Jump to content

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
(మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
జననంమధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
(1920-03-05)1920 మార్చి 5
India ఐలెండు పోలవరం గ్రామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1992 నవంబరు 7
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిసాహిత్యసమ్రాట్, ఆంధ్రకల్హణ
మతంహిందూ
తండ్రిసత్యనారాయణమూర్తి
తల్లిలచ్చమ్మ

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (మార్చి 5, 1920 - నవంబర్ 7, 1992) తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు.ఇతడు సిధ్ధార్థి నామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాటికి సరి అయిన 1920, మార్చి 5వ తేదీన తన మాతామహుడైన ఆకొండి రామ్మూర్తిశాస్త్రి ఇంట్లో ఐలెండు పోలవరం గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి లచ్చమ్మ, తండ్రి సత్యన్నారాయణమూర్తి. ఇతని బాల్యం పల్లిపాలెం గ్రామంలో గడిచింది. మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రి, ఓలేటి వెంకటరామశాస్త్రిల వద్ద కావ్య, వ్యాకరణాలు చదివాడు. ఆంధ్ర భాషమీద ఉన్న అపారమైన ఆభిమానంతో 1939లో ఆంధ్రి అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక ఆనాటి పండితుల, పరిశోధకుల అభిమానం చూరగొంది. ఈ పత్రిక సాహిత్య మాసపత్రికలలో మేల్తరమైనది, అందలి ప్రతి వ్యాసానికి, కవితలకు శాస్త్రి పుటకు దిగువ పాద గమనికలు వ్రాసేవాడు. ఈ పాద గమనికలలో వ్యాసంకాని, కవిత కాని బాగుగా ఉంటే వానిని శ్లాఘించే వాడు, లేకపోతే ఎంతటి మహాకవి రచయైన శాస్త్రి విమర్శకు లోనుకావలసిందే.ఇందులో ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైన పండితులు, కవులు, రచయితలనేకుల రచనలు ముద్రింపబడ్డాయి. ఈ పత్రిక 1941 నవంబర్ వరకు నడిచింది. ఈయన 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1940-44ల మధ్యకాలంలో 'సూర్యరాయాంధ్ర నిఘంటువు' నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1947లో ఆయన నివాసం రాజమండ్రికి మార్చి వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 1974 వరకు అ పాఠశాలలోనే పనిచేసి పదవీవిరమణ చేశాడు. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగాను ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆంధ్ర పురాణము, ఆంధ్ర రచయితలు ఆయన రాసిన ఇతర ప్రముఖ రచనలు.

ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్త్రి ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల సౌందరనందము, దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహచరిత్ర, శతావధాని గడియారం వేంకట శేషశాస్త్రి శ్రీ శివభారతము, తుమ్మల సీతారామమూర్తి బాపూజీ ఆత్మకథ అనేవి. శాస్త్రి రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం.

ఆంధ్ర రచయితలు శాస్త్రి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్త్రి కుమారులు మధునామూర్తి సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాడు.

చరిత్ర ధన్యులు చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం.

ఇందులో శాస్త్రి శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.[1]

చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది. శాస్త్రి రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్త్రి పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక వ్రాస్తూ శాస్త్రి మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదహరించాడు.

తే॥ నొడువ జాలని యిడుమల గుడిచి బడలి
చిక్కి జీర్ణించి నిజదేశ సేవ చేసి
తుదకు స్మరణీయులైన యాంధ్రుల దలంప
గాజు కన్నైన నొక యశ్రుకణము రాల్చు’’

శాస్త్రి నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు మొదలైన సాహిత్య శాఖలలో రచనలు సాగించారు. బోధి వృక్షము - బుద్ధుని చరిత్ర ఇతివృతంగా వ్రాయబడిన నవల. కళ్యాణతార మరియొక నవల. ఇందు శ్రీకృష్ణదేవరాలు కొండపల్లి ముట్టడిని గూర్చిన ఇతివృత్తమున్నది. శాస్త్రి పతంజలి చరిత్ర, ధన్వంతరి చరిత్ర, షడ్దర్శన సంగ్రహం వారి రచనలో నొకటి.

ఇతర లింకులు

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. సత్యనారాయణ, మధునాపంతుల. చరిత్ర ధన్యులు.