కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి రిఫరెన్సు గ్రంధాలు
పంక్తి 150: పంక్తి 150:
* Kumarajiva by Fotopoulou Sophia (http://www.newsfinder.org/site/more/kumarajiva/)
* Kumarajiva by Fotopoulou Sophia (http://www.newsfinder.org/site/more/kumarajiva/)
* Kumarajiva and maadhyamika school of thought- Dr Bachchan Kumar of Indira Gandhi National Centre for Arts, New Delhi (http://ignca.nic.in/kumarjiva/kumarjiva_abstracts_cvs/ab_bachchan_kr.pdf)
* Kumarajiva and maadhyamika school of thought- Dr Bachchan Kumar of Indira Gandhi National Centre for Arts, New Delhi (http://ignca.nic.in/kumarjiva/kumarjiva_abstracts_cvs/ab_bachchan_kr.pdf)

==ఇతర రిఫరెన్సు గ్రంధాలు==
* Himalaya Calling: The Origins of China and India, World century publishing corporation,NJ 07601,USA
* Saints & Sages of Kashmire-T.N Dhar Kundan (A.P.H. Publishing Corporation, New Delh -2004)
* Some Aspects of Asian History and Culture –Upendra Thakur (Abhinav Publications –1986)





22:16, 9 నవంబరు 2015 నాటి కూర్పు

కుమారజీవుడు
జననంక్రీ.శ. 344
మరణంక్రీ.శ. 413
వృత్తిబౌద్ద సన్యాసి, మహాయాన పండితుడు, గొప్పఅనువాదకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సంస్కృత భాషలో వున్న బౌద్ద గ్రంధాలను చైనా భాషలోనికి అనువదించడం.
తల్లిదండ్రులుజీవిక, కుమారయాన

క్రీ.శ 5 వ శతాబ్దికి చెందిన కుమారజీవుడు మధ్య ఆసియా నగర రాజ్యమైన కూచా (Kucha) లో జన్మించిన సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి. మహాయాన బౌద్ద పండితుడు. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకడు.

ఇతని తల్లి జీవిక కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన భారతీయ బ్రాహ్మణుడు. జన్మతా భారతీయుడు కానప్పటికి భారతీయ మూలాలను కలిగివున్న కుమారజీవుడు బాల్యం నుండే అత్యంత ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. తన తొమ్మిదవ సంవత్సరం నుండే తల్లితో కలసి దేశాలు పర్యటిస్తూ, కాశ్మీర్, కాష్గర్, కూచా లలో బౌద్ధ సిద్ధాంతాలు అభ్యసించాడు. తొలుత సర్వాస్థివాద (హీనయానం) శాఖను అనుసరించినప్పటికి తరువాత మహాయాన బౌద్ధం లోకి మారాడు. ఇరవై సంవత్సరాల వయసు వచ్చేనాటికి మధ్య ఆసియాలో అత్యంత ప్రముఖ బౌద్ధ సన్యాసిగా, అఖండ మేధో సంపన్నుడుగా పేరుగాంచాడు. మద్య ఆసియా నుండే కాక, తూర్పు ఆసియా, చైనా దేశాలనుండి బొద్ద బిక్షువులు బోదనల కోసం, జ్ఞాన సముపార్జనకోసం ఇతని వద్దకు వచ్చేవారు. అయితే దురదృష్టవశాత్తూ చైనా దేశపు అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయి 17 సంవత్సరాలు పాటు యుద్ద ఖైదీగా బందీలో వున్నాడు. చివరకు విడుదలై క్రీ.శ 401 లో ఉత్తర చైనా రాజధాని ‘చాంగన్’ (changan) లో స్థిరపడ్డాడు.

చైనా చక్రవర్తి కోరిక మేరకు ప్రామాణిక బౌద్ధ గ్రంధాలను పాళీ, సంస్కృత భాషల నుండి చైనా భాషలోనికి అనువదించే బృహత్తర కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. 12 సంవత్సరాల పాటు నిర్విరామ కృషి చేసి 384 వాల్యూంలతో కూడిన 74 బౌద్ధ గ్రంధాలను చైనా భాష లోనికి అనువదించి చైనీయులకు నిజమైన బౌద్ధతత్వాన్ని పరిచయం చేసాడు. తన ముందు కాలంలో చినా భాషలోనికి మొరటుగాను, అసంబద్డంగాను అనువదించబడిన ప్రామాణిక బౌద్ధ గ్రంధాలను చక్కని అనువాదంతో తిరిగి పరిష్కరించడమే కాక తన అనువాదాల ద్వారా చైనాలో మహాయాన బౌద్ధ వికాసానికి అవసరమైన తాత్విక ఆధార భూమికను కల్పించాడు. సర్వాస్థివాద, మహాయాన బౌద్దానికి చెందిన అనేక ప్రముఖ గ్రంధాలు మూల సంస్కృతంలో అలభ్యమైనప్పటికి కుమారజీవుని చైనీయ అనువాదాల నుండే అందులోని విషయాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషలతోపాటు ఇతర ప్రపంచ భాషల్లో ప్రామాణిక బౌద్ధ గ్రంధాలు అనువదించబడ్డాయి. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకనిగా కుమారజీవుడు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు.

కూచా నగరానికి 30 కి.మీ. దూరంలో గల కిజిల్ గుహల ప్రవేశప్రాంగణంలో నిర్మితమైన కుమారజీవుని స్మారక విగ్రహం

ఆధార గ్రంధాలు

కుమారజీవుని జీవిత చరిత్రకు సంబందించిన వివరాలు Kao seng techoam (2 వ భాగం)(క్రీ.శ. 519) , Tch’ou san tsang ki si (క్రీ.శ. 520) మరియు Chi-mo-lo-shi మొదలగు చైనా గ్రంధాలలో విపులంగా పేర్కొనబడింది.

కుటుంబ నేపధ్యం

కుమారజీవుడు క్రీ.శ 344 లో మధ్య ఆసియా లోని తక్లమికిన్ ఎడారి ప్రాంతం లోని ఒయాసిస్ నగర రాజ్యమైన కూచా (Kucha) లో జన్మించాడు. ఇది (ప్రస్తుత Xinjiang) చైనా దేశంలో అంతర్భాగంగా వుంది. ఇతని తల్లి జీవిక (జీవ) కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన జన్మతా భారతీయ బ్రాహ్మణుడు. ‘కుమారయాన’ కాశ్మీర్ లోని సంపన్న కులీన వర్గానికి చెందిన వాడు. ఇతను బౌద్ధ బిక్షువుగా మారి ధర్మ ప్రచారం కోసం కాశ్మీర్ ను విడిచిపెట్టి పామీర్ పర్వతాలను దాటి మధ్య ఆసియా లోని నగర రాజ్యమైన ‘కూచా’ (kucha) కు వచ్చి అక్కడి రాజాస్థానంలో బౌద్ధ సన్యాసిగా స్థిరపడ్డాడు. ఇతని ప్రతిబా విశేషాలను చూసిన కూచా రాజు ఇతనికి ‘కువో షిహ్’ బిరుదుతో (kuo-shih జాతీయ గురువు) గౌరవించాడు. ఈ రాజు యొక్క చిన్న సోదరి ‘జీవిక’ గొప్ప విదుషీమణి. అమోఘమైన జ్ఞాపక శక్తి కలది. రాకుమారి అయిన జీవిక సాటి రాకుమారులను కాదని, కుమారయానను చూసినంతనే అతనినే వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది. రాజు కూడా బౌద్ధ బిక్షువు అయిన కుమారయానుని తన సోదరితో వివాహానికి అంగీకరించమని కోరడం, నచ్చచెప్పడం జరిగి చివరకు జీవిక-కుమారయానుల వివాహం జరిగింది. వీరికి క్రీ.శ 344 లో ‘కుమారజీవుడు’ జన్మించాడు. కుమారయాన, జీవికలకు జన్మించిన కారణంగా వారి పేర్ల భాగాలతో కుమారజీవుడుగా పిలవబడ్డాడు.

బాల్యం-విద్యాభ్యాసం

కుమారజీవుని 7సంవత్సరాల వయసులో ఇతని తల్లి జీవిక తన భర్త నుండి అనుమతి పొంది బౌద్ధ సన్యాసినిగా మారి కూచాలోని సియోలి (Tsio-li) సన్యాసినుల మఠంలో చేరింది. ఏడు సంవత్సరాల చిరుప్రాయంలోనే కుమారజీవుడు బౌద్ధ సూత్రాలను వల్లెవేస్తూ అసాధారణ ప్రజ్ఞా పాటవాలను కనపరచడంతో, తల్లి జీవిక ఇతనిలోని ప్రతిభను గుర్తించి బౌద్ధ సిద్ధంతాలతోను, చింతనలోను చక్కని ప్రావీణ్యం నేర్పించాలనే నిశ్చయించింది.

కాశ్మీర్లో విద్యాభ్యాసం

కుమారజీవుని విధ్యాభ్యాస నిమిత్తం 9 సంవత్సరాల వయసులో అతనిని తోడ్కొని తల్లి జీవిక మధ్య ఆసియా నుండి ప్రయాసభరితమైన ప్రయాణం సాగించి బుద్ధుడు జన్మించిన భారతదేశానికి చేరుకొంది. కుమారజీవుడు ముందుగా తండ్రి స్వస్థలం అయిన కాశ్మీర దేశంలో ప్రసిద్ద బౌద్ధాచార్యుడు అయిన ‘బందుదత్తు’ని వద్ద సంస్కృతం అభ్యసించాడు. స్థవిరవాదుల సాంప్రదాయానికి చెందిన నికాయాలను దీర్ఘ ఆగమ, మధ్యమ ఆగమ, ఖుద్దక ఆగమాలను నేర్వడమే కాకుండా భారతీయ వైద్యం, ఖగోళం, జ్యోతిషం, తర్కం, గ్రంధ వివరణ, వ్యాఖ్యాన రీతులలో ప్రావీణ్యం సంపాదించాడు. కాశ్మీర రాజు సమక్షంలో జరిగిన విద్వత్ గోష్టిలో పాల్గొన్న కుమారజీవుడు పిన్న వయసులోనే తన వాదనాపటిమతో అనేకమంది బౌద్దేతర గురువులను ఓడించడంతో అతని పేరు ప్రసిద్దమైంది. 3 సంవత్సరాల తదనంతరం భారత దేశంలో విద్యను పూర్తి చేసుకొని తన తల్లితో కలసి కుమారజీవుడు తిరిగి కూచా రాజ్యానికి పయనమైనాడు.

కాష్గర్లో విద్యాభ్యాసం

మార్గమద్యంలో తల్లితో కలసి కుమారజీవుడు కాష్గర్ నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక బౌద్ద మోక్ష సన్యాసి (Arhat) కుమారజీవుని ఉద్దేశించి అతనికి ఉజ్వల భవిష్యత్తు వుందని, బౌద్ధ ధర్మప్రచారకుడిగా అసాంఖ్యకమైన ప్రజలను బౌద్ధంలోకి ఆకర్షించగలడని భవిష్యవాణి పలికాడు. అప్పటికే మద్య ఆసియా లోని కాష్గర్ నగరం బౌద్ధ ఆచార్యులతో, బౌద్ద గ్రందాలయాలతో విలసిల్లుతున్నది. కాష్గర్ లో స్థిరపడిన ఒక కాశ్మీర బౌద్ధసన్యాసి 'బుద్ధయాసు'ని మార్గదర్శకత్వంలో అభిధర్మ సాహిత్యాన్ని అభ్యసించాడు. వైదిక సాహిత్యం, వేద మంత్ర ఉచ్చారణ రీతులను నేర్చి, పారమార్ధిక సత్త్యోద్ఘాటనలో కనిపించాల్సిన ఉచ్చారణా ధ్వనిరీతులపై పట్టు సాధించాడు. కాష్గర్ నగరంలో వుంటున్నప్పుడే పాళీ, సంస్కృత భాషలతో పాటు మధ్య ఆసియా భాషలపై పట్టు సాధించాడు. ఇవి తరువాత కాలంలో సంస్కృతంలో వున్న బౌద్ధ గ్రంధాలను చైనా భాషలోకి అనువాదం చేయడంలో కుమారజీవునికి ఎంతగానో ఉపకరించాయి. ఒకానొక సందర్భంలో కాష్గర్ రాజాస్థానంలో కుమారజీవుడు విశిదీకరించిన ఒక బౌద్ధ ధర్మసూత్రాన్ని ఆధారం చేసుకొని అక్కడి బౌద్ధ మఠాలలో కనిపించే నిర్లక్ష్యధోరణిలను సంస్కరించే ప్రయత్నం జరిగింది.తరువాత 12 వ ఏట కుమారజీవుడు తల్లితో కలసి కాశ్హ్గర్ ను విడిచి తుర్పాన్ (Turpan) చేరుకొన్నాడు.

మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు

క్రీ.శ. 4 వ శతాబ్దంలో తారిమ్ బేసిన్ (చైనా) లో ఏర్పడిన కూచా, కాష్గర్, తుర్పాన్ తదితర మద్య ఆసియా రాజ్యాలు

కూచా రాజ్యానికి ఈశాన్య సరిహద్దులలో వున్న తుర్పాన్ రాజ్యంలో 10 వేలకు పైగా బౌద్ధ సన్యాసులు వుండేవారు. కుమారజీవుడు దాదాపుగా ఇక్కడ ఉంటున్న సమయంలోనే కుమారజీవుని ధర్మపధం మహాయానం వైపు నడిచింది. ఒకప్పుడు యార్కండ్ (Yarkand) రాకుమారుడు తరువాత కాలంలో మహాయాన బౌద్ధసన్యాసిగా మారిన సుత్యసోమని ప్రభావం కుమారజీవునిపై గాడంగా పడింది. అతని ప్రభావం వల్ల కుమారజీవుడు శూన్యవాదం వైపు ఆకర్షించబడ్డాడు. సుత్యసోముని ఉపదేశంతో కుమారజీవుడు మహాయాన బౌద్ధసూత్రాలని ఆకళింపు చేసుకొన్నాడు.

హీనయానం (స్థవిర వాదం) నుంచి మహాయాన బౌద్ధానికి మారిన తరువాత కుమారజీవుడు తన మనోవైఖిరిని వివరిస్తూ “బంగారాన్ని (మహాయానం) ఎరుగని వ్యక్తి, ఇత్తడిని (స్థవిరవాదం) చూసి అదే గొప్పదని భ్రమపడినట్టుగా, తానింతకాలం వున్నానని, చివరకు మహాయాన ప్రభావంతో తాను విముక్తుడు అయినట్లు” వెల్లడించాడు.

తుర్పాన్ లోవున్న ఆనతి కాలంలోనే మాధ్యమిక బౌద్ధానికి చెందిన ఆచార్య నాగార్జునుడు, ఆచార్య ఆర్యదేవుడు మొదలగు ఉద్దండుల గ్రంధాలను అభ్యసించాడు. మహాయాన బౌద్ధం నేర్చుకోవడానికి భారత దేశం నుండి తన తొలి గురువు బందదత్తుని ఆహ్వానించి వాదనలో గురువుని మెప్పించగలిగాడు. క్రమేణా తుర్పాన్ రాజ్యంలో కుమారజీవుని పేరు ప్రఖ్యాతులు ఉత్తర చైనాకు, తూర్పు ఆసియాకు విస్తరించాయి. తూర్పుఆసియా నుండి అనేకమంది అతని వద్దకు బౌద్ధదర్మం నేర్చుకోవడానికి రాసాగారు.

కూచా రాజు పోషుయ్ (Po-shui) ఆహ్వానం మేరకు స్వదేశం చేరుకొన్న కుమారజీవుడు అక్కడ బౌద్ద సన్యాసినిగా మారిన రాకుమారికి ధర్మోపదేశం చేసాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి కుమారజీవుడు పూర్తి బౌద్ద సన్యాసిగా మారాడు. కూచా రాజాస్థానంలో దేశ, విదేశీ బౌద్ద వేత్తలతో బౌద్ద తాత్విక చర్చలు నిర్వహిస్తూ ప్రోత్సాహించేవాడు. కుమారజీవుడు కూచా రాజ్యంలో వుంటన్నప్పుడు అతని ప్రజ్ఞా పాటవాలను విన్న ఉత్తర చైనా చక్రవర్తి ‘ఫు జియన్’ (Fu Jian), బౌద్ధ సూత్రాలను చైనా భాషలోనికి అనువదించగల సమర్ధుడిగా కుమారజీవుని భావించి, తన రాజధాని ‘చాంగన్’ (Changan)కు పంపించవలసినదిగా కూచా రాజును కోరాడు. కాని కూచా రాజు నిరాకరించడంతో చక్రవర్తి కోపోద్రికుడయ్యాడు.

చైనాలో నిర్భందం – విడుదల

కుమారజీవుని రాకకై వేగిరపడిన చైనా చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు అతని సేనాధిపతి జనరల్ ‘లుగుయాంగ్’ (Gen. Lu Guang) క్రీ.శ. 383 లో కూచా రాజ్యంపై దాడిచేసి రాజుని చంపి కుమారజీవుని బందించాడు. బందించబడే నాటికి కుమారజీవుని వయస్సు 40 సంవత్సరాలు. ఇదే సమయంలో ఉత్తర చైనా రాజ్యంలో అంతర్గత రాజకీయ పోరు సంభవించింది. కిన్ వంశానికి చెందిన పాత చక్రవర్తి చంపబడటం, యావో వంశానికి చెందిన కొత్త చక్రవర్తి అధికారంలోకి రావడం జరగడంతో సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ తన విధేయతను మార్చుకొని స్వతంత్ర్యం ప్రకటించుకొన్నాడు. యుద్ద ఖైదీ అయిన కుమారజీవుని చక్రవర్తి వద్దకు పంపకుండా తన రాజధాని ‘లియాంగ్ గ్జౌ’ (Liangzhou) లో తన వద్దనే 16 సంవత్సరాలుకు పైగా బందీగా వుంచుకొన్నాడు. ఈ బందీ పరిస్థితులలోనే కుమారజీవుడు చైనా భాషను నేర్చుకొనడం జరిగింది. తదనంతరం రెండవ చక్రవర్తి అయిన యావో జింగ్ (Yao Xing) తన సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణికి విసిగిపోయి క్రీ.శ. 401 లో అతనిపై దాడి చేసి ఓడించి కుమారజీవుని సురక్షితంగా విముక్తి చేసి తన రాజధాని చాంగన్ కు రప్పించుకొన్నాడు. ఈవిధంగా చైనా అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయిన కుమారజీవుడు క్రీ.శ. 384 నుండి 401 వరకు 16 సంవత్సరాలకు పైగా అకారణంగా బందీయై మగ్గిపోవలసి వచ్చింది.

చాంగన్ నగరంలో కుమారజీవుడు

చైనాకు బౌద్ద గ్రంధాలను చేరవేస్తూ మరణించిన తన అశ్వానికి స్మారకంగా కుమారజీవుడు దుహాంగ్ లో నిర్మించిన White Horse Pagoda

16 సంవత్సరాల సుదీర్ఘ బందనం నుంచి విముక్తుడై క్రీ.శ. 401 లో రాజధాని చాంగన్ (ప్రస్తుత Xian, చైనా)లో అడుగుపెట్టిన కుమారజీవునికి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) నుండి అఖండ ఆదరణ లభించింది. చక్రవర్తి అతనిని జాతీయ గురువు (National Perceptor) గా నియమించడమే కాక రాజ గురువుగా స్వీకరించి గౌరవించాడు. బౌద్ధ సూత్రాలను, సారస్వతాన్ని చైనా భాషలోనికి అనువదించడంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా చక్రవర్తి అతనిని కోరాడు.

బౌద్ద పరిభాషను, బుద్దుని యథార్ధ బోధనలను అర్థం చేసుకొంటూ, మూల సంస్కృత బౌద్ద గ్రంధాలలోని భావాన్ని, తత్వాన్ని అనువాదంలో స్పష్టంగా వ్యక్తం చేయాలంటే, చైనా అనువాదకునిగా స్థానిక తావో (Taoism) తాత్విక ప్రభావానికి గురికాని విదేశీ బౌద్ద సన్యాసి అవసరమవుతుంది. అప్పటికే కుమారజీవుడు మద్య ఆసియాలో అత్యంత ప్రముఖ ఆచార్యుడిగా పేరు పొందాడు. పైగా పాళీ, సంస్కృత భాషలలో దిట్ట మరియు మహాయాన బౌద్ద్దంలో కూడా పండితుడు కావడం, బౌద్ద తత్వాన్ని, ధర్మాన్ని విశిదీకరించడంలో అతనికున్న సాధికారత, అపార ప్రజ్ఞా పాటవాలు ఈ అంశాలన్నీ చైనా చక్రవర్తి కుమారజీవుని అనువాద కార్యానికి నాయకత్వం వహించవలసిందిగా కోరడానికి దారితీసాయి.

అప్పటికే టావోన్ (Tao-on) అనే బౌద్ద సన్యాసి కృషితో చాంగన్ నగరంలో ఒక అనువాద కేంద్రం నెలకొల్పబడింది. చక్రవర్తి ఆదరణ పుష్కలంగా ఉండడంతో, ఉత్సాహపరులైన బౌద్ద సన్యాసుల, అనువాదకుల సహకారంతో ఈ అనువాద కేంద్రంలో పని ప్రారంభించిన కుమారజీవుడు సంస్కృత భాషనుండి అనేక ప్రామాణిక బౌద్ద గ్రంధాలను చైనా భాషలోనికి అనువదించాడు. కొత్త అనువాదాలనే కాక పాత అనువాదాలను సమీక్షించి, పునః పరిష్కరించడం కూడా చేసాడు.

ఉత్తర చైనా రాజధాని చాంగాన్ లో అనువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు కుమారజీవుని ఖ్యాతి దక్షిణ చైనా రాజ్యానికి కూడా ప్రాకింది. దక్షిణ చైనా బౌద్దసంఘ నాయకుడైన ‘హ్యు యువాన్’ (Hui-Yuan) కుమారజీవునితో బౌద్ద తత్వంపై, ఆశ్రమ విషయాలపై చర్చిస్తూ కుమారజీవుని అనువాద కృషిని ప్రోత్సాహించేవాడు. ఇతని కోరికపై కుమారజీవుడు ధర్మ కాయానికి, ధర్మధాతుజ కాయానికి మద్య గల భేదాన్ని విశిదీకరించినట్లు తెలుస్తుంది. ఒకానొక దశలో కుమారజీవుడు తన స్వస్థలమైన కూచా రాజ్యానికి వెళ్లిపోదలుచుకొన్నాడన్న వార్త విని అతనిని చైనాలోనే వుండిపోవలసిందిగా హ్యు యువాన్ కుమారజీవుని తీవ్రంగా అభ్యర్ధించాడు. హ్యు యువాన్ తో కుమారజీవుడు జరిపిన 18 ఉత్తర ప్రత్య్త్తత్తరాలు చారిత్రిక ప్రాధాన్యం కలిగివున్నాయి. అనువాదకుడుగా చాంగన్ లో స్థిరపడిన కుమారజీవుడు క్రీ.శ. 413 లో తను మరణించే వరకూ 12 సంవత్సరాల పాటు చైనా లోనే నివసించాడు.

కుమారజీవునికి ముందు కాలంలో చైనీయుల అనువాదాల స్థితి

కుమారజీవునికి ముందు నుంచి కూడా పాళీ, సంస్కృత భాషలలో వున్న బౌద్ద సూత్రాలు అనేక వందల సంఖ్యలో చైనా భాషలోనికి అనువదించబడి వున్నప్పటికీ, బౌద్ద సిద్దాంతాలు చైనా ప్రజలలో గాడంగా చొచ్చుకోలేకపోయాయి. దీనికి కారణం చైనా అనువాదాల దుస్థితి. ఈ అనువాదాలు అప్పటికే స్థానికంగా వ్యాప్తిలోనున్న తావోమతం (Taoism) తత్వ భావాన్ని వుపయోగించి చేసినవై వున్నాయి. దీని వల్ల చైనా అనువాదకులు బుద్దుని బోధనలను వాస్తవికంగా అర్ధం చేసుకోలేకపోయారు. బొద్ద తత్వం పట్ల సరైన అవగాహన లేని అనువాదాల వాళ్ళ చైనా భాషలోనికి తర్జుమా చేయబడ్డ బౌద్ద గ్రంధాలు చైనీయులలో బౌద్ధం పట్ల సరైన తాత్విక భూమికను కలిగించలేకపోయాయి. చైనీయులకు అసలైన బౌద్ధతత్వం పట్ల అవగాహన కల్పించడంలో పాత అనువాద క్రియలు విఫలం అయ్యాయి. కుమారజీవుడు చైనా భాషలో అనువాదాలు ప్రారంభించడంతో ఈ పరిస్థితులు మారిపోయాయి.

కుమారజీవుని అనువాద శైలి

కుమారజీవునికి ముందు చైనా భాషలోని బౌద్ద అనువాద గ్రంధాలలో ‘కోయ్’ (ko-i అనగా అర్ధంతో సరిపడటం) అనువాద విధానం వుండేది. దీని వలన పరిచయం లేని సంస్కృత సారస్వత పదాలకు బాగా తెలిసిన చైనా పదాలను వాడారు. దీని వలన మూలంలోని భావం విశిదీకరించడంలో రాజీ పడాల్సివచ్చేది. అయితే దీన్ని అధిగమించడానికి సంస్కృతపదాలకు సరిసమాన పదాలు చైనా భాషలో లేనిపోని కారణంగా సరి సమానార్ధక పదాలుగా నూతన పదాలను సృష్టించి అనువాదాలలో వాడడంతో ఆ అనువాదాలు గందరగోళంలా తయారయ్యేవి. కుమారజీవుడు ఈ అనువాదాలను చూసి అనువాదం అనేది మూల గ్రంధంలోని భావానికి భంగం వాటిల్లకుండా తెలియచేసే విధంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చాడు.

ఫలితంగా కుమారజీవుని రాకతో బౌద్ద గ్రందాలకు చైనా అనువాదశైలిలో నూతన శకం బయలుదేరింది. మూలంలోని భావానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన, నూతన పద సృష్టి జోలికి పోకపోవడం వాళ్ళ ఇతని అనువాద శైలి విలక్షణంగా, మృదు ప్రవాహ శైలిలో కొనసాగి సామాన్య చైనీయులకు సులభంగా చేరువైంది. మూలంలోని అసలు భావాన్ని విశిదీకరించడంలో అందె వేసిన ఇతని అనువాదాలు చైనీయులకు బౌద్దధర్మం యొక్క అసలు తత్వం తెలియచెప్పాయి.

కుమారజీవుని అనువాద ప్రక్రియ

కుమారజీవుడు అనువాద శైలిలోనే కాకుండా అనువాద విధానాలలో నూతన మార్పులు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా అనువాద ప్రక్రియలో అంతకు ముందెన్నడూ లేని విధంగా సామూహిక కృషికి ప్రముఖ స్థానం కల్పించాడు. ఇతను నెలకొల్పిన వ్యవస్థాగతమైన అనువాద పద్దతులు ‘సద్దర్మ పుండరీక సూత్ర’ (Lotus Sutra) అనే అనువాద గ్రంధ పీఠికలో పేర్కొనబడ్డాయి.

కుమారజీవుని ఆధ్వర్యంలో అనువాద సభలు ఏర్పాటయ్యేవి. వాటి సమావేశాలకు వందలాది బౌద్ద సన్యాసులు హాజరయ్యేవారు. ఆ సమావేశాలలో అనువాదం చెయదానికి ఎంచుకొన్న మూల తాళపత్ర గ్రంథంలోని ప్రతీ వాక్యాన్ని గట్టిగా పఠించేవారు. ప్రతీ వాక్య పఠనానంతరం ఆ వాక్యానికి కుమారజీవుడు అర్ధాన్ని, భావాన్ని విశిదీకరించేవాడు. చైనా భాషలో తన అనువాదాన్ని సైతం వినిపించేవాడు. అనువాద సభా సమావేశాలకు హాజరైన వందలాది బౌద్ద సన్యాసులు దానికి వ్యాఖ్యలు, మార్పులు, చేర్పులు సూచించేవారు. అత్యధికుల ఆమోదం పొందిన అనంతరం అనువాద వాక్యం రాయబడేది. తరువాత మూల గ్రంధంలో అంతర్గతంగా పొసగేటట్లుగా ఆ అనువాద వాక్య శైలి సవరించబడేది. తరువాత నగిషీకారులు (Calligraphers) ఆ వాక్యాన్ని చైనా లిపిలోకి మార్చేవారు. ఇటువంటి అనువాద సభా సమావేశాలకు చైనా చక్రవర్తి సైతం తరచుగా హాజరయ్యేవాడు. ఈ విధంగా అనువాద ప్రక్రియలో సామూహిక కృషికి పెద్ద పీట వేయడం వలన విస్తృత జనామోదం పొందిన వాక్యాలే నిలిచేవి. గందరగోళంతో కూడిన నూతన పదాలకు ఆస్కారం వుండేది కాదు. కుమారజీవుడు అనువాద ప్రక్రియలో ప్రవేశపెట్టిన నిర్దిష్ట మార్పులు, వ్యవస్థాగతమైన పద్దతులు తదనంతర కాలంలో అనువాదకులకు మార్గదర్శకంగా నిలిచాయి.

ఈ అనువాద కృషిలో 800 కు పైగా చైనా, విదేశీ పండితులు, బౌద్ద సన్యాసులు, అనువాదకులు కుమారజీవునికి సాయంగా నిలిచారు. అనువాద కృషి సామూహికంగా జరిగినప్పటికీ అనువాద కర్తగా కుమారజీవుని పేరుతోనే నమోదయ్యంది. దీనికి కారణం అనువాదంలోని కనిపించిన ప్రతీ చైనా పదం అనేక విస్తృత చర్చలనంతరం కుమారజీవుని ఆమోదంతోనే ప్రకటితం కావడమే.

కుమారజీవుడు అనువదించిన ముఖ్య బౌద్ధ గ్రంధాలు

కుమారజీవుడు క్రీ.శ. 401 లో రాజధాని చాంగన్ లో అడుగుపెట్టినప్పటినుండి తను మరణించేవరకు (క్రీ.శ. 413) 12 సంవత్సరాల పాటు బృహత్తర అనువాద కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషి చేసి 384 వాల్యూంలతో కూడిన 74 బౌద్ధ గ్రంధాలను చైనా భాష లోనికి అనువాదం చేసాడు. అనేక బౌద్ద సూత్రాలను, వ్యాఖ్యలను ముఖ్యంగా మహాయానానికి చెందిన ప్రజ్ఞాపారమిత సాహిత్యాన్ని అనువదించాడు. కుమారజీవుడు అనువదించిన ప్రామాణిక బౌద్ద గ్రంధాలలో కొన్ని

  1. సత్య సిద్ది శాస్త్ర – 20 వాల్యూమ్స్ – (క్రీ.శ. 402-412 ల మద్య కాలంలో)
  2. అష్ట సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర - 10 వాల్యూమ్స్ –(క్రీ.శ. 408 లో)
  3. వజ్రచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర (The Diamond Sutra) – 1 వాల్యూమ్ – (క్రీ.శ. 402-412 ల మద్య కాలంలో)
  4. సద్దర్మ పుండరీక సూత్ర (The Lotus Sutra) - 8 వాల్యూమ్స్ –(క్రీ.శ. 406 లో)
  5. లఘు సుఖావతి వ్యూహ (అమితభ సూత్ర) – 1 వాల్యూమ్ – (క్రీ.శ. 402 లో)
  6. మాద్యమిక శాస్త్ర – 4 వాల్యూమ్స్ –(క్రీ.శ. 409 లో)
  7. శతిక శాస్త్ర – 2 వాల్యూమ్స్ –(క్రీ.శ. 409 లో)
  8. ద్వాదశముఖ శాస్త్ర – 1 వాల్యూమ్ – (క్రీ.శ. 409 లో)
  9. సర్వాస్థివాద వినయ – 61 వాల్యూమ్స్ – (క్రీ.శ. 404-409 ల మద్య కాలంలో)
  10. మహా ప్రజ్ఞాపారమిత ఉపదేశ – 100 వాల్యూమ్స్ – (క్రీ.శ. 402-405 ల మద్య కాలంలో)
  11. పంచవింశతి సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర – 27 వాల్యూమ్స్ –(క్రీ.శ. 404 లో)
  12. విమలకీర్తి నిర్దేశ సూత్ర - 3 వాల్యూమ్స్ –(క్రీ.శ. 406 లో)
  13. కరుణికరాజ ప్రజ్ఞాపారమిత సూత్ర - 2 వాల్యూమ్స్
  14. మైత్రేయ వ్యాకరణ సూత్ర – 1 వాల్యూమ్
  15. శురంగమ సమాధి సూత్ర - 2 వాల్యూమ్స్
  16. బ్రహ్మజాల సూత్ర - 2 వాల్యూమ్స్
  17. దశాభూమిక విభాస - 17 వాల్యూమ్స్

వీటిలో 'వజ్రచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర’(The Diamond Sutra), సుఖావతి వ్యూహ (అమితభ సూత్ర), సద్దర్మ పుండరీక సూత్ర(The Lotus Sutra), ‘విమలకీర్తి నిర్దేశ సూత్ర’, ‘అష్ట సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర', ‘మహా ప్రజ్ఞాపారమిత ఉపదేశ’ అనువాదాలు ముఖ్యమైనవి. వీటన్నింటిలోకూడా లోటస్ సూత్రాలుకు చేసిన అనువాదం (సంస్కృతంలో 'సద్దర్మ పుండరీక సూత్ర’: చైనా భాషలో 'Miao-fu-lien-hauo') బౌద్ద ధర్మాన్ని విశిదీకరించడంలోను, భాషా అనువాద స్థాయిలోను కుమారజీవుని ప్రతిభను చాటి, ప్రపంచ అత్యుత్తమ అనువాదకారులలో ఒకడిగా చిరస్మరణీయం చేసింది.

కుమారజీవుడు స్వయంగా రచించిన గ్రంధాలు అరుదనే చెప్పాలి. అశ్వఘోషుడు, నాగార్జనుడు, ఆర్యదేవుడు, వసుబంధు ల జీవన చరిత్రలను చినా భాషలో రాసాడు.

చక్రవర్తి యావో జింగ్ తో కుమారజీవుని సత్సంబందాలు

కుమారజీవుడు ఆనాటి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) తో చక్కని స్నేహపూరితమైన సంబందాలు కలిగివున్నాడు. కుమారజీవుని అసాధారణ ప్రజ్ఞా పాటవాలు, బౌద్ద ధర్మ వివరణలో అతనికున్న సాధికారత, చక్రవర్తిని అమితంగా ఆకర్షించాయి. బౌద్ద గ్రంధాల చైనా అనువాద ప్రక్రియలకు సమర్ధుడిగా అతనినే భావించిన చక్రవర్తి కుమారజీవుని శత్రు చెర నుంచి విడిపించి తన వద్దకు రప్పించుకొన్నాడు. జాతీయ గురువుగా గౌరవించడమే కాకుండా, రాజ గురువుగా ప్రకటించి తన ఆస్థానంలో అతని స్థాయిని అతి స్వల్ప వ్యవధిలోనే ఉన్నతీకరించాడు. అనువాద కేంద్రానికి నాయకుడిగా చేసి బృహత్తర అనువాద కార్యక్రమ భాద్యతను కుమారజీవుని భుజ స్కంధాలపై నిలిపాడు.

అదేవిధంగా చక్రవర్తి చూపిన ఆదరణ, అందించిన తోడ్పాటు, అనువాదం పట్ల చక్రవర్తికి గల ప్రత్యేకాసక్తిని గమనించిన కుమారజీవుడు చక్రవర్తి అభిమతానికి అనుగుణంగా అనువాద కార్యక్రమాన్ని రాజధానికి చేరుకొన్న ఆరు రోజుల వ్యవధిలోనే ప్రారంభించాడు. తను మరణించేవరకూ 12 సంవత్సరాలపాటు నిరాఘాటంగా అసమాన కృషితో అనువాద యజ్ఞాన్ని కొనసాగించి చక్రవర్తి అభిమానానికి పాత్రుడయ్యాడు.కుమారజీవుని ప్రభావంతో చక్రవర్తి యావో జింగ్ తన రాజ్యంలో అనేక బౌద్దాలయాలు, నిర్మించాడు. కుమారజీవుని ప్రభావం వలన ఈ చక్రవర్తి కాలంలోనే బౌద్దమతానికి తొలిసారిగా రాజ మద్దతు లభించింది. ఫలితంగా కుమారజీవుని ప్రభావంతో ఇతని రాజ్యంలో 90 శాతం ప్రజలు బౌద్దులుగా మారారని వర్ణించబడింది.

కుమారజీవుని ధార్మిక చింతన, ప్రతిభ, ఆద్యాత్మిక సంపన్నత చక్రవర్తిని ఎంతగా కదిలించాయంటే, సన్యాసి అయిన కుమారరజీవునికి సంతతి లేని కారణంగా, అతని అపూర్వ ప్రతిభా పాటవాలు అతనితోనే అంతరించిపోతాయనే దిగులు సైతం చక్రవర్తికి కలిగింది. ఫలితంగా ఆశ్రమజీవితం నుండి కుమారజీవుని తప్పించి ఒక అందమైన రాజ భవంతిలోకి తరలించాడు. ఆకర్షణీయమైన అంతఃపుర పడుచులను ఎన్నిక చేసి మరీ అతనికి పరిచారకులుగా నియమించి వారి ద్వారా ఉత్తమ సంతానం కలిగేటట్లుగా అనుకూల పరిస్థితులు కల్పించాడు. దీనితో బొద్ద సన్యాసిగా కుమారజీవునికి సంకట పరిస్థితి ఎదురైంది. ఒకవైపు చక్రవర్తి ఆజ్ఞ ధిక్కరిస్తే అనువాద కేంద్రం మూతబడవచ్చు. మరోవైపు పాటిస్తే సన్యాసిగా తన నియమ నిష్ఠకు భంగం వాటిలుతుంది. జాగ్రత్తగా ఆలోచించి చక్రవర్తి ఆజ్ఞకు తలవంచవలసి వచ్చింది. కొన్ని ఆధారాల ప్రకారం ప్రతికూల పరిస్థితుల ప్రభావానికి గురైన కుమారజీవుడు ఆశ్రమ జీవితం నుండి సాంసారిక జీవితానికి బలవంతంగా మళ్ళించబడ్దాడని, అతనికి సంతతి కలిగిందని తెలుస్తుంది. ఒకానొక సమయంలో అసలు సంగతులు తెలియని అతని గురువు 'విమలరక్ష'(క్రీ.శ. 337 - 413) చైనాకు వచ్చినపుడు శిష్యుడైన కుమారజీవుని జీవనరీతిని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది. ఖిన్నుడైన కుమారజీవుడు గురువుతో తాను కర్మకు బందీ అయినవాడుగా, క్లేశానికి లోనైన వాడుగా వివరించి, గౌరవార్హతకు నోచుకున్నవానిగా తనకు తాను పరిగణించుకోవడం లేదని విన్నవించుకొన్నాడు. పశ్చతాపానికి లోనైన కుమారజీవుడు రాజ భవంతిలో భోగభాగ్యాల మద్య తులతూగవలసి వచ్చినప్పటికీ తన జీవన రీతిని ఒక బౌద్దాశ్రమ సన్యాసి జీవించే రీతిలోనే గడపడానికి చివరివరకు ప్రయత్నించాడు. బురద నుండి వెలువడిన పద్మం వలె తనను పోల్చుకొన్నాడు. తన శిష్యులతో, తన తోటి బౌద్దసన్యాసులతో తన జీవన రీతిని ఉద్దేశిస్తూ పద్మంను మాత్రమే చూసి దానికి అంటిన బురదని పట్టించుకోవలదని కోరాడు. తన బోదనలలోని అంతిమ సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకొనమని, తన జీవన విధానాన్ని ఆదర్శంగా గ్రహించవద్దని తరచు కోరేవాడు. ఏది ఏమైనప్పటికి సమకాలీన బౌద్ద సమాజం కూడా అతని సంకట పరిస్థితిని అర్ధం చేసుకొన్నట్లే కనిపించింది. అనువాద కృషి అవాంతరాలు లేకుండానే చివరవరకూ కొనసాగింది.

మరణం

కుమారజీవుని స్మారక పగోడా, Huxian ప్రాంతం - దీనిలోనే చితిజ్వాలలలో నాశనం కాకుండా మిగిలినిదిగా భావించబడిన కుమారజీవుని 'నాలుక' భద్రపరచబడింది.

క్రీ.శ.413 లో తన 69 వ సంవత్సరంలో కుమారజీవుడు చాంగన్ నగరంలో మరణించాడు. సాంప్రదాయం ప్రకారం కుమారజీవుడు మరణశయ్యపై వున్నప్పుడు తన ఆంతరంగిక శిష్యులతో ‘తన శరీర దహనం (Cremation) అనువాదకుడిగా తన విజయాన్ని నిరూపిస్తుందని, తను చేసిన అనువాదంలో బౌద్ద ధర్మానికి విరుద్దంగా ఏమైనా లోపాలుంటే చితి జ్వాలలు తన పార్దివ దేహాన్ని ఆసాంతం దహించివేస్తాయని, తన అనువాదంలో లోపాలు లేనట్లయితే తన నాలుక (tongue) తప్ప మిగిలిన దేహం మాత్రమే దహించబడుతుంద’ని చెప్పినట్లు ప్రతీతి. అతని మరణానంతరం శిష్యులు దీనిని నిరూపించడానికి ప్రయత్నించగా ఒక్క నాలుక మాత్రమె నాశనం కాకుండా మిగిలివుందని శిష్యులు గ్రహించినట్లు తెలుస్తుంది.

చాంగాన్ లో మరణించిన కుమారజీవుని చైనీయులు భారతీయునిగానే భావించి భారతీయ ఆచారాల ప్రకారమే అతనికి దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారజీవుని కృషికి స్మారక చిహ్నంగా చైనాలోని ప్రాచీన చాంగన్ (Xian) నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో Huxian ప్రాంతంలో కుమారజీవ పగోడా నిర్మించి అతని అవశేషాలను (చితాభస్మాన్ని,చితిజ్వాలలలో నాశనంకాని నాలుక) భద్రపరిచారు.

కుమారజీవుని మరణానంతరం చాంగాన్ రాజకీయంగా అలజడులకు లోనయ్యింది. దానితో అనేక మంది బౌద్ద సన్యాసులు సురక్షితమైన ప్రదేశాలకు తరలిపోవలసి వచ్చింది.

వారసత్వం

కుమారజీవునికి 3 వేలకు పైగా శిష్యులుండేవారని ప్రతీతి. వీరిలో నలుగురు ప్రధాన శిష్యులు

  • దావో షెంగ్ (Dao Sheng),
  • సింగ్ జావో (Seng hao),
  • దావో రాంగ్ (Dao rong),
  • సేంగ్రుయ్ (Sengrui)

కుమారజీవుని శిష్యులు చైనాలో సాన్ లున్ (Sanlun) బౌద్దశాఖను నెలకొల్పారు. ఇది తూర్పు ఆసియాలోని మాద్యమిక శాఖ వంటిది.

సూక్తులు

పంచవింశతి సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర కు చేసిన అనువాదంలో కుమారజీవుని ప్రముఖ సూక్తి ఈ విధంగా వుంది.

“What is seen does not differ from what is empty, What is empty does not differ from what is seen, Form is emptiness, Emptiness is form. It is the same for feeling, perception, interaction & consciousness.”
“ఏదైతే కనిపిస్తుందో అది శూన్యంతో విభేదించదు. ఏదైతే  శూన్యంగా వుంటుందో అది కనిపించే రీతితో విభేదించదు. రూపం వున్న చోటే శూన్యత కూడా వుంటుంది. శూన్యత వున్న చోటే రూపం కూడా వుంటుంది. .... ”

అనువాదకునిగా కుమారజీవుని విశిష్టతలు

  • పాళీ, సంస్కృత భాష లలో వున్న మూల బౌద్ద గ్రంధాలు క్రీ.శ. 2 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకూ గల మద్య కాలంలో సుమారు 6,000కు పైగా చైనా దేశంలోనికి తరలించబడి వుంటాయని ఒక అంచనా. 200 మందికి పైగా ప్రముఖ అనువాదకులు ఈ వేలాది గ్రంధాలను పాళీ/సంస్కృత భాషలనుండి చైనా భాషలోనికి అనువదించారు. వీరందరిలో క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన కుమారజీవుడు, 7వ శతాబ్దానికి చెందిన హుయన్ త్సాంగ్ లు అత్యంత ప్రముఖ అనువాదకులుగా చరిత్రలో పేరుపొందారు. వీరిలో కుమారజీవుడు జన్మతా భారతీయుడు కానప్పటికీ భారతీయ సంతతి (Indian Origion)కి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఒకవైపు బుద్దుడు జన్మించిన దేశంలో బౌద్దమత ప్రాభవం క్షీణిస్తున్న కాలంలోనే (మలి గుప్తుల కాలంలో), మరొవైపు విదేశాలలో ముఖ్యంగా చైనాలో బౌద్దమత గ్రందాల అనువాదం ద్వారా బౌద్ద మత వికాసానికి ఎనలేని కృషి చేసినవాడు కుమారజీవుడు.
  • కుమారజీవుడు అనువాద శైలిలోను, ప్రక్రియా విధానంలోను సమూలమైన మార్పులు ప్రవేశపెట్టాడు. భావానికి ప్రాధాన్యం ఇస్తూ మృదుప్రవాహ శైలిలో అనువదించాడు. కుమారజీవుని అనువాదాలు ప్రస్తుత కాల పరిస్థితులలో సైతం అధ్యయనం చేయడానికి అనుకూలంగా వున్నాయంటే అతని అనువాదం ఎంత సరళంగా భావస్ఫురితంగా వుంటుందో అర్ధమవుతుంది. అనువాద ప్రక్రియలో కుమారజీవుడు ప్రవేశపెట్టిన బృహత్తర సామూహిక కృషి కూడా అంతకు ముందు అనువాదాల క్రియలో ఎన్నడూ లేదు. అనువాద ప్రక్రియను నిరంతరం కొనసాగించడం కోసం సంస్థాగత యంత్రాంగాన్ని(Institutional Mechanism) ఏర్పాటుచేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో వందలాది స్వచ్చంద అనువాద సహాయకుల, సహకారాన్ని పొందగలిగాడు. అనువాద విధానాన్ని అనువాదకుల వ్యక్తిగత కృషి (individual effort) స్థాయి నుండి వ్యవస్థీకృత కృషి (organized effort) స్థాయికి తీర్చిదిద్ది తన తరువాతి అనువాదకులకు మార్గదర్శిగా నిలిచాడు.
  • కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషతో పాటు ఇతర ప్రపంచ భాషలలోకి బౌద్ద గ్రంధాలు అనువదించబడ్డాయి. స్థవిరవాదుల, మహాయానుల సాహిత్యం మూల సంస్కృతంలో అలభ్యం అయినప్పటికీ ఇతని అనువాదాల నుండే అందలి విషయాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. ఉదాహరణకు 'మాద్యమిక కారిక' అనువాద గ్రంధానికి అసలు సంస్కృత ప్రతి అలభ్యం అయినప్పటికీ కుమారజీవుని అనువాదం వల్లే అందలి విషయాలు బయటకి వెల్లడయ్యాయి. కుమారజీవుడు లేనట్లయితే కొన్ని గొప్ప మహాయాన గ్రంధాలు సంరక్షించబడకపోయి వుండవచ్చు.

కుమారజీవుని అనువాదాల ప్రభావం

చైనాలో బౌద్ద చింతన, బుద్దబోదనల వికాసానికి కుమారజీవుడు చేసిన అనువాదాలు మూలాధారంగా నిలిచాయి.

  • కుమారజీవుని అనువాదాల వల్లే అంతవరకూ చైనీయులకు తెలియని ప్రామాణిక బౌద్ద గ్రంధాలు (ముఖ్యంగా మహాయాన బౌద్ద గ్రంధాలు) అందుబాటులోకి వచ్చాయి. అంతేగాక బౌద్ద పరిభాషను స్పష్టం చేయడంలో, బౌద్ద తత్వ భావనలను విపులీకరించడంలో కుమారజీవుడు చూపిన అనన్యమైన ప్రతిభ చైనీయుల బౌద్ద తత్వంపై గాడమైన ప్రభావం చూపింది.
  • కుమారజీవుని అనువాదాల వలన చైనాకు యదార్ధ బౌద్ధతత్వం పరిచయమైంది. క్రీ.శ.2 వ శతాబ్దం నుండి క్రీ.శ. 5 వ శతాబ్దం వరకు వచ్చిన మొరటు అనువాదాలు చైనీయులకు బౌద్ద ధర్మం, తాత్వికత పట్ల సరైన అవగాహన కల్పించలేకపోయాయి. ఆ విధంగా బౌద్ద తాత్విక అంధకారంలో వున్న సామాన్య చైనీయులకు కుమారజీవుని అనువాద గ్రందాలతో నూతన గవాక్షాలు తెరుచుకొన్నట్లయ్యింది. అసలైన బౌద్దతత్వం సామాన్యులకు చేరువవ్వడంతో చైనాలో(మహాయాన) బౌద్ద ప్రాభవం పరవళ్ళు తొక్కడం ప్రారంభమైంది. కుమారజీవుని అనువాద ప్రభావం వలన క్రీ.శ. 5 వ శతాబ్దం నుండి చైనాలో బౌద్ధం ఒక విదేశీమతంగా ఇక ఏమాత్రం పరిగణించలేనంతగా చైనాలో అంతర్భాగమయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే క్రీ.శ. 5 వ శతాబ్దానికి బౌద్ధం చైనీయులకు సజీవ ఆరాధ్య మతంగా మారిపోయింది.
  • చైనాలో మహాయాన బౌద్దమత వికాసానికి కావలిసిన నేపధ్య ఆధార భూమికను కుమారజీవుడు తన అనువాదాల ద్వారా అందించాడు. మహాయానతత్వం పట్ల సాధికారత గల కుమారజీవుని నుంచి వచ్చిన అనువాదాలు చైనాలో మహాయాన బౌద్ధం వికసించడానికి మాత్రమే కాక తూర్పు ఆసియా దేశాలకు (వియత్నాం, సింగపూర్, కంబోడియా తదితర దేశాలకు) అక్కడినుంచి కొరియా, జపాన్ దేశాలకు సైతం వ్యాపించడానికి దోహదం చేసింది. తూర్పు ఆసియా దేశాలలో అనుసరిస్తున్న మహాయాన బౌద్ధానికి సంబందించిన పారాయణ గ్రంధాలు కుమారజీవుని చైనా అనువాద గ్రంధాలను ఆధారంగా చేసుకొనే రూపు దిద్దుకొన్నాయి.
  • అంతేగాక కుమారజీవుని కృషి చైనాలో బౌద్ద శాఖలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసాయి. అటువంటి బౌద్ద శాఖలలో ‘తియన్ తాయ్’ (Tien Tai) శాఖ, ‘సాన్ లున్’ శాఖ (Sanlun) లు ముఖ్యమైనవి. వీటిలో ‘సాన్ లున్’ శాఖ తూర్పు ఆసియా మాధ్యమిక శాఖగా, ‘త్రి శాస్త్ర’ శాఖ(Three Treatises)గా పేరుపొందింది. ఈ రెండు శాఖలకు ప్రధాన సాహిత్య పారాయణాలుగా కుమారజీవునిచే అనువదించబడిన మాధ్యమిక బౌద్ద సూత్రాలే వున్నాయి.

మూలాలు

ఇతర రిఫరెన్సు గ్రంధాలు

  • Himalaya Calling: The Origins of China and India, World century publishing corporation,NJ 07601,USA
  • Saints & Sages of Kashmire-T.N Dhar Kundan (A.P.H. Publishing Corporation, New Delh -2004)
  • Some Aspects of Asian History and Culture –Upendra Thakur (Abhinav Publications –1986)