Jump to content

భాషా శాస్త్రం

వికీపీడియా నుండి
ఇండో-యూరోపియన్ భాషల వర్గీకరణ

భాషా శాస్త్రం అనగా భాష యొక్క పుట్టుకకు మూలమైన ధ్వని అర్ధాలను వివరించేది. శాస్త్రం అను మాటను ఆంగ్లములోని science పదమునకు తుల్యంగా వాడుతున్నాము.

శాస్త్రంని రెండువిధములుగా విభజించవచ్చును.

  1. శుద్ధ శాస్త్రం (pure science)
  2. అనుభూతి లేదా అనుభవాల శాస్త్రం (emphirical science)

ఈ రెండు అంశాల ఆధారంగా

  • ఏ శాస్త్రం అయినా అది నిరూపణలకు లొంగివుండాలి.
  • ఏ శాస్త్రం అయినా అది క్రమపద్ధతిని అనుసరించాల్సి ఉండాలి.

భాషా శాస్త్రం ఏం చేస్తుంది ?

[మార్చు]
  • భాషకు సంబంధించిన విషయాలును చర్చిస్తుంది
  • కాలక్రమములో భాషలో వచ్చే మార్పులును ఇది విపులీకరిస్తుంది
  • సోదర భాషలతో ఉన్న సంబంధాలను తులనాత్మకంగా అధ్యయనం చేస్తుంది
  • భాషలో వ్యక్తం చేయదలుచుకున్న భావాలన్నిటిని వ్యక్తీకరిస్తుంది
  • విజ్ఞాన శాస్త్ర సంబంధ ఇతర విజ్ఞాన విషయాలను అర్థం చేసుకోవడానికి తగిన భాషావనరులను వృద్ధి చేస్తుంది

అంశాలు

[మార్చు]

భాషాశాస్త్రం నాలుగు ప్రధానఅంశాల్ని కలిగి ఉంది అవి :

  1. విషయ సంగ్రహణ -పరిశీలన
  2. విశ్లేషణ
  3. సూత్ర సిద్ధాంతీకరణ
  4. అనువర్తన

భాషా శాస్త్ర శాఖలు

[మార్చు]

భాషాశాస్త్ర శాఖలని ప్రధానంగా నాలుగు విధములుగా విభజించవొచ్చును.అవి

  1. ఏకకాలిక భాషాశాస్త్రం (synchronic study)
  2. ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study)
  3. తులనాత్మక భాషాశాస్త్రం (comparative study 4.చారిత్రక భాషాశాస్త్రం (historical study)
  4. వర్ణనాత్మక భాషాశాస్త్రం (ఏకకాలిక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రంలకి ఉపశాఖగా ఉంటుంది)

ఏకకాలిక భాషాశాస్త్రం (syn chronic study)

[మార్చు]

నిర్ణీత కాలంలో వెలువడే భాషాస్వరూపాన్ని సమగ్రంగా చర్చించే శాస్త్రం ఏకకాలిక భాషాశాస్త్రం(synchronic study) అంటారు.

ఉదాహరణ: నన్నయ్య కాలంలో వెలువడిన రచన యొక్క భాషపై చర్చించేది

ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study)

[మార్చు]

రెండు నిర్ణీత కాలాలమధ్య ఉండే భాషా స్వరూపాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study) అంటారు.దీన్నే చారిత్రక భాషాశాస్త్రం అనికూడా అంటారు.

ఉదాహరణ: నన్నయ్య కాలంలో వెలువడిన రచనల భాష, కందుకూరి, గురజాడల కాలంలో వెలువడిన రచనల భాషలపై చర్చంచేది.

తులనాత్మక భాషాశాస్త్రం (comparative study)

[మార్చు]

ఒకటికన్నా ఎక్కువ భాషల మధ్య (1+1+.....) గల సంబధాలను తులనం చేస్తూ చర్చించే శాస్త్రం తులనాత్మక భాషాశాస్త్రం (comparative study అంటారు.

ఉదాహరణ: సంస్కృత రచనలు తెలుగు, కన్నడం వంటి భాషా రచనల యొక్క భాషపై చర్చించేది

చారిత్రక భాషాశాస్త్రం (historical study)

[మార్చు]

ఒక నిర్ణీత కాలంలో ఉండే భాషలమధ్య తులనాత్మకంగా అధ్యయనం చేసేది .చారిత్రక భాషాశాస్త్రం (historical study) అంటారు లేదా ద్వైకాలిక, తులనాత్మక లక్షణాలను సంతులన పరుస్తూ భాషను అధ్యయనం చేసేది చారిత్రక భాషాశాస్త్రం(historical study) అంటారు. లేదా అనేక కాలాల మధ్యగల అనేక భాషలను తులనం చేస్తూ అధ్యయనాన్ని సమగ్రపరిచేది చారిత్రక భాషాశాస్త్రం(historical study) అంటారు.

వర్ణనాత్మక భాషాశాస్త్రం

[మార్చు]

ఏకకాలిక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రాలకు ఉపశాఖగా ఉంటుంది. భాషాయంత్రాంగములో వివిధ శాఖలను క్రోఢీకరిస్తూ వాటిని సమగ్రంగా సంయమనం చేస్తూ అధ్యయనం చేసే భాషా స్వరూప శాస్త్రాన్ని వర్ణనాత్మక భాషాశాస్త్రం అంటారు. లేదా ఒక రచన గాని, ఒక కవి గాని రాసిన అనేక రచనలుగాని నిర్ణీతకాలములో వెలువడిన అన్ని రచనలను అధ్యయనం చేసేది వర్ణనాత్మక భాషాశాస్త్రం అంటారు.

భాషాశాస్త్రంతో సంబంధం ఉండే ఇతర శాస్త్రాలు-అనువర్తనాలు

[మార్చు]
  1. నిఘంటువులు తయారీకి
  2. భాషాబోధన
  3. పాఠ్యపుస్తకాలు తయారీ
  4. ఇతర సాంఘిక, కళా, మాధ్యమ, రంగాలతో
  5. మానవ వికాసంకు
  6. మనోవిజ్ఞాన శాస్త్రమ్
  7. సంగణక అనువర్తిత శాస్త్రమ్ (కంప్యూటరు-సంగణక శాస్త్రం
  8. గణిత శాస్త్రం

పై భాషాశాస్త్రాలన్నిటిలో అనువర్తిత భాషాదృస్టితో అధ్యయనం చేస్తే అది సంపూర్ణత సిద్ధిస్తుంది.

భాషాశాస్త్రం నిర్వచనాలు

[మార్చు]

1.భాష్యతి ఇతి భాష >ప్రాచీనవేత్తల

2.భాషా వ్యక్తాయం వాచి వ్యక్తంచేయడానికి ఉపయోగించేదే భాష

3.నృశాస్త్రం లేదా మానవ నిర్మితశాస్త్రం నుంచి భాష అనేది అభివృద్ధి చెందినది.

పాశ్చాత్య నిర్వచనాలు

1.Language is purly human and non instinctive method of communicating ideas,emotions and desires by means of voluntirily produced symboles >Edward sappire(language)

2.A language is a system of orbitrarary vocal symbols by means of which a social group co-operater >bloch trager (out lines of linguvistics analysis)

3.the institutoin where by humans communicate and intract with each other by means of habitually used oral-auditory orbitrary symboles >Robert A Hall (Essay on language)

4.from now on i wil consider language to be set in finit of sentence each finit in langht and constucted out of a finite set of sentence >noam chimsky (synthathic structures).

అక్షరం=syllabul

  • అక్షరం అనగా క్షరం లేనిదని ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు వివరించారు.
  • స్వరం, స్వరసహిత వ్యంజనాలను అక్షరాలును పేర్కొన్నరు.
  • స్వరాలు, స్వరసహిత వ్యంజనాలు ఉచ్చరించేటప్పుడు అడ్డంకితోను, అడ్డంకిలేకుండాను వెలువడతాయి.
  • ఇతువంటి నిశ్వాస వాయుమార్గాన్ని తెరలు తెరలుగా లేదా ఉగ్గలు ఉగ్గలుగా వెలువడుతుండటాన్ని మనం గుర్తించగలం.
  • ఇలా నిశ్వాసవాయువులో ఒక ఉగ్గలో వెలువడే ధ్వనులు సముదాయాన్ని అక్షరం అంటారు.

తెలుగు జన్మతః ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని కాల్డ్‌వెల్ శాస్త్రీయంగా నిరూపించి 150 సంవత్సరాలు అయినా, ఇంకా ఇది సంస్కృత జన్యమేనని వాదించే వారు ఈనాటికీ ఉండడం నమ్మలేని విషయం. . చరిత్రకారుడిగా పేరున్న ఒక రచయిత తెలుగు, తమిళాది భాషలు సంస్కృత ప్రాకృత జన్యమైన పైశాచి భాషనుండి పుట్టాయని కొంత కాలంగా చాటింపు వేస్తున్న వారిలో ప్రముఖులు. ఈయనే అస్త్రాలయా ఆస్ట్రేలియా అయ్యిందని, మూడు వేల సంవత్సరాల క్రితమే అర్జునుడు అమెరికా పర్యటించినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ మధ్య ఒక వ్యాసంలో ఆయన తెలుగు అంకెల గురించి రాస్తూ, “ఏక” శబ్దం నుండి “ఒక”, “దొందు” శబ్దం నుండి “రెండు” వచ్చాయని చెప్పి మూల ద్రావిడం మిధ్య అయిపోతుందని మరోమారు తనదైన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో సజాతి పద నిర్ధారణకు, భాషా సంబంధ నిరూపణకు భాషాశాస్త్రం ఉపయోగించే ప్రాథమిక సూత్రాల గురించి ఒక ఔత్సాహిక విద్యార్థిగా నేను తెలుసుకొన్న కొన్ని విషయాలు ముచ్చటించడం ఈ వ్యాసం ఉద్దేశం.

1.భాషా సంబంధ నిరూపణ - తులనాత్మక పద్ధతి

ఏవైనా ఒక రెండు భాషల మధ్య సంబంధం నిరూపించాలంటే, ఆ భాషల్లో ఒకే రకంగా ధ్వనించే సమానార్థకాలైన పదాలని చూపించాలన్నది సామాన్యంగా వినిపించే అభిప్రాయం. ఒకే భాషా కుటుంబానికి చెందిన సోదర భాషల్లో తరచూ ఇటువంటి పదాలు కనిపిస్తాయి కూడా. ఒకవేళ ఉన్నా అవి మాత్రమే సరిపోవు. అదీకాక, చాలాసార్లు పదాలలో పైపైన కనిపించే పోలికలు, భాషలమధ్య లేని సంబంధమేదో ఉన్నట్టు మభ్య పెడుతాయి. ఉదాహరణకు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో దాదాపు ఒకే అర్థం ఉండి ఒకే రకంగా ధ్వనించే ఈ పదాల జంటలను గమనించండి: ఒన్ను one అటక attic నీటు neat కాపు cop పెట్టు put

పైన చూపిన జంట పదాల ఆధారంగా ఇంగ్లీష్ తెలుగు భాషనుండి పుట్టిందని వాదించడం ఎంత హాస్యాస్పదమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

ఆధునిక భాషా శాస్త్ర పరంగా రెండు భాషల మధ్య జన్మసంబంధ (genetic relationship) నిరూపణకు భాషావేత్తలు గత రెండు శతాబ్దాలుగా వాడుతున్న విధానాన్ని “తులనాత్మక పద్ధతి (Comparative Method)” అని అంటారు. ఈ విధానాన్ని వివరించే ముందు ఈ పద్ధతికి ఉపయోగపడే రెండు ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావిస్తాను.

ధ్వని పరిణామం (Sound Change)

కన్నడ భాషతో కొద్దిపాటి పరిచయం ఉన్న తెలుగువారెవరైనా గమనించగలిగే విషయం, తెలుగులో /ప/ అక్షరంతో ప్రారంభమైన చాలా పదాలు కన్నడభాషలో /హ/ అక్షరంగా మారినట్టుగాకనిపించడం.

కన్నడ తెలుగు హాలు పాలు హగలు పగలు హళ్ళి పల్లె హణ్ణు పండు హంది పంది హత్తు పది హావు పాము

కన్నడ తెలుగు హిడి పిడి హువ్వు పువ్వు హుళి పులి హుంజు పుంజు హొట్ట పొట్ట హో- పో- హోరాట పోరాటం

నిజానికి పాత కన్నడ లో (హలెగన్నడలో) ఈ పదాలన్నీ /ప/ అక్షరంతోనే ఉపయోగించేవారని, కాలక్రమేణా /ప/ ధ్వని /హ/ ధ్వనిగా రూపాంతరం చెందిందని మనకు తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి ధ్వని పరిణామం వల్లనే తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల (front vowels) ముందు /క/ శబ్దం /చ/ శబ్దంగా మారింది . ఈ క్రింది తెలుగు కన్నడ పదాలను గమనించండి. తెలుగు కన్నడ చెయ్యి కై చెవి కివి చెడు కెడు చెఱువు కెఱె

ప్రాఙ్నన్నయ యుగ శాసనాలలో 8 వ శతాబ్ది దాకా చేయు ( <*కేయు) అనే క్రియకు రూపాలైన కేచిన (చేసిన), కేసి (చేసి), కేసిరి (చేసిరి) మున్నగునవి క-కారంతోనే ఉండేవి. ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషల్లో కూడా ఈ పదాలు క-కారంతో ఉండటం బట్టి, మూల ద్రావిడ భాషలో ఈ పదాలన్నీ /క/-కారాలుగా ఉండేవని మనం గుర్తించవచ్చు.

ఈ రకమైన ధ్వని పరిణామాలు ప్రపంచంలోని అన్ని భాషలలోనూ, అన్ని కాలాల్లోనూ జరుగుతూ వస్తున్నాయని ఆధునిక భాషావేత్తలు కనుగొనడం భాషా శాస్త్ర పరిశోధనలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ప్రపంచ భాషలలో, ముఖ్యంగా ఇండో-యూరోపియన్ భాషలలోని ధ్వని పరిణామాలను సూత్రీకరించే ధ్వని సూత్రాల నిర్మాణం శాస్త్రజ్ఞులను విస్మయ పరిచే ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది. భాషా సంబంధాల విషయంలో అప్పటిదాకా అంతు చిక్కని సమస్యలనెన్నింటినో పరిష్కరించింది. సజాతి పద (cognate) నిరూపణకు "శబ్ద సామ్యం" ముఖ్యంకాదని ధ్వని సూత్ర శీలమైన "ధ్వని అనుగుణ్యత (Sound Correspondence)" ముఖ్యమని తెలియ జెప్పింది.

ఉదాహరణకు, "దేవ" శబ్ద సంబంధమైన లాటిన్ భాషలోని deus అన్న పదం, అదే అర్థంలో వాడే గ్రీక్ భాషలోని theos అన్న పదం సజాతి పదాలని చాలా కాలంగా నమ్మేవారు. కానీ, సంస్కృత, లాటిన్ భాషలలోని /d/ ధ్వనికి గ్రీక్ భాషలోని /th/ ధ్వనికి ధ్వన్యనుగుణ్యత చూపించలేకపోవటం వల్ల ఈ రెండు పదాలు సజాతి పదాలన్న నమ్మకాన్ని అసత్య వాదంగా (false cognates) నిరూపించగలిగారు. నిజానికి, గ్రీక్ భాషలోని theos, లాటిన్ భాషలోని fes-, festus పదాలు, సజాతి పదాలని ఈ ధ్వన్యనుగుణ్యత సూత్రాల ద్వారా చూపించగలగటం ఈ సిద్ధాంతం యొక్క విజయాన్ని, శాస్త్ర నిబద్ధతను ధ్రువీకరించింది.

అంతేకాక, ఈ సూత్రాల ఆధారంగానే శబ్ద సామ్యం లేని పదాలను కూడా సజాతి పదాలుగా నిరూపణ చెయ్యగలగడం ఈ సిద్ధాంతాల ద్వారా సాధించిన సత్ఫలితాల్లో ప్రధానమైనది. అర్మేనియన్ భాషలోని erku (=రెండు) పదానికి ఇండో-యూరోపియన్ మూల ధాతువైన *dw- (*ద్వ-) కు గల అనుబంధం క్రమబద్ధమైన ధ్వని సూత్రాల ఆధారంగా నిరూపించారు. ఈ ధ్వని సూత్రాల ఆధారంగానే ఇంగ్లీష్ భాషలోని /five/ అన్న పదాన్ని సంస్కృత భాషలోని /పంచ/ అన్న పదానికి సజాతి పదంగా రుజువు చెయ్యవచ్చు.

ఆధునిక వ్యుత్పత్తి శాస్త్రానికి పునాదులు వేసిన వారిలో ఒకరిగా భావించే ఏ. ఎఫ్. పాట్ (A. F. Pott) అనే జర్మన్ భాషావేత్త "మినహాయింపులు లేని ధ్వని పరిణామ సూత్రాలు (Exceptionless Sound Laws)" ఉన్నాయని గాఢంగా నమ్మేవాడు.

2.ప్రాథమిక పదజాలం

రెండు భాషల మధ్య సంబంధం చూపించాలంటే ఆ భాషలలోని ప్రాథమిక పదజాలాల మధ్య సంబంధం చూపించాలి. ప్రాథమిక పదజాలం అంటే ఆ భాషలో అనునిత్యం వాడే మౌలికమైన పదజాలం ఉదా: బంధుత్వాల పేర్లు, శరీర అవయవాల పేర్లు, సర్వనామాల పేర్లు, సంఖ్యావాచకాల పేర్లు, ఋతువులకు, కాలాలకు సంబంధించిన పేర్లు, కాలకృత్యాలకు వాడే పేర్లు మొదలగునవి. ఒక భాష వేరే భాషాకుటుంబంనుండి పదజాలాన్ని ఎంతగా అరువు తెచ్చుకున్నా, ప్రాథమిక విషయాలను వ్యక్తపరచడానికి మాత్రం తన సొంత భాషలోని పదజాలాన్నే ఉపయోగిస్తుంది. కానీ ఒక్కోసారి కొన్ని భాషలలో ప్రాథమిక పదజాలంలో కూడా అన్యభాషా పదాలు కనిపించడం కద్దు. అయితే, ఇలాంటి సందర్భాలలో చాలాసార్లు ఆ ప్రాథమిక పదాలకు సొంత భాషలో పదాలు కూడా ఉండటం గమనిస్తాము. ఉదాహరణకు జపనీస్ భాషలో కనిపించే రెండు రకాలైన సంఖ్యావాచకాలు: ఒకటి చైనీస్ భాషనుండి అరువు తెచ్చుకున్న సంఖ్యావాచకాలైతే, మరొకటి జన్మతః సంక్రమించిన జపనీస్ అంకెలు.

భాషా సంబంధాలను వివరించడానికి ఉపయోగించే ప్రాథమిక పదజాలానికి ఒక ఉదాహరణ Swadesh list. కానీ ఈ ప్రాథమిక పదాల పట్టికను తయారు చేసిన Morris Swadesh దీని ఆధారంగా సోదర భాషల మధ్య కాల వ్యత్యాసాన్ని గణిత సూత్ర సంబంధంగా (glottochronology) కొలవటానికి ఉపయోగించడంతో ఇది వివాదాస్పదంగా మారింది. ప్రాథమిక పదజాలం అన్ని భాషలలోనూ ఒకే గతిలో మార్పు చెందుతుందన్న Swadesh ప్రతిపాదన చాలామంది భాషావేత్తలు ఒప్పుకోరు. అయితే, భాషాసంబంధ నిరూపణకు అవసరమైన ప్రాథమిక పదజాలానికి మాత్రం ఈ పట్టిక ఒక నమూనాగా ఉపయోగపడుతున్నది.

3.ధ్వన్యనుకరణ పదాలు, శైశవ పదాలు

భాషాసంబంధ విషయంగా పదజాలాలను పోల్చిచూసేటప్పుడు, భాషావేత్తలు ధ్వన్యనుకరణ పదాలను, శైశవ పదాలను ప్రాథమిక పదజాలంగా పరిగణించకుండా జాగ్రత్తపడతారు. ధ్వన్యనుకరణ పదాలు ప్రపంచంలోని చాలా భాషలలో ఒకే రకంగా వినిపిస్తాయి. కోడి కూత తెలుగులో కొక్కొరక్కో అయితే, జపనీస్ భాషలో కొక్కెకొక్కో, ఇంగ్లీష్ భాషలో కొక్క-డూడుల్-డు. ఈ పదాల ఆధారంగా తెలుగు, జపనీస్, ఇంగ్లీష్ భాషల మధ్య ఏదో సంబంధం ఉందనడం పసలేని వాదన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలాగే, “అమ్మ” అన్న పదానికి చైనీస్ భాషలో వాడే పదం “మా”, బాస్ఖ్ భాషలో పదం “అమ”, వెస్టిండీస్ లో కోబన్ తెగ వారు మాట్లాడే భాషలో పదం “అమ్మీ”. అంతమాత్రం చేత ఈ భాషలకు తెలుగు భాషకు సంబంధం ఉందని చెప్పలేము. ఈ పదాలలో సామ్యతకు మౌలికమైన వివరణ ఉంది. పసి పిల్లలు మాటలు నేర్చుకునే వయస్సులో కొన్ని రకాల ధ్వనులను మాత్రమే ఉచ్ఛరించగలుగుతారు. పెదవులతో తేలికగా ఉచ్ఛరించగలిగే /ప/, /ఫ/, /బ/, /భ/, /మ/ (ఓష్ఠ్యాలు) శిశువులు మొట్టమొదట పలకగలిగే ధ్వనులు. అచ్చులలో తేలికగా పలికే అచ్చు /అ/. అందుకనే పసిపిల్లలు పలికే మొదటి పదం మనకు “అమ్మ” అనో “మా” అనో వినిపిస్తుంది. ఆ మొట్టమొదటి పదాన్ని తల్లికి ఆపాదించడం సహజం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా మ-కారంతో కూడిన తల్లి పదం. అదే విధంగా అన్ని భాషలలో వేర్వేరు అర్థాలలో కనిపించే పాపా, మామా, బాబా, దాదా, తాతా, నానా అన్న పదాలు. ఈ శైశవ పదాలలో కనిపించే సామ్యతను, సార్వజనీనతను కూలంకషంగా చర్చించి, వివరించిన భాషాశాస్త్రవేత్త జాకబ్‌సస్

4.తులనాత్మక పద్ధతి (Comparative Method)

ఆధునిక భాషా శాస్త్ర పరంగా రెండు భాషల మధ్య జన్మసంబంధం (genetic relationship) నిరూపించాలంటే “ఆ రెండు భాషల ప్రాథమిక పదజాలంలో దాదాపు సమానార్థకాలైన పదాలకు క్రమబద్ధమైన ధ్వనుల అనుగుణ్యత (sound correspondence) చూపగలగాలి.” ఈ రకమైన ధ్వన్యనుగుణ్యత ద్వారా మూల ధాతువులను, తద్వారా ఈ రెండు భాషలకు మాతృక అయిన ఒక మూల భాష (proto-language) ను పునర్నిర్మాణం చేయగలిగితే ఆ భాషలు ఒకే భాషా వృక్షానికి చెందినవని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ సంబంధాన్ని నిరూపించడానికి అవసరమైన ధ్వని పరిణామాల ద్వారా ఆయా భాషల మధ్య సామీప్యత (nearness) ని కూడా అంచనా వేయవచ్చు. ఈ పద్ధతినే తులనాత్మక పద్ధతి అంటారు.

స్థూలంగా తులనాత్మక పద్ధతిలో ప్రధానమైన అంశాలు ఇవి:

1. సజాతి పద సేకరణ 2. ధ్వని పరిణామ సూత్రాల ద్వారా సజాతి పద సమర్థన 3. మూల ధాతువులు, మూల ధ్వనుల ప్రతిపాదన 4. మూల భాష పునర్నిర్మాణం

ఉదాహరణకు సజాతి పదాలుగా అనిపించే ఈ పదాల వరసలను గమనించండి:

ఇండో-యూరోపియన్ భాషలలో కొన్ని సజాతి పదాలు Sanskrit Avestan Greek Latin Gothic English pitar pitar pater pater fadar father pada padam poda pedem fotu foot daśa dasa deka decem taihun ten

మొదటి రెండు పదాల వరుసల ఆధారంగా మూల ఇండో యూరోపియన్ పదాలలో /ప/ ధ్వని ఇంగ్లీష్, గాథిక్ మొదలైన జర్మానిక్ భాషలలో /f/ ధ్వనిగా పరిణమించిందని ఊహించవచ్చు. అట్లాగే చివరి రెండు వరసలు /ద/ ధ్వని జర్మానిక్ భాషలలో/T/ ధ్వనిగా మారిందని చెప్పడానికి వీలు కల్పిస్తాయి. అయితే ఈ కొన్ని ఉదాహరణలతో సరిపెట్టుకోకుండా ఈ ధ్వనుల మధ్య ఆయా భాషలలో క్రమబద్ధమైన అనుగుణ్యత చూపించి భాషాశాస్త్రజ్ఞులు ఈ ధ్వనిపరిణామాన్ని ధ్రువపరిచారు. ఆధునిక పద్ధతులతో భాషాశాస్త్రజ్ఞులు కనిపెట్టిన ధ్వని పరిణామ సూత్రాలలో కొన్నింటిని దాదాపు 2500 సంవత్సరాల క్రితమే పాణిని గ్రంథస్థం చేసాడన్న విషయం ఆశ్చర్యకరమైన విషయమే (ఉదా: Grassmann’s Law) !

అలాగే ఈ క్రింది ఉదాహరణలను గమనించండి: Sanskrit Avestan Greek Latin Gothic English మూల ధాతువు bhratar bratar phrater frater brothar brother *bhrater bharami barami phero fero baira bear *bher

సంస్కృతంలో /భ/ ధ్వని కి, అవెస్తాలో /బ/ ధ్వనికి, గ్రీక్ భాషలోని /ఫ/ ధ్వనికి లాటిన్ భాషలో /f/ ధ్వనికి, ఇంగ్లీష్, గాథిక్ భాషలలో /బ/ ధ్వనికి మాతృకయైన ధ్వని ఒకటి మూల భాషలో ఉండి ఉండాలని ఊహించి, ఆ ధ్వనిని పునర్నిర్మించడం తులనాత్మక పద్ధతిలో తదుపరి మెట్టు. సంస్కృతంలోని వేద వాఙ్మయం, లాటిన్, గ్రీక్ భాషలలో లభ్యమైన ప్రాచీన సాహిత్యం ఈ ధ్వనులు ఎలా రూపాంతరం చెందుతున్నాయో చెప్పడానికి కచ్చితమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి. ఈ క్రింది పదాలలో మూల ధాతు ప్రతిపాదనలను గమనించండి:

Sanskrit Avestan Greek Latin Gothic English మూల ధాతువు

pitar pitar pater pater fadar father *p@-t-er padam padam poda pedem fotu foot *ped bhratar bratar phrater frater brothar brother *bhrater bharami barami phero fero baira bear *bher jivah jivo wiwos qius quick (’living’) *gwei sanah hano henee senex sinista senile *sen virah viro wir wair were (wolf) (’man’) *wiro tri tri tris tres thri three *trei daśa dasa deka decem taihun ten *dekm śatam satem he-katon centum hund (rath) hundred *dkm-tom

ప్రాచీన, ఆధునిక ఇండో-యూరోపియన్ భాషలలో ఇటువంటి సజాతి పదాలను వేలకొలది విశ్లేషించి, వాటి మూల ధాతువులను, మూల ధ్వనులను వివేచించిన భాషావేత్తలు ఇండో-యూరోపియన్ మూల భాషను పునర్నిర్మించగలిగారు. ఇంతేకాక ఐరోపా నుండి భారత ఉపఖండం దాకా విస్తరించిన ఈ మహా భాషా కుటుంబ వృక్షాన్ని శాఖోపశాఖలుగా వర్గీకరించడం ఈ తులనాత్మక పద్ధతి ద్వారానే సాధ్యమయ్యింది.

ఈ తులనాత్మక పద్ధతికి సిద్ధాంత పరంగానూ, ఉపయోగంలోనూ కొన్నిపరిమితులున్నాయి[6]. కానీ గత రెండు శతాబ్దాలుగా ఈ పద్ధతి ప్రపంచ భాషల వర్గీకరణకు, భాషల అంతర్నిర్మాణ పరిశోధనకు భాషాశాస్త్ర వేత్తలకు ఎంతగానో తోడ్పడిన ఏకైక ఉపకరణం. తెలుగు అంకెలు, సంస్కృత సంఖ్యలు

ఇకపోతే ఏక శబ్ద నుండి “ఒక”, దొందు శబ్దం నుండి “రెండు” సంఖ్యావాచకాల ఉత్పత్తి సాధ్యమా అన్న విషయం తులనాత్మక పద్ధతి ద్వారా పరిశీలిద్దాం. భారతీయ ఇండో-ఆర్యన్ భాషలలో మొదటి రెండు సంఖ్యావాచకాలు ఇలా ఉంటాయి[8]:

1. ఏక (సంస్కృతం) ఏక్ (హిందీ) ఏక (పాళీ) ఏకు (సింధీ) ఏక (ఒరియా) హెక్/ఇక్క (పంజాబీ) 2. ద్వ/ద్వౌ (సంస్కృతం) దో (హిందీ) దో బా (సింధీ) దుఇ/బేని (ఒరియా) బే (మరాఠీ)

ఇందులో ఏక శబ్దం అన్ని భాషలలో దాదాపు ఒకే రూపంలో ఉన్నా పంజాబీ భాషలో మాత్రం హెక్/ఇక్కగా మారింది. కానీ, పంజాబీ భాషలో నొక్కి పలికినపుడు ఎ- ధ్వని హె- ధ్వనిగా కానీ, హి- ధ్వనిగా కానీ మారుతుందని ఇతర ఉదాహరణల ద్వారా నిర్మించిన ధ్వని సూత్రాల ద్వారా నిరూపించవచ్చు. అలాగే వ- ధ్వని బ-ధ్వనిగా మారటం ఇండో-ఆర్యన్ భాషలలో సర్వ సాధారణం. ఈ ధ్వని సూత్రాల ద్వారా ద్వ- శబ్దం ద్బ- శబ్దంగా, ఆపైన బ- శబ్దంగా పరిణామం చెందిందని చెప్పవచ్చు. తెలుగు “ఒక” శబ్దం “ఏక” శబ్దం నుండి ఉద్భవించిందని చెప్పాలంటే *ఏ > ఒ ధ్వని పరిణామానికి క్రమబద్ధమైన ధ్వన్యనుగుణ్యత చూపించగలగాలి. అలాగే దొందు శబ్దం రెండు శబ్దంగా రూపాంతరం చెందిందని చెప్పడానికి పదాదిన ద- ధ్వని ర- ధ్వనిగా మారడానికీ, పదాంతంలో ద- ధ్వని డ- ధ్వనిగా పరిణమించడానికి మరిన్ని ఉదాహరణలతో క్రమబద్ధమైన అనుగుణ్యత చూపగలగాలి.

నిజానికి తెలుగులో మొదటి సంఖ్యా వాచక శబ్దం ఒకటి- మిగిలిన ద్రావిడ భాషలవలే *ఒన్, *ఒన్ఱు > *ఒండు, *ఒరు, *ఒక్ అన్న ధాతువులకు దగ్గరిదని నిరూపించడం సులభం. ఒంటి-, ఒంటరి- అన్న ప్రాచీన తెలుగు పదాలు ఇందుకు ఉదాహరణలు. అలాగే రెండు- అన్న శబ్దం *ఇరు-/*ఇరండు ధాతువు నుండి పరిణామం చెందిందని చూపడం తేలిక. ఇరువురు, ఇరువది (ఇరు+పది), ఇమ్మడి (రెండు రెట్లు), ఇరువాగు వంటి ఇరు- సంబంధ శబ్దాలు తెలుగులో కోకొల్లలు.

ఇండో-యూరోపియన్ కుటుంబంలోని వేర్వేరు భాషలలోనూ, ద్రావిడ భాషలలోనూ సంఖ్యా వాచకాలను ఒక్క సారి పరిశీలిస్తే తెలుగు అంకెలకు, సంస్కృత, ప్రాకృత సంఖ్యావాచకాలకు లంకె లేదన్న విషయం సుస్పష్టమవుతుంది.

ఇండో-యూరోపియన్ భాషలలో సంఖ్యా వాచకాలు మూల ధాతువు

Sanskrit Avestan Greek Latin Gothic English

  • oi- eka aēuua oios ūnus ains one
  • duwo / *dwo dva duua duō duo twai two
  • treyes tri θri treis trēs þreis three
  • kwetw- catur čaθware tessares quattuor fidwor four
  • penkwe pañca paṇča pente quinque fimf five
  • sweks / *seks ṣaṣ xšuuaš heks sex saihs six
  • sept@m sapta hapta hepta septem sibun seven
  • októ aṣṭa ašta oktō octō ahtau eight
  • new@n nava nauua ennea novem niun nine
  • dek@mt daśa dasa deka decem taihun ten
  • dkm-tom śatam satem he-katon centum hund (rath) hund-red

ద్రావిడ భాషలలో సంఖ్యా వాచకాలు మూల ధాతువు తమిళం తెలుగు కన్నడ

  • ఒన్/*ఒన్ఱు ఒన్ఱు ఒండు ఒందు
  • ఈర్/*ఇర్ ఇరు/ఇరంటు/రెండు ఇరు/రెండు ఇరు/ఎరడు
  • మూహ్-/*మూ-/*మూన్ఱు- మూన్ఱు మూఁడు మూఱు
  • నాల్- నాల్కు నాలుగు నాల్కు
  • చయ్-మ్- ఐంతు/అంజు ఏను/అయిదు అయిదు
  • చాఱ్- ఆఱు ఆఱు ఆఱు
  • ఏೞು- ఏೞು ఏడు ఏೞು
  • ఎణ్- ఎట్టు ఎణుంబొంది / ఎనిమిది ఎంటు
  • తొల్-/*తొణ్- తొంటు తొమ్మిది ఒంబత్తు
  • ప@-/*పత్తు- పత్తు పది పత్తు
  • నూఱు- నూఱు నూఱు నూఱు

తెలుగు పత్రికలలో భాషావ్యాసాల తీరు

భారత కేంద్ర ప్రభుత్వం తమిళ భాషని ప్రాచీన భాషగా గుర్తించి ఆ భాషకు నూరు కోట్ల రూపాయలు బహూకరించిండంతో తెలుగు భాష ప్రాచీనత గత సంవత్సరంలో ముఖ్య చర్చనీయాంశం అయ్యింది. తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చేయ్యడానికి పలురకాల ప్రతిపాదనలు పత్రికల్లో కనిపించాయి. అయితే ఈ వ్యాసాల్లో తర్కబద్ధమైన వివేచనతో, నిర్దిష్టమైన రుజువులతో శాస్త్రపరీక్షకు నిలువగలిగే విశ్లేషణ చాలా తక్కువనే చెప్పక తప్పదు.

ఉదాహరణకు ఒక రచయిత క్రీ. పూ. 3000 సంవత్సరాల క్రితం బహ్రేన్ లో వెలసిల్లిన తెల్‌మున్ నాగరికత తెలుగు వారిదేనంటూ, “సుస” అనే నగరంలో దొరికిన ‘క్లే టాబ్లెట్స్’లో ఉన్న ఒక ఉత్తరంలోని భాషకు తెలుగు భాషకు సంబంధం అంటగట్టారు. అయితే, ఇందులో తెలుగు పదాలుగా చెప్పుకున్న పదాలు ప్రాచీన తెలుగు శబ్దాలు కావు. అసలైతే ఇందులో తెలుగు పదాలుగా పేర్కొన్న అన్నాయం, సకియం వంటి చాలా పదాలు అర్వాచీనాలైన సంస్కృత తద్భవాలు. మరో రచయిత ఊరు, గుడి, గుడియ అన్న పదాల ఆధారంగా సుమేరులో తెలుగుతేజం వెలిగిందని నిర్ణయించారు. క్రీ. పూ. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండే తెలుగు వారు గోదావరి లోయ గుండా సముద్ర మార్గాన సుమేరు ప్రాంతాలకు వలస వెళ్ళారని తమ పూర్వజులతో వర్తక సంబంధాలు కొనసాగించారని ఈయన పేర్కొన్నారు. కానీ క్రీ. పూ. 1100 నాటి కంటే ముందు దక్షిణ భారత దేశంలో ఏ రకమైన నాగరికత వెలసిల్లినట్టుగా ఆర్కియలాజికల్ ఆధారాలు లేవు. మరో రచయిత కృష్ణుడు అంధక వృష్ణీయంలో పుట్టిన వాడు కాబట్టి తెలుగు జాతివాడేనని అభిప్రాయపడ్డారు. తమిళులు శ్రీలంక నుండి భారతదేశానికి వలస వస్తే, తెలుగు వారు బలూచిస్తాన్ ద్వారా భారత దేశానికి ప్రవేశించారని మరో రచయిత సూచించారు. ఇవేవీ శాస్త్ర పరిశీలనకు నిలువగలిగే వాదాలు కావు. బౌద్ధ జాతక కథలో ప్రస్తావించిన ‘తెలివాహ’ గోదావరి నదేనని రాసిన వ్యాసంలో మాత్రం కొంత భాషాశాస్త్ర బద్ధమైన విశ్లేషణ కనిపిస్తుంది.

తెలుగు, ఆంధ్ర శబ్దాలను తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వేర్వేరు భాషలుగా చిత్రిస్తూ ఈ మధ్య వచ్చిన వ్యాసాలు కూడా ఈ కోవకు చెందినవే. “తెలుగు”, “ఆంధ్ర” శబ్దాల వ్యుత్పత్తి గురించి, వాటిని భాషా పరంగా, జాతి పరంగా, ప్రాంత పరంగా పూర్వ వాఙ్మయంలో వాడిన దృష్టాంతాల గురించి భాషాశాస్త్రవేత్తలు [గంటి] [భద్రిరాజు] చేసిన విశ్లేషణకు మించి, ఈ వ్యాసాల్లో శాస్త్ర విమర్శకు నిలువగలిగే వివరాలేవీ నాకు కనబడలేదు. జన్యుశాస్త్ర పరంగా తెలంగాణా ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు భిన్న జాతికి చెందినవారని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. తెలంగాణా తెలుగు, కోస్తాంధ్రా తెలుగు భాషల వ్యుత్వత్తి వేరని నిరూపించాలంటే, తులనాత్మక పద్ధతిద్వారా ఈ భాషల ప్రాథమిక పదజాలంలో క్రమబద్ధమైన అనుగుణ్యత లేదని రుజువు చెయ్యగలగాలి. భాషాశాస్త్ర సిద్ధాంత దృష్టితో చూస్తే ఈ రెండు “భాషలు” ఒకే భాషకు చెందిన రెండు మాండలికాలుగానే తప్ప మరేరకమైన వాదన చేయడానికి వీలు లేదని తెలిసిపోతుంది. తెలంగాణా భాషకు లంబాడి, సవర భాషలకు సంబంధం ఉండవచ్చునేమోనని మరో రచయిత సందేహం వెలిబుచ్చారు. లంబాడీ భాష రాజస్థానీ ఉపశాఖకు చెందిన ఇండో-ఆర్యన్ భాష. సవర భాష ముండా ఉప శాఖకు చెందిన ఆస్ట్రో-ఏసియాటిక్ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు భాషపై ఈ రెండు భాషల ప్రభావం చాలా తక్కువేనని చెప్పకోవచ్చు.

వచ్చిన చిక్కేమిటంటే భాషా చరిత్రలపై ఈ వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు. సాహిత్యం ఒక కళ అయితే భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం. సాహిత్య సృష్టికి కల్పనా శక్తి చాలా అవసరం. విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు తార్కిక వివేచన, విశ్లేషణ ( (Logical Reasoning and Analytical Skills) అత్యంత ప్రధానమైన అంశాలు. మౌలిక పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏవో కొన్ని వాస్తవాంశాలకు తమ కల్పనా శక్తిని జోడించి తమ దృక్పథాల ప్రకారం, ఏవో తాత్కాలిక ప్రయోజనాలకోసం, చరిత్రలు రాయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. ఉప సంహారం

కనీసం మూడువేల సంవత్సరాలుగా భారత ఉపఖండం బహు భాషా కుటుంబ ప్రదేశం (Linguistic Area) గా విలసిల్లింది. ఇండో-ఆర్యన్ భాషలు, ద్రావిడ భాషలు, ముండా భాషలు, టిబెట్టో-బర్మీస్ భాషలు సహజీవనం చేసిన భారతదేశపు పూర్వ చరిత్ర సంక్లిష్టమైనది. సింధూలోయ నాగరికత లోని ప్రజలు ఏ భాష మాట్లాడి ఉంటారన్నది ఇప్పటికీ పరిశోధకులకు అంతుచిక్కని అంశం. ఆర్య భాషలపై ద్రావిడ భాషల ప్రభావం ఇప్పటికీ వివాదాస్పదమైన విషయమే[8][10][11]. క్లిష్టమైన ఈ పూర్వ చరిత్ర పునర్నిర్మాణానికి మౌలికమైన పరిశోధనలు చాలా అవసరం. చారిత్రక, భాషాత్మక ఆధారాలతో ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, జియాలజీ, జెనెటిక్స్ మొదలైన విజ్ఞాన శాస్త్ర ఆధారాలను అనుసంధానం చేయగలిగే పరిశోధనలు మాత్రమే ఈ చిక్కుముడులు విప్పగలవు.

పాశ్చాత్య చరిత్రకారులు తమ స్వార్థం కోసం తిమ్మిని బమ్మిని చేసి తప్పుడు చరిత్ర బనాయించారని ఒక విమర్శ వినిపిస్తూఉంది. సామ్రాజ్యవాద దృక్పథం వల్లనో, శ్వేతజాతి అహంకారం వల్లనో, భారతీయులను చరిత్రహీనులుగా ప్రచారం చేసే ఉద్దేశంతోనో పాశ్చాత్య విద్వాంసులు భారతీయ చరిత్రకు న్యాయం చెయ్యలేదని, చెయ్యలేరని వీరి వాదన. అసలైన భారతీయ ఆత్మను ఆవిష్కరించే సమగ్ర యత్నం భారతదేశం నుండే రావాలని వీరి నమ్మకం. అయితే సర్ విలియం జోన్స్, కాల్డ్‌వెల్ ల నుండి బరో, ఎమెనోల వరకూ భారతీయ భాషలపై అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారు పాశ్చాత్యులే. తొలితరం పాశ్చాత్య చరిత్రకారులు చేసిన సిద్ధాంతాలలో కొన్ని లోపాలను ఈ తరం పరిశోధకులు కనిపెట్టి ఉంటే ఉండవచ్చు - ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని. కానీ తొలితరం పాశ్చాత్య విద్వాంసులు అవిశ్రాంతంగా పనిచేసి సేకరించిన ఆధారాలు, శాస్త్ర బద్ధంగా చేసిన పరిశోధనలు ఇప్పటికీ అనుసరణీయాలే. భారతీయ భాషలకు చేసిన మహత్తరమైన సేవలకి వారు ఎప్పటికీ చిరస్మరణీయులే.

అయితే మన గత చరిత్ర గురించి మనమే ఆసక్తి, అభిమానం చూపడంలోనూ, అధ్యయనం చెయ్యాలనుకోవడంలోనూ తప్పేమీలేదు. అంతేకాక భారతదేశంలో శాస్త్ర పరిశోధనకు అవసరమైన ప్రతిభకు కొరతలేదు. కానీ ఈ పరిశోధనలకు కావాల్సిన మౌలికమైన శిక్షణ, వనరులు (training and infrastructure) మన దేశంలో అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా శాస్త్రపరిశోధనలు భారతదేశంలో జరగాలంటే భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఉత్తమ స్థాయి పరిశోధనకు అవసరమైన వనరుల్ని, వసతుల్ని ఏర్పాటుచెయ్యగలగాలి. పరిశోధనకు కావల్సిన అన్వేషణా ప్రవృత్తిని, జిజ్ఞాసను ప్రేరేపించే వాతావరణం యూనివెర్సిటీలలో నెలకొల్పగలగాలి. భారతీయ భాషా పరిశోధనలకు, భారత చరిత్ర రచనలకు ఈ యూనివెర్సిటీలు కేంద్రాలు కావాలి. ఆధునిక భాషా శాస్త్రాలకు భిక్ష పెట్టిన పాణిన్యాదులు మన భాషాపరిశోధకులకు స్ఫూర్తి కావాలి. మన మధ్యే నివసిస్తున్న ప్రపంచ ఖ్యాతి చెందిన భద్రిరాజు కృష్ణమూర్తి వంటి భాషావేత్తల మేధాశక్తిని, విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ మహత్తర బాధ్యతను మన యూనివెర్సిటీలు నిర్వర్తించనంత కాలం భారతీయ భాషా, చరిత్ర, సంస్కృతుల గురించి పాశ్చాత్య పరిశోధకుల రచనలే శిరోధార్యం కాక తప్పవు. ఉపయుక్త గ్రంథాలు

Principles of Historical Linguistics, Hans Hock [1991]

Historical Linguistics: An Introduction, Lyle Campbell [2004]

Dravidian Languages, Bhadriraju Krishnamurti [2003]

ఆంధ్ర భాషా వికాసము, గంటి సోమయాజి [1947]

Why “mama” and “Papa”? Roman Jakobson [1959]

On the limits of Comparative Method, S. P. Harrison in “The Handbook of Historical Linguistics: Brian D. Joseph, Richard D. Janda” [2003

Language, Culture, and Society: key topics in linguistic anthropology, Christine Jourdan, Kevin Tuite [2006]

The Indo-Aryan Languages Colin P. Masica [1991]


indo-European Numerals, Jadranka Gvozdanović [1992]


Linguistic Archaeology Of South Asia, Franklin C. Southworth [2005]


The Munda Languages, Norman H. Zide (Editor), Gregory D. S. Anderson (Editor) [2006]