రామసుబ్బరాయ కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాజపేయయాజుల రామసుబ్బరాయ కవి
రాసురాట్కవి
జననం (1895-10-10) 1895 అక్టోబరు 10 (వయసు 129)
మరణం1982 జూన్ 18(1982-06-18) (వయసు 86)
జాతీయతభారతీయుడు
వృత్తిఆస్థాన కవి
ఉద్యోగంజటప్రోలు సంస్థానం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి
గుర్తించదగిన సేవలు
ప్రసన్న భారతము
పురస్కారాలుకవివీర,
కవిరత్న,
సాహిత్యస్థాపక,
కవిజనారాధ్య,
ఆర్షవిద్యావిభూషణ

రామసుబ్బరాయ కవి కలకత్తాలో స్నేహలతా కవితా సంఘం స్థాపించి 200కు పైగా పుస్తకాలను ప్రచురించిన వ్యక్తి.

జీవిత విశేషాలు

[మార్చు]

వాజపేయాజుల రామసుబ్బరాయ కవి 1895 అక్టోబర్ 10న పశ్చిమ గోదావరి జిల్లా, పేకేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం హైస్కూలులో స్కూల్ ఫైనల్ పూర్తి చేశాడు. తరువాత కలకత్తాలో డిగ్రీని, రాజమండ్రిలో బి.ఇడి. పూర్తి చేశాడు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఇతని గురువు. ఇతడు కలకత్తాలోని కివేట్ చంద్ర ఇన్‌స్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేశాడు. ఇతడు మెట్రిక్యులేషన్ విద్యార్థులకు ఇంగ్లీషుతో పాటు పాళీ భాషను నేర్పించాడు. చిలుకూరి నారాయణరావుకు ఇతడు పాళీభాషను నేర్పాడు. తరువాత తేలప్రోలు జమీందారు రాజా శోభనాద్రి అప్పారావు కుమారుడు రాజా విజయ అప్పారావుకు చదువు చెప్పేందుకు ఆ సంస్థానంలో కొలువుకు కుదిరాడు. అక్కడ ఇతనికి జటప్రోలు రాజు సురభి వెంకటలక్ష్మణరావుతో పరిచయం అయ్యింది. జటప్రోలు రాజు ఆహ్వానంపై జటప్రోలు ఆస్థాన కవిగా నియమించబడ్డాడు. జటప్రోలు ఆస్థాన కవిగా ఉంటూనే కొల్లాపూర్ హైస్కూలులో ఆంధ్రోపాధ్యాయుడిగా 32 సంవత్సరాలు పనిచేశాడు.[1]

సాహిత్యసేవ

[మార్చు]

ఇతనికి చిన్నతనం నుండే కవిత్వం వ్రాయడం అబ్బింది. కలకత్తాలో చదువుకునే రోజుల్లో స్నేహలతా కవితా సంఘం స్థాపించాడు. ఒక తెలుగువాడు ఆంధ్రేతర ప్రాంతంలో ఒక కవితా సంఘాన్ని ప్రారంభించి సాహిత్యసేవ చేయడం విశేషం. ఇతడు కవులను, కవయిత్రులను ప్రోత్సహిస్తూ స్నేహలతా కవితా సంఘం ద్వారా 200కు పైగా పుస్తకాలను ప్రచురించాడు. ఇతడు స్వయంగా నూటయాభైకి పైగా రచనలు చేశాడు. ఇతడు 1931లో రెడ్‌లెటర్స్ అనే లిఖిత పత్రికను ప్రారంభించి అందులో పద్యరూప లేఖలను నిరంతరాయంగా ప్రకటించాడు. ఈ లేఖలలో ఇతడు ఆశీర్వదిస్తూ వ్రాసిన లేఖలు, అభినందిస్తూ వ్రాసిన లేఖలు, స్నేహపూర్వక లేఖలు, తత్వజ్ఞానంతో కూడిన లేఖలు అనేకం ఉన్నాయి. ఇతడు శతకాలు, తారావళి, అష్టకాలు వంటి ప్రక్రియలలో నూత్న ఒరవడి సృష్టించాడు. ఇతను వ్రాసిన గ్రంథాలలో పేరెన్నిక గన్నది ప్రసన్నభారతం. ఈ కావ్యం జ్ఞానపీఠ పురస్కారానికి పరిశీలింపబడింది[1].

రచనలు

[మార్చు]

ఇతని రచనలలో కొన్ని

  • ప్రసన్నభారతం
  • శ్రీ రాజా వేంకటకృష్ణారావు బహద్దరు వారి జీవితము[2]
  • సీతాకల్యాణము (వేంకటనారాయణ కవితో కలిసి)
  • కాశీయాత్ర (వేంకటనారాయణ కవితో కలిసి)
  • సురభిలక్ష్మి
  • దేవిప్రసన్నం
  • లక్ష్మీశతకం
  • ఆరోగ్య వేంకటేశ్వర శతకం
  • రామకోటేశ్వర తారావళి
  • మదనగోపాలాష్టకం

సన్మానాలు, బిరుదులు

[మార్చు]

సాహిత్యాన్ని జీవితంగా మలుచుకున్న రామసుబ్బరాయకవి కొల్లాపూర్ సంస్థానంతో పాటు, వనపర్తి, గద్వాల, ఆత్మకూర్, జడ్చర్ల, గోపాల్‌పేట, మహబూబ్‌నగర్, కొవ్వూరు, తాడేపల్లిగూడెం మొదలైన ప్రాంతాలలో ఘన సన్మానాలను అందుకున్నాడు. 1954, 1964, 1968లలో బొంబాయి ఆంధ్రమహాసభ ఇతడిని సత్కరించింది. 1964లో కలకత్తా ఆంధ్రా అసోసియేషన్ పక్షాన బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతడిని సన్మానించాడు. ఇతనికి కవివీర, కవిరత్న, సాహిత్యస్థాపక, కవిజనారాధ్య, ఆర్షవిద్యావిభూషణ మొదలైన బిరుదులు వరించాయి[1].

మరణం

[మార్చు]

రాసురాట్కవిగా సాహిత్యలోకంలో పేరుగాంచిన వాజపేయయాజుల రామసుబ్బరాయ కవి 1982, జూన్ 18న మరణించాడు[1].

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 నియోగి (1 September 2019). అక్షర నక్షత్రాలు (1 ed.). విజయనగరం: భారతీ తీర్థ ప్రచురణ. pp. 57–60.
  2. రామసుబ్బరాయ కవి. "శ్రీ రాజా వేంకటసుబ్బారావు గారి జీవితము". ఇంటర్నెట్ ఆర్కైవ్. Retrieved 4 February 2020.