వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 18వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు.

అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టర్‌లకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టర్ ప్రకాశంను కూడా బారిస్టర్ అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీలాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టర్ అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.

1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు....పూర్తి వ్యాసం: పాతవి