క్యుములోనింబస్ మేఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్యూములోనింబస్ (లాటిన్‌లో క్యూములస్ అంటే 'కుప్ప' అని, నింబస్ అంటే 'జడివాన' అనీ అర్థాలు) అనేది దట్టమైన, ఎత్తైన నిలువుపాటి మేఘం. [1] ఇది సాధారణంగా దిగువ ట్రోపోస్పియర్‌లో ఘనీభవించిన నీటి ఆవిరి నుండి ఏర్పడుతుంది. ఇది శక్తివంతమైన తేలియాడే గాలి ప్రవాహాల చర్య ప్రభావంతో పైకి నిలువుగా ఏర్పడుతుంది. క్యూములోనింబస్ దిగువ భాగాల పైన ఉండే నీటి ఆవిరి, మంచు, గ్రాపెల్ వంటివి మంచు స్ఫటికాలుగా మారతాయి. వీటి పరస్పర చర్య వలన వడగళ్ళు, మెరుపులు ఏర్పడతాయి. ఉరుములతో కూడిన తుఫాను సంభవించినప్పుడు ఈ మేఘాలను పిడుగుమూలాలు అని సూచించవచ్చు. క్యూములోనింబస్ మేఘాలు ఒంటరిగా గాని, సమూహాలుగా గానీ స్క్వాల్ లైన్ల వెంట గానీ ఏర్పడుతాయి. ఈ మేఘాల నుండి మెరుపులు, సుడిగాలులు, ప్రమాదకరమైన గాలులు, పెద్ద వడగళ్ళు వంటి ఇతర ప్రమాదకరమైన తీవ్రమైన వాతావరణం ఏర్పడుతుంది. క్యూములోనింబస్ మేఘాలు బాగా తయారైన క్యూములస్ కంజెస్టస్ మేఘాల నుండి ఏర్పడి, మరింత అభివృద్ధి చెంది, సూపర్ సెల్‌లో భాగంగా అవుతాయి. క్యూములోనింబస్‌ను సంక్షిప్తంగా Cb అని అంటారు.

మెక్సికోలోని మోంటెర్రేలో క్యుములోనింబస్ కాల్వస్ మేఘం

భారీ క్యూములోనింబస్ మేఘాలు సాధారణంగా చిన్న క్యూములస్ మేఘాలతో కలిసి ఉంటాయి. క్యూములోనింబస్ పీఠం అనేక కిలోమీటర్ల మేర విస్తరించినంత పెద్దదిగా ఉండవచ్చు లేదా కొన్ని పదుల మీటర్లంత చిన్నదిగా ఉండవచ్చు. ఇది ట్రోపోస్పియర్‌లో సుమారుగా 200 నుండి 4,000 మీ. (700 నుండి 10,000 అ.) ఎత్తున ఏర్పడుతుంది. వీటి శిఖరాలు సాధారణంగా 12,000 మీ. (39,000 అ.) వరకు చేరుకుంటాయి, 21,000 మీ. (69,000 అ.) కంటే ఎక్కువ ఎత్తున ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. [2] బాగా అభివృద్ధి చెందిన క్యూములోనింబస్ మేఘాల పై భాగం చదునుగా, దాగలి (అన్విల్) లాగా ఉంటుంది. నిలువుగా పెరిగిన మేఘాలలో బాగా పెద్దవి సాధారణంగా మూడు మేఘప్రాంతాలలోనూ విస్తరించి ఉంటాయి. అతి చిన్న క్యూములోనింబస్ మేఘంతో పోల్చినపుడు కూడా చుట్టు పక్కల ఉన్న మేఘాలు పరిమాణంలో మరుగుజ్జుల లాగా కనిపిస్తాయి.

వివిధ రకాలు

[మార్చు]

ప్రభావాలు

[మార్చు]

క్యూములోనింబస్ తుఫాను కణాల వలన భారీ వర్షాలు (తరచుగా వాన స్థంభం లాగా), ఆకస్మిక వరదలు, అలాగే సూటిగా వీచే పెనుగాలులూ ఏర్పడతాయి. చాలా తుఫాను కణాలు దాదాపు 20 నిమిషాల తర్వాత సమసిపోతాయి. అవపాతం వలన్ అప్‌డ్రాఫ్ట్ కంటే డౌన్‌డ్రాఫ్టు ఎక్కువైనప్పుడు, శక్తి పలచబడిపోతుంది. అయితే, వాతావరణంలో తగినంత అస్థిరత, తేమ ఉంటే మాత్రం (ఉదాహరణకు, మండు వేసవి రోజున), ఒక తుఫాను ఘటం నుండి ప్రవహించే తేమ, గాలుల కారణంగా ఆ మేఘానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం లోనే, కొన్ని పదుల నిమిషాల లోపే కొత్త మేఘాలు ఏర్పడవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో, అనేక గంటల తర్వాత కూడా ఇవి ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియ వలన హోరువాన ఏర్పడడం (అలాగే తగ్గిపోవడం) అనేది అనేక గంటలు లేదా అనేక రోజుల పాటు కొనసాగుతుంది. క్యూములోనింబస్ మేఘాలు ప్రమాదకరమైన శీతాకాలపు తుఫానులుగా కూడా ఏర్పడవచ్చు. వీటిని "థండర్‌స్నో" అని పిలుస్తారు. ఇవి ముఖ్యంగా తీవ్రమైన హిమపాతం రేట్లు, మంచు తుఫాను పరిస్థితులలో బలమైన గాలులతో కలిసి దృశ్యమానతను మరింత తగ్గిస్తాయి. అయితే, క్యూములోనింబస్ మేఘాలు ఉష్ణమండల ప్రాంతాలలో సర్వసాధారణం. మధ్య అక్షాంశాలలో వెచ్చని సీజన్‌లో తేమతో కూడిన వాతావరణంలో కూడా తరచుగా ఏర్పడతాయి. [3] క్యూములోనింబస్ డౌన్‌బర్స్ట్ వల్ల ఏర్పడే దుమ్ము తుఫానును హబూబ్ అంటారు

విమానయానానికి ప్రమాదాలు

[మార్చు]
విమానం నుండి చూసినపుడు క్యుములోనింబస్ మేఘం

క్యూములోనింబస్ లోని శక్తివంతమైన గాలి ప్రవాహాల కారణంగా విమానయానానికి చాలా ప్రమాదకరం. అంతేకాక, దృశ్యమానత తగ్గడం, మెరుపులు, అలాగే విమానం మేఘం లోపల ప్రయాణిస్తూ ఉంటే అందులోని వడగళ్ళు కూడా ప్రమాదకరమే. ఉరుములతో కూడిన తుఫానుల లోపల, పరిసరాల్లో వరుసగా గణనీయమైన అల్లకల్లోలం, స్పష్టమైన-గాలి అల్లకల్లోలం (ముఖ్యంగా దిగువకు వీచే గాలి) ఉంటుంది. క్యూములోనింబస్ లోపల, కింద గాలి కోత తరచుగా తీవ్రంగా ఉంటుంది. శిక్షణ, సాంకేతిక అభివృద్ధి, ఇప్పటి ముందస్తు చర్యలు లేని గత కాలంలో డౌన్‌బర్స్ట్‌లు అనేక ప్రమాదాలకు కారణమయ్యాయి. డౌన్‌బర్స్ట్‌కు చిన్న రూపమైన, మైక్రోబర్స్ట్ వలన అనేక విమానాలు కూలిపోయాయి. అవి వేగంగా మొదలై, గాలి ప్రవాహాలు, ఏరోడైనమిక్ పరిస్థితులు చకచకా మారిపోవడం దీనికి కారణం. చాలా డౌన్‌బర్స్ట్‌లు వాన స్థంభాల లాగా కంటికి కనిపిస్తూంటాయి. అయితే, పొడి మైక్రోబర్స్ట్‌లు సాధారణంగా కంటికి కనిపించవు. టోర్నడో గుండా ప్రయాణించడం వలన సుడిలో చిక్కుకుని కూలిపోయిన వాణిజ్య విమాన సంఘటన కనీసం ఒకటి నమోదైంది.

జీవిత చక్రం లేదా దశలు

[మార్చు]
క్యుములోనింబస్ మేఘం జీవిత దశలు.

సాధారణంగా, క్యుములోనింబస్ ఏర్పడటానికి తేమ, అస్థిర గాలి ద్రవ్యరాశి, ట్రైనింగ్ ఫోర్స్ అవసరం. క్యుములోనింబస్ సాధారణంగా మూడు దశల గుండా వెళుతుంది: అభివృద్ధి చెందుతున్న దశ, పరిపక్వ దశ, సమసిపోయే దశ. [4] ఉరుములతో కూడిన వర్షం సగటున 24 కి.మీ.ల వ్యాసంతో, 12.2 కి.మీ. ల ఎత్తుతో ఉంటుంది. వాతావరణంలో నెలకొని ఉన్న పరిస్థితులపై ఆధారపడి, ఈ మూడు దశలు గడవడానికి సగటున 30 నిమిషాలు పడుతుంది. [5]

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. World Meteorological Organization, ed. (1975). Cumulonimbus, International Cloud Atlas. Vol. I. pp. 48–50. ISBN 92-63-10407-7. Retrieved 28 November 2014.
  2. Haby, Jeff. "Factors Influencing Thunderstorm Height". theweatherprediction.com. Retrieved 15 July 2016.
  3. "Flying through 'Thunderstorm Alley'". New Straits Times. 31 December 2014. Archived from the original on 18 June 2018.
  4. Michael H. Mogil (2007). Extreme Weather. New York: Black Dog & Leventhal Publisher. pp. 210–211. ISBN 978-1-57912-743-5.
  5. National Severe Storms Laboratory (15 October 2006). "A Severe Weather Primer: Questions and Answers about Thunderstorms". National Oceanic and Atmospheric Administration. Archived from the original on 25 August 2009. Retrieved 1 September 2009.