మెదడుకు రక్తప్రసరణ
మెదడుకు రక్తం ఆంతర గళ ధమనులు , వెన్ను ధమనులు ద్వారా ప్రసరిస్తుంది. రెండు పక్కలా గళ ధమనులు కంఠంలో బాహ్య గళ ధమనులు, ఆంతర గళ ధమనులుగా చీలుతాయి.
ఆంతర గళ ధమనులు (ఇంటర్నల్ కెరాటిడ్ ఆర్టెరీస్) కపాలం లోనికి ప్రవేశించి పురో మస్తిష్క ధమనులు అనే శాఖలు ఇస్తాయి. పురో మస్తిష్క ధమనులు మెదడులో లలాట భాగాల ముందు భాగాలకు రక్తప్రసరణ చేకూరుస్తాయి[1].
రెండు పురో మస్తిష్క ధమనులు ఒకదానితో మరొకటి పురో సంధాన ధమని ద్వారా కలుపబడుతాయి[2].
పురో మస్తిష్క ధమని శాఖలు ఇచ్చిన పిదప ఆంతర గళ ధమనులు మధ్య మస్తిష్క ధమనులుగా కొనసాగి లలాట భాగపు వెనుక భాగాలకు, పార్శ్వ భాగాలకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.
వెన్ను ధమనులు కపాలం లోనికి వెనుక నుంచి ప్రవేశించి, కపాలంలో కలసి మూలిక ధమనిగా ఒకటవుతాయి.[3]
మూలిక ధమని మజ్జాముఖానికి ( మెడుల్లా ఆబ్లాంగేటా ), వారధికి ( పాన్స్ ) చిన్నమెదడుకు శాఖలిచ్చి రెండు పృష్ఠ మస్తిష్క ధమనులుగా చీలుతుంది. పృష్ష్ఠమస్తిష్క ధమనులు మెదడు వెనుక భాగాలకు, కర్ణభాగాలకు రక్తంను ప్రసరింపజేస్తాయి.
ప్రతి పృష్ఠ మస్తిష్క ధమని నుంచి పృష్ఠ సంధాన ధమనిగా ఒక శాఖ వెలువడి ఆంతర కంఠధమనితో కలుస్తుంది.
సంధాన ధమనులతో కలుపబడి మస్తిష్క ధమనులు మెదడు క్రింద భాగంలో ధమనీ చక్రం (ఆర్టీరియల్ సర్కిల్ ఆఫ్ విల్లిస్) ఏర్పరుస్తాయి[1].
మస్తిష్కమునుండి రక్తం బాహ్య సిరల జాల వ్యవస్థ , అంతర సిరల జాల వ్యవస్థల ద్వారా వివిధ సిరాపరిఖలకు చేరి ఆపై అంతర కంఠసిరలకు కొనిపోబడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Gray's Anatomy 2008, p. 247.
- ↑ "ACKNOWLEDGEMENTS", Gray's Anatomy, Elsevier, pp. x, 2008, retrieved 2023-05-04
- ↑ Gray's Anatomy 2008, p. 250.