బరోడా రాష్ట్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బరోడా రాష్ట్రం ప్రస్తుత గుజరాత్‌లో ఒక రాచరిక సంస్థానంగా ఉండేది. ఇది 1721లో ఏర్పడినప్పటి నుండి 1949లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన అధినివేశ రాజ్యంలో భాగమయ్యే వరకు మరాఠా గైక్వాడ్ రాజవంశంచే పాలించబడింది. బరోడా నగరం (వడోదర) దాని రాజధానిగా ఉంది. బ్రిటీష్ రాజ్ సమయంలో బ్రిటీష్ వారితో దాని సంబంధాలను బరోడా రెసిడెన్సీ నిర్వహించేది. 1901లో రాష్ట్ర ఆదాయం రూ. 13,661,000.[1] 1949 మే 1 న బరోడా అధికారికంగా భారత అధినివేశ రాజ్యంలో భాగమైంది. దీనికి ముందు రాష్ట్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.[2]

చరిత్ర[మార్చు]

బరోడా అనే పేరు వడోదర అనే ప్రాంతీయ నామం నుంచి ఏర్పడింది. వడోదర అనేది వటోదర (వటవృక్షం మధ్య భాగం) అనే సంస్కృత పదానికి రూపాంతరం. 17వ శతాబ్దానికి చెందిన ప్రేమానంద్ భట్ అనే గుజరాతీ కవి ఈ ప్రాంతానికి వడోదర అనే పేరుతో బాటు వీరక్షేత్ర, వీరావతి (వీర భూమి అని అర్థం) అనే పేర్లు కూడా ఉన్నాయి అని పేర్కొన్నాడు. మొదటి ఆంగ్లేయ యాత్రికులు దీనిని బ్రోడెరా అని పేర్కొన్నారు. అందునుంచే బరోడా అనే పేరు వచ్చింది.[3] భౌగోళికంగా ఇది ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1000 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అనేక విడి భూభాగాలను కలిగి ఉంది. ఇవి నాలుగు ప్రాంతాలుగా విభజించబడ్డాయి. అవి కడి, బరోడా, నవ్సారి, అమ్రేలి. ద్వారక సమీపంలోని ఓఖమడల్, డయ్యూ సమీపంలోని కోడినార్ ఈ రాష్ట్రంలోని తీర ప్రాంతాలు.[4]

మరాఠాలు మొదటిసారిగా 1705లో గుజరాత్‌పై దాడి చేశారు. 1712 నాటికి, మరాఠా నాయకుడు ఖండే రావు దభాడే ఈ ప్రాంతంలో శక్తివంతంగా ఎదిగాడు. 1716లో ఆయన సతారాకు తిరిగి వచ్చినప్పుడు, అతన్ని సేనాపతి (కమాండర్ ఇన్ చీఫ్) గా నియమించారు. ఆ తర్వాత 1721లో "బాలాపూర్ యుద్ధం" సమయంలో, అతని అధికారులలో ఒకరైన దామాజీ గైక్వాడ్‌కు షంషేర్ బహదూర్ లేదా విశిష్ట ఖడ్గవీరుడు అనే బిరుదు లభించింది. దామాజీ 1721లో మరణించాడు. అతని తర్వాత అతని మేనల్లుడు పిలాజీరావు వచ్చాడు.[5]

ఆ విధంగా 1721లో మరాఠా జనరల్ పిలాజీ గైక్వాడ్ మొఘలుల నుండి సోన్‌గఢ్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు బరోడా రాష్ట్రం స్థాపించబడింది. దీనికి ముందు మరాఠా సామ్రాజ్య ప్రధాన మంత్రి అయిన పేష్వా పిలాజీరావును గుజరాత్ నుండి ఆదాయాన్ని సేకరించేందుకు అధికారిగా నియమించాడు. మరాఠా రాజులు మొఘలుల నుండి సూరత్‌కు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను స్వాధీనం చేసుకుని సూరత్ సర్కార్‌ స్థాపించారు. 1866 వరకు సోన్‌గఢ్ "హౌస్ ఆఫ్ గైక్వాడ్" యొక్క ప్రధాన కార్యాలయంగా ఉంది.[6][7] రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-1805) తరువాత, ఈస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్‌లోని చాలా భాగాన్ని మరాఠాల నుండి స్వాధీనం చేసుకుంది. అయితే బరోడాకు చెందిన గైక్వాడ్‌లు బ్రిటీష్ వారితో ప్రత్యేక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతర్గత స్వయంప్రతిపత్తిని నిలుపుకోవడం కోసం బ్రిటిష్ ఆధిపత్యాన్ని, ఇంకా రాష్ట్ర విదేశీ వ్యవహారాల నియంత్రణను అంగీకరించే అనుబంధ కూటమిలోకి ప్రవేశించారు.

మూలాలు[మార్చు]

  1. "Imperial Gazetteer of India, Volume 7, page 25". dsal.uchicago.edu. Digital South Asia Library. Retrieved 12 July 2020.
  2. "Rulers Farewell Message". The Indian Express. 1 May 1949.
  3. Gazetteer, p. 25
  4. Gazetteer, p. 26
  5. Gazetteer, p. 31, 32
  6. "280 years ago, Baroda had its own Navy". The Times of India. 27 September 2010. Archived from the original on 3 November 2012.
  7. Gazetteer, 32