భాషా ప్రణాళిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాషా ప్రణాళికకి, విధానాలకి (language planning and policy) మధ్య విడదీయలేని సంబంధం ఉంది. కాబట్టి స్పొల్స్కి ఈ అధ్యయన శాస్త్రాన్ని "భాషా విధానాలు" అని అన్నారు.

భాషా ప్రణాళిక (Language Planning) ముఖ్య ఉద్దేశం

సమాజంలో ఉన్న భాషలు, వాటి వాడుక గురించి తీసుకున్న నిర్ణయాలు, వాటి నిర్వహణను, భాషా తీరులను, ప్రవర్తలను మార్చడం.ఇది వర్ణణాత్మక భాషా శాస్త్రం చెప్పినట్లు కాకుండా, భాషలోకి జోక్యం కల్పించుకొనే విధంగా ఉంటుంది.

నిర్వచనం[మార్చు]

ఫిట్ట్స్ చెప్పినట్లుగా(1997, పేజీ 14), భాషా ప్రణాళిక భాషా విధానాన్ని తెలుపుతూ, విమర్శనాత్మక విశ్లేషణ చేస్తుంది. మొదటిది హేతుబద్ధత కలిగిన ప్రామాణికతను, ప్రభావాన్ని తెలుపుతుంది. రెండోది, భాషా ప్రణాళిక నమునాల అభివృధ్ధి కోసం ఈ ఆలోచనలను అమలులోకి తీసుకొస్తుంది. ఈ అధ్యయన శాస్త్రాన్ని "భాషా ప్రణాళికా విధానాలు" అని చెప్పవచ్చు.
లూయిస్ జీన్ కల్వెట్(1996) ప్రకారం భాష నిర్మాణానికి, విలువలకు, ప్రచారానికి తీసుకొనే నిర్ణయాలను భాషా విధానాలు అని, భాషా విధానాలను అమలు పరచడాన్ని భాషా ప్రణాళిక అని అంటారు.

వివిధ భాషలను మాట్లాడే సమాజంలోని ప్రజలకు, రచయితలకు మార్గదర్శనం కోసం అక్షరాలను, వ్యాకరణాన్ని, నిఘంటువులను తయారు చేయడమే భాషా ప్రణాళిక పని. దీని ఆచరణలో మనం వర్ణణాత్మక భాషా శాస్త్రాన్ని దాటి అందుబాటులో ఉన్న భాషా రూపాల ఎంపికల ద్వారా తీర్పుని కలిగి ఉన్న దారిలోకి వెలుతున్నాము.(Haugen, 1959, p. 8).

భాషా ప్రణాళిక ఎప్పుడూ బహుళ భాష, బహుళ సాంస్కృతిక సమాజాలలో సంభవిస్తుంది. దీనిలో ఒక భాష కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఏ భాషలను నిర్ణయించాలనేది వివిధ వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల మధ్య ఉన్న శక్తి సంబంధాలు(power relations) నిర్ణయిస్తాయి. ఈ రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాలు భాషా ప్రణాళికలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇది భాష పరిధిని మించుతుంది. భాషపై గల భావాలును(Ideologies) నిర్ణయించే సంస్థలు భాషా ప్రణాళికపై ప్రభావితం చూపిస్థాయి.

భాషా ప్రణాళిక దశలు, రకాలు, పద్ధతులు[మార్చు]

హెయింజ్ క్లాస్ (Heinz Kloss 1969) భాషా ప్రణాళికలు[మార్చు]

హెయింజ్ క్లాస్ మూడు భాగాలుగా భాషా ప్రణాళికలను విభజించారు. అవి ఈ విధంగా ఉన్నాయి.

1) హోదా ప్రణాళిక(status planning) : ఇది భాష ఎంపికకు, వాడుకకు సంబంధించింది. భాషా చట్టాలు, నియంత్రణ ద్వారా కొన్ని పరిస్థితులను బట్టి ఒక భాషను ఎంపిక చేయడం జరుగుతుంది.తక్కువ హోదా కలిగిన భాషను కూడా ఎంపిక చేసి, దాని హోదాను మార్చవచ్చు. దీనిలో అధికార భాష, దేశ భాష మొదలైన అంశాలు ఇమిడి ఉంటాయి.

2) నిర్మాణాత్మక ప్రణాళిక(corpus planning) : ఇది భాష నిర్మాణానికి సంబంధించింది. ఒక భాషను అధికారికంగా వాడాలంటే, ఆ భాషలోని అన్ని పదాలను అవసరానికి తగినట్లుగా కొత్త పదాలను, అక్షరాలను నిర్మించాలి. కాబట్టి ఈ ప్రణాళికలో నిఘంటువుల తయారీ, అక్షరాల తయారీ, వ్యాకరణ తయారీ మొదలైన భాషా నిర్మాణ అంశాలు ఇమిడి ఉంటాయి.

3) భాషార్జన ప్రణాళిక(Acquisition planning) : ఇది భాషను ఉపయోగించే వారికి సంబంధించింది. ఇది ఎంచుకున్న భాష పరివ్యాప్తికి సహాయపడుతుంది. విద్యా, మత, మీడియా మొదలైన మాధ్యమాలు దీనిలో ఇమిడి ఉంటాయి.

Neustupny (1974), భాషా ప్రణాళికా పద్దతులు[మార్చు]

ఈయన రెండు విధాలుగా పద్ధతులను వివరించారు.

1) విధాన పద్ధతి(policy approach) : ఇది స్థూల స్థాయిలో సమాజానికి, ప్రభుత్వానికి సంబంధించింది. ఇందులో భాష ఎంపిక(అధికార భాష), హోదా, భావజాలం మొదలైన అంశాలు ఇమిడి ఉంటాయి. ఇది హోదా ప్రణాళిక లాంటిది.

2) సాగు పద్ధతి(Cultivation planning approach) : ఇది సూక్ష్మ స్థాయిలో భాష మాట్లాడటం, రాయడం, భాషా వ్యాప్తి చెందించడానికి, ముఖ్యంగా సాహిత్యవృద్ధికి తోడ్పడుతుంది.

అదే విధంగా భాషా ప్రణాళికలను రెండు విధాలుగా చెప్పవచ్చు(Schiffman 1996).[1] అవి:

  1. ప్రకటితమైన ప్రణాళిక(overt planning) : ఏ ప్రణాళికలైతే క్రమబద్ధంగా క్రోడీకరించి, దేశ చట్టాలలో, నిశ్చితం, అధికారిక పత్రాలలో స్పష్టంగా కనపడతాయో అవి ప్రకటితమైన ప్రణాళికలు.
  2. అప్రకటితమైన ప్రణాళిక(covert planning) : ఏ ప్రణాళికలైతే అనిశ్చితంగా ఉండి, పేర్కొనబడకుండా(అధికారికంగా పత్రాలలో) వాస్తవంగా అమలులో ఉంటాయో అవి అప్రకటితమైన ప్రణాళికలు.

భారతదేశపు భాషా ప్రణాళిక[మార్చు]

భారతావనిలో పూర్వకాలం నుండే భాష ప్రణాళికలను మనం చూడొచ్చు.

ప్రాచీన కాలంలో భాషా ప్రణాళిక[మార్చు]

ఈ కాలంలో అనిగూఢమైన ప్రణాళికను చూడొచ్చు.పవిత్ర గ్రంథాలను, భాష పవిత్రతను(సంస్కృతం) కాపాడటానికి శ్రద్ధ వహించారు. ఇది సమాజంలో ఉన్న వనరులకు(వస్తు సంపద) మాత్రమే పరిమితం కాకుండా, టెక్నిక్ మీద కూడా ఆధారపడింది. ఆ విధానమే మౌఖిక పద్ధతి. పవిత్ర గ్రంథాలును జ్ఞప్తి ఉంచుకొని తరువాత వారికి తెలియపరిచేవారు. అగ్రకులాలకు మాత్రమే వీటిని నేర్పేవారు. సరైన వ్యక్తి, సరైన సమయంలో, వేదం నేర్చుకుంటే వారికి మంత్రాలు సిద్ధించేవని, ఆ మంత్రాలతో దేవుడితో మాట్లాడొచ్చని నమ్మేవారు. ఆర్యులు ఆర్యులుకాని వారిని బానిసలుగా చూశారు. ఆర్యులు వారి భాషనే ప్రమాణికంగా చూశారు. మిగిలిన వాటిని అప్రమాణికంగా, తక్కువ భాషగా, మ్లేచ్చ భాషగా(సంస్కృతంలో) చూశారు. సంస్కృత భాషను అనిత్య భాషగా చెప్పారు. దీనిని సరిగ్గా ఉచ్చరించడంవల్ల ధర్మం వస్తుందని ఒక పవిత్రతను ఆపాదించారు. ఆర్యులు భారతదేశంలోకి పోవడం, అదే సమయంలో కొత్త ఆర్య భాషలు రావడం వలన ద్విభాష వ్యవహరం(diglossia) సమాజంలో ఉండేది. ఎగువ(H-variety) భాషను మత వ్యవహారాలకు ఉపయోగించేవారు. ఇలాంటి వైవిధ్యం ప్రజలలోను, భాషలోనూ కనబడుతుంది. ఈ వైవిధ్యం తమిళ, తొద వంటి భాషలకు కూడా వ్యాపించింది. పాణిణి రాసిన వ్యాకరణం, తమిళ తొల్కప్పియ వ్యాకరణం ఎగువ భాషను స్థిరీకరించడం భాషా నిర్మాణ, హోదా ప్రణాళికలుగా చూడవచ్చు. షిఫ్మెన్ ప్రకారం, ఎగువ భాష స్పష్టమైన ప్రణాళికకు, దిగువ భాష అస్పష్టమైన ప్రణాళికకు సూచనగా ఉంది. ఈ భేదాన్ని భారతావనిలో ఉన్న బుద్ధులు అడ్డుకున్నారు. వీరు మ్లేచ్చ(పాళి) భాషలను ఉపయోగించారు. ఇలా భారతావని మొదటి నుండి వైవిధ్య దేశంగా కనిపించింది.

మధ్య కాలంలో భాషా ప్రణాళిక[మార్చు]

ముస్లింలు భారతదేశానికి వచ్చినప్పుడు పర్షియన్ భాషను అధికార భాషగా ఉపయోగించారు. మొఘలుల పాలనలో ప్రభుత్వ చట్టాలన్నీ పర్షియన్ భాషలోనే జరిగేవి. అయినప్పటికీ మిగిలిన భాషలను ప్రోత్సహించారు. పర్షియన్ భాష హిందుస్తాని భాషను ముఖ్యంగా లిపిని ప్రభావితం చేసింది. దీనినే షిఫ్మెన్ వైవిధ్యానికి బయట నుండి వచ్చిన సవాలు అని అన్నారు.

సామ్రాజ్యవాదంలో భాషా ప్రణాళిక[మార్చు]

భాషా ప్రణాళికలు బ్రిటీషు వారి కాలంలో రెండు విధాలుగా పరిణితిచెందాయి. అవి సైనిక తిరుగుబాటు ముందు సైనిక తిరుగుబాటు తరువాత అని చెప్పవచ్చు. 16వ శతాబ్దంలో యూరోపియన్లు వ్యాపారనిమిత్తం వచ్చినప్పుడు, అప్పుడు ఏవైతే భారతీయ భాషలు వాడుకులో ఉన్నాయో వాటినే వాడేవారు(పర్షియన్, ఉర్దూ వంటివి). 1813లో మిషనరీలను అనుమతించిన తరువాత, బ్రిటీషు వారికి భారతదేశంలో ఉన్న భాషలు రాకపొతే ప్రజలకు మతబోధను చెయ్యలేరని గ్రహించి ఆ భాషలపై దృష్టి పెట్టారు. కొన్ని భాషలకు వ్యాకరణాలను, నిఘంటువులను తయారు చేశారు. 1835లోని మెకాలె విద్యాసంస్కరణలు భారతదేశపు విద్యావిధానంలో మార్పులను తెచ్చాయి. అప్పుడు కొంత మంది అంగ్ల విద్యకు అనుకూలంగానూ, మరి కొంతమంది దానికి వ్యతిరేకతను వినిపించారు. మెకాలె సూచించిన విద్యావిధానం కన్నా, అతడు భారతీయ భాషలను విమర్శించిన తీరుపై అనేక వాదనలు జరిగాయి. అతను బ్రిటీష్ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో "నాకు సంస్కృత, అరబిక్ భాషల గురించిన జ్ఞానం లేదు" అంటూనే, యూరోపియన్ లోని ఒక గ్రంథాలయంలో ఉండే అరలోని పుస్తకాలంత విలువను భారతీయ భాషలు కలిగి ఉంటాయని వ్యాఖ్యానించారు. సంస్కృత, అరబిక్ భాషలులో చదివిన విద్యార్థులు వారి విద్యార్హతతో సంతోషంగా లేరని, ఉద్యోగ అవకాశాలు రావడం లేదని చెప్పారు. ఆంగ్లంలో చదివిన భారతీయులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వ్యాఖ్యాతలుగా ఉంటారని, ఆంగ్ల భాష పాశ్చాత భాషల కన్నా గొప్పదని వివరించారు. 1854 చివరిలో వుడ్ లార్ద్ డెల్హౌసికి పంపిన ఆర్డినెస్స్ లో "ఏ సాధారణ విద్యలోనైనా ఆంగ్లమును కొరితేనే చెప్పాలి కానీ, అది భారతీయ భాషలతో కలిసి ఉండాలి". ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న విద్యావిధానానికి మూలం ఈయనే. మన స్వాతంత్ర్య సమరయోధులు గోఖులే, ఠాగూర్, గాంధీ వంటి వారు మాతృభాష లోనే ప్రభుత్వ కార్యకలాపాలు జరగాలని, విద్యావిధానం ఉండాలని పోరాటం చేసారు. మొత్తంగా చెప్పాలంటే, మూడు విద్యానమూనాలు బ్రిటిషు కాలంలో వచ్చాయి. అవి: 1) ప్రాథమిక దశ నుండే నగరాలలో ఆంగ్ల భాష మాధ్యమంగా విద్యాబోధన. 2) పట్టణాలలో ప్రాథమిక విద్యాబోధనకు దేశీయ భాషలు, తరువాతి దశలో అంగ్ల భాషలో విద్యాబోధన. 3) గ్రామీణ ప్రాంతాలలో దేశీయ భాషలలో విద్యాబోధన.

First day of constituent assembly in India. From left B.G.Kher and Sardar Vallabhai Patel, K.M.Munshi is seated behind Patel

స్వతంత్ర భారత దేశంలో భాషా ప్రణాళిక[మార్చు]

బ్రిటీషు వారి నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశంలో భాష అనేది పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవాలి. అప్పటివరకూ ఆంగ్ల భాషలో జరిగిన అధికారిక పనులన్ని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అదే భాషలో జరగటం సరికాదని చాలా మంది భావించారు. రాజ్యాంగంలో మన దేశ భాష గురించి వివరించవలసిన సమయం వచినప్పుడు కొందరు హిందీ భాష అధికార భాషగా ఉండాలని మరికొందరు ఉండకూడదనీ, మరికొంతమంది అన్ని భాషలపై సంస్కృత భాషా ప్రభావం ఉంది కాబట్టి అధికార భాషకు తగనివని నిరసనలు చేయడం జరిగింది. కాని ఈ వాదన నిలువలేదు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా, దేశ భాష దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తుంది. కాబట్టి అయ్యంగర్ రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారతదేశానికి ఒక దేశ భాష కలిగి ఉండాలని నొక్కివక్కానించారు. మైత్ర, అయ్యంగర్ వంటి వారు అధికార భాషతో పాటుగా మిగిలిన భాషలను కూడా(రాష్ట భాషలుగా) గుర్తించాలనుకుంటే గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి వారు హిందీ భాష మాత్రమే భారతదేశమంతటా ఉండాలని అన్నారు. అయితే, అసెంబ్లీ హిందీ భాష మద్దతదారులుగా, వ్యతిరేకులుగా విడిపోయింది. బీ.ఆర్. అంబేద్కర్ దృష్టిలో ఒక భాష ప్రజలను కలుపుతుంది, రెండు భాషలు విడగొడతాయి.ఇలా రాజ్యంగ అసెంబ్లీలో ఐక్యత కొరవడుతున్న సమయంలో ముంషీ-అయ్యంగర్ సూత్రం ఇరు వర్గాలకు సాయోధ్యను కుదిర్చింది. ఈ సూత్రం ప్రకారం హిందీ, ఆంగ్లం రెండిటినీ అధికార భాషలుగా చేశారు. ఆంగ్ల భాషను 15సంవత్సరముల వరకు అధికార భాషగా ఉంచాలని నిర్ణయించారు. కాబట్టి భారత రాజ్యాంగము అంగ్లంలోనే రాయబడింది.

సోవియెట్ మోడల్[మార్చు]

19వ శతాబ్దం మొదట్లో రష్యన్ భాష ఆధిపత్య భాషగా వ్యవహరించేది. కానీ ఈ సోవియెట్ లో చాలా చిన్న దేశాలు కలిసి ఉండటం వల్ల, వేరే భాషలు మాట్లాడే వారు కూడా పెరిగిపోవడంతో రష్యన్ భాషకి ప్రాముఖ్యత తగ్గుతుందని భావించి ఆ భాషను అధికార భాషగా ప్రకటించారు. ఈ రష్యన్ ఆధిపత్యాన్ని తొలగించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకొని స్థాపించబడినదే "సోవియెట్ యూనియన్." అప్పటి నుంచి వేరే చిన్న భాషలను కూడా వ్యవహారిక మాధ్యమంలో ఉపయోగించడం మొదలు పెట్టారు.అధికారిక భాష వేరుగా ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీ భాషలకు తక్కువ అవకాశాలు ఉండటం వల్ల ఆ భాషలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత వాటికి ఇస్తూనే రష్యన్ భాషను సమానంత్వంలో మొదటి స్థానంగా (primus inter pares), అంటే ఇతర భాషలకి రష్యన్ భాషకి మధ్య సంబంధ భాషగా(lingua franca) రష్యన్ మాత్రమే ఉపయోగించాలని ఆజ్ఞను జారీ చేశారు. ఇందులో భాగంగా రోమన్, అరబిక్ లిపిని ఉపయోగించుకునే హక్కుని తొలగించారు. అప్పటి అధికారి స్టాలిన్ సోవియెట్ యూనియన్ రద్దు చేసే ముందు వరుకూ అక్కడ రష్యన్, ఇతర భాషలను మాట్లాడేవారి సంఖ్య యాభై శాతం కంటే తక్కువగానే ఉండేది. టర్కిష్, మంగోలియన్ ఇంకా ఇతర భాషలు(ఇండో-యూరోపియన్ భాషలు కానివి) మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉండేది. రష్యనేతర భాషలను పాఠశాలలో బోధనకు ఉపయోగించవచ్చని కానీ ఇది ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమని తెలిపారు. వేరే ప్రాంతపు వ్యక్తి తన మాతృభాషలో విద్యాభ్యాసం చేయలేరని, రష్యన్ భాషలోనే చేయాలని. ఇలా ప్రజలను రష్యన్ భాషతో ఏకీకరించడానికి ప్రోత్సహించారు. ఈ విధంగా రష్యన్ జాతీయ భావజాలానికి ఈ ప్రణాళిక అద్దంపట్టింది. ఈ మోడల్ ను లెనిన్ అధికారికంగా సోవియెట్ యూనియన్ కోసం మాత్రమే అభివృద్ధి చేశారు.

కానీ మన పరిశీలనాధికారులు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టి రష్యన్ భాషలాగా భారతదేశంలో కూడా హిందీ భాషను భర్తీ చేయవచ్చనుకుని సోవియెట్ యూనియన్ నుంచి ఈ ప్రణాళికను మన దేశంలోకి తీసుకున్నారు.చివరికి ఇది విఫలమైందనే చెప్పుకోవాలి. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. వీటిలో హిందీ భాష సంఖ్యాపరంగా పెద్దది కానీ అది అన్ని భాషలకు సంబంధ భాషగా అయితే లేదు, రష్యన్ భాషకున్న విలువ(రష్యేతర భాషల ప్రజల దృష్యా) హిందీ భాషకు లేదు అనేవి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

తరువాత భారత పార్లమెంటు అధికారభాషా కమిటీని 1957లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1965 తరువాత కూడా హిందీ భాషేతర ప్రజలు ఒప్పుకునే వరకు ఆంగ్ల భాష కొనసాగాలని సూచించింది. దీన్ని అప్పటి హోం శాఖా మంత్రి పంత్ గారు రాష్టపతికి సమర్పించారు. దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి 1963 అధికార భాష చట్టంగా చేసి, ఆంగ్ల భాషను అధికార భాషగా ఉంచారు.1967లో పార్లమెంటులో ఒక తీర్మానం చేశారు. హిందీ భాషను అధికారికంగా ఉపయోగించడానికి భాషాభివృద్ధిని పెంచడం, ఇతర భాషలను కూడా వృద్ధిపరచాలని, ప్రభుత్వ ఉద్యోగలకు హిందీ లేదా ఆంగ్లం పూర్తి స్థాయిలో రావాలని, కొన్ని ఉద్యోగాలకు రెండు భాషలు రావాలని, ప్రతి సంవత్సరం ఈ భాషావిధానంపై ఒక నివేదికను రాయాలని తీర్మానాలను చేశారు. దీని తరువాత 1963లో వచ్చిన అధికార భాషాచట్టాలు ముఖ్యమైనవి.

భారత రాజ్యంగంలో ప్రణాళిక[మార్చు]

భారత రాజ్యంగం 120, 210, 343-351 అధికరణాలు భాష గురించి చర్చించింది. వాటిని, ఈ క్రింది విధంగా విభజించవచ్చు.అవి:

భారత రాజ్యంగంలో 17వ భాగంలో(343-344 అధికరణలు) అధికార భాష గురించి రాసి ఉన్న మొదటి పేజీ

దేశ అధికార భాష(343-344)[మార్చు]

అధికార భాషా చట్టాన్ని అమలు చేసే సమయంలో ఈ కింది నిర్ణయాలను తీసుకున్నారు.

దేవనాగరి లిపిలోని హిందీ భాష దేశ అధికార భాషగా ఉండాలి. దేవనాగరి సంఖ్యలను కాకుండా అంతర్జాతీయ సంఖ్యలను మాత్రమే వాడాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత నుండి 15సంవత్సరముల వరకు అధికార భాషగా అంగ్లం ఉండాలని నిర్ణయించారు. ఈ గడువులో హిందీని వృద్ధిచేసి, ఆంగ్లాన్ని తీసివేయొచ్చు. ఈ గడువు తరువాత కూడా అవసరమైతే పార్లమెంటు ఈ కాలన్ని పొడిగించవచ్చు. ప్రతి ఐదు లేదా పది సంవత్సరాలకొకసారైనా భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి, హిందీ భాష పనితీరును మెరుగుపరచాలి.

అందుకోసం 1955లో ఒక భాషా కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా అన్ని దేశాల భాషా ప్రణాళికలను బాగా చదివి పరిశీలించి మన దేశానికి ఒక నిర్దిష్టమైన భాష ప్రణాళికను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీని ప్రభావం 1964 నాటి "త్రిభాషా సూత్రం"(Three-language formula) పై పడింది. మొదట ఇది సోవియెట్ యూనియన్ (రష్యా విప్లవానికి పూర్వం ఏర్పడిన కార్మిక కర్షక విప్లవ సంఘం) లో అమలులో ఉండేది. ఈ భాషా సంఘానికి కార్యదర్శి అయిన ఎస్.జి.భార్వె గారు రష్యా(సోవియెట్ యూనియన్) వెళ్ళి అక్కడ కొద్ది రోజులు పరిస్థితులన్ని పరిశీలించి వచ్చి ఈ ప్రణాళిక మన దేశంలో అమలు పరచొచ్చని సూచించారు. ప్రజాసామ్య భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని, అంగ్లమును తీసివేయడం సరికాదని, ప్రాథమిక విద్య దేశీయ భాషలలో జరగాలని, కెంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు హింది పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని, 14 సంవత్సరలోపు విద్యార్థులకు హిందిని తప్పనిసరిగా నేర్పించాలని, కోర్టు చట్టాలు దేశీయ భాషలలోనికి అనువదించాలని మొదలగు అంశాలను పేర్కొన్నారు. భార్వె గారు రాసిన నివేదికలో అంతర్గత నిజాలను తెలిపే విధంగా ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండూ కలిపి ఉన్నాయి. రాష్యా ప్రణాళికను ఉనదిఉన్నట్లుగా తీసుకొకుండా, భారతావనికి తగినట్లుగ కొన్ని మార్పులు చెసి అమలులోనికి తీసుకొని రావచ్చునని ముందు జాగ్రత్త లాగా భార్వె సూచన ఇచ్చారు. కానీ పరిశీలనాధికారులు ప్రయోజనాలని మాత్రమే పరిగణ లోకి తీసుకొని మన దేశంలో కూడా అమలు పరిచారు.అదే సమయంలో ఎన్నో పోరాటాలు, నిరసనలు, కొట్లాటలు తరువాత అప్పటివరకు ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు మాట్లాడే వారంతా విడిపోయి 'ఆంధ్రప్రదేశ్' గా ఒక కొత్త రాష్ట్రం 1953 లో ఏర్పరచబడింది. ఈ విభజన 'రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాం' ఏర్పాటుకి దారి తీసింది.

1963 అధికార భాషా చట్టం, 1967లోనికి అమలులోనికి వచ్చింది. ఇది హిందీ, అంగ్ల భాషల 15 సంవత్సరాల గడువును పొడిగించింది. దీనిలోని అంశాలు- 1) పార్లమెంటుకు, హిందేతర రాష్ట్రాల సంభాషణకు, కేంద్ర అధికార అవసరతలకు ఈ రెండు భాషలను ఉపయోగించుకోవచ్చు. 2) ఈ రెండు భాషల పరిజ్ఞానం లేదని ప్రభుత్వ అధికారిపై వివక్షత చూపరాదు(ఏ ఒక్క భాషైనా రావచ్చు) 3) అన్ని రాష్ట్రాలు ఒప్పుకునేంతవరకూ ఈ రెండు భాషలు అధికార భాషలుగా ఉంటాయి.4) 30 మంది సభ్యులు గల (20 మంది దిగువ సభ, 20 మంది ఎగువ సభ నుండి ఎన్నిక ద్వారా) అధికార భాషా కమిటీని ఏర్పాటు చేయాలి. అది హిందీ భాష అభివృద్ధిపై దృష్టి పెట్టి, ఆ భాష వృధ్ధి కోసం ఏవైనా సిఫారసులు ఉంటే రాష్ట్రపతికి తెలుపవచ్చు. 5) ఆంగ్ల, హిందీ భాషలలో ప్రామాణికంగా హిందీ భాషనే చూడాలి.6) హిందీ భాష అధికారికంగా లేని రాష్ట్రాలలో గవర్నరు దానికి సమానమైన హిందీ అనువాదాన్ని అందజేయమని అడగవచ్చు. దీనిలో కూడా హిందీనే ప్రామాణికంగా తీసుకోవాలి.7) పార్లమెంటు అధ్యక్షులు ముందుగా రాష్ట్ర గవర్నరు అనుమతి తీసుకొని హైకోర్టు అదేశాలను హిందీ లేదా ఇతర రాష్ట్ర భాషలలోకి అనువదించవచ్చు. ఇది 1976 అధికార భాషా నిబంధనలకు దారితీసింది. భారతాదేశాన్ని 3 భాషా ప్రాంతాలుగా విభజించారు. అవి: 1) ప్రాంతము-ఎ: హిందీ ఉన్న రాష్ట్రాలు, 2) ప్రాంతం-బి: సామన్య వాడుకగా హిందీ ఉన్న రాష్ట్రాలు, 3) ప్రాంతము-సి: అంగ్లం ఉన్న రాష్ట్రాలు. ఈ విభజన కేంద్ర-రాష్ట్రాల మధ్య, ఇతర రాష్ట్రాల మధ్య సంభాషణలను దృష్టిలో ఉంచుకొని జరిగింది. ఇంకా, 1973 లో వచ్చిన కేంద్ర అధికార ప్రామాణిక చట్టం (Law on Authoritative Texts (Central Laws) Act) ప్రకారం, కేంద్ర చట్టాలను హిందీలో మాత్రమే కాకుండ ఇతర షెడ్యూల్ భాషలలో కూడా అనువదించవచ్చు.

హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని (ministry of home affairs) అధికార భాషా విభాగము హిందీ భాషాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంది. వాటిలో 1963 నాటి అధికార భాషా చట్టాన్ని అమలుపరచడం, రాష్ట్రపతి ముందు అనుమతితో హైకోర్టులలో హిందీని వాడటం, ప్రభుత్వ పనుల కోసం వివిధ శాఖలలో హిందీ అభివృద్ధికై పుస్తకాలును, పదాలను, నిఘంటువులను కావలసిన పరికరాలను అందజేయడం, వివిధ హిందీ సలహా సమితీలను సమన్వయ పరచటం, వేరే భాష నుంచి హిందీలోకి అనువాదాలు చేయడం మొదలైన పనులను చేస్తుంది. ఇవన్ని 2009 అధికార భాష మార్గదర్శిక సూత్రాలలో ప్రతిబింబిస్తాయి.

త్రి-భాషా సూత్రం[మార్చు]

1940లో కేంద్రం విద్య కోసం ఒక చట్టబధ్ధమైన సలహా మండలిని (central advisory board on education) ఏర్పాటు చేసింది.విద్యా రంగంలో ఉండవలసిన భాషల గురించి అప్పటినుంచి చర్చలను మొదలుపెట్టి 1960 వరకు కొనసాగించాయి. ఈ మండలి ముఖ్యంగా ఐదు సమస్యలను గమనించి వాటిపై ద్రుష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరింది. అవి:

  1. పాఠశాల విద్యాలో ఉన్న వివిధ స్థాయిలలో ఎన్ని భాషలను ఉపయోగించాలని
  2. రెండవ, మూడవ భాషలను ఏ తరగతిలో పరిచయం చేయాలని
  3. ఆంగ్ల భాష స్థానము, పాఠశాల విద్యలో దాని పాత్ర
  4. హిందీ భాష స్థానము, పాఠశాల విద్యలో దాని పాత్ర
  5. పాఠశాలలో సంస్కృతం ఇంకా ఇతర దేశీయ భాషల బోధన
Name Board of Devarapalli train station on Dharmavaram Bengaluru line, Ananthapur district written in Telugu, Hindi, English

భారతదేశ భాషలలో ఉన్న అసమానతను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ మండలి 23వ సమావేశాంలో పైన చెప్పిన సమస్యలపై ద్రుష్తి పెట్టి హిందీ మాట్లాడే రాష్ట్రాలలోనూ, మాట్లాడని రాష్ట్రాలలోనూ మూడు భాషలను తప్పనిసరిగా బోధించాలంటూ సలహా ఇచ్చింది. అది ఎలా అంటే:

మొదటిది:

  • (అ) (1) మాతృ భాష లేదా, (2) ప్రాంతీయ భాష లేదా, (3) మాతృ భాష యొక్క మిశ్రమ కోర్సుతో పాటుగా ప్రాంతీయ భాష లేదా, (4) మాతృ భాష యొక్క మిశ్రమ కోర్సుతో పాటుగా శాస్త్రీయ భాష లేదా, (5) ప్రాంతీయ భాష యొక్క మిశ్రమ కోర్సు లేదా శాస్త్రీయ భాష
  • (ఆ). హిందీ లేదా ఆంగ్లము
  • (ఇ). పైన (అ), (ఆ) లో లేనటువంటి ఏదైనా ఆధునిక భారతీయ లేదా యూరోపియన్ భాష.

రెండవది:

  • (అ). (1) మాతృ భాష లేదా, (2) ప్రాంతీయ భాష లేదా, (3) మాతృ భాష యొక్క మిశ్రమ కోర్సుతో పాటుగా ప్రాంతీయ భాష లేదా, (4) మాతృ భాష యొక్క మిశ్రమ కోర్సుతో పాటుగా శాస్త్రీయ భాష లేదా, (5) ప్రాంతీయ భాష యొక్క మిశ్రమ కోర్సు లేదా శాస్త్రీయ భాష.
  • (ఆ). ఆంగ్లము లేదా ఆధునిక యూరోపియన్ భాష.
  • (ఇ). హిందీ (హిందీ మాట్లాడని ప్రాంతాలలో), ఏదైనా ఆధునిక భారతదేశంలోని భాష(హిందీ మాట్లాడే ప్రాంతాలలో) (MOE 1957, quoted in Agarwal 1993:79)

ఈ రెండు విధానాలను సరళీకృతం చేసి 1961లో జరిగిన ముఖ్య మంత్రుల నమావేశంలో త్రి-భాషా సూత్రాన్ని ఈ విధంగా ఆమోదించారు.

  1. మాతృ భాష లేదా ప్రాంతీయ భాష ( రెండు భాషలు వేరు అయితే)
  2. హిందీ (హిందీ మాట్లాడని ప్రాంతాలలో), ఏదైనా ఇతర భారతీయ భాష (హిందీ మాట్లాడే ప్రాంతాలలో),
  3. ఆంగ్లము లేదా ఇతర యూరోపియన్ భాష. (GOI 1962:67)
షెడ్యూల్ భాషలు(344(1), 351)[మార్చు]

భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షడ్యూల్లో 344(1),351 అధికరణల ప్రకారం 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. అవి:

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒడియా, అస్సామిస్, బోడో, డోగ్రీ, బెంగాలీ, గుజరాతీ, కాష్మీరీ, కొంకనీ, మైథిలీ, మైథై, పంజాబీ, నేపాలీ, సంథాలీ, సంస్కృత, సింధి, ఉర్దు.

వీటిలో 14 భాషలు రాజ్యాంగంలో మొదట కలపబడినవి. తరువాత, 1967లో 21వ రాజ్యాంగ సవరణ చట్టం కింద సింధి ని, 1992లో 71వ సవరణ చట్టం కింద కొంకనీ, మనిపురీ, నేపాలీ, 2003లో 92వ సవరణ చట్టం కింద డోగ్రీ, బోడో, మైథిలీ, సంథాలీ కలపబడ్డాయి. ప్రభుత్వం ఈ భాషలను అభివృద్ధి చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని కమ్యూనికేట్ చేసే సమర్థవంతమైన సాధనాలుగా తయారుచేయాలని బాధ్యతలు తీసుకుంది.

2003లో శ్రీ సితకంట్ మహాపాత్ర అధ్యక్షుడిగా ఒక కమిటి ఏర్పడి, ఈ షెడ్యూల్ భాషలకు కావలసిన అభిలక్షణాలను(criteria) తెలుపుతూ 2004లో ఒక నివేదికను సమర్పించింది. ఇది ఇంకా, కేంద్ర మైనారితీ విభాగాల పరిశీలనలోనే ఉంది. ఇప్పటివరకు అభిలక్షణాలను నిర్ణయించలేకపోవటం బాధాకరం.

మైనారిటీ భాషా హక్కులు[మార్చు]

రాజ్యాంగ 29వ అధికరణం ప్రకారం, భారతదేశంలోని ఏ పౌరుడైనా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా భిన్నమైన భాష, లిపి లేదా సంస్కృతి కలిగిన వారు వాటిని రక్షించుకునే అధికారం ఉంది. ఏ పౌరుడైనా సరే కుల, మత, జాతి, భాష ప్రాతిపదికన విద్యాసంస్థలలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. 30వ అధికరణం ప్రకారం, భాష లేదా మత ప్రాతిపదికన ప్రతీ మైనారిటీలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చును, రాష్ట్రం వీటిని వివక్షతగా చూడరాదు. 350(ఎ) అధికరణం ప్రకారం, మైనారిటి భాషలకు చెందిన పిల్లలకు వారి భాషలోనె ప్రాథమిక విద్యను బొధించవలెను. 1956లో 7వ సవరణ కింద 17వ భాగంలో 350-(బి) అని అధికరణని అమలులోకి తీసుకుని వచ్చింది. దీనిలో కొన్ని నిబంధనలను తెలిపారు. అవి- భారతదేశ అధ్యక్షుడి చేత ఒక ప్రత్యేక అధికారిని మైనారిటి భాషా ప్రజలకు నియమించబడతారు. ఈ అధికారి భాషా మైనారిటీ హక్కులను అన్ని విషయాలలోను సంరక్షించే విధంగా దర్యాప్తు చేస్తూ ఉండాలి. దేశ రాష్ట్రపతి అడిగినప్పుడు నివేదికను సమర్పిస్తూ ఉండాలి. ఆ నివేదికను రాష్ట్రపతి రెండు సభలలోనూ(శాశన సభ, రాజ్యసభ), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తారు. జాతయ మైనారిటి విద్యాసంస్థల కమిషను 2004 లో రాజ్యాంగంలోని మైనాటి విద్యాసంస్థల హక్కులను కాపాడటానికి ఏర్పాటుచేసింది. ఇది సివిల్ కోర్టు అధికారం కలిగిన మిశ్రమ న్యాయవ్యవస్థ. దీనిలో డిల్లి హైకొర్టు ప్రాధాన న్యాయమూర్తి అధ్యక్షులుగా, ఇద్దరు కేంద్ర ప్రభుత్వం వారు నియమిస్తారు. కెంద్ర ప్రభుత్వం మైనారిటి భాషల విధివిధానాలను సూచనచేసింది. కాని వీటిని కచ్చితంగా అనుసరించాల్సిన పనిలేదు. అవి- ఆ జిల్లాలో గాని ఉప-జిల్లాలోగాని 15% మైనారిటి భాషల ప్రజలు ఉంటే వారి భాషలలోకి ముఖ్యమైన చట్టాలను అనువదించాలి, 60% ప్రజలు ఒక మైనారిటి భాషను ఒక జిల్లాలో మాటలాడుతున్నట్లయితే దానిని రెండోవ అధికార భాషగా గుర్తించాలి, సమస్యల విన్నపము, జవాబు వారి భాషలలోనె ఉండాలి, రెండో ప్రాథమిక విద్యాదశలో మైనారిటి భాషను బోధించాలి, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు వారి భాషలోనె ఉండాలి, త్రిభాష సుత్రాన్ని పాటించాలి, కరపత్రాల పంపిణి వారి భాషలోనే ఉండాలి మొదలగునవి. కాని, ఏ రాష్ట్రాలు కూడా ఈ విధానాలను అనుసరించుటలేదు. పిల్లల నిర్భంద ఉచిత విద్యాచట్టం (2009) లో మత లేదా భాషా మైనారిటీలు నడుపుతున్న పాఠశాలలలో ఒక కమిటీని ఏర్పాటుచేయాలని సూచించింది. అంతరించిపోతున్న భాషల సంరక్షణ పధకం( SCHEME FOR PROTECTION AND PRESERVATION OF ENDANGERED LANGUAGES) ను మానవవనరుల శాఖ 2013లో ఏర్పరిచారు. ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం అంతరించిపోతున్న భాషలను భద్రపరచటం, కాపాడటం. ప్రస్తుతానికి ఇది 117 భాషలను భధ్రపరచటానికి జాబితా వేసుకుంది. నిఘంటువులు, వ్యాకరణాలు మొదలగు రూపాలలో భద్రపరుస్తారు. బహుభాషలవిద్యావిధానం(multiningual education) మాతృభాషలోనే విద్యను బోధించాలనే లక్ష్యంతో ఏర్పడింది. దీని వల్ల ప్రాథమిక స్థాయివరకు పాఠ్యపుస్తకాలను తయారుచేసారు. కాని ఇది విజయవంతము కాలేదు. ఉపాధ్యాయులు వారి భాష వచ్చినవారు లేకపోవడం, వారి శిష్యనపై శ్రద్ధ లేకపోవడం వంటి కారణాల వల్ల రాసిన పుస్తకాలు మ్యూజియాలలో, అధికారుల గదులలో మాత్రమే కనిపిస్తాయి. కొన్ని తక్కువ భాషలలో మాత్రమే దీనిని అనుసరిస్తున్నారు. 6వ అల్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం, విద్యామాధ్యమంగా ఉన్న 80 భాషలు 41కి చేరినాయి.

Date 11 December 2013, 21:23:22, ఢిల్లీ ప్రధాన న్యాయస్థానం
The historical judgement by the Delhi High court that declared Section 377 unconstitutional as it violated Fundamental Rights. This judgement decriminalised Gay and Lesbian issues that were declared as "against the order of nature" as espoused by old British Commonwealth Law.

రాష్ట్రాల అధికార భాషలు, వాటి మధ్య సంభాషణ(346-347)[మార్చు]

ప్రతి రాష్ట్రంలో మాట్లడే భాషను ఆ రాష్ట్ర ప్రభుత్వమే అధికార భాషగా నిర్ణయించుకోవచ్చు. కేంద్రం, రాష్టాల మధ్య సంభాషణకు దేశ అధికార భాషను ఉపయోగించాలి. 1963 అధికార భాషా చట్టం ప్రకారం హిందేతర రాష్టాలు అంగ్ల భాషను, హిందీ రాష్టాలు హిందీ భాషను ఉపయోగించాలని తీర్మానించింది. రాష్టాల మధ్య సంభాషణ వారి వారి రాష్ట్ర ప్రభుత్వం తేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

కోర్టులలో భాష(348), పార్లమెంటు భాష[మార్చు]

సుప్రీం, హై కోర్టులలో అంగ్లం మాత్రమే ఉపయోగించాలి.రాష్ట్ర గవర్నరు కావాలంటే హై కోర్టుతో హిందీ లేదారాష్ట్ర భాషలలో సంభాషణ జరుపవచ్చు. కానీ చట్టాలు, ఆదేశాలు అన్ని అంగ్లంలోనే ఉండాలి. గవర్నరు చట్టాలను, ఆదేశాలను హిందీ లేదా ఇతర భాషలలో ఉపయోగించాలనుకుంటే దానికి అంగ్ల అనువాదం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన కోర్టులు, చట్టాలు చేయడానికి వాటి విశ్లేషణకు అంగ్ల భాషకు అలవాటు పడిందని, అంగ్ల పదాలకు తగిన హిందీ పదాలు లేకపోవడం అనేది అయ్యంగర్ దీనికి కారణంగా చెప్పారు. 1963లో పార్లమెంటులోని చట్టాలు, ఆదేశాలు హిందీ అనువాదం ఉండాలని ఆదేశించారు. 120 అధికరణం ప్రకారం పార్లమెంటులో హిందీ లేదా అంగ్ల భాషలను ఉపయోగించవచ్చు. ఒకవేళ తమ మాతృభాషను ఉపయోగించాలంటే ముందుగానే తెలియజేయాలి. 210 అధికరణం ప్రకారం రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర అధికార భాషలను లేదా హిందీ అంగ్ల భాషలను అసెంబ్లీ వ్యవహారాలలో ఉపయోగించవచ్చు. ఏ వ్యక్తైన ఈ భాషలలో మాట్లాడటానికి ఇబ్బంది పడినట్లయితే ముందుగానే తెలియజేయాలి.

ప్రత్యేక ఆదేశాలు(350-351)[మార్చు]

ఏ వ్యక్తైనా సరే, వారి భాషలో ప్రభుత్వానికి ఏ పనివద్దనైనా, ఏ అధికారి దగ్గరైనా, ఏ ఆఫీసులోనైనా వారి ప్రాతినిధ్యాన్ని తెలియపరచవచ్చు. ప్రతి రాష్ట్రం, ప్రాథమిక విద్యను వారి వారి మాతృభాషలోనే బోధించాలి.మన భాషలను సంరక్షించడానికి రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని ఉంచాలి. ఆ నివేదికను పార్లమెంటు ముందుంచాలి.

ఉపయుక్త గ్రంధాలు[మార్చు]

  1. shohamy, elan (2006). "Language Policy Hidden agendas and new approaches". ISBN 1134333528. Routledge: new york.
  2. ricento, thomas (2006). "An Introduction to Language Policy Theory and Method". ISBN 1-4051-1497-5.Blackwell Publishing: uk.
  3. splosky, bernad(2012). "The Cambridge Handbook of Language Policy".ISBN 978-0-521-19565-2. Cambridge university press: Cambridge.
  4. Schiffman, Harold F(2002) "Linguistic Culture and Language Policy". ISBN 0-415-18406-1. Routledge: USA
  5. Schiffman, Harold F. (2002a.)  ‘Linguistic Tolerance Policies: Can a Viable Model be Constructed for ?’  In Gremalschi 2002.
  6. https://www.sas.upenn.edu/~haroldfs/540/handouts/ussr/soviet2.html
  7. The Controversy Of The National Language In India. https://web.archive.org/web/20190618202526/http://jlsr.thelawbrigade.com/index.php/2017/04/21/the-controversy-of-the-national-language-in-india/. retrived on 16-03-2019.
  8. CONSTITUTION OF THE COMMITTEE OF PARLIAMENT ON OFFICIAL LANGUAGE, BACKGROUND, MEMBERSHIP AND ACTIVITIES. http://rajbhasha.nic.in/sites/default/files/cpolreport9-chapter1eng.pdf retrived on 16-03-2019.
  9. wodak, ruth and corson, david(ed) (1997). "encyclopedia of language and education: language policies and political issues in education".ISBN 978-0-7923-4928-0. spinger.
  10. Meganathan, Ramanujam. (2011). Language policy in education and the role of English in India: From library language to language of empowerment Ramanujam Meganathan.
  11. Lakshmikanth.M (2015). "Indian Polity", McGraw Hill Education (India) Private Limited.ed-5.
  12. The central government’s language policy http://www.axl.cefan.ulaval.ca/asie/inde-3pol-union.htm retrieved on 20-03-2019.

మూలాలు[మార్చు]

  1. Schiffman, Harold F (2002). Linguistic Culture and Language Policy. usa: routledge. ISBN 0-415-18406-1.