Jump to content

వీర గున్నమ్మ

వికీపీడియా నుండి
సాసుమాన గున్నమ్మ వీరనారి - వీర గున్నమ్మ

వీర నారి గున్నమ్మ - బ్రిటిష్ ముష్కరుల చర్యలను ఓ సామాన్య మహిళ ఎదిరించినది. ధైర్యముగా ముందుకు కదిలింది. ఆంగ్లేయులతో పోరుకు సై అన్నది. కదనరంగంలో వారి తూటాలకు బలై వీర గున్నమ్మగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలింది జిల్లాలో తొలి ఉద్యమ గ్రామం గుడరి రాజమణీపురము రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని కప్పం (పన్ను) కింద ఆంగ్లేయులు వసూలు చేయడాన్ని గ్రామప్రజలు మొట్టమొదటగా ఎదుర్కొన్నారు. అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు బ్రిటిష్ పోలీసులు అడ్డుకునేవారు. అది అటు పోలీసులకు, ఇటు రైతులకు మధ్య పోరాటానికి దారితీసింది. 1940 ఏప్రిల్ 01న రాజపురం పొలిమేరల్లో బ్రిటిష్ పోలీసులకు, రైతులకు పోరాటము జరిగింది. యుక్త వయసులో ఉన్న సాసుమాన గున్నమ్మ వీరనారిగా కదం తొక్కుతూ ముందుకు ఉరికింది. ఆమె పై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. తూటాలకు గురై నిండు చూలాలు గున్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె స్మారకార్ధం ఆమె నివాస గ్రామం శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలోని మందస గ్రామాన్ని వీరగున్నమ్మపురంగా పిలుస్తారు. ఆ గ్రామానికి వెళ్ళే ముఖద్వారంలో ఆమె పేరున సింహద్వారాన్ని ఏర్పాటు చేసారు. మృతిచెందిన చోట జ్ఞాపకార్ధం మసీదు నిర్మించారు. దీన్ని అప్పటి గవర్నర్ కుముద్ బెన్‌జోషి ప్రారంభించింది.[1]

గున్నమ్మ 71వ వర్ధంతి

[మార్చు]

జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో రక్తబలిదానం చేసిన వీర వనిత గున్నమ్మ ఉద్దానం అడపడుచు. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపంగా నిలిచిన వీరనారి సాసుమాను గున్నమ్మ. గున్నమ్మ 71వ వర్ధంతిని మండలంలో గురువారం నిర్వహించనున్నారు. వీరనారిగా చరిత్రలో స్ధానం పొందిన గున్నమ్మ గుడారి రాజమణిపురం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించింది. రెక్కాడితేగానీ డొక్కాడని దుర్భర జీవితంలో గున్నమ్మ పెరిగింది. నిండు గర్భవతిగా ఉన్న సమయంలో యుక్త వయసులోనే భర్త మాధవయ్యను భౌతికంగా కోల్పోయింది. అయినా గుండె నిబ్బరంతో జీవితాన్ని నెట్టుకొచ్చింది. చేదు అనుభవనాలు, జీవిత సవాళ్లను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. 1940 మార్చి 27,28లలో పలాసలో పెద్దఎత్తున నిర్వహించిన అఖిల భారత రైతు మహాసభలు జమీందారీ వ్యతిరేక ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. ఈ మహాసభ స్ఫూర్తితో నూతన ఉత్తేజాన్ని పొందుతూ 1940 మార్చి 29న ఎన్‌ జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్‌ గౌతు లచ్చన్న, గానుగుల తరణిచారి, బెందాళం గవరయ్య, సర్దార్‌ మార్పు పద్మనాభం నాయకత్వంలో మందస ప్రాంతంలో ఉన్న గుడారి రాజమణిపురం మందస సంస్థానం కిసాన్‌ సభను రైతులు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు, మహిళలు హాజరైన సభలో రైతు నాయకుడు మార్పు పద్మనాభం ఉద్వేగభరితంగా ఉపన్యసించారు. ఈ సభలో క్రియాశీలకంగా పాల్గొన్న గున్నమ్మ కూడా ప్రసంగించి రైతులను ఉత్తేజితులను చేసింది. ఈ సభ ఒక సాధారణ స్త్రీని వీరనారిగా తీర్చిదిద్దింది. మందస కొండల్లోని రుక్కమెట్ట అదుపు అడవికి వెళ్లి వంద ఎడ్ల బళ్లపై కలపను తీసుకురావడానికి రైతులు సిద్ధపడాలని గున్నమ్మ పిలుపునిచ్చింది. అడవిపై జమీందారులు విధించిన ఆంక్షలను చేధిస్తూ గున్నమ్మ నాయకత్వాన రైతులు కదిలి అడవిలో కలపను నరికి బళ్లపై ఎక్కించారు. విషయం తెలుసుకున్న మందస జమీందారు జగన్నాధ రాజమణి బెంబేలెత్తిపోయాడు. రైతులు తిరుగుబాటును అణచివేయాలని దివాను రామకృష్ణదేవ్‌ను, ఫారెస్ట్‌ రేంజర్‌ కృష్ణచంద్రరాజుకు హుకుం జారీ చేశాడు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను, వారి ఎడ్ల బళ్లను ఆపేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్‌, ఎస్‌ఐకి, మెజిస్ట్రేట్‌లకు సమాచారం పంపించారు. అడవి నుంచి కలప తరలించడానికి వీల్లేదని ఫారెస్టర్‌ హుకుం జారీ చేసినా గున్నమ్మ నాయకత్వంలో రైతులు కలపను తీసుకుపోయారు. అనంతరం పూలదండలతో, పసుపు కుంకుమలతో ప్రజలు గున్నమ్మ నుదుట వీరతిలకం దిద్దారు. 1940 మార్చి 30న రాత్రి రాజమణిపురంలో అభినంద సభ ఏర్పాటుచేసి గున్నమ్మ ధైర్యసాహసాలను కిసాన్‌ నాయకులు ప్రశంసించారు.

అణచివేతకు పోలీసుల విఫలయత్నం

[మార్చు]

కలపను ఎడ్ల బళ్లపై తీసుకెళ్లడాన్ని ఇన్‌స్పెక్టర్‌ గోపి సుందర గంతాయత్‌ సహించలేక సోంపేట మెజిస్ట్రేట్‌ మద్దతుతో ఏప్రిల్‌ 1న పది మంది కానిస్టేబుళ్లను వెంట తీసుకొనివెళ్లాడు. ఉత్తరాన పొలంలో గుమిగూడివున్న ప్రజల్లోకి వెళ్లి కలపను స్వాధీనపర్చాలని గద్దించాడు. రైతుల ముఖాల్లోని ఉద్రిక్తత, వీరావేశం చూసి తోకముడిచి ఇంటిదారి పట్టాడు.

ప్రత్యక్ష పోరాటంలో వీర మరణం

[మార్చు]

ఈ పరిస్థితిని తెలుసుకున్న జమీందారు ఆందోళనతో అల్లాడిపోయాడు. జిల్లా ఎస్‌పి, సబ్‌కలెక్టర్‌, పోలీస్‌ సర్కిల్‌, సోంపేట మెజిస్ట్రేట్‌ తమ బలగాలతో వచ్చి రైఫిళ్లు, తుపాకులు చూపుతూ జనంలోకి ప్రవేశించారు. కదిలితే కాల్చివేస్తామని బెదిరించడంతో ఈటెలు, బల్లాలతో రైతులు యుద్ధానికి సిద్ధమయ్యారు. గూడెన నరసింహులు, గొర్లే దాలిబందు, గొర్లే జంగాలు, నెయ్యిల మంగళ, గొర్లే చంద్రయ్య, గొర్లే కర్రెన్నల చేతులకు బేడీలు వేసి పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు. పోలీసు శకటం కదలకుండా దానికి అడ్డంగా రైతులు పడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన గున్నమ్మ బేడీలు వేసి చెరలో పెట్టడానికి మీకెన్ని గుండెలురా అని గర్జించింది. శకటానికి అడ్డంగా నిలిచింది. గున్నమ్మ గుండెకు తుపాకులు గురిపెట్టి పక్కకు తప్పుకోవాలని పోలీసులు ఉన్నతాధికారులు హెచ్చరించినా గున్నమ్మ తప్పుకోలేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ నా రైతులను బందీలుగా పోనివ్వనంటూ మరలా గర్జించడంతో ఓ పోలీసు ఆఫీసర్‌ రివాల్వర్‌ పైకెత్తాడు. గున్నమ్మలో ఏ మాత్రం చలనం లేకపోవడంతో పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఒకవైపు మొండికేసిన ప్రజలు, మరోవైపు జమీందారు హుకుంతో రెచ్చిపోయిన పోలీసు అధికారులతో ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారింది. కేకలు, అరుపులు, తుపాకీ శబ్ధాలు మిన్నుముట్టాయి. గున్నమ్మ పొట్టలోంచి తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి. 1940 ఏప్రిల్‌ 1న సాయంత్రం 6.30 గంటలకు గున్నమ్మ వీరమరణం పొందింది. గున్నమ్మతోపాటు గుండ బుదియాదు, గొర్లే జగ్గయ్య, కర్రి కళియాడు, గుంట చిననారాయణ పోలీసుల కాల్పుల్లో మృతిచెంది జిల్లా రైతాంగ ఉద్యమాల చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందారు.

గున్నమ్మ అమరత్వాన్ని చాటిచెబుతూ గుడారి రాజమణిపురం నేడు గున్నమ్మనగర్‌గా మారింది. 1988 సెప్టెంబరు 10న గున్నమ్మ పేరిట స్థూపాన్నిప్రభుత్వం నిర్మించింది. స్థూపాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి ఆవిష్కరించారు. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపంగా గున్నమ్మ చరితార్ధమైంది.

మూలాలు

[మార్చు]
  1. "వీర గున్నమ్మ".{{cite web}}: CS1 maint: url-status (link)