లక్ష్మి

వికీపీడియా నుండి
(లక్ష్మీదేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లక్ష్మీ
సంపద యొక్క దేవత
రాజా రవివర్మ గీసిన గజలక్ష్మీ
సంపద, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క దేవత [1]
ఇతర పేర్లుశ్రీ[1]
దేవనాగరిलक्ष्मी
సంస్కృత అనువాదంlakṣmī
అనుబంధందేవి, త్రిదేవి
నివాసంవైకుంఠం[2]
భర్త / భార్యవిష్ణువు[3]
తోబుట్టువులుఆలక్ష్మీ (పెద్ద సోదరి)
వాహనంఏనుగు, గుడ్లగూబ[4]
పండుగలుదీపావళి, లక్ష్మీపూజ, వరలక్ష్మీ వ్రతం,నవరాత్రి

లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది.

సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట [5]. ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.

మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు[6]. సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే[7][8][9][10]

బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయుడు - వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు.[11]

హైందవ సంప్రదాయంలో స్థానం[మార్చు]

హళేబీడులో లక్ష్మీ నారాయణుల శిల్పాలు.

హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.[12] లిప్యంతరీకరణ

ఋగ్వేదంలో అక్కడక్కడ లక్ష్మి, శ్రీ అనే పదాలు కనిపిస్తాయి.కాని ఋగ్వేదంలో ఎక్కడా సంపదకు సంబందించిన విశేషమైన దేవతగాని, దేవికాని కనిపించదు.సంపదలకు ఇంద్రుడు, అశ్వినీ కుమారులు, మొదలగు దేవతలను యాచించేవారు.ఋగ్వేదంలో అక్కడక్కడా స్తీ దేవతలు కనిపిస్తారు.

యజుర్వేదకాలం నాటికి శ్రీ మరియు లక్ష్మి పరమ పురుషుని పత్నులుగా వెలుగులోకి వచ్చారు.అధర్వణవేదం కాలం మొదట్లో శ్రీ పదాన్ని సంపతి, ఐశ్వర్యం అనే అర్ధాన్ని స్ఫురిస్తాయి.ఈ కాలంలో శ్రీ కి లక్షికి అంతగా బేధం ఉన్నట్లు కనిపించదు.కాని లక్ష్మిని పొందడానికి బలి ఇవ్వడం అన్నది ఈకాలంలోనే మొదలైంది.మొహంజెదారోలో లభించిన ఒక నాణెంపై దేవి సమక్షంలో ఒక మేకపోతు ఉన్నట్లు కనిపిస్తుంది. అధర్వణ వేదకాలానికి యిద్దరు లక్ష్ములు వెలిసారు.ఒక లక్ష్మి మంచిది.మరొకటి పాపి. ఒకటి ఆర్యుల శ్రీదేవి.పాపిలక్ష్మి అనార్యుల దేవి.అవే లక్ష్మి, అలక్ష్మి.

పురాణకాలం నాటికి లక్ష్మి, విగ్రహారాధన పూర్తిగా ప్రచారం లోనికి వచ్చింది కాని, యజ్ఞయాగాదుల పట్లప్రజల విశ్వాసం తగ్గుతూ వచ్చింది.పురాణకాలం నాటికి లక్ష్మికి చక్కటి రూపకల్పన జరిగి పోయింది.పూజా విధానం కూడా వెలుగులోకి వచ్చింది.బ్రహ్మ పురాణంలో వర్ణించబడిన లక్ష్మి మరియు దరిద్ర దేవతల మధ్య జరిగిన కధనం చాల చక్కగా ఉంటుంది.దాని సంగ్రహమే లక్ష్మీ దేవే రుక్మిణి, సీతగా వివిధ కాలాలలో అవతరించిందిగా వర్ణించబడినది.లింగ పురాణంలో కూడా లక్ష్మీ దేవి సముద్రం నుంచే ఉద్భవిస్తుంది.

పురణకాలం నాటికి లక్ష్మికి, యక్షిణిలతో సంబంధం పూర్తిగా విడిపోయింది.గుడ్లగూబ లక్ష్మీవాహనంగా గుర్తించబడింది.విష్ణుపత్ని అయిన కారణంగా గరుడపక్షి కూడా లక్ష్మికి వాహనమే.

గుడ్లగూబ లక్ష్మికి వాహనంగా ఎలా మారిందో ఒక కధ వర్ణించబడినది.పూర్వకాలంలో ఒక వృద్ధదంపతులు ఉండేవారు.వారికి కటికదరిద్రులు.ఉన్నది ఒక్కటే గుడ్డ.ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆగుడ్డతో బయటకు వెళ్ళాలి.ఒకనాడు అలా యాచనకు వెళ్ళిన ఆబ్రాహ్మణుడు ఏమీ దొరకని కారణంతో చావాలని అనుకుంటాడు.అలా తన బాధలను తలచుకొని ఒక చెట్టు క్రింద కూర్చొని విలపిస్తాడు. అదంతా ఆచెట్టుపైనున్న గుడ్లగూబ వింటుంది.ఆవేద బ్రాహ్మణుడి ఓదార్చి తన కష్టాలను తీరుస్తానని చెప్పి ఇంటికి వెళ్ళమంటుంది.దీపావళి రోజున, ప్రతియేడు లాగానే లక్ష్మి నగరంలో ప్రవేశిస్తుంది.ఏ గడపలో కాలు పెట్టిన గుడ్లగూబ కూతవిని అపశకునంగా వెనక్కు వెళ్తుంది.చివరకు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో కాలు మొపబోతుంది.గుడ్లగూబ కూయదు.దాంతో లక్ష్మీ దేవి ఆబ్రాహ్మణుడి ఇంట్లో ప్రవేశిస్తుంది. తాను వెళ్ళదలచుకొన్న ఇంట్లోకి వెళ్ళనీయకుండా అవరోధం కలిగించిన గుడ్లగూబను తన వాహనంగా చేసుకుంటుంది.

భారతీయ నాగరికత విదేశాలలో ప్రవేశించాక విదేశాలలో కూడా ఏదో ఒక రూపంలో లక్ష్మి కొలవబడుతుంది.బాలి ద్వీపంలో హిందేషియా రాజులు లక్ష్మి రాణిరూపంలో ఉండేటట్లు భావించేవారు.జావాలో పురాతనమైన బంగారు ఆభరణాలపై శ్రీ అని వారిభాషలో వ్రాయబడినది.కాంబోడియాలో విష్ణువుతో పాటు పలు లక్ష్మీ దేవి విగ్రహాలు చెక్కబడ్డాయి.

మనకు ద్రవ్యానికి లక్ష్మి దేవత అయినట్లు, జూనో-మోనెటా స్త్రీ దేవత, రోమన్ లకు ద్రవ్యదేవత.అందుకు సాక్ష్యం అక్కడ దొరికిన నాణాలపై ఒక వైపు ద్రవ్యదేవత రెండవవైపు ద్రవ్యవిలువ ముద్రించేవారు.ఈనాడు మనం ఆగ్లపదంగా ఉచ్చరించే మనీ మోనెటా నుండే వచ్చింది.

ప్రధాన గాధలు[మార్చు]

లక్ష్మీ దేవి గురించి వివిధ గాథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.

తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.[13][14]

విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది.[15] ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీత గా, కృష్ణావతారంలో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.

వివిధ నామాలు[మార్చు]

లక్ష్మి రూప చిత్రణ

చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.

లక్ష్మి రూప చిత్రణ[మార్చు]

అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.

వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).

రంగాపురం దేవాలయంలో లక్ష్మి ప్రతిమ

యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.[12]

అష్ట లక్ష్ములు

లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇతర మతాలు, సంప్రదాయాలు[మార్చు]

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్!

జైన, బౌద్ధ కళలలో కూడా లక్ష్మీదేవి రూపకల్పన కొన్నిచోట్ల గమనించవచ్చును. గ్రీకు పురాణ దేవత ఆఫ్రొడైట్ మరియు రోమన్ పురాణ దేవత వీనస్ ల స్వరూప, కథాంశాలలోను లక్ష్మి స్వరూప కథాంశాలలోను కొంత సారూప్యత కనిపిస్తుంది.

బౌద్ధమతం సాహిత్యంలో మిళింద, పన్హ, సిరికాలకణ్ణి జాతక కథము, ధమ్మపధ అట్టకథలు శ్రీమాతను "సిరిమా" దేవతగా పేర్కొన్నాయి. ఆ కథల ప్రకారం ఆమె సౌందర్య, అదృష్ట, ప్రజ్ఞా శక్తులు ప్రసాదించే కరుణాంతరంగ. జైనమతం కల్పసూత్రం ప్రకారం వర్ధమాన మహావీరుడు జన్మించడానికి ముందు అతని తల్లికి కలిగిన స్వప్నాలలో శ్రీమాత కూడా ఉంది. సింధులోయ నాగరికతకు సంబంధించి లభించిన ప్రతిమలలో ఆభరణ భూషితలైన మాతృదేవతల ప్రతిమలున్నాయి. మౌర్యుల కాలానికి చెందిన కొన్ని శిల్పాలలో కూడా అలాంటి మాతృదేవతామూర్తులున్నాయి. ఈ మూర్తులే లక్ష్మీదేవి రూపానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చును.[12]

పూజలు, ఆచారాలు[మార్చు]

దీపావళి
శుక్రవారం
శ్రావణ శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం)

ప్రార్ధనలు[మార్చు]

లక్ష్మి దేవిని స్తుతించేందుకు పురాతనమైనవి, ఆధునికమైనవి అనేక ప్రార్థనలు, గానాలు, పద్యాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని:

మహాలక్ష్మ్యష్టకం
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||

ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగదామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
శ్రీసూక్తం
కనకథారా స్తోత్రం
అష్టలక్ష్మీ స్తోత్రం

దేవాలయాలు[మార్చు]

కొల్హాపూర్ మహాలక్ష్మి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; mmwlak అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. George M. Williams (2008). Handbook of Hindu Mythology. Oxford University Press. p. 128. ISBN 978-0-19-533261-2.
 3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; anandrao167 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. Laura Amazzone (2012). Goddess Durga and Sacred Female Power. University Press of America. pp. 103–104. ISBN 978-0-7618-5314-5.
 5. Monier-Williams Sanskrit-English Dictionary.
 6. భాగవత పురాణం:8.8.23-24
 7. Encyclopaedia of Hindu gods and goddesses By Suresh Chandra http://books.google.co.in/books?id=mfTE6kpz6XEC&pg=PA199&dq=goddess+lakshmi
 8. http://www.festivalsinindia.net/goddesses/radha.html
 9. Radha in Hinduism, the favourite mistress of the god Krishna, and an incarnation of Lakshmi. In devotional religion she represents the longing of the human soul for God: The Oxford Dictionary of Phrase and Fable | 2006 | ELIZABETH KNOWLES |
 10. Essential Hinduism By Steven Rosen|2006|p=136
 11. Kinsley, David (1988). Hindu Goddesses: Vision of the Divine Feminine in the Hindu Religious Traditions. University of California Press. ISBN 0-520-06339-2. p. 95.
 12. 12.0 12.1 12.2 "శ్రీలక్ష్మి తొలి వాగ్రూప చిత్తరువులు" - రచన: దిట్టకవి కన్నబాబు - సప్తగిరి మాసపత్రిక - జనవరి 2008 - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
 13. Pattanaik, Devdutt. Lakshmi: The Goddess of Wealth and Fortune-An Introduction. Vakils Feffer & Simons Ltd, 2003 (ISBN 81-87111-58-5)
 14. Pattanaik, Devdutt. Lakshmi: Or how my Kaamwali came to be named so?. Vakils Feffer & Simons Ltd, 2005 (ISBN 8187134385)
 15. Sankaranarayanan, S., Glory of the Divine Mother (Devī Māhātmyam), Nesma Books, India, 2001. (ISBN 81-87936-00-2), P 148.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లక్ష్మి&oldid=2719847" నుండి వెలికితీశారు