ధూమపానం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మే 2017) |
పొగ త్రాగడం లేదా ధూమపానం అనగా పొగాకు సేవించే అలవాటు. ఇది మిక్కిలి ప్రమాదకరమైనది.
నేపధ్యం
[మార్చు]కాల్చినా, నమిలినా, పక్కనుంచి పొగ పీల్చినా హానిచేసే పొగాకు ఉత్పత్తులు దేశార్థికానికీ తీరని నష్టం కలిగిస్తున్నట్లు పలు నివేదికాంశాలు స్పష్టీకరిస్తున్నాయి. మనదేశంలో 'పొగాకు వ్యాధుల' చికిత్స నిమిత్తం ఒక్క 2011లోనే ఆర్థిక వ్యవస్థపై పడిన భారం లక్షకోట్ల రూపాయలకు మించిపోయింది. ఆ ఏడాది స్థూల జాతీయోత్పత్తిలో 1.16శాతంగా లెక్కతేలిన మొత్తం, అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య పద్దుకింద చేసిన ఖర్చుకన్నా ఎక్కువ! పొగాకు ఉత్పత్తులపై వసూలవుతున్న సుంకాలకన్నా, వాటి వాడకంవల్ల దాపురిస్తున్న మహమ్మారి రోగాల చికిత్సకు చేస్తున్న ఖర్చే ఎన్నో రెట్లు అధికమని 2004నాటి అధ్యయన నివేదిక నిగ్గుతేల్చింది. దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలాన ఆయా కుటుంబాలమీద రూ.40వేల కోట్లకుపైగా వ్యయభారం పడుతున్నట్లు ఆనాడు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. ధూమపానం, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం పుణ్యమా అని నష్టం మరింత తీవరించినట్లు కొత్త నివేదిక తెలియజెబుతోంది! 'భారత ప్రజారోగ్య ఫౌండేషన్ (పీహెచ్ఎఫ్ఐ) ' అంచనాల ప్రకారం, పొగాకు సేవనంతో అకాలమరణాల కారణంగా దేశం ఏటికేడు భారీయెత్తున నష్టపోతూనే ఉంది. పొగాకు వాడకాన్ని ఉద్యమస్థాయిలో నిరుత్సాహపరచకపోతే 2020నాటికి ఏటా కోటీ పది లక్షలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదని ఫౌండేషన్ నివేదిక హెచ్చరిస్తోంది.
అనర్ధాలు
[మార్చు]పొగాకు అలవాటు కారణంగా ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ఏటా 4.9 మిలియన్ మరణాలు ఇదే కారణంగా సంభవిస్తున్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలో 10.9 శాతం మంది ఏదో రూపంలో పొగాకు తీసుకుంటున్నారు. ఇందులో 82 శాతం మంది దీని వల్ల సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారు. 9 లక్షల మంది ప్రతి ఏటా మృత్యువాత పడుతున్నారు. 90 శాతం వూపిరితిత్తుల కేన్సర్లకు పొగ తాగడమే ప్రధాన కారణం. 35 శాతం నోటి క్యాన్సర్లు పొగాకు నమలడం ద్వారా వస్తున్నాయి. పొగ తాగే వారితోపాటు దానిని పీల్చడం వల్ల కుటుంబంలో ఇతరుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. మిగతా వారితో పోల్చితే పొగాకు అలవాటున్న వారిలో 2-3 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పాశ్చాత్య ప్రభావం, ప్రపంచీకరణ ఫలితంగా మహిళల్లోనూ ఈ అలవాటు పెరుగుతోంది.
సినిమాలు, టీవీలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రభావంతో చిన్నతనం నుంచే పొగాకు బానిసలవుతున్నారు. దీంతో 20-25 ఏళ్లకే ఎంతోమంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరాలలో పబ్ కల్చర్, హుక్కా సెంటర్లు పెరుగుతున్నాయి. వారాంతాలు ఇక్కడ గడిపేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. పబ్ కల్చర్ వల్ల నెమ్మదిగా పొగాకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా స్నేహితులతో దమ్ము కొట్టినా...చివరికి అలవాటు కింద మారుతోంది. సిగరెట్, సింగార్, బీడీ, తంబాకు, గుట్కా ఇలా ఏ రూపంలో తీసుకున్నా అది శరీరానికి హానికరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు నోటిలో పెట్టి నమలడం ద్వారా నోరు పొక్కడం తద్వారా ఓరల్ కేన్సర్, గొంతు చిన్నగా మారడం, మాట్లాడలేకపోవడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థి దశ నుంచే ఈ అలవాటు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం.
సరదాగా మొదలైన ధూమపానాన్ని అలవాటుగా మార్చి వ్యసనంగా దిగజార్చే లక్షణం నికొటిన్‌కి ఉంది. సిగరెట్ పొగలో నికొటిన్‌తోపాటు దాదాపు నాలుగువేల రసాయనాలుంటాయి. వాటిలో పందొమ్మిది క్యాన్సర్ కారకాలు! ఈ వాస్తవాలు విస్తృత వ్యాప్తిలోకి వచ్చి ఇతర దేశాల్లో ధూమపానం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లో మనదేశంలోనే పొగదాసుల జనాభా 33.8శాతంనుంచి 23శాతానికి పడిపోగా, స్త్రీలలో ధూమపానం జోరెత్తడం విస్తుగొలుపుతోంది. 1980నాటికి 53లక్షలున్న వారి సంఖ్య ఇప్పుడు కోటీ 22లక్షలకు ఎగబాకింది. దేశీయంగా మహిళల్లో సంతానలేమి, క్యాన్సర్ కేసుల పెరుగుదలకు ధూమపానానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రస్ఫుటమవుతోంది. పొగతాగడంపై నిషేధాంక్షల్ని అమలుపరుస్తున్న అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో నెలలు నిండని జననాలు, పిల్లల్లో ఉబ్బసం కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అందుకు విరుద్ధంగా, దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలాన ఆరోగ్య సమస్యల ఉత్పాతం తీవ్రంగా ఆందోళనపరుస్తోంది! ఇండియాలో నేడు ధూమకేతుల మొత్తం సంఖ్య సుమారు పదకొండు కోట్లు. గుట్కా, పాన్‌మసాలా వాడకందారులకు అంతే లేదు. పొగాకు వినియోగంవల్ల క్యాన్సర్లు, గుండెజబ్బులతోపాటు మధుమేహం, కీళ్లవాతం, అంధత్వం తదితర సమస్యలూ కమ్ముకుంటాయని తాజా అధ్యయనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. జనచేతనపై దృష్టి నిమగ్నం చేయడంద్వారా ఇతర దేశాలెన్నో సత్ఫలితాలు సాధిస్తుండగా- పన్నుల పెంపు, నామమాత్ర హెచ్చరికలకే పరిమితమవుతున్న దేశీయ ఉదాసీన ధోరణులు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. తాజా పరిశోధనల్లో ధూమపానం వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించాయి.
మహిళల్లో పెరుగుతున్న అలవాటు
[మార్చు]నగరాలలో పాశ్చాత్య పోకడల కారణంగా మహిళల్లో పొగతాగే అలవాటు పెరుగుతోంది. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లలో పురుషులు 56 శాతం వరకు ఉంటే...అదే మహిళల్లో ఈ సంఖ్య 44 శాతం వరకు ఉన్నట్లు నివేదికలు ఘోషిస్తున్నాయి. పబ్, పేజ్-3 కల్చర్‌తో పొగ తాగుతున్న మహిళలు కొందరైతే...తంబాకు, గుట్కా తదితర రూపంలో నోటి ద్వారా నములుతున్న వారు కూడా ఉన్నారు. అట్టడుగు వర్గాల మహిళలు పొగాకు వివిధ రూపాల్లో తీసుకొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పొగ తాగే మహిళలు గర్భం దాల్చినప్పుడు శిశువులు అనేక రూపాల్లో పుట్టే ప్రమాదం ఉంది. పిల్లలు పుట్టినా వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. తల్లికి ధూమపాన అలవాటు ఉంటే తద్వారా పిల్లలకు కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యవయస్సులోకి రాగానే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు పెలుసు బారడం) వంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
పక్కవారి పొగ పీల్చినా ప్రమాదమే
[మార్చు]పొగ తాగే వారితోపాటు ఆ పొగ పీల్చే వారిలో 30 శాతం వూపిరితిత్తుల కేన్సర్లు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని 2004లో కేంద్రప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధించింది. పాఠశాలలకు సమీపంలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. మైనర్లుకు వీటిని విక్రయించకూడదు. గుట్కా, పాన్‌మసాలాలు అమ్మరాదు. నగరంలో ఈ చట్టం చట్టుబండలైంది. మచ్చుకైనా అమలు కావడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉన్నా పట్టించుకునే వారే లేరు. పార్కులు, సినిమా హాళ్లు, కళాశాలలు, మార్కెట్లు ఇలా అన్ని చోట్లా పొగరాయుళ్లు రెచ్చిపోతున్నారు.
4 వేల రసాయనాలు
[మార్చు]పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇందులో 400 రకాలు కేన్సర్ కారకాలే. మృత దేహాలను భద్రపరచడానికి వాడే రసాయనాలు, బొద్దింకలను చంపడానికి వాడేవి, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు వినియోగించే రసాయనాలు, నాఫ్తలీన్ గోలీల్లో ఉండే రసాయనాలు పొగాకులో నిక్షిప్తమై ఉంటాయి. పొగ తాగడం వల్ల వూపిరితిత్తులతోపాటు అది వెళ్లే మార్గంలో ఉన్న స్వరపేటిక, నాలుక, పెదాలతోపాటు గొంతు, ఆహారనాళం కూడా దెబ్బతింటాయి. వూపిరితిత్తుల్లో ఉండే ఇన్‌ఫెక్షన్ ఆహార నాళంలోకి వచ్చి మ్యూకస్ పొర దెబ్బతింటుంది. అల్సర్లు, ఇరిటేషన్, ఎసిడిటీతో ప్రారంభమై చివరికి కేన్సర్‌గా రూపాంతరం చెందుతుంది.
నివారణ చర్యలు
[మార్చు]సిగరెట్ల రేట్లు పదిశాతం మేర పెంచితే, వాటి వాడకం నాలుగైదు శాతందాకా తగ్గుతుందని భారత్‌లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఆ రాబడి పెంపుదలనే చూస్తూ- పొగాకు వ్యాధుల చికిత్స వ్యయభారాన్ని, అపార మానవ వనరుల నష్టాన్ని ఇన్నేళ్లూ పట్టించుకోని హ్రస్వదృష్టి నేతలు ప్రజారోగ్యాన్ని పణంపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు పరిశ్రమ తీరుతెన్నుల్ని క్షుణ్నంగా ఔపోసన పట్టిన ప్రపంచబ్యాంకు ఆర్థికవేత్త హొవార్డ్ బార్నమ్, పొగాకు అంతిమంగా నష్టాలే కొనితెస్తుందని ఏనాడో నిగ్గుతేల్చారు! ప్రజారోగ్య పరిరక్షణతో పోలిస్తే పన్నుల రాబడి ఏమంత ప్రధానం కాదని నిర్ధారించుకున్న ఐస్‌లాండ్, కెనడా, మెక్సికో లాంటిచోట్ల మూడు దశాబ్దాల్లో పొగరాయుళ్ల సంఖ్య ఇంచుమించు 60శాతం మేర పడిపోయింది. డెన్మార్క్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితరాల్లోనూ 45శాతానికిపైగా నియంత్రణ సుసాధ్యమైంది. పొగాకు వినియోగంతోపాటు వివిధ రకాల ఉత్పత్తుల్నీ నిషేధించిన మొట్టమొదటి దేశంగా భూటాన్ నాలుగేళ్లనాడు చరిత్ర సృష్టించింది. దేశంలో 60లక్షలమంది పొగాకు రైతులున్నట్లు అంచనా. వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, గిరిజన తండాలు, వ్యాపారులు మొత్తం ఆరుకోట్ల మందికిపైగా జీవనం పొగాకుతోనే ముడివడి ఉంది. తగు ప్రోత్సాహకాలతో అంచెలవారీగా పంట మార్పిడికి ఆసరా ఇచ్చి, కార్మికుల బతుకులు వీధిన పడకుండా ప్రత్యామ్నాయ జీవిక చూపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పొగాకు ఎంత ప్రమాదకరమో పాఠ్యాంశాల్లో బోధించాలి. వూరూరా జనజాగృత కార్యక్రమాలు నిర్వహించాలి.
బయటి లంకెలు
[మార్చు]- BBC Headroom Archived 2013-01-13 at Archive.today - Smoking advice
- Cigarette Smoking and Cancer – National Cancer Institute
- Smoking & Tobacco Use – Centers for Disease Control
- Treating Tobacco Use and Dependence – U.S. Department of Health and Human Services
- How to stop smoking Archived 2010-08-16 at the Wayback Machine – National Health Service UK
- NY Times: Responses to the targeting of teenage smokers