మేడమెట్లు (కథా సంపుటి)

వికీపీడియా నుండి
(మేడ మెట్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మేడమెట్లు
కృతికర్త: బుచ్చిబాబు
అంకితం: శివరాజు సూర్యప్రకాశరావు (రచయిత తండ్రి)
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథల సంపుటి
ప్రచురణ: దేశి కవితామండలి, విజయవాడ
విడుదల: మే 1951
పేజీలు: 104

తెలుగు నవలా సాహిత్యంలో బుచ్చిబాబుది చాలా ప్రసిద్ధమైన పాత్ర. బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది నవల చాలా ప్రసిద్ధమైన నవల. సుమారు 82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక-నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయ చరిత్రకు చెందిన మొదటి భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు బుచ్చిబాబు రాశారు.

ప్రస్తుత పుస్తకం బుచ్చిబాబు రచించిన కథల సంపుటి. దీనిని దేశి కవితా మండలి, విజయవాడ వారు మొదటిసారి 1951 మే నెలలో ప్రచురించారు. దీనికి సంపాదకులుగా బొందలపాటి శకుంతలాదేవి, బొందలపాటి శివరామకృష్ణ వ్యవహరించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తండ్రిగారికి అంకితం ఇచ్చాడు. ఈ పుస్తకంలోని కథలు అంతకు ముందు కిన్నెర, స్వతంత్ర, శిల్పి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఇందులోని కథలు

[మార్చు]
  • మేడమెట్లు
  • నన్ను గురించి కథ వ్రాయవూ ?
  • దేశం నాకిచ్చిన సందేశం

కథల సంక్షిప్త పరిచయం

[మార్చు]

మేడమెట్లు

[మార్చు]

ఈ కథలో అరుణ, అధికారి, దౌర్భాగ్యుడు ప్రధాన పాత్రలు. ‘అధికారి’ ‘దౌర్భాగ్యుడు’ వీళ్ళిద్దరూ మిత్రులు. అధికారి అరుణ భర్త. దౌర్భాగ్యుడు ఆమె చిన్ననాటి ప్రియుడు. మనిషిలో ఉండే ‘రెండుతరహాల ప్రవృత్తులకూ వేర్వేరు సంకేతాలు. ఐశ్వర్యంపట్ల, అధికారం పట్ల మనిషికి ఉండే ఆకాంక్షకు సంకేతం ‘అధికారి’ అయితే – సౌందర్యపిపాసకు, అలౌకికమైన శాశ్వత విలువలకు, సంకేతం ‘దౌర్భాగ్యుడు’ ! – పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రవృత్తులలో దేనినీ వరించలేక వీటిమధ్య జరిగే సంఘర్షణలో ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యే సగటు మనిషికి ‘అరుణ’ సంకేతం. దౌర్భాగ్యుడు తన చిననాటి ప్రియురాలితో ఆడుకున్నది మేడమెట్ల మీద. ఆమెకోసం కలవరించింది మేడ మెట్లమీద. కథ చివర్లో అధికారి కూతురు కళ్యాణిని చూచి, తన చిననాటి స్నేహితురాలిగా భావించి, ఆవేశంతో మేడమీదనించి దిగుతూ కాలుజారి పడి చనిపోయింది గూడా మేడమెట్లమీదనే ! అతని జీవితకథలో మేడమెట్లకు గల స్థానం అత్యంత ముఖ్యమైంది. దౌర్భాగ్యుడి ప్రేమకథను పెనవేసుకున్న మరొక విషయం అరుణ ఉంగరం. ఆ ఉంగరాన్ని అతడు విడిచిపెట్టడు. అరుణకు ఆ ఉంగరం దౌర్భాగ్యుడి దగ్గిర ఉండడమే ఇష్టం. ప్రతిసారి అది తనకు తిరిగి ఇచ్చెయ్యమని అడగడం, దానికోసం దౌర్భాగ్యుడితో పోట్లాడడం – అతనిపట్ల గల మమకారాన్ని దానికి విరుద్ధమైన భావంగా వ్యక్తీకరించడమే! అయితే, ఆమె బ్రతుకనేర్చింది. దౌర్భాగ్యుడు కోరుకున్నట్టుగా ఆమె నగలన్నీ విడిచేసి పువ్వుల్ని ప్రేమించలేదు. అందుకే అధికారానికి అర్థాంగి అయింది. అయినప్పటికీ ఆమె దౌర్భాగ్యుణ్ణి మరచిపోలేదనడానికి కారణం భర్తకు నచ్చకపోయినా, పట్టుపట్టి ఇదివరకు తాను చిన్నతనంలో దౌర్భాగ్యుణ్ణి (అతని పేరు అదే అనుకుంటే) కలుసుకున్న ఇంటికి ఉన్నట్టుగానే సరిగ్గా అదే ఇరవైమూడు మెట్లున్న మేడను అద్దెకు తీసుకునేలా చెయ్యడం. కాని, ఆమె ఎప్పుడూ మేడ దిగివచ్చేది కాదు. ఆ మెట్లు దిగిరాగలిగితే ఆ రోజేఆమె దౌర్భాగ్యుడికి అంకితమై పోయేది ! దౌర్భాగ్యుడి చేతికి ఉన్న ఉంగరాన్ని అరుణ తీయించడం మధురమైన జ్ఞాపకాలను తన గుండెల్లో భద్రపరచుకోవడానికి ఆమె చేసిన మరో ప్రయత్నంగా భావించవచ్చు[1].

నన్ను గురించి కథ వ్రాయవూ?

[మార్చు]

ఈ కథలో తన గురించి కథ రాయమని రచయితని అడుగుతుంది కుముదం. “నీలో ఏముందని నిన్ను గురించి కథ వ్రాయనూ?” అంటాడతను. ఆమెకి చదువు లేదు, సంగీతం రాదు, ఆమెది ప్రేమ విహావం కూడా కాదు, ధనవంతురాలు కాదు, మరీ పేదది కాదు, పద్యాలు రాద్దామంటే అందగత్తె కాదు, అలా అని అనాకారీ కాదు. సాధారణమైన వాళ్ళ గురించి రాయడానికి ఏముంటుందని అనుకుంటాడు. కాని ఆమెతో సంభాషిస్తున్నకొద్దీ తాను అనుకున్నంత అమాయకురాలు కాదమె అని అర్థం చేసుకుంటాడు. ఆరు గంటల పరిచయంతో, ఆరు వందల మాటలతో తన ప్రపంచాన్నే తలక్రిందులు చేసిందని గ్రహిస్తాడు[2].

దేశం నాకిచ్చిన సందేశం

[మార్చు]

ఈ కథలో ఆర్థిక అంశాల ప్రాబల్యాన్ని తాత్విక చింతనతో చిత్రించడం కనపడుతుంది. ఇది ప్రత్యక్షంగా కుటుంబ సంబంధాలను ప్రస్ఫుటపరిచే కథ కానప్పటికీ పరోక్షంగా ఆ స్ఫురణ కథని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. కథలోని ప్రధానపాత్ర జీవితంలోని వివిధ దశల్లో అతని ఆర్థిక స్థితిగతుల్ని అంచనా కట్టడంకోసం అనేకమంది అడిగిన ప్రశ్న అతనికి జీతం ఎంత వస్తుంది అన్నది. ఆ ప్రశ్న వెనుక ఉన్న ఫిలాసఫీని రచయిత విశ్లేషించిన తీరువల్ల ఆ ప్రశ్న అడగడానికి అతని కుటుంబపు స్థాయిని ఎదుటివారు అంచనా వేయడానికీ మధ్య ఉన్న పోలిక పాఠకునికి అందుతుంది. కుటుంబాన్ని సమర్ధవంతంగా నడపడానికి ఆర్థిక అంశాలు ఎంత ముఖ్యమని లోకం భావిస్తుందో ప్రధాన పాత్ర ఎదుర్కొన్న ప్రశ్నలే బోధపరుస్తాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. కోడూరి శ్రీ రామమూర్తి (1 April 2005). "బుచ్చిబాబు కథలు – మనోవైజ్ఞానిక దృక్పథం". విహంగ. Archived from the original on 22 జూన్ 2020. Retrieved 21 June 2020.
  2. కొల్లూరి సోమశంకర్. "అంతశ్చేతనని తట్టి కుదిపే "బుచ్చిబాబు కథలు"". పుస్తకం. నెట్. Retrieved 21 June 2020.
  3. కె.ఎన్.మల్లీశ్వరి (7 December 2015). "బహుళత్వం బుచ్చిబాబు కథల తత్వం". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 22 జూన్ 2020. Retrieved 21 June 2020.