రాఘవేంద్రస్వామి
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595 - 1671)[1], హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూలరాముడి, శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లో లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి బుక్ చేసుకోవచ్చు.[2] ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.[3]
జీవితం
[మార్చు]రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు, గోపికాంబ అనే కన్నడ భట్టు రాజుల రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత, వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, దేవతార్చన. "శ్రీ రాఘవేంద్రస్వామి". eenadu.net. ఈనాడు. Archived from the original on 6 July 2017. Retrieved 6 July 2017.
- ↑ "మంత్రాలయము". EENADU. Retrieved 2022-04-13.
- ↑ "మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-13. Retrieved 2022-04-13.
బయటి లింకులు
[మార్చు]- Official site of Mantralaya
- A page on Sri Raghavendra at Dvaita.org Archived 2009-01-29 at the Wayback Machine
- మంత్రాలయం గురించి ఒక వ్యాసం Archived 2003-06-30 at the Wayback Machine