Jump to content

జి.ఎస్.ఖాపర్దే

వికీపీడియా నుండి
(ఖాపర్దే నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:జి.ఎస్.ఖాపర్దే

గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే (1854 ఆగస్టు 27 – 1938 జూలై 1) భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు, షిర్డీ సాయిబాబా యొక్క ముఖ్య భక్తుడు.[1][2][3][4]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1854 ఆగస్టు 27 న బేరర్ లోని ఇంగోలీలో జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టినా అతడెంతో కష్టపడి సంస్కృతం, ఆంగ్లభాషను చదివారు. ఆయన 1884లో ఎల్.ఎల్.బి చేసాడు. తరువాత ప్రభుత్వోద్యోగంలో చేరాడు. ఆయన 1885 నుండి 1890 వరకు మున్సిఫ్, అసిస్టెంట్ కమీషనర్ గా బెరార్ లో పనిచేసాదు. ఆయన బాలగంగాధర్ తిలక్కు సన్నిహితంగా ఉండేవారు. ఆయన తరువాత రాజకీయాలపై మక్కువతో 1890 లో ఉద్యోగానిని రాజీనామా చేసి స్వంతంగా అమ్రావతిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆయన ఎంతో గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకుని ధనవంతుడయ్యాడు. ఎన్నో గుర్రాలు, గుర్రపు బండ్లు, సేవకులు, బంధువులతో ఎప్పుడూ వారిల్లు కళకళలాడుతూ ఉండేది . అతడెంతో మంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు . స్వాతంత్ర్యోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు . ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆయన 1897 లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి అమ్రావతిలో రిసెప్షను కమిటీ చైర్మన్ గా పనిచేసాడు.[1][4] ఆయన బాలగంగాధర్ తిలక్తో కలసి 1906లో కలకత్తా వద్ద జరిగిన శివాజీ పండగలో పాల్గొన్నారు. ఆయన "లాల్-బాల్-పాల్"గా పిలివబడే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లతో కలసి ఉద్యమాలలో పాలోన్నారు.[2]

బాబాతో పరిచయం

[మార్చు]

బ్రిటిష్ వారి దుష్ప్రవర్తన భరించలేక మన ప్రజలు వారిపై తిరగబడి వారిని మనదేశం వదిలి వెళ్ళిపొమ్మని పోరాడడం వల్ల మన దేశ నాయకులను జైళ్ళల్లో పెట్టారు. వారిలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకరు . తిలక్ తో పాటు ఆయన సహాయకుడైన ఖాపర్దేను కూడా జైలులో పెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే అతనికి శిరిడీలో ఉండే బాబా గొప్పతనం గురించి తెలిసింది. వెంటనే అతడు తనను రక్షించమని బాబాను ప్రార్ధించడానికి మొట్టమొదటిసారిగా బాబాను దర్శించాడు .

బాబాకు ఖాపర్దే జన్మజన్మల నుంచీ తెలుసు. ఈ విషయం బాబా చెప్పారు. ఒక జన్మలో బాబాతో కలిసి వారి గురువుగారి దగ్గర ఖాపర్దే కూడా ఉండేవాడని ఆయన చెప్పారు. ఎన్నో జన్మల నుండే అతడికి తానూ గొప్పపేరు సంపాదించు కోవాలని, బాగా ధనవంతుడినవ్వాలని, పెద్ద పెద్ద పదవులలో ఉద్యోగం చేయాలనీ కోరిక ఉండేదిట! కీర్తి మీద, దానం మీద అతనికున్న వ్యామోహాన్ని చిన్న చిన్నగా జన్మ జన్మలకూ తగ్గిస్తూ వచ్చి ఈ జన్మలో దేశసేవగా చేసేలా తయారుచేశారు బాబా. ఈ జన్మలో అతడు సాధ్యమైనంత దేశసేవ చేసిన తరువాత అతనిని తెల్లవారు జైలుకు పంపకుండా కాపాడడమే కాకుండా అతనిలోని చెడ్డగుణాలను తగ్గించి, మంచి గుణాలను పెంచి, మంచి మార్గంలో ధర్మంగా నడిచేలా చేయడమే బాబా ఉద్దేశం. అంతేకాదు, ఖాపర్దే ద్వారా బాలగంగాధర్ తిలక్ ను కూడా భవిష్యత్తులో తన దగ్గరకు రప్పించు కోవాలనుకున్నారు బాబా.

ఖాపర్దే డిసెంబర్ 5, 1910 న శిరిడీ చేరాడు. అక్కడ సాయి దర్శనానికి పేదవారు, ధనికులు, స్త్రీలు, పురుషులు, ఉన్నత ఉద్యోగస్ధులు, పండితులు - అందరూ రావడము, వారి సమస్యలను బాబా తొలగించడమూ గమనించాడు. మొదటిసారి ఒక్కవారం రోజులు మాత్రమే బాబా సన్నిధిలో శిరిడీలో ఉన్నాడు ఖాపర్దే. ఆ తర్వాత సాయి అనుమతితో తన ఊరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అతని పరిస్ధితి ఇంకా ప్రమాదకరంగా తయారైంది. అతనిని తెల్ల ప్రభుత్వం జైలుకు పంపి అటు తర్వాత ఏ అండమాన్ దీవులకో పంపివేయవచ్చని ఖాపర్దేకు అర్ధమైంది. న్యాయవాద వృత్తిలో అతనికి రాబడి తగ్గింది. భయము, దిగులు, అనారోగ్యము తట్టుకోలేక ఒక సంవత్సరం తర్వాత డిసెంబరు 6, 1911న శిరిడీ చేరాడు. ఎందుకంటే బాబా అతడు మొదటిసారి తానను దర్శించినప్పుడే అతనితో, "ఇది నీ ఇల్లే ! నేనిక్కడ ఉండగా ఎవరికైనా భయమెందుకు?" అన్నారు. ఈసారి కూడా అతడు రాగానే తిరిగి అదే మాట అన్నారు బాబా.

బాబా అభయం

[మార్చు]

బాబా అభయమివ్వడం వల్ల అతనికి బాబా సన్నిధిలో తానున్నంతవరకు తనకు ఎటువంటి ప్రమాదమూ జరుగదన్న ధైర్యం వచ్చింది. బాబాకు ఏ క్షణంలో ఎక్కడేమి జరుగుతున్నదీ తెలుస్తూ ఉంటుందనీ, అందరి మనస్సులలోని భావాలూ ఆయనకు తేలుస్తాయనీ అర్ధమైంది. అయినా అతనికి త్వరగా తన ఊరైన అమ్రావతి వెళ్లి న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తూ జీవించాలని అనిపించేది. కానీ బాబా అతనిని పంపేవారు కాదు. తన మంచి కోసమే బాబా తనను అమ్రావతి పంపటం లేదని అతనికి తెలుసు. గనుక తనకెంతగా తిరిగి వెళ్ళాలనిపించినా సమాధానపడేవాడు. అలా బాబా ఖాపర్దేకు తనపై విశ్వాసం కోల్పోకుండా ఉండడమెలాగో నేర్పించారన్నమాట. శిరిడీలో తలదాచుకున్న ఖాపర్దేను పట్టుకోవడం తెల్ల ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. కేవలం బాబాయే వారికలా బుద్ధి పుట్టకుండా వారి మనస్సులను మార్చారు. ఆ విషయం ఆయన చెప్పారు కూడా. ఈ విధంగా ఖాపర్దేను రక్షించారు.

ఒకసారి ఖాపర్దే కుమారుడైన బల్వంత్ కు శిరిడీలో ఉండగా ప్లేగు వ్యాధి సోకింది. ఖాపర్దే భార్య బాబాను దర్శించి బల్వంత్ పరిస్ధితి వివరించింది. బాబా వెంటనే తమ కఫ్నీ నడుము పైకెత్తి తమ శరీరాన్ని చూపించారు. ఆశ్చర్యం! ఆయన ఒంటి మీద కోడి గుడ్లంత ప్లేగు బొబ్బలు నాలుగు కనిపించాయి. బాబా ఆమెతో, "చూడు తల్లీ, నీ బాధంతా నాపైకి తీసుకున్నాను!" అన్నారు .అది చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. త్వరలో బల్వంత్ కు, సాయికీ ప్లేగు తగ్గిపోయింది. అలా బాబా ఖాపర్దే కుటుంబంలో ఎవరికీ ఏ కష్టమొచ్చినా తొలగించారు.

ఒకసారి శ్రీమతి ఖాపర్దే బాబాకు నైవేద్యం తీసుకుని బాబా వద్దకు వచ్చింది . ఇంకెవ్వరు సమర్పించిన నివేదనలనూ త్రాకకుండా బాబా ఆమె తెచ్చిన నివేదనను ఎంతో ఇష్టంగా స్వీకరించారు . శ్యామా ఎంతో ఆశ్చర్యంగా బాబాను అలా ఎందుకు చేశారని అడిగాడు . అప్పుడు బాబా, "పూర్వజన్మలో ఈమె ఒక వైశ్యుని ఇంట్లోని ఆవు . అప్పుడు ఆమె నాకు త్రాగడానికి కావలసినన్ని పాలు ఇచ్చేది . మరుజన్మలో ఆమె ఒక తోటమాలి కూతురు . ఆ తర్వాత జన్మలో ఒక క్షత్రియుని కుటుంబంలో జన్మించింది . ఆ తర్వాత ఒక బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించింది . చాలాకాలం ఆమెను చూడడం సాధ్యపడలేదు . మరలా ఇప్పుడే ఆమెను చూస్తున్నాను . అందుకే ఆమె నివేదనంటే నాకంత ఇష్టం "అన్నారు . బాబాకు అందరి పూర్వజన్మలూ తెలుసన్నమాట !

ఖాపర్డేకు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేయడము ,ఎక్కువగా నిద్రపోవడమూ అలవాటు . ఈ రెండు అలవాట్లు మంచివి కావని ,వాటిని తొలగించు కోమనీ బాబా అతనికి బోధించారు . అంతేకాదు ;కీర్తి ,ధనమూ మితిమీరి సంపాదించడం చెడు దారి తీస్తుందని ,కనుక చాలా ప్రమాదకరమనీ బాబా అతనికి తెలియజెప్పారు . మనం జీవితంలో దేని గురించి ఎంతగా తాపత్రయపడినా మనకెంత ప్రాప్తముంటుందో అదే దక్కుతుందని అతనకి నేర్పారు సాయి . కాలాంతరంలో అతని స్నేహితుడైన బాల గంగాధర్ తిలక్ కూడా బాబాను దర్శించి ఆయన ఆశీస్సులు పొందాడు .

ఖాపర్దే డైరీ విశేషాలు

[మార్చు]

ఖాపర్డే కు డైరీ వ్రాయడం అలవాటు. అతడు బాబా సన్నిధిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి డైరీ వ్రాసుకున్నాడు. సాయి భక్తులకు బాబాను గురించి తెలుసుకోడానికి అతడు వ్రాసిన డైరీ ఎంతగానో ఉపయోగపడింది. అందులో అతడిలా వ్రాశాడు.

జనవరి 17,1912

"ఈ రోజు బాబా ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వారు. నవ్వు ఎంత బాగుందో! దానిని ఒక్కసారైనా చూడడానికి శిరిడీలో ఎన్ని సం॥లైనా ఉండి ఎదురు చూడవచ్చు. అది చూసి పారవశ్యంతో నన్ను నేనే మరచిపోయాను. కళ్లార్పకుండా అలా బాబానే చూస్తూ ఉండిపోయాను."[5] ఇది చదువుతుంటే బాబా చిరునవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో మనకర్ధమౌతుంది . అది చూడగలిగిన సాయి సన్నిధిని రుచి చూసిన భక్తులు ఎంత ధన్యులో !!

మరణం

[మార్చు]

జి.ఎస్.ఖాపర్డే జూలై 1 1938 న మరణించాడు. ఆయన కుమారుడు బాలకృష్ణ గణేష్ కాపర్దే కూడా భారతీయ న్యాయవాది, నాయకుడు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
  • Rigopoulos, Antonio (1993), The life and teachings of Sai Baba of Shirdi, SUNY Press, ISBN 0-7914-1267-9.
  • Ruhela, S.P (1993), The Immortal Fakir of Shirdi, Diamond Pocket Books (P) Ltd., ISBN 81-7182-091-3.
  • Sinha, P.B (1971), A New Source for the History of the Revolutionary Movement in India, 1907–1917. The Journal of Asian Studies, Vol. 31, No. 1. (Nov., 1971), pp. 151–156, Association for Asian Studies, ISSN 0021-9118.
  • Wolpert, Stanley (1989), Tilak and Gokhale:Revolution and Reform in the making of Modern India, Oxford University Press, ISBN 0-520-03339-6.
  • Yadav, B.D (1992), M.P.T. Acharya, Reminiscences of an Indian Revolutionary, Anmol Publications Pvt ltd, ISBN 81-7041-470-9.
  • Ekkirala, Bharadwaja (1975), Saibaba The Master, Sri Manga Bharadwaja Trust, Hyderabad., archived from the original on 2015-11-25, retrieved 2016-01-02.