Jump to content

సోమంచి వాసుదేవరావు

వికీపీడియా నుండి

సోమంచి వాసుదేవరావు (16 నవంబర్ 1902 - 27 సెప్టెంబర్ 1965) ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నకు చెందిన కవి.

తల్లిదండ్రులు

[మార్చు]

సోమంచి కోదండరామయ్య, సూరమ్మ దంపతులకు సనాతన వైదీక బ్రాహ్మణ కుటుంబంలో వాసుదేవరావు జన్మించారు. కోదండరామయ్య వేద విద్యా పండితులు, సూరమ్మ గృహిణి. కోదండరామయ్యకు భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి (వరహావెంకటగిరి) సమీప బంధువు. మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి కుటుంబంతో ఉండే బంధుత్వం వలన వాసుదేవరావు ఆయన వివాహానికి కూడా హాజరయ్యారు.

కుటుంబవిశేషాలు

[మార్చు]

కోదండరామయ్య సూరమ్మ దంపతులకు ఐదుగురి సంతానంలో మొదటివాడు వెంకటనారాయణ తరువాత సోమంచి వాసుదేవరావు రెండవవాడు. తరువాత ముగ్గురు సోదరులు శివరామమూర్తి, నరసింహమూర్తి, కృష్ణమూర్తి, ఒక సోదరి పార్వతి.

జన్మస్థలం, విద్యాభ్యాసం

[మార్చు]

కోదండరామయ్య ప్రస్తుత శ్రీకాకుళం నగరం సమీప ంలో గల రాగోలు పంచాయతీకి చెందిన గ్రామం రాయపాడుకు చెందినవారు. తరువాత కాలంలో కోదండరామయ్య శ్రీకాకుళంలో కానుకుర్తివారివీధికి నివాసం మారారు. సోమంచి వాసుదేవరావు బాల్యం, యవ్వనం మిగిలిన జీవితమంతా అక్కడే గడిచింది. చిన్నతనంనుండి తండ్రి దగ్గర శిష్యరికంలో వేద విద్యలు నేర్చుకున్న వాసుదేవరావు, విద్యాభ్యాసము శ్రీకాకుళం పట్టణం లోనే జరిగింది. మునిసిపల్ పాఠశాల (ప్రస్తుత ఎన్టీఆర్ హై స్కూల్) లో ఎస్సెస్సెల్సీ  ( పదవతరగతి ) వరకు చదివారు. తరువాత పీయూసీ   ( ప్రీ యూనివర్సిటీ కోర్స్ - ఇంటర్మీడియట్ ) వరకు చదివారు.

వివాహం, సంతానం

[మార్చు]
Signature of Somanchi Vasudeva Rao

సోమంచి వాసుదేవరావు కు శ్రీకాకుళం జిల్లాలోని మురపాక సమీప గ్రామమైన చెల్లాయమ్మ అగ్రహారంనికి చెందిన పుల్లెల వారి కుటుంబానికి చెందిన అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వేంకటరమణ మూర్తి, శ్రీ వేంకటేశ్వరులు.

సాహిత్య కృషి, రచనా వ్యాసంగం

[మార్చు]

సంస్కృతం, ఆంగ్లం బాగా నేర్చుకున్న వాసుదేవరావు పలు పత్రికలకు రచనలు చేయడంతో పాటు, స్వాత్రంత్ర్య ఉద్యమానికి సంబంధించి తన అభిప్రాయాలను లేఖల రూపంలో వ్రాసేవారు. తన ఇరవయివఏట 1922 లో గుమస్తాగా తాలూకా ఆఫీసులో ఉద్యోగంలో చేరారు. భారతి వంటి సాహిత్య పత్రికలకు వ్యాసాలు రాసేవారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తో సాన్నిహిత్యం, ఉత్తరాల ద్వారా అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉండేవారు. శ్రీకాకుళం జిల్లాలోని బొంతలకోడూరు గ్రామానికి చెందిన మహా సహస్ర అవధాని మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి వాసుదేవరావుకు మంచి స్నేహితుడు. ఉద్యోగ రీత్యా టెక్కలి లో కూడా కొంతకాలం వాసుదేవరావు పని చేసారు. వాసుదేవరావు మొదట తన రచనలను మహాభారతం శ్రీమద్రామాయణం లోని ఘట్టాల మీద చేసారు. కొన్ని కదా సాహిత్యం పై సమీక్షలు వ్రాసి సాహితీ విమర్శ కూడా చేశారు.

రచనలు

[మార్చు]
  1. సౌందర్యలహరి, శంకర భగవత్పాదుల విరచితం - ఆంధ్రీకరణ/ తెలుగు అనువాదం : సోమంచి వాసుదేవరావు, ప్రచురణ: శ్రీ కోరంగి ఆయుర్వేదీయ ముద్రాక్షరశాల, జగన్నాధపురం కాకినాడ,1936.
  2. శివానందలహరి , శంకర భగవత్పాదుల విరచితం - ఆంధ్రీకరణ/తెలుగు అనువాదం: సోమంచి వాసుదేవరావు, ప్రచురణ: శ్రీరామకృష్ణ ప్రింటింగ్ వర్క్స్, చికాకోల్ ( ప్రస్తుత శ్రీకాకుళం) వైజాగ్ జిల్లా1936.
  3. స్తుతిరత్నమాలిక, ప్రచురణ: ఉత్తరాంధ్ర ముద్రణాలయం శ్రీకాకుళం శాలివాహన శకం 1883 ప్లవ సంవత్సరం 1961 జూలై.
  4. శ్రీ నిర్వచన సుందరకాండ , ప్రచురణ: శ్రీ కృష్ణా పవర్ ప్రెస్ విజయనగరం - శాలివాహన శకం 1883 నవంబర్ 1961.
  5. సమీర సందేశం, ప్రచురణ: శ్రీ వెంకటరమణ ముద్రణాలయం, శ్రీకాకుళం, శాలివాహన శకం 1884 శుభకృత నామ సంవత్సరం, మార్చి, 1963.
  6. శ్రీ శివస్తుతి నవగ్రహ స్తోత్రములు, ప్రచురణ: విజయలక్ష్మి ప్రింటింగ్ వర్క్స్, శ్రీకాకుళం,1964 - ( తే 21-05-1964 దీన శ్రీకాకుళంలోని నాగావళి నదీతీరాన వెలసియున్న ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి అలయమున ధ్వజస్థంభము, నవగ్రహమండపముల ప్రతిష్ట సందర్భముగా ఆవిష్కరించబడిన గ్రంధము)
  7. శ్రీ వెంకటేశ్వరస్తవము
  8. శ్రీ కిష్కింధకాండము, శ్రీ విజయలక్ష్మి ప్రింటింగ్ వర్క్స్, శ్రీకాకుళం, శాలివాహన శకం, 1887, విశ్వావసు సంవత్సరం, జనవరి 1965.
  9. కర్ణుడు-గాంధారీ నిర్వేదనము[1][2]

శివానందలహరి

[మార్చు]

శ్రీ శివానందలహరిని వాసుదేవరావు తన తండ్రి కోదండరామయ్య మార్గదర్శనంలో చదివారు. శివతత్త్వం పట్ల ఆకర్షితుడైన వాసుదేవరావు శంకరుడి రచనలను తెలుగులో అనువాదించాలని సంకల్పించి తండ్రి ప్రేరణతో 1929లో మార్చి 9వ తేదీన మహాశివరాత్రి నాడు శివానందలహరిని తెనుగీకరించే బృహత్కార్యక్రమమునకు శ్రీకారం చుట్టారు.

ఒక సంవత్సరంలోనే 1930 నాటికి పూర్తి చేసినా ఆర్ధిక పరిస్థితులు సహకరించక పోవడం వలన ప్రచురణను వాయిదా వేస్తూ వచ్చారు. ఉద్యోగరీత్యా అప్పటి గంజాం జిల్లాలోని టెక్కలిలో పనిచేస్తూ ఉండటం వలన కూడా ప్రచురణకు వీలుపడలేదు.

చివరకి తండ్రి ప్రోత్సాహంతో 1935 లో ప్రచురణకు ప్రభుత్వ అనుమతి కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన చికాకోల్ సబ్ కలెక్టర్ ప్రచురణకు అనుమతి ఇవ్వవసినదిగా సిఫార్సు చేశారు. దీనిని ఆమోదిస్తూ గంజాం కలెక్టర్ 990/36 సంఖ్య గల లేఖతో మార్చి 3వ తేదీన అనుమతి మంజూరు చేశారు. ఈ పుస్తకానికి పణ్యం బలరామస్వామి గారు ముందుమాట వ్రాశారు. (ఈ వివరాలన్నింటిని ఈ గ్రంధంలో చూడవచ్చు.)

తనను శంకరుని రచనల వైపు ప్రోత్సహించిన తండ్రి కోదండ రామయ్యకు ఈ కృతిని అంకితమిచ్చారు.

'క వినుతంబగు నీకృతీసుమ

    మునుమజ్జనుకునకు సకల బుధజన సన్మా

    న్యునకును రామయ బుధ నం

  దనునకు గోదండరామునకు నర్పింతున్.

ఈ పుస్తకం మొదట 500 ప్రతులు ప్రచురించగా వాటికి ఆదరణ లభించటంతో మరోసారి 500 ప్రతులు కూడా అదే సంవత్సరం లో ప్రచురించారు.

పాఠ్యగ్రంథాలుగా రచనలు

[మార్చు]

వాసుదేవరావు సంస్కృతం నుండి తెలుగు లోకి అనువదించిన శివానందలహరి ని ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు 1936 సంవత్సరంలో పాఠ్యగ్రంధంగా నిర్ణయించారు. ఈయన రచించిన సమీరసందేశంను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి వారు తెలుగు ఉపవాచకంగా 1968 లో నిర్ణయించారు.

ఉపనిషన్మందిరంతో అనుబంధం

[మార్చు]

వాసుదేవరావు కానుకుర్తివారి వీధిలో నివసించే రోజుల్లో తన నివాసానికి సమీప ంలో ఉండే కోదండరామాలయాన్ని నిత్యం సందర్శిస్తూ ఉండేవారు. 1954వ సంవత్సరంలో ఆలయంలో ఉపనిషన్మందిరంను స్థాపించినపుడు ఆయన అందులో వ్యవస్థాపక సభ్యులు కూడా. ఆయన రచించిన సుందరకాండ, కిష్కింధకాండ లను ప్రచురించిన అనంతరం ఉపనిషన్మందిరం సభ్యులు వాసుదేవరావును ఘనంగా సన్మానించారు. ఆయన రచనలన్నీ ఉపనిషన్మందిరం లో నేటికి లభ్యమవుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "పుట:Bhaarati sanputamu 3 sanchika 8 aug 1926.pdf/125 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2019-06-14.
  2. కాశీనాథుని నాగేశ్వరరావు(సం.) (1926). భారతి (మాస పత్రిక) (1926 ఆగస్టు సంచిక).

వనరులు

[మార్చు]
  1. శివానందలహరి https://ia801607.us.archive.org/22/items/in.ernet.dli.2015.331975/2015.331975.Shivaanandalahari.pdf
  2. https://archive.org/details/srisoundaryalahari/page/n3/mode/2up
  3. https://archive.org/details/srisivasthuthinavagrhasthotramulupdf/page/n3/mode/2up
  4. www.gpedia.com/te/m/gpedia లింకులో 41 వ పేరు సౌందర్యలహరి/సోమంచి వాసుదేవరావు
  5. 'నేనే శ్రీకాకుళం' శ్రీకాకుళం జిల్లా స్వర్ణోత్సవ సంచిక, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ, శ్రీకాకుళం, 2000.
  6. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఆరుద్ర 11వ సంపుటి.
  7. దేవులపల్లి శేష భార్గవి, శతక సాహిత్యం -2 భాష, తేటగీతి ఆన్ లైన్ తెలుగు పత్రిక, http://www.thetageethi.org/s35.html[permanent dead link]
  8. ప్రేమ పక్షులు... ప్రణయరాయబారులు http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MTQ3Nw==&subid=MTA=&menid=Mw==&authr_id=MA==[permanent dead link]
  9. కవిత్వంలో వాసుదేవరావు వెలుగులు dated 16.11.2019. https://web.archive.org/web/20191116073021/http://epaper.prajasakti.com/c/45801979
  10. ఆధ్యాత్మిక కవి సోమంచి జయంతి నేడు dated 16.11.2019. https://epaper.sakshi.com/c/45810170[permanent dead link]
  11. సోమంచి ఆదర్శనీయులు dated 15.11.2019 http://www.jaijayam.com/adminupload/1573815346_15-11-2019%20Jayam%20Evening%20Daily5%20copy.jpg[permanent dead link]
  12. నేడు సోమంచి జయంతి dated 16.11.2020 https://epaper.sakshi.com/c/56501166 Archived 2020-11-21 at the Wayback Machine
  13. ఘనంగా సోమంచి జయంతి dated 17.11.2020 https://epaper.sakshi.com/c/56501253 Archived 2020-11-21 at the Wayback Machine
  14. నేడు సోమంచి జయంతి https://epaper.sakshi.com/c/64377116 Archived 2021-11-28 at the Wayback Machine
  15. ఘనంగా సోమంచి జయంతి https://epaper.sakshi.com/c/64520851 Archived 2021-11-28 at the Wayback Machine