Jump to content

కృష్ణా గోదావరి బేసిన్

వికీపీడియా నుండి
(కృష్ణా గోదావరి బేసిన్‌ నుండి దారిమార్పు చెందింది)

కేజీ బేసిన్‌లో కొత్త గ్యాస్‌ నిక్షేపాలు బయటపడ్డాయి.డి6 క్షేత్రంలో భారీ నిక్షేపాలను రిలయన్స్‌ కనుగొంది. ఇప్పటి వరకు కనుగొన్న నిక్షేపాలకంటే భారీ పరిమాణంలో నిక్షేపాలు వెలుగు చూసినట్లు రిలయన్స్‌ ప్రకటించింది. బ్రిటిష్‌ పెట్రోలియంతో కలిసి రిలయన్స్‌ చేపట్టిన తవ్వకాల్లో భారీ నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి దాకా కేజీ బేసిన్‌లో సహజవాయు నిల్వలు అడుగంటుకోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. తాజా పరిణామం రాష్ట్రానికి, దేశానికి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.....

కృష్ణా గోదావరి బేసిన్‌లో గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిపోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేజీ బేసిన్‌లో భారీ నిక్షేపాలను కనుగొన్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది. గత ఏడాది కాలంగా కేజీ బేసిన్‌లో ఉత్పత్తి పడిపోవడంతో దేశ వ్యాప్తంగా పారిశ్రామిక, ఎరువులు, విద్యుత్‌ ఉత్పత్తి రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిలయన్స్‌ భారీ నిక్షేపాల అచూకీ కనుగొన్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు జరిపిన చమురు అన్వేషణల్లో లభించిన దానికంటే భారీ పరిమాణంలో హైడ్రో కార్బన్ నిల్వల్ని గుర్తించినట్లు ప్రకటించింది. బ్రిటిష్‌ పెట్రోలియం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జరిపిన సంయుక్త అన్వేషణల్లో మెసోజోయిక్‌ రిజర్వాయర్లలో 155 మీటర్ల గ్యాస్‌ పే జోన్‌ను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాంతాల్లో 18నెలల పాటు జరిపిన తవ్వకాల్లో నిక్షేపాలు వెలుగు చూశాయని ఆర్‌ఐఎల్‌, బ్రిటిష్‌ పెట్రోలియాలు సంయుక్తంగా ప్రకటించాయి. డి6 క్షేత్రంలో రిలయన్స్‌కు 60శాతం వాటా, బ్రిటిష్‌ పెట్రోలియానికి 30శాతం, నికో రిసోర్సెస్‌కు 10శాతం వాటాలున్నాయి. డి1, డి3 క్షేత్రాల కంటే రెండు వేల మీటర్ల దిగువున సముద్ర గర్భంలో 4509మీటర్ల లోతులో ఈ నిక్షేపాలు వెలుగుచూశాయి. పరీక్షా సమయంలో రోజుకు 30.6 మిలియన్ల ఘనపుటడుగుల గ్యాస్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నట్లు గుర్తించారు. పరీక్షా సమయంలో రోజుకు 2161బ్యారెళ్ల చమురు లభ్యమైంది. తాజాగా వెలుగు చూసిన నిక్షేపాలు దేశంలోనే అతిపెద్ద చమురు సంపదగా భావిస్తున్నారు. గతంలో జరిపిన తవ్వకాల్లో ఓ బావిలో లభించిన 8,900కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌, 56మిలియన్‌ బ్యారెళ్ల చమురు కంటే డి6లో ఎక్కువ సహజసంపద ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో డి6లో కొత్త నిక్షేపాలు వెలుగు చూడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చమురు అన్వేషణలు ముగిసిన ప్రాంతాల్లో కొత్త బావుల తవ్వకాలకు కేంద్రం అనుమతించింది.

రిలయన్స్‌ తవ్వకాల్లో భారీ గ్యాస్‌ నిక్షేపాలు వెలుగు చూడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా అంతకుముందు జరిగిన పరిణామాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్‌ ధరను పెంచాలంటూ రిలయన్స్‌ గత ఏడాది కాలంగా కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. మరోవైపు రాష్ట్ర అవసరాలకు గ్యాస్‌ కేటాయించాని అడుగుతున్నా లెక్క చేయకుండా తూర్పు తీరంలో లభిస్తున్న గ్యాస్‌ను ఆర్‌ఐఎల్‌ పశ్చిమ తీరానికి తరలించుకుపోతోంది. గ్యాస్‌ లభ్యత సాంకేతిక అంశాలతో ముడిపడిన అంశం కావడంతో ఈ విషయంలో రిలయన్స్‌ చెప్పిందే వేదమవుతోంది. ప్రైవేట్‌ రంగంలో సహజవాయు నిక్షేపాలను వెలికితీసేందుకు అనుమతించిన తర్వాత రిలయన్స్‌ ఈ రంగంలో విదేశీ భాగస్వామ్యంతో భారీగా పెట్టుబడులు పెట్టింది. డి1, డి3 క్షేత్రాల్లో భారీగా గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయని రిలయన్స్‌ ప్రకటించింది. ఇక 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ క్షేత్రాల్లో గ్యాస్‌ ఉగ్పత్తి తగ్గడం మొదలైంది. 23.5శాతం తగ్గుదలతో 2012లో 551.31బిలియన్ల ఘనపుటడుగుల సహజవాయువును వెలికితీశారు. అదే సమయంలో 4.94 మిలియన్‌ బ్యారెళ్ల క్రూడ్‌ ఆయిల్‌ లభించింది. 2010-11తో పోలిస్తే ఈ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2011-12 చివరి త్రైమాసికం నుంచి గ్యాస్‌ ఉత్పత్తిలో తగ్గుదల నమోదవుతూ వచ్చింది. అదే ఏడాది కేంద్రం కొత్త నిక్షేపాల వెలికితీతకు అమోదించడంతో రిలయన్స్‌ కొత్త అన్వేషణల్ని కూడా ప్రారంభించింది. డి26 పేరిట మరో కొత్త ప్రణాళికను కూడా రిలయన్స్‌ సమర్పించింది. ఓ వైపు కొత్త అన్వేషణలు జరుపుతూనే పాత బావుల్లో నీరు చేరిందని, ఇతర సాంకేతిక కారణాలతో ఉత్పత్తి తగ్గిందని రిలయన్స్‌ ప్రకటిస్తూ వచ్చింది. 2012 నాటికి రిలయన్స్‌కు కేజీ బేసిన్‌తో పాటు పన్నా, సిబిఎం, ముక్తా అండ్‌ తపతిలతో పాటు 17 గ్యాస్‌ క్షేత్రాలుండేవి. ఇవన్ని ప్రభుత్వరంగ ఓఎన్జీసితో పోటీగా గ్యాస్‌ నిక్షేపాలను వెలికితీసేవి.

కేజీ బేసిన్‌ క్షేత్రాల నుంచి ఉత్పత్తి తగ్గుతున్న సమయంలోనే గ్యాస్‌ విక్రయ ధరపై ప్రభుత్వంతో రిలయన్స్‌కు వివాదం తలెత్తిన నేపథ్యంలో రంగరాజన్‌ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2012 డిసెంబర్‌ రంగరాజన్‌ కమిటీ గ్యాస్‌ ధరను పెంచేలా ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుత గ్యాస్‌ యూనిట్‌ విక్రయధరను 4.2డాలర్ల నుంచి 14డాలర్లకు పెంచాలని సిఫార్సు చేసింది. నిజానికి ప్రస్తుతం దేశంలో ఓఎన్జీసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో 60శాతానికి పైగా గ్యాస్‌ వెలికితీత జరుగుతోంది. మిగిలిన ఉత్పత్తి ప్రైవేట్‌ రంగంలో జరుగుతున్నా దేశ అవసరాలు ఏమాత్రం తీరడం లేదని..., గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో రోజుకు 111 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి జరిగితే వినియోగం 286ఎంఎంఎస్‌సిఎండిలను దాటిపోయింది. అదే సమయలో దిగుమతుల కోసం గత ఏడాది 7లక్షల కోట్ల రుపాయల్ని ఖర్చు చేయాల్సి వచ్చిందని అందులో 879కోట్ల డాలర్ల నష్టాన్ని కేంద్రం భరించిందని పెట్రోలియం శాఖ వాదిస్తోంది. దిగుమతి చేసుకునే గ్యాస్‌ మిలియన్‌ మెట్రిక్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 15డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోందని, రంగరాజన్‌ కమిటీ సిఫార్సు చేసిన పెంపుకంటే ఇది ఎక్కువని మొయిలీ చెబుతున్నారు. గ్యాస్‌ ధర కొలిక్కి రాకముందే గత ఆర్థిక సంవత్సరంలో కూడా రిలయన్స్‌ గ్యాస్‌ వెలికితీతలో తగ్గుదలనే ప్రదర్శించింది. సహజవాయు వెలికితీతలో 39శాతం తగ్గుదలతో 33వేల కోట్ల ఘనపటడుగుల నిక్షేపాలను వెలికితీశారు. ఇక క్రూడ్‌ ఆయిల్‌ 41శాతం తరుగుదలతో 2.91 మిలియన్‌ బ్యారెళ్లు మాత్రమే లభించినట్లు చూపింది. అదే సమయంలో కొత్త నిక్షేపాల కోసం నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు రిలయన్స్‌ చెబుతూ వచ్చింది. ఫిలిప్స్‌ ఈ గ్యాస్‌ టెక్నాలజీ సాయంతో సింథసిస్‌ ప్రొసెస్‌ను వినియోగించి పెట్రోలియం కోక్‌ను వెలికితీస్తున్నట్లు చెప్పింది. గ్యాస్‌ అవసరం తీవ్రమవడంతో కొత్త క్షేత్రాల్లో అన్వేషణాలకు కేంద్రం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2013 నాటికి రిలయన్స్‌కు డి6తో పాటు ఎన్‌ఇసి 25, పిఎంటి, సిిబిఎం, సౌరాష్ట్ర, కేజీబేసిన్‌, కావేరీ, కాంబే, మహానందిలలో 9 క్షేత్రాలున్నాయని ప్రకటించింది.

గత ఫిబ్రవరి తర్వాత కేజీ బేసిన్‌లో కొత్త నిక్షేపాలతో పాటు గ్యాస్‌ ధర విషయంలో పరిణామాలు చకచక జరిగిపోయాయి. కేజి బేసిన్‌ డి6 క్షేత్రంలో రిలయన్స్‌ నిక్షేపాల గురించి ప్రకటించడానికి రెండు నెలల ముందు రిలయన్స్‌, బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థలు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపాయి. 2013 ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో డి6 క్షేత్రంలో నాలుగు ట్రిలియన్‌ ఘనపుటడుగుల నిక్షేపాలున్నాయని కేంద్రానికి వివరించారు. అంత మొత్తం గ్యాస్‌ను దిగుమతి చేసుకోవాలంటే 50బిలియన్‌ డాలర్ల ఖర్చవుతుందని, తమ ప్రణాళికను అమలు చేస్తే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 5బిలియన్‌ డాలర్ల ఖర్చుతో దేశీయంగా గ్యాస్‌ లభిస్తుందని అంచనాలు సమర్పించారు. 2012 డిసెంబర్‌ వరకు డి6 క్షేత్రంలో 2 ట్రిలియన్‌ ఘనపుటడుగుల గ్యాస్‌ను ఉత్పత్తి చేశామని, 22మిలియన్‌ బ్యారెళ్ల చమురును వెలికి తీశామని ఈ సంస్థలు వివరించాయి. అదే మొత్తంలో దిగుమతి చేసుకుని ఉంటే 35బిలియన్‌ డాలర్ల ఖర్చయ్యేదని ప్రకటించాయి. ఆ తర్వాత కొద్ది నెలలకే రిలయన్స్‌ డి6లో ధీరూభాయ్‌ అంబానీ 55పేరిట కొత్త గ్యాస్‌ నిక్షేపాన్ని కనుగొన్నట్లు ప్రకటించాయి. అదే రోజు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా గ్యాస్‌ ధర పెంపును సమర్ధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి 2004లో మొదటిసారి రిలయన్స్‌ గ్యాస్‌ వెలికితీతను ప్రారంభించినపుడు ఓఎన్జీసి యూనిట్‌ ధర 1.83డాలర్లు మాత్రమే..... కాని రిలయన్స్‌ మాత్రం 2.34డాలర్ల ధరకు ఎన్టీపిసికి గ్యాస్‌ను విక్రయించింది. 2007లో ప్రణభ్‌ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 4.2డాలర్లకు రిలయన్స్‌ గ్యాస్‌ అమ్ముకోవచ్చని సిఫార్సు చేసింది. కాని 2008 వరకు ఓఎన్జీసి 1.83డాలర్లకే గ్యాస్‌ను విక్రయించినా అత్యధిక లాభాలను పొందిన ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. ప్రణబ్‌ కమిటీ ఐదేళ్ల గడువు ముగియడంతో రిలయన్స్‌ ఏడాది కాలంగా ధర పెంచాలంటూ ఒత్తిడి చేస్తోంది. రంగరాజన్‌ కమిటీ కూడా యూనిట్‌ ధర 14.2డాలర్లకు పెంచాలని సిఫార్సు చేయడం, దీని వల్ల ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసి కూడా లబ్ధి చేకూరుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాదిస్తున్న నేపథ్యంలో కేజీ బేసిన్‌లో కొత్త నిక్షేపాలు వెలుగు చూశాయి. అయితే ఈ మొత్తం పరిణామంలో రాష్ట్రానికి దక్కే ప్రయోజనం ఏమిటన్నది మాత్రం ఎటూ తేలలేదు.