శివసాగర్ (కవి)

వికీపీడియా నుండి
(శివ సాగర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శివ సాగర్ (కె.జి. సత్యమూర్తి) మాజీ నక్సలైటు నాయకుడు, ప్రముఖ విప్లవ రచయిత.

విప్లవ జీవితం

[మార్చు]

ఇతను 1968లో నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఆ సమయం నుంచే ఇతను శివ సాగర్ అనే కలం పేరుతో కవితలు వ్రాయడం మొదలు పెట్టాడు. ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో అతను ఒక కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. బెంగాల్ కేంద్రంగా నక్సల్బరీలో పెల్లుభికిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన చారు మజుందార్ ను కలిసి ఆంధ్రాలో నక్షలైట్ ఉద్యమ నిర్మాణానికి ముందున్న అగ్రనాయకులలో శివసాగర్ ఒకరు. శివసాగర్ కొండపల్లి సీతారామయ్య ఇద్దరూ మొదట సిపిఐ ఎం ఎల్. సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ స్థాపించారు. ఒక రకంగా ఆ పార్టీ మూల సిద్దాంత కర్తలు శివసాగర్ కొండపల్లి. శివసాగర్ పీపుల్స్ వార్ లో పనిచేస్తున్న సమయంలో పార్టీ నాయకులకి, ఇతనికి మధ్య విభేదాలు వచ్చి ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలోని అగ్రకులాల నాయకులు దళితుడైన సత్యమూర్తి పార్టీలో ఎదగనివ్వలేదన్న అభిప్రాయం దళితవర్గాలలో ఉంది.[1][2] ఉద్యమం నుంచి బయటకి వచ్చిన తరువాత కూడా ఇతను కవితలు వ్రాయడం కొనసాగించారు. ఇతను మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదాన్ని బలంగా నమ్ముతూ కృశ్చేవ్, బ్రెజ్ఞేవ్, డెంగ్ సియావోపింగ్ లాంటి రివిజనిస్ట్ నాయకుల్ని తీవ్రంగా విమర్శించే కవితలు కూడా వ్రాశాడు. పీపుల్స్ వార్ గ్రూప్ నుండి వెలివేయబడిన సత్యమూర్తి సి.పి.ఐ. (ఎం. ఎల్) ప్రజా ప్రతిఘటన (పి.పి.జి) లో చేరి ఆ బృందం యొక్క లక్ష్యాన్ని వర్గ పోరాటం నుండి కుల పోరాటం వైపు మరలించాడు. దీనితో ప్రజాప్రతిఘటన బృందంలో చాలామంది ఉద్యమకారులు విప్లవ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి ప్రధానస్రవంతిలో కలిసిపోయారు.[3]

వివాహ జీవితం

[మార్చు]

శివసాగర్ తన కుటుంబ జీవితాన్ని వదిలి పూర్తి స్థాయి విప్లవ కార్యకర్తగా మారిపోయాడు. నాటికి ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు సిద్దార్థ,ప్రసన్న రావు, శ్రీదేవి,అనుపమలు ఆయన సంతానం. తర్వాత కాలంలో ఆయన కొడుకులు కుమార్తెలు కొంతకాలం సాయుధ రాజకీయాలలో ఉన్నారు. ఆ తర్వాత సాధారణ జీవితంలో ఉన్నారు. డెబ్బయ్యో దశకంలో తన ఉద్యమ సహచరి శివపార్వతితో కలిసి ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి వారు విడిపోయారు. దాదాపు మూడు దశాబ్దాలు అజ్ఞాత జీవితంలో రెండు దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉన్న శివసాగర్ దళిత విప్లవ కవిగా తెలుగు నాట సుప్రసిద్దులు. విప్లవ కవిత్వానికి చిరునామా మారిన ఆయన రాసిన కవిత్వం 1968 నుండి 1972 వరకు రాసిన ‘గెరిల్లా విప్లవ గీతాలు, 1972 నుండి 73 మధ్యలో రాసిన ‘జనం ఊపిరితో’ అవి కలిపి ‘పది వసంతాలు’ ఉద్యమ నెల బాలుడు’ 1983 గా ఒక సంకలనం ఆనాటి విప్లవ సాహిత్యం లో ఒక జనఘోష, సాగర హోరు. 1990 సెప్టెంబర్ లో విరసం సిటీ యూనిట్ ‘నెలవంక’ మాత్రమే అ నాటికి శివసాగర్ అచ్చులో ఉన్నాడు. ఆయన కవిత్వాన్ని 1931-2012 శివసాగర్ కవిత్వం పేరుతో ప్రచురించారు. రగుల్ ప్రచురణగా వచ్చిన ఆ సంకనాన్ని డా.గుఱ్ఱం సీతారాములు ప్రచురించాడు.

విశేషాలు

[మార్చు]

శివసాగర్ తండ్రి సుప్రసన్నరావు కొంత కాలం మిలటరీలో పనిచేసాడు (రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు) తర్వాత బడిపంతులుగా కూడా పనిచేసాడు

  • కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కందులపాడు లోని తన పెద్ద కుమారుడు సిద్దార్థ ఇంట్లో16.4.2012 న శివసాగర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
  • సత్యమూర్తి కంకిపాడు మండలం పునాదిపాడులో, ఆ తర్వాత వరంగల్‌ జిల్లా ఖాజీపేటలోని సెయింట్‌ గాబ్రియేల్‌ పాఠశాలలో, ఫాతిమా పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడే కొండపల్లి సీతారామయ్య హిందీ ఉపాధ్యాయులుగా ఉన్నారు.
  • గుంటూరు కేంద్రంగా రాష్ట్ర యువజన సమాఖ్యను ఏర్పాటు చేయడంతోపాటు 'యువజన' అనే పత్రికకు సంపాదకునిగా ఉన్నారు.
  • కులాధిపత్యం నిర్మూలనకు విప్లవపార్టీలు పోరాడాలని పార్టీలో ఎజెండా చర్చకు పెట్టారు. అనంతర కాలంలో ఆయనను పీపుల్స్‌వార్‌ బహిష్కరించింది.
  • పీపుల్స్‌వార్‌ రెడ్లు, బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉందని విమర్శించారు.
  • గుంటూరుజిల్లా మంగళగిరిలో ఉన్న చార్వాక ఆశ్రమం, దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు స్థాపించిన లుంబినీ వనంలో ఉంటూ కొంతకాలం అంబేద్కర్‌ను అధ్యయనం చేశారు.
  • దళిత ఉద్యమాన్ని ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో 'సామాజిక విప్లవ సమాఖ్య'ను ఏర్పాటు చేశారు. 'ఎదురీత', 'నలుపు' పేరుతో వచ్చిన పత్రికల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంది.
  • చుండూరు ఊచకోత తర్వాత దళిత ఉద్యమ శ్రేణులతో కలిసి గ్రామంలోనే ఉండి ఉద్యమానికి ప్రేరణ ఇచ్చారు.
  • ఆయన 'ఉద్యమ నెలబాలుడు'పై అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసిన వారు పీహెచ్‌డీ పట్టాలు పొందారు.

అంబేద్కర్ సూర్యుడు

[మార్చు]

షేక్ మసూద్ బాబాతో చర్చించి సత్యమూర్తి ‘అంబేద్కర్ సూర్యుడు’ పుస్తకం రాయడం విశేషం. ఆ పుస్తకాన్ని సత్యమూర్తి తనకెంతో ప్రియమైన మిత్రుడు బాబాతో ఆవిష్కరింప చెయ్యడం బాబా పట్ల శివసాగర్ కి వున్న గౌరవానికీ, ప్రేమకూ గుర్తు.

కొన్ని గేయాలు

[మార్చు]

ఉద్యమ నెలబాలుడు', 'నర్రెంక చెట్టు కింద నరుడో భాస్కరుడా!', 'చెల్లీ చంద్రమ్మ', 'తూర్పు పవనం వీచెను'

మూలాలు

[మార్చు]
  • ఈనాడు 16.4.2012
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-04. Retrieved 2008-12-17.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-23. Retrieved 2008-12-17.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2002-11-26. Retrieved 2010-08-08.

5. https://magazine.saarangabooks.com/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%8d-%e0%b0%ac/