శిశుపాలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. ఈయన తల్లి వసుదేవుని సోదరి శ్రుతదేవి. ఈయన కృష్ణునికి మేనత్త కొడుకు. శిశుపాలునికి కాబోవు భార్య అయిన రుక్మిణిని ఎత్తుకొనిపోయినందుకు కృష్ణునికి శత్రువైనాడు. శిశుపాలుని కృష్ణుడు తన చక్రాయుధంతో వధించాడు.

జన్మ వృత్తాంతం[మార్చు]

దస్త్రం:Birth of Shisupala.jpg
శిశుపాలుని జననం

శిశుపాలుడు దమఘోషుడు, సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. తల్లితండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు " అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామ కృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి " కృష్ణా ! నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు " అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తికాగానే నా చేతిలో హౌతుడౌతాడు " అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు.

కృష్ణుడు విష్ణుచక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించుట

రాజసూయ యాగం శ్రీకృష్ణుడు సభాసదులను చూసి " మేము ప్రాగ్జ్యోతిష పురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు " అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి " నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా ? " అని దూషించాడు .ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు . తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.

మూలాలు[మార్చు]