Jump to content

ఓ.హెన్రీ

వికీపీడియా నుండి
(ఓ. హెన్రీ నుండి దారిమార్పు చెందింది)
ఓ.హెన్రీ
Portrait of O. Henry, by W. M. Vanderweyde, 1909
పుట్టిన తేదీ, స్థలంవిలియం సిడ్నీ పోర్టర్
(1862-09-11)1862 సెప్టెంబరు 11
గ్రీన్స్ బరో, నార్త్ కరోలినా
మరణం1910 జూన్ 5(1910-06-05) (వయసు 47)
న్యూయార్క్ నగరం
కలం పేరుఓ.హెన్రీ, ఒలివర్ హెన్రీ[1]
వృత్తిరచయిత
జాతీయతఅమెరికన్

విలియం సిడ్నీ పోర్టర్ (సెప్టెంబర్ 11, 1862 – జూన్ 5, 1910) ఓ.హెన్రీ అనే కలం పేరుతో కథలు రాసిన ప్రఖ్యాత అమెరికన్ రచయిత. తన కథా రచనల్లో ఒక చురుకుదనం, ఆసక్తి, హాస్యం, ఉత్కంఠ, ఉద్రేకాన్ని చొప్పించి సరళమైన శైలిలో ఆశర్యకరమైన ముగింపులతో పాఠకుల మనసులను చూరగొన్నాడు. ఓ.హెన్రీకి మాములు ప్రజలు, ప్రదేశాలు అంటే అంతో ఆసక్తి ఉండేదని అయన కథలు తెలియజేస్తాయి. ముఖ్యంగా న్యూ యార్క్, మిగిలిన నగరాలలో, మురికి వాడల్లో నివసించే అతి సామాన్య ప్రజా, తాగుబోతులు, పోలీసులు, అంగళ్ళలో, బార్లలో పనిచేసే అమ్మాయిలు, గుమాస్తాలు, సంసారం చేస్తున్న భార్యాభర్తలు, వాళ్ళ పాట్లు, ప్రేమికులు - వాళ్ళ ఇక్కట్లు, ఇంటి యజమనురాళ్ళు ఓ.హెన్రీ కథలలో ముఖ్య పాత్రలు. ధనవంతులు కూడా కథలలో దర్శనమిస్తుంటారు.

ఈ సామాన్య ప్రజల వేషభాషలు, దుస్తులు, హవభావాలు, ఆలోచనలు, కష్టసుఖాలు, ఆవేశాలు, ఆహార వ్యవహారాలు మనకు కళ్ళకు కట్టినట్లు, హాస్యాన్ని, మానవతా దృక్పధాన్ని సమపాళ్ళలో మేళవించి, మనముందు నిలబెడతాడు . ఓ. హెన్రీ కథలు చాలామటుకు సమకాలీన పరిస్త్తితులను, పరిసరాలను మనకు తెలియజేస్తాతాయి.

సాహిత్యలోకానికి వాణిజ్యపరంగా కథలను ప్రవేశపెట్టిన ఘనత ఓ.హెన్రీ దే. తన ప్రత్యేక శైలిలో రాసిన కథలతో అమెరికాలోను, ఇతర దేశాలలోను ఎన్నో తరాలను ప్రభావితం చేసాడు ఓ.హెన్రీ. పాఠకులకు అతి త్వరగా ప్రీతి పాత్రుడై పోయాడు. అతడు కథల్ని అతి వేగంగా రాసేవాడు. కానీ వాటిని ఒకసారి తిరిగి చదవటం అలవాటు చేసుకోలేదు. గొప్ప జనాదరణ పొందాడు.

బాల్యం

[మార్చు]

విలియం సిడ్నీ పోర్టర్ సెప్టెంబర్ 11 1862 లో నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బరోకి దగ్గరలో పుట్టారు. తండ్రి అల్జెర్నన్ సిడ్నీ పోర్టర్ వైద్యుడు. తల్లి మేరీ జేన్ విర్జీనియా స్వైమ్మ్ పోర్టర్. అతనికి మూడేళ్ళ వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. 1865 లో తల్లి మరణం తర్వాత సిడ్నీ పోర్టర్ తండ్రి గ్రీన్స్ బరోకి తన నివాసం మార్చుకున్నారు.

చదువు

[మార్చు]

పోర్టర్ మేనత్త అయిన ఎవెలినా మేరియా పోర్టర్ నిర్వహించే పాఠశాలలో 1876 లో విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత లిండ్సే ఉన్నత పాఠశాలలో చేరాడు. అతనికి పదిహేనేళ్ళ వయసు వరకూ అతని మేనత్తే అధ్యాపకురాలిగా వ్యవహరించింది. 1879 లో అతని మావయ్య నిర్వహిస్తున్న ఔషధ దుకాణంలో చేరి 1881 వరకూ పనిచేసి పంతొమ్మిదేళ్ళ వయసులో ఫార్మాసిస్టుగా లైసెన్స్ సంపాదించాడు.

రచనలు

[మార్చు]

ఓ హెన్రీ కథల్లో విశిష్టత ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కథ కూడా మనం వూహించినట్లు వుండదు. చివరలో ఒక కొసమెరుపు మొత్తం కథ నే మార్చివేస్తుంది. కథ చదువుతున్నంత సేపూ పాఠకుడు వూహిస్తున్నదానికీ భిన్నమైన ముగింపుతో కథ ముగుస్తుంది. ఆ రకంగా ఆ కథలు, వాటిని సృజించిన రచయిత ఓ హెన్రీ ఇద్దరూ పాఠకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. దాదాపు 600 కు పైగా కథలు రాసి అమెరికన్ సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కథా రచయిత .

ఈయన రాసిన కథలలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కథలు కొన్ని :

The gift of the Magi ( విజ్ఞుల బహుమతులు )

The Skylight Room ( ఆకాశ గవాక్షం)

The Third Ingredient ( మూడవ దినుసు)

The last leaf ( చిట్ట చివరి ఆకు)

The cop and the Anthem ( పొలిసు - భక్తి గీతం ).

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1882 లో సిడ్నీ పోర్టర్ డాక్టర్ జేమ్స్ కె. హిల్ తో కలిసి టెక్సాస్ రాష్ట్రాన్ని చూద్దామని వచ్చారు. శాన్ ఆంటోనియాలో హిల్ కి చెందిన రాంచ్ లో వున్నంత కాలం పుస్తకాలు చదువుకుంటూ గడిపేశారు. 1884 లో రిచర్డ్ హిల్ తో కలిసి పోర్టర్ ఆస్టిన్ కి వచ్చారు. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు ఆస్టిన్ లోనే ఆయన వుండిపోయారు. ఆస్టిన్ లో వున్నప్పుడు ఒక సిగార్ స్టోర్ లోనూ, మందుల షాప్ లోనూ, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనూ పనిచేశారు. మంచి గాత్రం వున్న పోర్టర్ గిటార్, మాండలిన్ వాయించేవారు. ఆస్టిన్ లో వున్నప్పుడే పోర్టర్ కి అతోల్ ఎస్టేట్స్ తో పరిచయమయింది. అతోల్ తల్లితండ్రులు వీరి ప్రేమను వొప్పుకోకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళిచేసుకున్నారు. 1889 లో వీరికి ఒక పాప పుట్టింది. పేరు మార్గరెట్. అప్పట్లో ఆయనకు నెలకు వంద రూపాయల జీతంవచ్చేది. ఇదే సిడ్నీ పోర్టర్ జీవితంలో అతి సంతోషకరమైన సమయం. ఆ తర్వాత ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది. ఉద్యోగం పోవడంతో సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ ఫస్ట్ నేషనల్ బాంక్ లో టెల్లర్ గా చేరారు. 1894 లో బాంక్ లో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నపుడే సిడ్నీ పోర్టర్ “ The Rolling Stone” ( ది రోలింగ్ స్టోన్ ) అనే వారపత్రికను ప్రచురించేవారు. ఈ వారపత్రికలో పేరుకు తగ్గట్లు ఎక్కువగా హాస్య రచనలు, కథలు, కవితలు . కార్టూన్లు, ఉత్తరాలు ప్రచురితమయ్యేవి. ఈ వారపత్రిక బాగానే అమ్ముడు పోయేది. హాస్య చతురత, కథ చెప్పే విధానంలో అద్భుతమైన శైలి వీటన్నింటితో సిడ్నీ పోర్టర్ కి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఇవేమీ ఆయనను ఆర్థికంగా నిలదొక్కుకొనివ్వలేదు. కుటుంబ పోషణ కష్టం కావటంతో సిడ్నీ ఏడాది తర్వాత పత్రిక మూసివేశాడు. పత్రిక మూతపడటం ఒక రకమైన నష్టం అయితే బాంక్ లో నిధుల స్వాహా బయటపడటం సిడ్నీకి ఎదురైన మరో పెద్ద కష్టం. ఉద్యోగం పోగొట్టుకొని ఆరునెలల పాటు దుర్భరమైన నిరుద్యోగాన్ని సిడ్నీ కుటుంబం అనుభవించింది. “ The Houston Post” తమ పత్రికకు రచయితగా తీసుకోవటంతో సిడ్నీ ఆస్టిన్ వదిలి హ్యూస్టన్ వెళ్ళాడు. ఈ పత్రికలో సిడ్నీ రాసిన కాలమ్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. అక్కడ నుంచి సిడ్నీ ఒక రచయితగా తన కెరియర్ ను ప్రారంభించాడు. అయితేహ్యూస్టన్ లో ఈ రకమైన జీవితం కేవలం 8 నెలల పాటు మాత్రమే గడిచింది. ఆస్టిన్ బాంక్ లో నిధుల కుంభకోణం విచారణకు రావడంతో సిడ్నీ భార్య, పిల్లలను ఆస్టిన్ కి పంపేశాడు. అయితే కుటుంబం, స్నేహితుల ముందు కోర్టు విచారణ ఎదుర్కొలేననుకున్న సిడ్నీ రైలెక్కి న్యూ ఆర్లీన్స్ కి, అక్కడ నుంచి ఓడెక్కి హోండూరస్ కి వెళ్ళాడు. హోండూరస్ లో ఆరునెలల పాటు వుండటం వల్ల సిడ్నీకి తన రచనలకు కావలసిన బోలెడంత సమాచారం దొరికింది కానీ భార్యా పిల్లలను కలుసుకోవటం మాత్రం వాస్తవంగా సాధ్యం కాలేదు. క్షయ వ్యాధితో బాధపడుతున్న భార్య బాగోగులుచూసుకునేందుకు తప్పనిసరిగా సిడ్నీ ఆస్టిన్ వచ్చి చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. 1897 లో భార్యను పోగొట్టుకున్న ఏడు నెలల తర్వాత సిడ్నీ కేసు విచారణ జరిగింది. ఈ సమయంలో నే సిడ్నీ మొదటి చిన్న కథను ఒక నేషనల్ పబ్లికేషన్ కొనుక్కుంది. తన మూడు రోజుల కోర్టు విచారణలో సిడ్నీ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు.అయితే సాక్ష్యాలు మాత్రం అతడిని అపరాధిగా నిలబెట్టాయి. నేరం నిర్ధారణ కావటంతో అయిదు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఒహాయో లోని కొలంబస్ లోని ఫెడరల్ జైలుకి సిడ్నీని పంపారు. ఇక ఆ తర్వాత సిడ్నీ టెక్సాస్ కి తిరిగి రాలేదు.

జైల్లో వున్నప్పుడు సిడ్నీ తన రచనా వ్యాసంగం మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగారు. అక్కడ వున్నపుడే ఆయన ఓ.హెన్రీ అనే కలం పేరు పెట్టుకొని కథలు రాశారు.మూడున్నర ఏళ్లకే జైలు నుంచి బయటకు వచ్చేనాటికి ఓ.హెన్రీ కలం పేరు కింద దాదాపు 14 కథలు ప్రచురితమై మంచి రచయితగా పేరు సంపాదించుకున్నాడు.

1902 లో ఒహాయో జైలు నుంచి బయటకు వచ్చాక, పిట్స్ బర్గ్ లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న కూతురు మార్గరెట్ తో కొద్ది కాలం గడిపాడు. రచనా వ్యాసాంగం మీద జీవనం గడపటానికి గాను పబ్లిషర్స్ కి దగ్గరలో వుండేందుకు గాను న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. నిరంతరం మేల్కొని వుండే ఆ నగరం సిడ్నీకి ఎన్నో రకాలుగా స్ఫూర్తి నిచ్చింది. చివరకు అదే ఆయన స్థిర నివాసమయింది. విజయపు అంచులను ఆయన చవి చూచినది అక్కడే. జైల్లో వున్నప్పుడు రాసి ప్రచురితమైన కథలకు మంచి పేరు రావడంతో, అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన “ The New York World Sunday Magazine”తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ప్రతి వారం వారికి ఒక కథను అందించారు. ఆయన జీవితం లోని చివరి ఎనిమిది సంవత్సరాల్లో సిడ్నీ పోర్టర్ మొత్తం 381 కథలు రాశారు.ఆయన కథల్లోని సామాన్య పాత్రలు, హాస్యం, చదివింపచేసే శైలి, కథను నడిపించే విధానం, పదాల ఎంపిక, వూహించలేని మలుపులు, పాత్ర చిత్రణ ఇవన్నీ కూడా ఆయనను అమెరికాకు చెందిన ఉత్తమ కథకుడిగా తీర్చిదిద్దాయి.

మరణం

[మార్చు]

ఓ.హెన్రీకి దక్కిన కీర్తి సిడ్నీ పోర్టర్ గా ఆయనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. జూదం, తాగుడు లాంటి వ్యసనాల వల్ల పబ్లిషర్స్ నుంచి ముందే పెద్ద మొత్తంలో పొందిన అడ్వాన్స్ లకు సరిపడా ఎప్పటికప్పుడు రచనలు సాగించాల్సి వచ్చింది. ఒకప్పుడు బాంక్ టెల్లర్ గా పనిచేసిన సిడ్నీ తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవహారాలను కానీ, తన ఆరోగ్యాన్ని కానీ సరిగ్గా చూసుకోలేకపోయాడు. డయాబిటీస్, లివర్ సంబంధిత వ్యాధి, గుండెజబ్బులతో 48 ఏళ్లకే ఓ.హెన్రీగా ప్రపంచ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిడ్నీ పోర్టర్ జూన్ 5, 1910 వ తేదీన కన్ను మూశాడు. ఓ.హెన్రీగా ఆయన కన్ను మూసి వందేళ్లు గడిచినప్పటికీ ప్రపంచ సాహిత్యం ఆయనను మర్చిపోలేదు.

మూలాలు

[మార్చు]
  1. "The Marquis and Miss Sally", Everybody's Magazine, vol 8, issue 6, June 1903, appeared under the byline "Oliver Henry"

“ కొసమెరుపు” కథారచయిత ఓ.హెన్రీ

ఓ.హెన్రీ కథలు

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ.హెన్రీ&oldid=3851753" నుండి వెలికితీశారు