స్వామి దయానంద సరస్వతి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
స్వామి దయానంద సరస్వతి (1824 ఫిబ్రవరి 12- 1883 అక్టోబరు 30) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఞానాంధకారం, దారిద్య్రం, అన్యాయాన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
జీవిత చరిత్ర
[మార్చు]మూల శంకర్ 1824 ఫిబ్రవరి 12లో గుజరాత్ లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఒక మహా శివ భక్తుడు, పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక శివరాత్రి నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికాలను చూసి, ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి 1846లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు, మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు. అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించడానికి బయలుదేరాడు.
ప్రయాణ మార్గంలో దేశ స్థితిగతులు, దీనమైన, శోచనీయమైన హిందు సమాజంపై అవగాహన చేసుకున్నాడు. భారతావని ఆంగ్లేయుల పాలనలో ఉంది. ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ముక్కలు అవుతోంది. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్యవివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసి, చలించి పోయి వాటిని ఛేదించడానికి పాఖండ ఖండిని అన్న పతాకాన్ని ఆవిష్కరించాడు.
భారతదేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారతదేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. స్త్రీలకు సైనిక శిక్షణ ఇవ్వడం అనే ప్రతిపాదనను ప్రధమంగా తీర్మానించినది స్వామి దయానందనే. సత్యార్ధ ప్రకాశ్ ద్వారా వేదాల విశ్లేషణ, మూఢ నమ్మకాలను ప్రక్షాళన చేయుట వంటి వాటిని ప్రచురిస్తూ ప్రజల మన్నలను పొందాడు. ధార్మిక జీవనం కొనసాగిస్తూ వేద సారాంశాల గురించి ఉపన్యాసాలిస్తూ జీవనం కొనసాగించాడు.
ఆర్య సమాజ స్థాపన
[మార్చు]ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘసంస్కరణకు పునాదిగా, 1875 10 ఏప్రిల్ న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజం స్థాపించాడు. హిందూధర్మాన్ని పునరుద్ధరిద్దాం (హిందూధర్మం ప్రత్యాగఛ్చత) అన్న పిలుపుకు నాంది పలికాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయ్యాడు. పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనం చేసుకుని వాటిని విఫలం చేసినను, చివరిసారిగా 1883 అక్టోబరు 30, దీపావళి రోజు సాయంత్రం జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు. అతను తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ అథర్వణ, యజుర్వేదం వంటివి భాష్యం చేసిన వేదభాష్యకారుడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ సరస్వతి, దయానంద. అథయజుర్వేద భాష్యము.
బయటి లింకులు
[మార్చు]- Pages using the JsonConfig extension
- విస్తరించవలసిన వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1824 జననాలు
- 1883 మరణాలు
- హిందూ తాత్వికులు
- భారతీయ తత్వవేత్తలు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు