వెన్ను ధమనులు

వికీపీడియా నుండి
(వెన్నుధమనులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


వెన్ను ధమనులు / కశేరుక ధమనులు (Vertebral arteries) గళధమనులతో పాటు మెడకు, మెదడుకు రక్తప్రసరణ చేకూరుస్తాయి. వెన్నుధమనులు మెడలో కండరాలకు, వెన్నుపాము పైభాగానికి, మజ్జాముఖానికి (మెడుల్లాఆబ్లాంగేటా), వారధికి (పాన్స్), చిన్నమెదడుకు, పెద్దమెదడు వెనుక భాగాలకు రక్తప్రసరణ చేకూర్చుతాయి. వెన్నుధమనుల ప్రవాహంలో అడ్డంకుల వలన రక్తప్రసరణలో లోపం కలిగితే మజ్జాముఖం, వారధి, చిన్నమెదడు, పెద్దమెదడు వెనుక భాగాల పనులలో అవలక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కూడా కలుగవచ్చు.

వెన్ను ధమనుల గమనము[మార్చు]

వెన్ను ధమని

వెన్నుధమనులు ఇరుప్రక్కల బాహుధమనుల మొదటి భాగమైన అధోజత్రు ధమనుల (సబ్ క్లేవియన్ ఆర్టెరీస్) వెనుకభాగం మీది నుంచి వెలువడుతాయి[1]. ప్రతి వెన్నుధమని మెడలో మీదకు పయనించి 6 వ మెడవెన్నుపూసయొక్క అటుప్రక్క భుజములో గల రంధ్రం ద్వారా మీదకు సాగి ఆపై క్రమంగా మిగిలిన వెన్నుపూసల భుజాలలో కల రంధ్రాల ద్వారా మీదకు పయనించి రెండవ మెడవెన్నుపూస (ఏక్సిస్) భుజరంధ్రం నుంచి వెలువడుతుంది. అచటనుంచి పక్కకు ఒరుగుచు మీదకు వెళ్ళి  మొదటి మెడవెన్నుపూస (అట్లాస్) భుజరంధ్రం ద్వారా పైభాగానికి చేరుకుంటుంది. తరువాత మొదటి మెడవెన్నుపూస వెనుకచాపంపై గల గాడిగుండా వెళ్ళి పుఱ్ఱె క్రింద ఉన్న పెద్దరంధ్రం (ఫొరమెన్ మేగ్నమ్) ద్వారా పుఱ్ఱె లోపలకు ప్రవేశిస్తుంది. పుఱ్ఱెలో రెండు వెన్నుధమనులు మెదడు పైపొర డ్యూరాను, మధ్యపొర అరఖ్ నాయిడ్ ను చీల్చుకొని వాటి క్రింద మధ్యస్థంగా పయనించి  మజ్జాముఖం ముందు భాగానికి చేరుకొని, మీదకు మధ్యస్థంగా సాగి వారధి మూలం వద్ద కలసి మూలిక ధమనిగా (బెసిలార్ అర్టరీ) ఒకటవుతాయి.

వెన్ను ధమనులు

మూలిక ధమని రెండుప్రక్కల నుంచి వారధికి, చిన్నమెదడుకు శాఖలు వెలువడుతాయి. తరువాత మూలిక ధమని రెండు పృష్ఠ మస్తిష్క ధమనులుగా చీలుతుంది. పృష్ఠ మస్తిష్కధమనులు మెదడు వెనుక భాగాలకు రక్తప్రసరణ చేకూరుస్తాయి. ప్రతి పృష్ఠ మస్తిష్కధమని అటువైపు ఉన్న మధ్య మస్తిష్కధమనితో పృష్ఠ సంధానధమని అనే శాఖచే కలుపబడుతుంది. మస్తిష్క ధమనులు, సంధాన ధమనులు కలసి మెదడు క్రింద ధమనీ చక్రం ఏర్పరుస్తాయి.


వెన్నుధమనులు, మూలిక ధమనులలో రక్తప్రసరణకు అంతరాయం కలిగితే, దేహంలో ఒకపక్క గాని లేక రెండు పక్కలా గాని చలననష్టం, స్పర్శనష్టం కలగడమే కాక తలతిప్పడం, కళ్ళుతిరగడం, దేహానికి అస్థిరత (అటాక్సియా), ద్విదృష్టి (ఒక వస్తువు రెండుగా కనిపించడం) కలుగవచ్చు.

Blausen 0114 BrainstemAnatomy
మెదడు రక్తనాళాలు
  1. GRAY’S ANATOMY. New York: Barnes & Noble Books. 1995. pp. Page=496. ISBN 0-7607-2273-0.