Jump to content

వికీపీడియా:ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేక కథనాలకై ప్రయత్నం

వికీపీడియా నుండి

ఎ2కె కృషిలో భాగంగా తెలుగు వికీపీడియా పురోగతి, తెలుగు వికీమీడియా సముదాయం కృషి వంటి వివిధ అంశాలు పత్రికా పాఠకులకు ఆసక్తికరమైన అంశాలుగా మలిచి కథనాలు, ముఖాముఖీలు, అభిప్రాయాలు, కాలమ్‌లుగా అంతర్జాల, ముద్రణ పత్రికల ద్వారా అందించడం లక్ష్యంగా ఈ ప్రయత్నం సాగుతోంది. ఈ ప్రయత్నం విషయమై గుర్తించాల్సిన అంశం - ఇది జరిగిన కార్యక్రమమో, కార్యశాలో వార్తగా ఇవ్వడాన్ని ప్రస్తావించడం లేదు, కథనాలు, ముఖాముఖీల ప్రభావం రీత్యా వేరుచేయడం జరుగుతోంది.

సంపద్రించిన సంస్థలు

[మార్చు]
  • తెలుగు వెలుగు - రామోజీ ఫౌండేషన్‌
    • తెలుగు వెలుగు సంస్థ వారు తెలుగు వికీపీడియన్ల నుంచి ఆసక్తికరమైన వ్యాసాలు, తెలుగు వికీపీడియాకు సంబంధించి విశేషమైన వార్తాంశాలు వారి సంపాదకత్వ నిర్ణయాలకు లోబడి ప్రచురించడానికి ఆసక్తి వెల్లడించారు.
    • తెలుగు వెలుగు వారి వద్ద ప్రస్తుతం తెలుగు వికీపీడియాకు సంబంధించిన ఒక వ్యాసం పరిశీలనలో ఉంది.
  • బాలభారతం - రామోజీ ఫౌండేషన్
    • బాలలకు ప్రత్యేకించిన ఈ పత్రిక వినోదాత్మకమైనవే కాక, విజ్ఞానాత్మకమైన అంశాలను కూడా అందిస్తున్నారు. తెలుగు వికీపీడియాను ఎలా వినియోగించుకోవచ్చు, వికీపీడియా వెనుక ఉన్న కథ ఏమిటి వంటి అంశాలను వినోదాత్మకంగా, బాలల అవగాహన స్థాయికి అర్థమయ్యేలా రాయగలిగితే ప్రచురణకు పరిగణిస్తామని తెలిపారు.
  • బీబీసీ తెలుగు
    • అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థ బీబీసీ వారు తెలుగులోనూ తమ వార్తాప్రసారాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంస్థ తెలుగు ప్రచురణలు ప్రారంభమైన కొద్ది వారాలకే బీబీసీ తెలుగు వారిని సంప్రదించి తెలుగు వికీపీడియా గురించి ప్రచురించమని కోరడం జరిగింది.
    • తెలుగు వికీపీడియా సముదాయం వైవిధ్యం, విస్తృతి తెలుపడమే కాక పలువురు వికీపీడియన్ల నేపథ్యం, దానిలోని ఆసక్తికరమైన అంశాలను వివరిస్తూ రాశాం. వారు ఆసక్తికరమైన కథనం అంటూ సుజాత-శ్రీరామమూర్తి గారల కృషిని వారు భావించడంతో వారి వివరాలను ముందస్తుగా అనుమతి తీసుకుని సంస్థ ప్రతినిధికి అందించాం.
  • సంచిక - అంతర్జాల పత్రిక
    • సంచిక పత్రిక సంపాదకులు సంప్రదించి తెలుగు వికీపీడియా సముదాయం కృషి గురించి, తెలుగు వికీపీడయా గురించి ఆసక్తికరమైన వ్యాసాలు వరుసగా వేసుకుంటామని కోరారు. ఈ నెల అభివృద్ధి చేసిన 5 మంచి తెలుగు వికీపీడియా వ్యాసాలు లేక వార్తల్లో ఉన్న అంశాలపై వికీపీడియా వ్యాసాలు, తదితర శైలిలో కూడా రాసి పంపవచ్చని సూచించారు.

సంప్రదించదలిచిన సంస్థలు

[మార్చు]

సంప్రదించగల సంస్థల పేర్లు ఇక్కడ సూచిస్తూ ఉన్నాం. సంప్రదించగలిగిన సంస్థల వివరాలు, సంప్రదించడానికి వ్యక్తుల పేర్లు కూడా చర్చ పేజీలో ఇవ్వగలరు.

  • సాక్షి (ఫన్ డే, సాహిత్యం, సంపాదకీయం)
  • ఆంధ్రజ్యోతి (ఆదివారం, సాహిత్యం, సంపాదకీయం)
  • నమస్తే తెలంగాణ (బతుకమ్మ)
  • నవ తెలంగాణ (సోపతి)
  • సారంగ అంతర్జాల పత్రిక

పత్రికా శైలి-వికీపీడియా శైలి - మౌలిక భేదాలు

[మార్చు]

కొన్ని సాధారణ-మౌలిక భేదాలను ప్రస్తావించడం వల్ల రాయదలుచుకున్నవారికి ఉపకరిస్తుందన్న ఉద్దేశంతో ఈ విభాగం రూపొందుతోంది. కేవలం భేదాలు జాబితా వేయడం వల్ల అనంతమైన-దురవగాహకమైన జాబితానే మిగులుతుంది కనుక అందుకు బదులుగా లక్ష్యం, వ్యూహాల్లో ఏ భేదం ఈ రెండు శైలులను వేరుచేస్తోందన్న అంశం అందిస్తున్నాం. కాబట్టి ఈ వ్యూహభేదాన్ని మనసులో పెట్టుకుని పత్రికలు పరిశీలిస్తే శైలి పట్టుబడుతుంది.

  • వికీపీడియా శైలిలో మౌలికంగా కనిపించే లక్షణం - పాఠకుడికి ఎంత సమయం ఉంటే అంతలో సాధ్యమైనంత విషయాన్ని వివరించడం, పాఠకుడే వ్యాసం వద్దకు అవసరం/ఆసక్తి కొద్దీ వస్తాడు. వారికి ఉన్న సమయాన్ని బట్టి కొద్ది సమయం/ఆసక్తి ఉంటే సమాచారపెట్టె, ఇంకొంత ఉంటే వ్యాస పరిచయం, ఆపైన వ్యాసం, ఇంకా కావాలంటే బయటి లంకెలు, మూలాలు చదువుకుంటూ పోవచ్చు. అందుకే మొదటి వాక్యంలోనే మొత్తం వివరించేస్తారు, వ్యాసం పేరు కూడా వివరణాత్మకంగా ఉంటుంది, వ్యాసంలో అంతా పైన వివరించిన ఔచిత్యానికి అనుగుణంగానే ఉండడం గమనించవచ్చు. ఇక్కడ పాఠకుడిని చివరి వరకూ నడిపించాలన్న ప్రయత్నంతో రాయట్లేదు.
  • సాధారణంగా పత్రికా శైలిలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. పాఠకుడు శీర్షిక, బొమ్మ చూసిన దగ్గర నుంచి చివరివరకూ చదివించడం వ్యూహంగా సాగుతుంది. అందుకే వివరణాత్మకమైన శీర్షికల కన్నా ఆలంకారికమైన శైలిలోనూ, ఆసక్తిదాయకమైన, ముడివేసి లాగేలాంటి వినూత్నమైన శీర్షికలు ఉంటాయి. అలాగే కథనం లేక వ్యాసం మొదలుపెట్టగానే వచ్చే విభాగాన్ని లీడ్ సెక్షన్ అంటారు. ఈ లీడ్ సెక్షన్లోనూ తెలుగు వికీపీడియా పద్ధతిలో మొత్తం వ్యాసానికి సారాంశంగా రాయరు. ఎందుకంటే లీడ్ చదివి పాఠకులు ముందుకువెళ్ళాలే కానీ బయటకుపోకూడదు కాబట్టి. అందులోనూ ఆలంకారికంగా ఆసక్తికరంగారాస్తూ వివరాలు వ్యాసంలో చదవమన్న సూచనతో రెండు మూడు వాక్యాల నుంచి ఒక పేరా వరకూ ఉండే లీడ్ ముగిస్తారు. ఆపైన వ్యాసంలో క్రమక్రమంగా విషయాన్ని వివరిస్తూ, ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు సాగుతారు.

వ్రాయదగిన అంశాలు

[మార్చు]

వికీపీడియా, తెలుగు వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమం వంటి అంశాలపై రాయడానికి ఎన్నైనా అంశాలుంటాయి. వాటన్నిటిని జాబితా వేయడం ఈ విభాగం లక్ష్యం కాదు. ఐతే ఆయా అంశాల్లో కొన్నిటిని, ప్రత్యేకించి తెలుగు పత్రికల పద్ధతికి అనుగుణమైనవాటిని, విస్తృత విభాగాల వారిగా పరిచయం చేయడం లక్ష్యం.

  • వికీపీడియా సముదాయం - హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీలు: వికీపీడియా సముదాయం చాలా వైవిధ్యభరితమైనది. విద్యార్థులు, గురువులు, వైద్యులు, పెద్దలు, పిన్నలు - చాలారకాల జనం ఒకచోటికి వచ్చి పనిచేయడం, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నం చేయడం చాలా ఆసక్తిదాయకమైన సంగతి. ప్రత్యేకించి ఒక్కొక్కరూ చేసిన భారీ కృషి రీత్యా ఇది మరింత ప్రత్యేకమైనది. ఈ సంగతి తెలిసేలా చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు : ఒక గృహిణి తన పిల్లల కోసం కంప్యూటర్ విజ్ఞానం తెలుసుకుని వికీపీడియాలో బృహత్తర కృషి సాగించడం ఒక వ్యక్తిత్వ వికాస పాఠమైతే, మరో వైద్యుడు తనకు రోజూ క్లినిక్లో లభించే కొద్దిపాటి సమయాన్ని కొంచెం కొంచెం కలుపుతూ చినుకు చినుకు సముద్రమైనట్టు విస్తారమైన కృషి ఎలా చేశారన్నది సమయ నిర్వహణలో గొప్ప ఉదాహరణ కాగలదు, రిటైరయ్యాకా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగ అంటూ మన వికీపీడియన్లను ఉదాహరణగా ఇవ్వవచ్చు (ఈ క్రమంలో మరికొన్ని ఉదాహరణలూ చూసుకోవాల్సివుంటుంది), ఇలా ఎన్నెన్నో మానవ ఆసక్తి కథనాలు (హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీలు అంటారు పత్రికా పరిభాషలో).
  • వికీపీడియా తెలుసు దాని వెనుక ఏముంది? - చాలామంది నోళ్ళలో నలిగి, వేళ్ళపై ఆడే డిజిటల్ బ్రాండ్లలో వికీపీడియా ఒకటి. కానైతే దీని వెనుక ఏముంది? ఈ మహాయంత్రం ఎలా సాగుతోంది? అన్నది చాలామందికి తెలియదు. తెలుసుకోవడం ఆసక్తికరంగా రాస్తే బావుంటుంది. వికీపీడియాకి తమ్ముళ్ళూ-చెల్లెళ్ళు అంటూ శీర్షిక పెట్టి (అన్నీ వికీపీడియా తర్వాతే పుట్టాయి మరి) వికీసోర్సు, విక్షనరీ, వికీమీడియా కామన్స్ ఒక్కొక్కటీ మనుషుల్లా తనని తానే పరిచయం చేసుకుంటున్నట్టు పిల్లల కోసం రాయవచ్చు. అంశం ఏదైనా కావచ్చు ఆసక్తికరంగా మలవడంలో ఉంటుంది కీలకం.
  • సమకాలీనమైన అంశాలు - పత్రికలకు ఈరోజు కీలకం, నిన్నటి వార్త పాతదైపోయినట్టే, ఇక మరి రెండు రోజులు గడిస్తే వార్తగా పనికిరాదు. ఐతే కథనం విషయంలో ఇంత పట్టుబట్టే పద్ధతి ఉండదు కానీ అక్కడా సమకాలీనత, ప్రస్తుతం అన్నవి కీలకమే. ఇటువంటి సమకాలీనమైన అంశాలు తెలుగు వికీపీడియాలో దొరికేవే కానక్కరలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు అంశాల నుంచి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు యూట్యూబ్ లో రకరకాల కుట్ర సిద్ధాంతాలకు సంబంధించిన వీడియోల పక్కన ప్రాజెక్టు విశ్వసనీయతను కాపాడుకునేందుకు ఆ అంశాలకు సంబంధించిన వికీపీడియా లింకులు ఇస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు యూట్యూబు, గూగుల్ సంస్థలు వికీపీడియాను విశ్వసనీయమైన విజ్ఞాన వనరుగా ఎందుకు పరిగణిస్తాయి అంటూ ఓ వ్యాసం రాస్తే "వికీపీడియా - విశ్వసనీయత" అన్న వ్యాసం సమకాలీనమైన అంశంతో సంబంధం లేకుండా రాసినదాని కన్నా ప్రచురణకు, పాఠకాదరణకు ఎక్కువ అవకాశం ఉంటుంది.