్సవాలను నిర్వహించాడు. ఉత్సవాల సందర్భంగా పలువురు దేశవిదేశ ముఖ్యులు అందజేసిన విలువైన వస్తువులతో ఈ నిజాం మ్యూజియం ఏర్పాటుచేయబడింది. [2]

చరిత్ర[మార్చు]

ఇది పురానీహవేలీ, ప్రిన్స్ దుర్రె షవార్ ఆసుపత్రి సమీపంలో గల సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని నిజాం ప్రభువు అధికార నివాసం. నిజాం కాలంలో పరిచారికలు, సైనంతో శత్రు దుర్భేధ్యంగా రాజదర్పంతో అలరారింది. నిజాం ప్రభువులు సేకరించిన దేశ, విదేశాలకు చెందిన అరుదైన వస్తువులను, కళాఖండాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. నిజాం మనవడు ముఫకంజా ఎంతో ఇష్టపడి తమ తాతలకాలం నాడు కానుకలుగా అందుకున్నవి, సేకరించిన వస్తువులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశాడు.[3]

నిజాం ట్రస్ట్ 2020, ఫిబ్రవరి 18వ తేదినుండి ఈ మ్యూజియంలోకి ప్రజల సందర్శనను ప్రారంభించింది. 1936లో రజతోత్సవ వేడుకల సందర్భంగా చివరి నిజాంకు సంబంధించిన బహుమతులు, మెమెంటోలు, దేశవిదేశాల ముఖ్యులు అందించిన జ్ఞాపికలను భద్రపరచడానికి ఈ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. హైదరాబాదులోని చారిత్రక కట్టడాలైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, మొజాంజాహి మార్కెట్, తెలంగాణ హైకోర్టు, నిలోఫర్ ఆసుపత్రి వంటి భవనాల వెండి నమూనాలు (ఉర్దూ భాషలో వివరాలు) ఈ మ్యూజియంలో ఉన్నాయి.[4] ఇందులో విద్యాసంస్థలు, ఆసుపత్రి కొనసాగుతున్నాయి. నిజాం నవాబు కోడలైన ప్రిన్స్ దుర్రె షవార్ కుమారుడు ముఫకంజా దీనికి చైర్మన్‌గా ఉన్నాడు.

హైదరాబాద్ నగర చరిత్రను తెలిపే అనేక అరుదైన వస్తువులు, కళాఖండాలతో 2012, మార్చి 11న నిజాం మ్యూజియంలోని ఒక విభాగంలో సిటీ మ్యూజియం ప్రారంభించబడింది.[3]

సేకరణలు[మార్చు]

ఈ మ్యూజియంలో చివరి నిజాం రజతోత్సవ వేడుకలకు ఉపయోగించిన బంగారు సింహాసనం, వజ్రాలతో చెక్కబడిన గోల్డెన్ టిఫిన్ బాక్స్, జూబ్లీ హాల్ భవన నమూనా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గాజు పెయింటింగ్ ఉన్నాయి. పాల్వంచ రాజు బహుకరించిన మదర్-ఆఫ్-పెర్ల్ వజ్రం, వజ్రాలు ఇతర విలువైన రాళ్ళతో నిండిన బంగారు కత్తులు, పేటికలు, అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా చెక్కబడిన వెండి సీసాలు, ఒక చెక్క పెట్టె ఉన్నాయి. వజ్రాలు అలంకరించబడిన వెండి కాఫీ కప్పులు, చెక్కతో చెయ్యబడిన రైటింగ్ బాక్స్, మావటితో ఉన్న వెండి ఫిలిగ్రీ ఏనుగు, వెండి చెట్టుతో ఆడుతున్న శ్రీకృష్ణుడు ప్రతిరూపం వంటివి ఇందులో ప్రదర్శనకు ఉన్నాయి.[5][6][7]

1930 రోల్స్ రాయిస్, ప్యాకర్డ్, జాగ్వార్ మార్క్ వి మొదలైన పాతకాలపు కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆరవ నిజాం ఉపయోగించిన బర్మా టేకుతో చేసిన 176 అడుగుల పొడవైన అలమార కూడా ఈ మ్యూజియంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. నిజాం నవాబులు ఉపయోగించిన దుస్తులు, టోపీలు, పాదరక్షలు, పింగాణీ పాత్రలు, బంగారం, వెండి కంచాలు, టేకు కర్రతో చేసిన ఉయ్యాలలు, కుర్చీలు, దుస్తులు భద్రపరిచే 155 అలమారాలలో సిద్ధంగా ఉన్న నవాబు, కుటుంబ సభ్యుల దుస్తులు, మంచినీరు తాగే గ్లాసు, ప్లేటు ఈ అల్మారాలో కనిపిస్తాయి. 150 సంవత్సరాల పురాతన కాలంనాటి మానవీయంగా పనిచేసే లిఫ్ట్, 200 సంవత్సరాల పురాతన కాలంనాటి డిక్లరేషన్ డ్రమ్స్ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇందులోని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిలువెత్తు తైలవర్ణ చిత్రపటాన్ని ఎటువైపు నుంచి చూసినా చూసినవారినే చూస్తున్నట్లు కనిపిస్తుంది.[3]

2018 దొంగతనం[మార్చు]

2018 సెప్టెంబరు నెలలో ఈ మ్యూజియంలో దొంగతనం జరిగింది. హైదరాబాదుకు చెందిన ఇద్దరు యువకులు మ్యూజియంలోని భద్రతా సిబ్బందికి, సిసిటివి కెమెరాలకు చిక్కకుండా వజ్రాలున్న గోల్డెన్ టిఫిన్ బాక్స్‌ను, కొన్ని విలువైన వస్తువులను దొంగిలించారు.[8][9] పోలీసులు వారిద్దరినీ వెంటనే పట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత మ్యూజియంలోని భద్రతను కట్టుదిట్టం చేశారు.[10][11]

సందర్శన వివరాలు[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మ్యూజియంలోకి అనుమతిస్తారు. ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.80, 15 ఏళ్ళలోపు చిన్నారులకు రూ.15గా ఉంది. కెమెరాకు రూ.150, వీడియోకు రూ.500 చెల్లించాల్సివుంటుంది.[3]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Jafri, Syed Amin. "A Peep into the past". rediff.com. Retrieved 17 October 2020.
  2. "Unveiling the past". Times of India. Archived from the original on 2013-02-21. Retrieved 17 October 2020.
  3. 3.0 3.1 3.2 3.3 మన తెలంగాణ, హైదరాబాదు (4 April 2018). "ఉట్టిపడే రాజసం నిజాం మ్యూజియం..!!". Archived from the original on 17 October 2020. Retrieved 17 October 2020.
  4. "Nizam's Museum".
  5. "Nizam Museum". Times of India Travel. Retrieved 17 October 2020.
  6. Sudhir, Uma. "Thief Used Hyderabad Nizam's Gold Tiffin Box To Eat Every Day: Police". NDTV. Retrieved 17 October 2020.
  7. Janyala, Sreenivas (2018-09-12). "Hyderabad: Two held in museum theft case, police say they wanted to get taste of Nizam luxury". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 17 October 2020.
  8. "Thieves who stole gold tiffin box, cup worth over Rs 100 crore from Nizam Museum arrested". India Today (in ఇంగ్లీష్). Retrieved 17 October 2020.
  9. "Nizam's multi-crore gold tiffin box found, thief used it to carry his food". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-09-11. Retrieved 17 October 2020.
  10. Vudali, Srinath. "Hyderabad Police nabs 2 for theft at Nizam Museum; stolen valuable recovered". Times of India. Retrieved 17 October 2020.
  11. Nanisetti, Serish (2018-09-05). "A museum begging to be burgled". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 17 October 2020.

ఇతర లంకెలు[మార్చు]