తవుడు నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తవుడు
తవుడును గుళికలుగా చేయు యంత్రం (pelletiser)
తవుడు గుళికలు
తవుడునుండి నూనెతీయు సాల్వెంటు ప్లాంట్
ముడి తవుడునూనె

తవుడు నూనె (Rice Bran oil) ఒక రకమైన శాకనూనె నూనె. ఆహర యోగ్య తైలం. ఏకబీజదళ తరగతికి చెందిన వరి మొక్క. కుటుంబం పోయేసి (poaceae). ఈ మొక్క శాస్త్రీయనామం ఒరైజా సాటివా (oryza sativa), యిది ఆసియా రకం. ఆఫ్రికా రకం పేరు ఒరైజా గ్లాబెర్రిమా. దీనిని ఏకవార్షీకంగా సాగుచేయుదురు. చరిత్రకాధారం ప్రకారం 4 వేల సంవత్సరాలకు ముందే చైనాదేశంలో ఈ పంట పండించేవారు. ఆక్కడనుండి గ్రీకులకు పూర్వమే ఇండియాలో వరిని పండించడం మొదలైనది.[1] ప్రస్తుతం వెయ్యికిపైగా వరిలో రకాలున్నాయి.

తవుడు, వడ్లలను (Paddy), బియ్యం మిల్లులో (Rice Mill) బియ్యం ఉత్పత్తికై ఆడించినప్పుఫు, 'తవుడు' లేదా 'తౌడు' ఉప ఉత్పత్తిగా ఏర్పడును. తౌడును 'చిట్టు', 'పారూ' అని కూడా ఆంటారు. తౌడును సాధారణంగా పశువులకు దాణాగా (మేత), కుడితిలో కలిపి యివ్వడం జరుగుతుంది. అటువంటి తవుడు నుండి నూనె అనగానే కొద్దిగా ఆశ్ఛర్యం అన్పిస్తుంది. గత 30-35 ఏళ్ళగా భారతదేశంలో తవుడు నుంచి నూనెను "సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ (Solvent extraction) పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. కాని మొదట 15 సంవత్సరాలు ఉత్పత్తి అయ్యిన తవుడు నూనె, ఎక్కువ శాతంలో F.F.A. (Free fatty Acids) ను కలిగి వుండటం వలన, ఆ నూనెను ఎక్కువగా, కేవలం సబ్బులు, ఫ్యాటిఆమ్లాల తయారీలో మాత్రమే వినియోగించేవారు. ఎక్కువ శాతం F.F.A. (40-80 %) వుండటం వలన ఈ నూనెను 'రిపైన్‌' చెయ్యుటకు అనుకూలం కానందున కేవలం సబ్బులు, ఫ్యాటి ఆసిడ్‌లు, గ్రీజ్‌ వంట్ వాటి ఉత్పత్తికి మాత్రమే తవుడు నూనెను వాడెవారు. కాలక్రమేన ఆయిల్‌ ఇండ్రస్టిలో, ఆయిల్‌ ప్రాసెంగ్‌ విధానంలో వచ్చిన మార్పుల వలన తక్కువ శాతం ఫ్రీ ఫ్యాటి ఆసిడ్‌ వున్న (5-20%) తవుడు నూనెను ఉత్పత్తి చేయ్యడం సాధ్యం అయ్యినది. అలాగే 'ఫిజికల్ రిఫైనింగ్‌' పద్ధతిలో, స్టీమ్‌ డిస్టిలెసన్‌ ద్వారా తవుడు నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులను తొలగించడం వలన, రిఫైనింగ్‌ లాస్‌ తగ్గడం వలన తవుడు నూనె నుండి వంటనూనెను (Cooking oil) ఉత్పతి చెయ్యడం మొదలైంది. ప్రస్తుతం తౌడు నూనె మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల పేరుమీద లభిస్తున్నది. ఉదాహరణకు: రైస్ రిచ్‌, రసోల, తండుల్, చెఫ్ వంటి పేర్లతో లభిస్తున్నది. కీ.శ.2008-2009 లో 8.5 లక్షల టన్నుల తవుడు నూనె ఉత్పత్తి కాగా అందులో, ఆందులో 8.2 లక్షల టన్నుల తవుడు నూనెను 'ఏడిబుల్‌ గ్రెడ్‌ (Edible grade) నూనెగా ఉత్పత్తి అయ్యింది[2]. తవుడు నూనెను సాల్వెంట్‌ విధానంలో ఉత్పత్తి చెయ్యడం వలన, 10-20% వరకు ఫ్రీ ఫ్యాటి ఆసిడ్స్ (F.F.A.), గమ్స్ (Gums)2-2.5%, వ్యాక్స్ (Waxes)2-3% కలిగి వుండటం వలన తవుడు నూనెను నేరుగా వంట నూనెగా ఉపయో గించడం వీలుకాదు. ఈ విధంగా ఎఫ్.ఎఫ్.ఏ., గమ్స్, వ్యాక్స్, కలిగి వున్న తౌడు నూనెను క్రూడ్‌ లేదా రా రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ అంటారు. అందుచే ఈ నూనెను రిఫైనరిలో 'రిఫైన్‌' (Refine) చేసి, రిఫైండ్ తవుడు నూనెగా మార్చి మార్కెటింగ్ చెయుదురు.

తవుడు ఉత్పత్తి, రకాలు[మార్చు]

వరిధాన్యం (Paddy) ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతోపాటుఊక (Husk) 25%, నూకలు (Broken rice) 3-5%,, తౌడు[3] 6-8% ఉపఉత్పత్తులు (By Products) ఏర్పడును. బియ్యపు గింజపై సన్నని పొరలా (Thin membrane), గోధుమ రంగులో, ఆవరించి వుండును. గోధుమ రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ (polish) చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తి అగును. తవుడు మంచిఫోషక విలువలున్న పదార్థాలను కలిగివున్నది.[4] పచ్చి తవుడులో 15-24% వరకు నూనె,14-16% వరకు మాంసకృత్తులు (Proteins) వున్నాయి, ఉప్పుడు తవుడు (boiles bran) లో 20-30%వరకు నూనె,14% వరకు ప్రొటిన్ వుండును..ఇంకను పాలిసాక్రైడ్స్‌, ఫైబరు వున్నాయి[3]. తవుడులో ఇంత పోషకవిలువలుండటం వలననే డాక్టరులు దంపుడుబియాన్ని (hand pounded rice) ఆహారంగా తీసుకోమని చెప్తారు. కొన్నిదేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు. 2008-2009 లో భారతదేశంలో, 140 మిలియన్‌ టన్నుల వరిఉత్పత్తి కాగా, మిల్లింగ్‌ చెయ్యగా 100 మిలియన్‌టన్నుల బియ్యం,80 లక్షలటన్నుల తవుడుఊత్పత్తి అయ్యింది.అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా,45 లక్షలటన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగింది. బియ్యాన్ని రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు. ఒకటి పచ్చిబియ్యం (Raw Rice, రెండు ఉప్పుడు బియ్యం (Boiled Rice). ధాన్యాన్ని కళ్ళంలో ఎండబెట్టి, తేమను తొలగించి, నేరుగా రైస్‌మిల్‌లో మిల్లింగ్‌చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని, తవుడును పచ్చితవుడు (Raw Rice Bran) అంటారు. ధాన్యాన్ని స్టీమ్‌ద్వారా ఉడికించి (steam boiled), మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం (Boiled Rice), అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు (Boiled Bran) అంటారు.

ఎస్టరిఫికెసన్‌[మార్చు]

కొవ్వుఆమ్లాలు అల్కహలులతో సంయోగం చెందు రసాయనిక చర్యను ఎస్టరిఫికెసను అంటారు. సంయోగం చెందు ఆల్కహాలులు ఒకే హైడ్రోక్షిల్ (OH) సమూహన్ని కలిగివున్న ఇథైల్, మిథైల్ వంటి మోనోహైడ్రోక్షిల్ ఆల్కహలులు కావచ్చును. లేదా రెండు అంతకుమించి హైడ్రోక్షిల్‌ సమూహలున్నవి కావచ్చును (గ్లిజరాల్‌ మూడుహైడ్రోక్షిల్ సమూహలను కల్గివున్నది). కొవ్వు ఆమ్లాలను మిథైల్, లేదా ఇథైల్ అల్కహల్‌తో ఎస్టరిఫికెసను చెయ్యడం వలన ఏర్పడునవి ఆల్కహల్‌ ఇష్టరులు. కొందరు ఈచర్యను 'అల్కహలిసిస్'అంటారు.గ్లిసెరొల్‌తో కొవ్వుఆమ్లాలు సంయోగం చెందగా ఏర్పడునవి కొవ్వుఆమ్లాల 'గ్లిసెరైడ్‌ ఈస్టరులు. శాకనూనెలనుండి'బయోడిజెల్'ను కొవ్వు ఆమ్లాలను అల్కహల్‌తో సంయోగపరచి ఉత్పత్తి చేయుదురు. మూడుఅణువుల కొవ్వు ఆమ్లాలు, ఒక అణువు గ్లిసెరొల్‌ సంయోగం వలన, ఒక నూనె ఆణువు, మూడు నీటి అణువులు ఏర్పడును[5]. ఈ విధంగా గ్లిసెరొల్, కొవ్వుఆమ్లాలు సంయోగచెంది నూనెగా ఏర్పడటాన్ని ఎస్టరిఫికెసను (esterification) అంటారు.ఆందుచే నూనెలను ట్రై గ్లిసెరైడ్‌లు (Triglycerides) లేదా కొవ్వుఆమ్లాల గ్లిసెరైడ్ ఎస్టరులందురు.

హైడ్రొలిసిస్

హైడ్రొలిసిస్[మార్చు]

ఎస్టరిఫికెసనుకు వ్యతిరేకచర్య 'హైడ్రొలిసిస్ (hydrolysis), [6] హైడ్రొలిసిస్ వలన నూనెలు కొవ్వుఆమ్లాలు,, గ్లిసెరొల్ గా విడగొట్టబడును. తవుడులో 'లీపెస్' (Lipase) అనే ఎంజైమ్‌వున్నది.ఈ లిపెస్‌ పచ్చితవుడులో చాలా క్రీయాశీలంగా వుండి 'హైడ్రొలిసిస్' (hydrolysis) చర్య ద్వారా నూనెను తిరిగికొవ్వు ఆమ్లాలుగా, గ్లిసెరిన్‌గా విడగొట్టును. ఈస్ధితిలో ఫ్యాటిఆసిడ్‌లు నూనెలో స్వేచ్ఛగా (free) వుండటం వలన వీటిని ఫ్రీఫ్యాటిఆసిడ్స్ (Free Fatty Acids, F.F.A.) ఆంటారు[7].అందుచే పచ్చితవుడును మిల్లింగ్ అయ్యినవెంటనే 24 గంటలలోపు సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్‌లో ప్రాసెస్ చేసి నూనెను ఉత్పత్తిచేసిన తక్కువ ఎఫ్.ఎఫ్, ఎ. వున్న ఆయిల్‌ను ఉత్పత్తి అగును.24 గంటలు దాటినచో పచ్చితవుడు లోఎఫ్,.ఎఫ్.ఎ. (F.F.A.) శాతం 25-45% వరకు పెరిగిపొవడం వలన ఆయిల్‌ను రిఫైన్‌చెసిన రిఫైనింగ్‌లాస్‌ ఎక్కువ వచ్చును,, ఆయిల్ కలర్‌కూడా ఎక్కువగా వుండును.బాయిల్డ్‌బ్రాన్‌లో ఎఫ్.ఎఫ్.ఎ.ఆంతత్వరగా పెరగదు. బాయిల్డ్ రైస్‌ను స్టీమ్‌కుకింగ్‌చెయ్యడం వలన, తవుడులోని 'లిపెస్'ఎంజైమ్‌ డిఆక్టివేట్‌అవ్వడం వలన, ఎఫ్.ఎఫ్.ఎ. త్వరగా పెరగదు.ఫ్రెష్‌బాయిల్డ్‌బ్రాన్‌నుండి 5% కన్న తక్కువ ఎఫ్.ఎఫ్.ఎ.వున్న ఆయిల్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.వంటకు ఉపయోగించు నూనెలో F.F.A.శాతం 0.25% మించి వుండరాదు. ఎఫ్.ఎఫ్.ఎ. 1% మించి వుండినచో, ఆయిల్‌ను వేడిచేసినప్పుడు తక్కువ ఉష్ణోగ్రతవద్దనే నూనెనుండి పొగ (smoke) రావడం ప్రారంభం అవుతుంది,, ఎఫ్.ఎఫ్.ఎ. కారణముగా నూనెకు చేదు (Bitter) రుచి వచ్చును. అందుచే సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ద్వారా ఉత్పత్తి చేసిన తవుడు నూనెను తప్పనిసరిగా రిఫైనింగ్‌ చేసిన తరువాత మాత్రమే వంటనూనెగా వినియోగించవలెను.ఆయిల్ రిఫైనింగ్‌ అనగా ఆయిల్‌లోని ఎ.ఎఫ్.ఎ.ను, గమ్స్, వ్యాక్సులను తొలగించి, ఆయిల్ కలరును తగ్గించడం. ఆంధ్ర ప్రదేశ్‌లో తవుడు నుండి నూనెను సంగ్రహించు సాల్వెంట్‌ ప్లాంట్‌లు 45 వరకు ఉన్నాయి. అలాగే తవుడు నూనెను రిఫైన్‌చెయ్యు రిపైనరిలు 20 వరకు ఉన్నాయి. రైస్‌మిల్‌ యొక్క ప్రాసెసింగ్‌ డిజైన్‌ను బట్టి, తవుడులో నూనెశాతం 8-25% వరకు వుండును. హల్లర్‌రైస్‌మిల్‌ (Huller mill) లోని తవుడులో 6-8% వరకు, షెల్లర్‌మిల్ (Sheller mill) తవుడులో 16-20% వరకు, మోడరన్‌ రబ్బరు షెల్లర్‌మిల్‌ తవుడులో 20-25% వరకు నూనె వుండును. తవుడు సాధారణంగా గోధుమరంగు (Brown) లో వుండును. మాములుగా నూనె గింజలనుండి ఆయిల్‌ను రోటరి మిల్‌, ఎక్స్ పెల్లరుల ద్వారా తీయుదురు. కాని తవుడు నూనెను కేవలం సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్‌ ద్వారానే సాధ్యం. ఏదైనా ఘన, లేదా ద్రవపదార్థాలను తనలో కరగించుకొనులక్షణం వున్న ద్రవంను'ద్రావణి' (Solvent). అన్ని ఆయిల్స్‌ హైడ్రొకార్బన్‌ సాల్వెంట్స్‌ అయిన బెంజీన్, అసిటొన్, క్లోరోపారం,, హెక్సెన్ (Hexane) లో అతి సులభంగా కరుగును. హెక్సెన్‌ను సాల్వెంట్ గా ఉపయోగించి, తవుడునుండి ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చెయ్యుదురు.

తవుడులో వుండు పోషక పదార్థముల పట్టిక

పోషక పదార్థాలు హల్లరు తవుడు పచ్చితవుడు బాయిల్డ్‌తవుడు
తేమ % 9-10 8-9 8-9
నూనె% 5-8 16-24 20-30
ప్రోటిను% 7-8 13-14 14-15
సాండ్/సిలికా% 12-14 5-8-7 6-7
పీచు పదార్థం% 18-20 9-10 9-11

తవుడు నుండి అయిల్‌ను సంగ్రహించడం[మార్చు]

తవుడునుండి ఆయిల్‌ను హెక్సెన్‌ను సాల్వెంట్‌గా ఉపయోగించి తీయుటను 'సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్' (solvent extraction) అంటారు.[8] హెక్సెన్‌ అల్కెన్ గ్రూప్‌నకు చెందిన ద్రవహైడ్రొకార్బన్‌. హెక్సెన్ తక్కువబాయిలింగ్‌ పాయింట్‌ కలిగి వుండటం, టాక్సిన్స్ (విష కారకాలు) లేకపోవడం, విస్తారంగా లభించడం వలన సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ప్లాంట్‌లలోహెక్సెన్‌ సాల్వెంట్‌గా వాడెదరు.[9] తవుడు పౌడరుగా వుండటం వలన నేరుగా ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చెయ్యుటకు కుదరదు. అందుచే తవుడును మొదటగా గుళికలుగా (Pellets) తయారు చేసి, ఆతరువాత ఈపిల్లెట్స్‌ను ఏక్స్‌ట్రాక్టరుకు పంపి, అక్కడ హెక్సెనును స్ప్రే చేసి తవుడునుండి నూనెను తీయుదురు.

తవుడును గుళికకలుగా మార్చు యంత్రాన్ని పెల్లెటైజరు (Pelletiser) లేదా కూబర్ మెచిన్ (cuber machine) అనెదరు[10] . పెల్లెటైజరులో సాధారణంగా కాస్ట్‌ఐరన్‌ (cast iron) తో చేసిన డై ప్లేట్‌ (Die plate),, రోలరులు వుండును.డై ప్లెట్‌కు 6-8 వ్యాసం (Diameter) వున్న రంధ్రాలుండును.డై ప్లేట్‌ మందం 55-60 మి.మీ. వుండును.ఈ డై ప్లెట్‌మీద 4-6 రోలరులు బిగించబడి వుండును.వీటి డయా 280 మి.మీ.లు వుండి, వెడల్పు 100-160 మి.మీ వరకు పెల్లెటైజర్‌ ఉత్పత్తి సామార్ద్యంనుబట్టి వుండును. డై ప్లేట్‌డయా కూడా మెషిన్‌ కెపాసిటిని బట్టి 600-840 మి.మీ. వుండును. పెల్లెటైజరుకు తవుడును పంపించెముందు, తవుడును టెంపరింగ్‌ కన్వెయరు (Temparing conveyer) లో ఒపన్‌స్టీమ్ ద్వారా కుకింగ్‌ చెయ్యుదురు. ఒపన్‌స్టీమ్‌ ద్వారా తవుడును కుకింగ్‌ చెయ్యడంవలన తవుడులోని తేమ (Moisture) శాతం 15% వరకు పెరగడంవలన పెల్లెట్స్ సుభంగా ఏర్పడుతాయి. పెల్లెటైజెర్ తిరుగునప్పుడు, డై ప్లెట్‌తో పాటు రోలరులు తిరుగును. డై ప్లేట్ భ్రమణ వేగం (Revolution) 90-100/నిమిషానికి వుండును. కుకింగ్ అయ్యిన తవుడు పెల్లెటైజెర్ డై ప్లెట్‌ మీద పడినప్పుడు, రోలరులు తవుడును అధిక వత్తిడితో డైప్లెట్ మీద నొక్కడం/వత్తడం వలన, తవుడు పెల్లెట్‌లగామారి డై ప్లెట్‌ రంధ్రాలనుండి బయటకు వచ్చును. పెల్లెటైజరు నుండి తయారు అయ్యివచ్చు పెల్లెట్‌ల ఉష్ణోగ్రత 80-85 డిగ్రీలి/సెంటిగ్రెడ్‌ వుండును. డై ప్లెటుకు దిగువన ఒకకట్టరును బిగించి, పెల్లెట్స్‌ను కావలసిన సైజుకు కత్తరించడం జరుగును. బ్రాన్‌పెల్లెట్స్‌ను సాల్వెంట్ ప్లాంట్‌కు పంపెముందు, పెల్లెట్స్ ఉష్ణోగ్రతను,, పెల్లెట్స్ యొక్క మాయిచ్చర్‌ను తగ్గించవలసి ఉంది. అందుచే పెల్లెట్‌లను పెల్లెట్‌ కూలర్‌ (pellet cooler) అనే యంత్రపరికరానికి పంపించి, పెల్లెట్‌ల ఉష్ణోగ్రతను 45-50 సెంటిగ్రెడ్‌ డిగ్రీల వరకు కూల్‌చెయ్యుదురు.పెల్లెట్‌కూలరులో పెల్లెట్స్‌ వెళ్లునప్పుడు, ఎయిరు బ్లొవర్‌ (Air Blower) ద్వారా చల్లనిగాలిని ప్రసరింప చెయ్యడం వలన పెల్లెట్స్ చల్లబడును. అంతియేకాదు, పెల్లెట్స్ యొక్క తేమ శాతం కూడా 12% వరకు వచ్చును. పెల్లెట్‌కూలరులో చల్లబరచిన పెల్లెట్స్ ఒకకన్వెయెర్ (conveyer) ద్వారా సాల్వెంట్‌ ప్లాంట్‌కు వెళ్ళును.

సాల్వెంట్‌ ప్లాంట్‌లో ఎక్స్‌ట్రాక్టరులో బ్రాన్‌ పెల్లెట్స్ మీద హెక్సెనును కంటిన్యుయస్‌గా స్ప్రే చెయ్యడం వలన తవుడు పెల్లెట్స్‌లోని ఆయిల్‌ హెక్సెనులో కరిగి తవుడు నుండి, వేరుపడును. ఎక్సూట్రాక్టరులో తవుడు పెల్లెట్స్ ఫీడింగ్‌ హపరు నుండి, డిచార్జి హపరుకు చేరు లోపల తవుడులోని ఆయిల్‌ మొత్తం హెక్సెనులోలో కరగి పోవును. ఇప్పుడు ఆయిల్లేని (Deoiled) తవుడు పెల్లెట్‌లో 30-35% వరకు సాల్వెంట్ వుండును. ఈ ఆయిల్డ్ బ్రాన్‌ను డిసాల్వెంటింగ్ టోస్టరుకు పంపి, జాకెట్‌ స్టీమ్‌హేటింగ్‌ చేసి, హెక్సెను వేపరులను తొలగించడం జరుగును. ఆ తరువాత డిఆయిల్డ్ బ్రాన్‌ను గది ఉష్ణోగ్రతకు చల్లార్చి, బ్యాగ్‌లలో ఫిల్లింగ్‌ చెయ్యుదురు.

తవుడునూనె, హెక్సెను మిశ్రమాన్ని 'మిసెల్లా' (Micella) అంటారు. ఈమిసెల్లాను వ్యాక్యుంలో వున్నడిస్టిలెసను (Distillation) సెక్షనులో ఆయిల్‌, హెక్సెనుగా వేరు చేయుదురు. డిస్టిలెసను సెక్షనులో హీటరులు, ఎవపరెటరులు అనే వెస్సల్స్‌ వుండును. హీటరులలో మిసెల్లను జాకెట్ స్టీంద్వారా 80-110 సెంటిగ్రెడ్‌ దిగ్రీలవరకు వేడిచేసి, ఎవపరెటరులకు పంపెదరు. హెక్సెను బాయిలింగ్‌ పాయింట్, ఆయిల్ బాయిలింగ్‌ పాయింట్‌ కన్న బాగాతక్కువ కావడం వలన, వేపరు రూపంలో హెక్సెను ఆయిల్‌ నుండి వేరుపడును (హెక్సెను బాయిలింగ్‌ పయింట్:68-72 సెంటిగ్రెడ్, ఆయిల్‌ బాయిలింగ్‌ పాయింట్‌: 350-400 సెంటిగ్రెడ్‌). వేపరురూపంలోని హెక్సెనును కండెన్సరులకు (condensers) పంపి, చల్లబరచి, ద్రవంగా మార్చి, తిరిగి ఎక్స్ట్రాక్షనులో వినియోగిస్తారు.

తవుడునూనె[మార్చు]

తవుడు నూనెలో వుండుసంతృప్త (saturated, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (unsaturated) సమతుల్యంగా వుండటం, తక్కువ కొలెస్టరు ఫ్యాక్టరు కలిగి వుండటం, ఒరైజనొల్‌ను కలిగి వుండటం వలన తవుడునూనెను "Friend of heart" అనికూడా అంటారు.[11] రెఫైండ్‌ రైస్ బ్రాన్‌ ఆయిల్‌లో వ్యాక్స్‌ 2.0% వరకువుండటం వలన, మిగతా అయిల్స్ కన్న కలరు కొద్దిగా ఎక్కువగా వున్నట్లు కన్పించును. సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిననూనెలో ఫ్రీ ఫ్యాటి అమ్లాలు, యితర మలినాలు వుండటం వలన చూచుటకు చిక్కగా కన్పించును. మూడినూనె పసుపు. ఎరుపురంగు కలయికలో వుండును, రిపైండుచేసిన నూనె లేతపసుపు రంగులో వుండును.

ముడినూనె,, రిపైండుతవుడునూనె భౌతిక, రసాయనికథర్మాల పట్టిక[12]

నూనె స్వభావము ముడి తవుడు నూనె రిపైండ్‌తవుడునూనె
తేమ% 0.5-1.0% 0.1-0.15%
సాంద్రత (15/150C) 0.913-0.920 0.913-0.920
వక్రీభవన సూచిక 1.4672 1.4672
ఐయోడిన్ విలువ 95-100 95-104
సపొనిఫికెసన్‌ విలువ 187 187
అన్‍ సపొనిఫియబుల్ పదార్థం 4.5-5.5 1.8-2.5
ఫ్రీకొవ్వుఆమ్లాలు 5-15% 0.15-0.2%
ఒరైజనోల్ 2.0 1.5-1.8
టొకొపెరొల్ 0.15 0.05
కలరు (టింటోమీటరు) 20Y+2.8R 10Y+1.0R

నూనెలో నున్న కొవ్వుఆమ్లాలు[13]

కొవ్వు ఆమ్లం శాతం
పామిటిక్ ఆమ్లం 15.0%
స్టియరిక్ ఆమ్లం 1.9%
ఒలిక్ ఆమ్లం 42.5%
లినొలిక్ ఆమ్లం 39.1%
లినొలెనిక్ ఆమ్లం 1.1%
అరచిడిక్ ఆమ్లం 0.5%
బెహెనిక్ ఆమ్లం 0.2%
తవుడు విశ్లేషణ Typical Analysis
పొడి పదార్థం 90 %
ముడి ప్రొటిన్ 13.0 %
నూనె/కొవ్వు 13.0 %
ముడి పీచు పదార్థం 13.0 %
తటస్థ డిటెర్జెంట్ ఫైబరు 29.7 %
ఆసిడ్ డిటెర్జెంట్ ఫైబరు 16.2 %
కాల్సియం 1.00 %
ఫాస్ఫరస్ 1.54 %
Total Digestible Nutrients 68.0 %
Net energy 70.0 Mcal/100 lbs.

తవుడునూనె ఉపయోగాలు[మార్చు]

  • రిఫైండు నూనెను వంటనూనెగా ఉపయోగించవచ్చును.దీని స్మోక్‌పాయింట్ మిగతా నూనెలకన్న ఎక్కువగా వున్నందున ఈనూనెను డిప్ ఫ్రైయింగ్, రోస్టింగులకు పయోగించ వచ్చును. మార్గరిన్, సలాడుల తయారిలో ఉపయోగిస్తారు. బేకరిలోవాడెదరు[14]
  • తూర్పు ఆసియా దేశాలలో దీన్ని హార్ట్ ఆయిల్ (heart oil) అనిపిలుస్తారు. నూనెలోవున్న ఓరైజనోల్, టొకోపెరొల్సు, హైడెన్సిటి కొలెస్ట్రొలును పెరిగేటట్లు చెయ్యడం వలన, గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్స్తుంది. కాన్సరు వ్యాధిని నిరోధిస్తుంది. దేహవ్యవస్థలో ఇమ్యూన్ వ్యవస్థను చురుకుపరుస్తుంది.[15] చర్మానికి మెరుపునిస్తుంది.కొరియా, జపానుదేశ స్త్రీలు దేహమెరుపుకై, కేశసంరక్షణకై తవుడునూనెనుపయోగిస్తారు.
  • ఎక్కువ F.F.A. వున్న తవుడు నూనెను సబ్బులతయారిలో, కొవ్వుఆమ్లాల ఉత్పత్తిలో వినియోగిస్తారు[16]
  • వనస్పతి తయారిలో వాడెదరు[17]

ఆధారాలు[మార్చు]

  1. "rice". infoplease.com. Retrieved 2015-03-08.
  2. SEA Hand Book.2009
  3. 3.0 3.1 SEA publication ,'Handbook on Rice Bran processing'
  4. "RiceBran Technologies Products". ricebrantech.com. Archived from the original on 2015-02-17. Retrieved 2015-03-08.
  5. "Definition of Triglycerides". medterms.com. Archived from the original on 2014-01-22. Retrieved 2015-03-08.
  6. "FATS & OILS" (PDF). scifun.chem.wisc.edu. Archived from the original (PDF) on 2017-12-15. Retrieved 2015-03-08.
  7. "FREE FATTY ACIDS (FFA)". florin-ag.ch. Archived from the original on 2016-03-08. Retrieved 2015-03-08.
  8. "SOLVENT EXTRACTION". lipidlibrary.aocs.org. Archived from the original on 2013-10-12. Retrieved 2015-03-08.
  9. "hexane". thefreedictionary.com. Retrieved 2015-03-08.
  10. "Images". google.co.in/search?q=rice+bran+pellets&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=8YFmUtz9BcP7rAfA6YH4CQ&ved=0CEoQsAQ&biw=1366&bih=677. Retrieved 2015-03-08.
  11. "Gamma-oryzanol from rice bran oil" (PDF). nopr.niscair.res.in. Retrieved 2015-03-08.
  12. "WHAT IS RICE BRAN OIL?". riceactive.com. Archived from the original on 2018-07-12. Retrieved 2015-03-08.
  13. "Why Rice Bran Oil". ricebranoil.info. Archived from the original on 2015-07-10. Retrieved 2015-03-08.
  14. "Rice Bran Oil". honestfoods.com. Archived from the original on 2013-07-09. Retrieved 2015-03-08.
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-30. Retrieved 2013-10-22.
  16. "Secrets of Rice Bran Oil". susansoaps.com. Retrieved 2015-03-08.
  17. "How our use of Rice Bran oil benefits you". books.google.co.in. Retrieved 2015-03-08.
  • A.E.Bailey's 'fat&oils'