Jump to content

గాడ్ ఆన్ ద హిల్

వికీపీడియా నుండి
(గాడ్ ఆన్‌ ద హిల్ నుండి దారిమార్పు చెందింది)
పుస్తక ముఖచిత్రం

వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ ద్వయం ఇటీవల వెలువరించిన మరోగ్రంథం గాడ్ ఆన్ ద హిల్ (God on the Hill). దీన్లో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జీవన, సాహిత్యాల విశ్లేషణ, ఎంచి కూర్చిన 91 పదాలకు ఆంగ్లానువాదాలు వున్నాయి. ఇదివరకు వీరే When God is a customer అనే గ్రంథంలో అన్నమయ్య కృతుల్ని కొన్నిటిని అనువదించారు గాని అక్కడ ప్రాధాన్యత క్షేత్రయ్యది. ఇప్పుడు అన్నమయ్య కవిత్వం మీద ప్రత్యేక దృష్టి సారించారు.

అన్నమయ్య పదాల్లో ఇప్పుడు మనకు దొరుకుతున్నవి కొన్ని వేలున్నాయి (ఆయన రాసినవి పదమూడు వేలని వాళ్ళ మనవడు చిన తిరుమలయ్య చెప్పినా అవన్నీ ఇప్పుడు దొరకటం లేదుట). వాటి నుంచి 91 ఎంచుకోవటం చాలా క్లిష్టమైన సమస్యే. ఆయన భావనా పరంపరలోని వివిధ అంశాలను స్పృశించే పదాలను ఎన్నుకోవటానికి మంచి ప్రయత్నం జరిగింది ఈ గ్రంథంలో. మూలాలు తెలియక పోయినా చక్కగా చదివి ఆనందించగలిగే అనువాదాలు అందించారు.

ఒక ఉదాహరణ

[మార్చు]

  Born a man.
  Serves another man.
  Suffers every day.

  Goes into every wretched place
  and begs for a morsel to eat.
  Craves for the place he was born.
  That's why he's never free.

  Born a man.

  God is born in all of us.
  Grows in all of us.
  Is all of us.
  If a man chooses him,
  he goes where no one else can go.

  Born a man.

సాహిత్యభాషగా తెలుగుకి చివరిరోజులు వస్తున్నాయని నాకు చాలా అనుమానం. దీనికి ముఖ్య కారణాలు - తెలుగు వచ్చిన వాళ్ళ సంఖ్య ఒక తరాన్నుంచి తరువాతి తరానికి విపరీతంగా పడిపోవటం, ప్రజ్ఞావంతులు తెలుగుకి దూరంగా పారిపోవటం, తెలుగు వల్ల ఆర్థికలాభం కనపడకపోవటం, అందువల్ల ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళ భాషగానే తెలుగు వెనకపడిపోవటం - అని అనిపిస్తున్నది నాకు. సంప్రదాయ తెలుగు సాహిత్యాన్ని చదివేవాళ్లు, చదివి అర్థం చేసుకోగలవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారిప్పుడు. ముందుతరంలో ఇంకా తగ్గిపోబోతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.

తిరుమల విశేషాలు

[మార్చు]

పుస్తకం చివర్లో అన్నమయ్య గురించి, ఆయనకూ తిరుమల దేవాలయానికీ ఉన్న సంబంధం గురించి వివరించిన అనేక నూతనవిషయాలు నాకు ఈ గ్రంథంలో ముఖ్యంగా నచ్చాయి. అందరికీ ఆసక్తికరంగా ఉండే అంశాలివి. కొద్దిగా ఆలోచిస్తే తిరుపతి గురించి ఎవరికైనా కొన్ని ధర్మసందేహాలు కలగక మానవు.

  1. మొదటిది, వేంకటేశ్వరుడు వడ్డికాసుల వాడు కావటం వెనక అసలు (చారిత్రాత్మకమైన) కథేమిటి? అప్పులూ వడ్డీలు ఆర్థిక విషయాలు. సామాన్యంగా గ్రామదేవతల గురించి వాడుకలో వున్న కథల్లో ఇలాటి నేలబారు ఐహిక విషయాలు వింటాం - ఆ పూజామూర్తులు నిజానికి ఇటీవలి కాలంలో (అంటే మహా ఐతే కొన్ని వందల ఏళ్ల నాడు) మన మధ్య తిరిగిన మనుషులు కనుక. అంతేకాని త్రిమూర్తులు, ఇతర ప్రధాన దేవతల గురించి కాదు. మరి విష్ణ్వవతారమైన వెంకటేశ్వరుడికి వీటితో పనేమిటి? తిరుపతి చుట్టుపక్కల వున్న దేవతల్ని పరిశీలిస్తే ఒక వింత విషయం బయటపడుతుంది - వీళ్ళు చాలా విలక్షణమైన దేవతలు. గోవిందరాజులు, అలమేలు మంగ, గంగమ్మ, వెంకటేశ్వరుడు - ఇది చాలా అసాధారణమైన కలయిక. ఈ స్థలంలోనే ఇలా ఎందుకు జరిగింది?
  2. రెండవది అన్నమయ్య అసలు కథ ఏమిటనేది. ఆయన మనవడు చిన తిరుమలయ్య నాటికే ఆయన్ను నందకాంశ సంభూతుడుగా చేసి మనుష్యప్రపంచం నుంచి దూరం చేశారు. దేవుళ్ల పుట్టుకల గురించి విచారించటం మన సంప్రదాయం కాదు. భక్తిగా విని పరవశించటానికి అనుకూలంగా మనమే వాళ్ళ గురించిన కథల్ని మలుచుకుంటాం. అన్నమయ్య విషయంలోనూ ఇదే జరిగింది - ఇటీవలి సినిమాలో చూపించినట్టు. ఐతే భక్తికీ శాస్త్రీయ పరిశీలనకీ చుక్కెదురు కాదు. రెండూ ఏకకాలంలో సాధ్యమే. కనుక అన్నమయ్య అసలు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండటం తప్పుకాదు.
  3. మూడవది మగవాడైన అన్నమయ్య స్త్రీల మనోభావాల్ని ఎంతో నిశితంగా, సూక్ష్మభేదాల్ని కూడ విశదం చెయ్యగల భాషను సృష్టించుకుని మరీ ఎలా చిత్రించగలిగాడన్నది. ఆయనకు కొద్దికాలం తర్వాత వచ్చిన పెద్దన, తిమ్మన, భట్టుమూర్తి లాటి గొప్పకవుల స్త్రీపాత్ర చిత్రణతో పోలిస్తే అన్నమయ్య పురోగామిత్వం మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తిరుపతి గంగమ్మ జాతరలో పురుషులు స్త్రీల వేషాలు వేసుకోవటమనే ఆచారం ఇప్పటికీ ఉంది. దీని వెనుక మరుగున పడ్డ చారిత్రక విషయాలేమైనా ఉన్నాయా? వాటిలో గ్రామ దేవతల పూజారుల పాత్ర ఏమిటి?

మూలాలు

[మార్చు]