అమర్ బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్ బోస్
జననం
అమర్ గోపాల్ బోస్

(1929-11-02)1929 నవంబరు 2
ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, అమెరికా
మరణం2013 జూలై 12(2013-07-12) (వయసు 83)
వేల్యాండ్, మసాచుసెట్స్, అమెరికా
వృత్తిఇంజనీరు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, బోస్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు
జీవిత భాగస్వామిఉర్సులా (మరణించేదాకా)
ప్రేమ బోస్ (విడాకులు)
పిల్లలు2
విద్యా నేపథ్యం
విద్యమసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SB, SM, ScD)
పరిశోధనలో మార్గదర్శినోర్బెర్ట్ వీనర్[1]
యుక్ వింగ్ లీ
పరిశోధక కృషి
పరిశోధక శిష్యులుఅలన్ వి. ఓపెన్‌హీమ్[1]

అమర్ గోపాల్ బోస్ (1929 నవంబర్ 2 - 2013 జులై 12) బెంగాలీ అమెరికన్ వ్యాపారవేత్త, విద్యావేత్త. ఎలక్ట్రికల్ ఇంజనీరు, సౌండ్ ఇంజనీరు అయిన అమర్ బోస్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MIT) 45 ఏళ్ళ పాటు ఆచార్యుడిగా ఉన్నాడు. ఇతను బోస్ కార్పొరేషన్ కి వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. 2011 లో ఆయన తనకున్న చాలా షేర్లను MIT కి దానం చేసాడు. MIT ఈ షేర్లను అమ్ముకోలేదు, సంస్థ భాగస్వామిగా ఓటు చేయలేదు కానీ ఆ షేర్ల ద్వారా వచ్చే ఆదాయంతో విద్యా బోధన, పరిశోధనకోసం వెచ్చించగలదు.[2]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

అమర్ బోస్ 1929 నవంబరు 2 న అమెరికాలోని ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా లో జన్మించాడు. అతని తండ్రి నోనీ గోపాల్ బోస్ భారతదేశంలో బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. అతని తల్లి షార్లెట్ ఫ్రెంచి, జర్మన్ మూలాలు కలిగిన అమెరికన్ మహిళ. నోనీ గోపాల్ బోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. అతని రాజకీయ కార్యకలాపాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో నిర్బంధానికి గురై, బ్రిటీష్ పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం 1920వ దశకంలో అమెరికాకు వెళ్ళిపోయాడు. తల్లి షార్లెట్ ఫ్రెంచి, జర్మన్ మూలాలు కలిగిన ఒక పంతులమ్మ అయినా తనకన్నా బెంగాలీ లక్షణాలు కనబరచేది అని బోస్ తల్లి గురించి చెప్పేవాడు. ఆమె హిందూ తత్వశాస్త్రం, వేదాంతశాస్త్రాల మీద అత్యంత ఆసక్తి కలిగి ఉంటూ శాకాహారాన్ని భుజిస్తూ ఉండేది.[3]

బోస్ కు 13 ఏళ్ళ వయసులోనే ఎలక్ట్రానిక్స్ మీద, వ్యాపారం మీద ఆసక్తి కలిగింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తమ కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం తన బడి స్నేహితులను సహోద్యోగులుగా చేసుకుని, తమ గ్యారేజిలో రైలు బొమ్మలు, హోం రేడియోలు మరమ్మత్తులు చేసేవాడు.[4]

వృత్తి

[మార్చు]

గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత బోస్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేరాడు. ఈ తొలి రోజుల్లో బోస్ 1956 లో అధునాతన స్టీరియో స్పీకర్ సిస్టం కొనుగోలు చేశాడు. అప్పటికి అది ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడినా అందులో వచ్చే ధ్వని మాత్రం ఆయనను నిరాశపరిచింది. నేరుగా ప్రదర్శనలో విన్నట్టు ఆయనకు అనిపించలేదు. ఈ అసంతృప్తి ఆయనను రాబోయే రోజుల్లో అధునాతన స్టీరియో స్పీకర్ల మీద విస్తృత పరిశోధనకు పురిగొల్పింది. ధ్వని శాస్త్రంలో ఆయన చేసిన విస్తృత పరిశోధనలు ఇంట్లో కూర్చునే ఒక ప్రదర్శన హాలులో వినిపించే ఇంపైన ధ్వనిని వెలువరించగల స్టీరియో లౌడ్ స్పీకర్ల తయారీకి దారి తీశాయి. ఆయన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిన సైకోఅకౌస్టిక్స్ సంబంధిత పరిశోధనలు తాను భవిష్యత్తుల్లో నెలకొల్పబోయే సంస్థ పరికరాల్లో చెరగని ముద్ర వేశాయి.

1964 లో తాను స్థాపించబోయే సంస్థ పెట్టుబడి కోసం ఏంజెల్ ఇన్వెస్టర్లను సంప్రదించాడు. ఇందులో తనకు MIT లో థీసిస్ అడ్వైజర్ అయిన యుక్-వింగ్ లీ కూడా ఉన్నాడు. తన పరిశోధనా రంగంలో బోస్ కు లభించిన ముఖ్యమైన పేటెంట్లు సంస్థకు ఆయువుపట్టుగా నిలిచాయి.

1980వ దశకంలో బోస్ వాహనాల్లో ఉపయోగించే ఎలక్ట్రోమాగ్నెటిక్ షాక్ అబ్సార్బర్స్ ని కనుగొన్నాడు. ఇవి అంతకు ముందు పరికరాలతో పోలిస్తే వాహనాలను కుదుపుల నుంచి సమర్థవంతంగా రక్షిస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 అమర్ బోస్ at the Mathematics Genealogy Project
  2. "Amar Bose '51 makes stock donation to MIT". MIT. 2011-04-29. Retrieved 2012-02-05.
  3. Shivanand Kanavi (2007-07-26). "reflections: Amar Bose-A Portrait". Reflections-shivanand.blogspot.com. Retrieved 2013-07-16.
  4. "Siliconeer: January 2005". www.siliconeer.com. Retrieved 2021-11-17.
"https://te.wikipedia.org/w/index.php?title=అమర్_బోస్&oldid=3438263" నుండి వెలికితీశారు