Jump to content

కావ్యాలంకార చూడామణి

వికీపీడియా నుండి
(కావ్యాలంకారచూడామణి నుండి దారిమార్పు చెందింది)

విన్నకోట పెద్దన "కావ్యాలంకార చూడామణి"లో ఛందో అంశాలతో బాటుగా, వ్యాకరణ విశేషాలు పలు పేర్కొన బడినవి. బహుళ ప్రచారాన్ని పొందిన వాటిల్లో.. కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం, అనంతా మాత్యుని చందో దర్పణం, ముద్దరాజు రామన రాసిన కవిజన సంజీవిని వంటి వాటితో పాటుగా విన్నకోటపెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి కూడా ఉంది.

దీని మూడవ ముద్రణ వేదం వేంకట రాయశాస్త్రి గారు కేసరి ముద్రాక్షరశాల, చెన్నపురిలో 1929 సంవత్సరంలో ముద్రించారు.

తెలుగునాటి ఉత్తర ప్రాంతాల్ని మధ్య యుగాల్లో పాలించిన సామంతరాజు వంశాల్లో పేరెన్నికలిగినది ఎలమంచిలి చాళుక్యులు. వెంగీ చాళుక్యుల వంశము వారు. వీరి ఆశ్రయంలో రచించబడిన ప్రముఖ లక్షణ గ్రంథమే కావ్యాలంకార చూడామణి. ఇదే తెలుగువారికి తెలుగులో అందించబడిన తొలి లక్షణ గ్రంథము.సా.శ. 1377-1407సంవత్సరముల మధ్య పాలించిన సంగీత సాహిత్య ప్రియుడైన విశ్వేశ్వర దేవచక్రవర్తి ప్రేరణచే సాహితీ ఘన రసరత్నాకరం నుండి ఒడగూడ్చి తేబడిన కబ్బపు మణి ఈ చూడామణి. దీనికర్త నియోగి బ్రాహ్మణుడు కౌశిక గొత్రీకుడు, గోవిందా మాత్యుని కుమారుడు అయిన విన్నకోట పెద్దన. ఈతడు తన గ్రంథంలో పూర్వకల్పిత శాస్త్రానుగతియైన స్వతంత్ర రచన అని చెప్పుకొన్నను, దండికావ్యాదర్సయిను, విద్యానాధుని ప్రతాపరుద్రీయం తప్పక మూలముగా గొనియుండును.

ఈ గ్రంథమును తన ప్రభువునకు అంకిత మిచ్చును.ప్రతాపరుద్రీయము వలనే అన్ని లక్షణములకు ప్రభువునే విషయముగా చేసి లక్షయములను వ్రాసినాడు. విశ్వేశ్వరుని శాసనాల్లో పేర్కొనబడిన సర్వలోకాశ్రయ, రాజనారాయణ, ధరణీ వరాహ, కరవాల భైరవ, రాయగుండ గోపాల మున్నగు బిరుదులు పెద్దన ఈ గ్రంథమున ఆతనికి వాడబడినవి.

ఇందులో గమనించవలసిన మరొక విషయము, చిత్రభాను నామ సంవత్సరమైన సా.శ.1402లో ఎలమంచిలికి ఆరు మైళ్ళ దూరంలో నున్న సర్వసిద్ది వద్ద జరిగిన భీకరయుద్ధము. ఈ యుద్ధమున విశ్వేశ్వరదేవుడు అంధ్రబలాల్ని ఎదురించి నట్లు ఈ కావ్యాలంకార చూడామణిలోను, శాసనాల్లోనూ కూడా వర్ణించబడింది.చూడామణిలో చాలా పద్యాలు విశ్వేశ్వరుని శౌర్యపరాక్రమాల్ని, యుద్ధోద్దతిని పేర్కొనేవే.వీటిలో ముఖ్యమైనవే నలభై పద్యలవరకూ ఉన్నాయి.

ఇంకా ఈ గ్రంథంలో సమకాలీక సంస్కృతీ విషయాలు, సామాజిక నిత్య జీవన వివరాలు చాలావరకు లభ్యమౌతాయి.సాధారణంగా స్త్రీలు అలంకరించుకొనే అలంకారాలు, లలాట రేఖగని బొట్టులు, నిలువు టద్దములు, క్రీడా విశేషములు, జల యంత్ర కర యంత్రాలు, వధూలావణ్యమును పటముల ద్వారా తెలుసుకొనుట, నవరస గీతములు, గోష్ఠి మున్నగునవి వర్ణించబడినాయి.లలిత కళల పోషణ ఎంత పరిపూర్ణంగా ఉండేదో మనకీ గ్రంథములో విశదమౌతుంది.ఈ కాలంలో ఇరుగుపొరుగు రాజ్యాల మధ్య సంగీత నాట్యాలు పుష్కలంగా వెల్లివెరిసినట్లు సంహాచలం శాసనాలు తెలుపుచున్నాయి.విశ్వేశ్వరుడు స్వయంగా సంగీత సరణి నేర్చిన గాంధర్వ కళాకోవిదుడుట.

చతురతతో వివిధ భాషా ప్రసంగాల చందంలో అందంగా వ్రాసిన ఈ గ్రంథంలో శాసనస్థ రాజకీయాంశాలేకాక, శాసనాలో చెప్పబడని ఎన్నో సాంఘిక జీవన విషయాలు, పేర్కొన బడిన చరిత్ర నిర్మాణంలో సాహిత్యపు విశిష్టతను ఈ కావ్యాలంకార చూడామని రుజువుచేస్తుంది.

మూలాలు

[మార్చు]