Jump to content

నికరాగువా సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 11°37′N 85°21′W / 11.617°N 85.350°W / 11.617; -85.350
వికీపీడియా నుండి
నికరాగువా సరస్సు
2005 జూన్ లో నికరాగువా సరస్సు
ప్రదేశంSouthern Nicaragua
అక్షాంశ,రేఖాంశాలు11°37′N 85°21′W / 11.617°N 85.350°W / 11.617; -85.350
సరస్సు రకంRift lake
వెలుపలికి ప్రవాహంSan Juan River
పరీవాహక విస్తీర్ణం41,600 కి.మీ2 (16,062 చ. మై.)[1]
ప్రవహించే దేశాలుNicaragua
గరిష్ట పొడవు161 కి.మీ. (100 మై.)
గరిష్ట వెడల్పు71 కి.మీ. (44 మై.)
ఉపరితల వైశాల్యం8,264 కి.మీ2 (3,191 చ. మై.)
గరిష్ట లోతు26 మీ. (85 అ.)
నీటి ఘనపరిమాణం108 కి.మీ3 (26 cu mi)
ఉపరితల ఎత్తు32.7 మీ. (107 అ.)
Islands400+ (including Islets of Granada, Ometepe, Solentiname Islands, and Zapatera)
ప్రాంతాలుAltagracia, Granada, Moyogalpa, San Carlos, San Jorge

నికరాగువా సరస్సు (ఆంగ్లం: Lake Nicaragua) మధ్య అమెరికా లోని అతి పెద్ద మంచినీటి సరస్సు. [2] ఇది మధ్య అమెరికాలో, నికరాగువా దేశపు నైరుతి భాగంలో ఉంది. ఓవల్ ఆకారంలో వున్న ఈ సరస్సు 8,264 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. స్థానికంగా ఈ సరస్సును కోసిబోల్కా సరస్సు అని, గ్రెనడా సరస్సు అని పిలుస్తారు. స్పానిష్ భాషలో దీనిని లా మార్ డుల్సే (స్వీట్ సీ) అనే పేరుతొ పిలుస్తారు.

సరస్సు ప్రత్యేకతలు

[మార్చు]

నికరాగువా సరస్సు మధ్య అమెరికాలో గల అతి పెద్ద సరస్సు. విస్తీర్ణత దృష్ట్యా ఇది ప్రపంచంలోనే 19 వ అతిపెద్ద సరస్సు. మొత్తం అమెరికా ఖండాలలో గల పదవ అతిపెద్ద సరస్సు. ఇది టిటికాకా సరస్సు కన్నా కొంచెం చిన్నది. టిటికాకా సరస్సు తరువాత లాటిన్ అమెరికాలో రెండవ అతిపెద్ద సరస్సు. మరో విధంగా చెప్పాలంటే అమెరికా,కెనడా-ఈ రెండు దేశాలలోని సరస్సులను మినహాయిస్తే, మిగిలిన అమెరికా ఖండాలలో గల రెండవ అతి పెద్ద సరస్సు.

  • కనుచూపుమేరా నీరు తప్ప మరేమీ కనిపించని అపారమైన జలారాశిని కలిగి వుండటం, అతి పెద్ద తరంగాలు ఏర్పడటం, భారీ తుఫానులు సంభవించడం, సముద్ర జీవజాతుల ఉనికి లాంటి మహా సముద్ర లక్షణాలు అనేకం ఈ సరస్సుకు ఉన్నాయి.
  • లాటిన్ అమెరికా ఖండంలోనే ఇది ఒక ముఖ్యమైన త్రాగునీటి జలవనరు.
  • ప్రపంచంలో షార్క్, రంపపు చేప వంటి సముద్ర జాతులను కలిగి ఉన్న ఏకైక సరస్సు ఇది. ముఖ్యంగా ఈ సరస్సు మంచినీటి షార్క్ చేపలను కలిగి ఉన్న ఏకైక ప్రదేశంగా పేరుపొందింది.[2]
  • ఈ సరస్సులో 400 పైగా దీవులు, మూడు ప్రధాన దీవులు ఉన్నాయి.
  • ప్రపంచంలో పదవ అతి పెద్ద సరస్సు దీవి (Lake Island) ఈ సరస్సులోనే ఉంది.
  • సరస్సు మధ్యలో రెండు అగ్ని పర్వతాలు ఉన్నాయి.
  • ప్రపంచంలోని మంచినీటి సరస్సులలో గల అతి పెద్ద అగ్నిపర్వత దీవి (volcanic island) అయిన ఒమెటెప్ ద్వీపం ఈ సరస్సులోనే ఉంది.

వివిధ పేర్లు

[మార్చు]

స్థానిక గిరిజనులు ఈ సరస్సును కోసిబోల్కా సరస్సు (Cocibolca Lake) అని పిలుస్తారు. స్వీట్ సీ (తీయని సముద్రం) అని దీని అర్ధం. ప్రస్తుత నికరాగువాకు వచ్చిన తొలి యూరోపియన్ దేశీయుడు గొంజాలెజ్ డెవిలా (Gil González Dávila). ఇతను కోస్టారికా నుండి ప్రయాణిస్తూ 1523 లో తొలిసారిగా ఈ నికరాగువా సరస్సును కనుగొన్నాడు. కనుచూపుమేర వరకు నీరు తప్ప మరేమీ కనిపించని ఈ అంతులేని మహా జలరాశిని తొలిసారిగా చూసిన అతను దీనిని ఒక సముద్రంగా భావించారు. అతని గుర్రం సరస్సు లోని నీటిని త్రాగడంతో, ఆశ్చర్యపోయి సముద్రంలా కనిపిస్తున్న ఈ సరస్సును స్వీట్ సీ (తీయని సముద్రం) గా పేర్కొన్నాడు. అప్పటినుండి స్పానిష్ ఆక్రమణదారులు దీనిని "స్వీట్ సీ" (స్పానిష్ భాషలో లా మార్ డుల్సే) అని కూడా పిలిచేవారు. ఈ సరస్సుకి వాయువ్య తీరంలో నెలకొనివున్న గ్రెనడా, ఒక ప్రముఖ వలసరాజ్యపు నగరం గానే కాక అట్లాంటిక్ సముద్ర ఓడరేవుగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈ నగర సామీప్యాన్ని బట్టి ఈ సరస్సుకు గ్రెనడా సరస్సు అనే పేరు కూడా స్థిరపడింది.

నైసర్గిక స్వరూపం

[మార్చు]

ఈ సరస్సు వాయువ్య నుండి ఆగ్నేయం వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఓవల్ ఆకారాన్ని కలిగి ఉంది. పనలోయా-శాన్ కార్లోస్ ప్రాంతాల మధ్య గరిష్ఠ పొడవును (160 కి.మీ.), లా వర్జెన్-శాన్ ఉబల్డో ప్రాంతాల మధ్య గరిష్ఠ వెడల్పును (65 కిమీ) కలిగివుంది. దీని విస్తీర్ణం 8,157 చ.కి.మీ.

ఈ సరస్సు ఉపరితలం సముద్ర మట్టానికి 29 మీటర్లు ఎత్తులో ఉంది. వేసవి (ఏప్రిల్), వర్షా (అక్టోబరు) కాలాలలో ఈ మట్టంలో హెచ్చుతగ్గుల తేడా 65 సెం.మీ వరకు మారుతూ వుంటుంది.

ఈ సరస్సు మరీ అంత లోతైనది కాదు. సగటు లోతు కేవలం 13 మీటర్లు మాత్రమే ఉంది. సరస్సు మధ్యభాగంలో లోతు 18 మీటర్లు. ఈ సరస్సులో గల ఒమెటెప్ ద్వీపం యొక్క ఆగ్నేయంలో మాత్రం దీని లోతు 60 మీటర్లు వరకు చొచ్చుకొని ఉంది. సరస్సు నుండి శాన్ జువాన్‌ నది లోకి పెద్దఎత్తున చేరుతున్న అవక్షేపణల కారణంగా శాన్ కార్లోస్ వద్ద లోతు కేవలం 3 మీ. మించి లేదు.

ఈ సరస్సు యొక్క అడుగు భాగం చాలా వరకు లోతుతో సంబంధం లేకుండా బురదమయంగా (muddy) ఉంది. అయినప్పటికీ ఒమెటెప్ ద్వీపానికి ఆగ్నేయంలోను, మేయల్ నదీ ముఖద్వారం దగ్గర, సోలెంటినేమ్ ద్వీపసమూహం చుట్టూ అనేక రాతి ప్రదేశాలు ఉన్నాయి. అలాగే, ఇసుకతో నిండిన అడుగుభాగాలు ఒమెటెప్‌కు నైరుతి దిశలో కనిపిస్తాయి, ఇవి శాన్ జార్జ్ తీరం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ అవక్షేప ఇసుక ఒమెటెప్‌లోని కాన్సెప్షన్ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనాల ఫలితంగా ఏర్పడింది.

దీనికి తూర్పు, పడమర దిశలలో రెండు మహా సముద్రాలు (అట్లాంటిక్, ఫసిఫిక్) ఉన్నాయి. భౌగోళికంగా ఈ సరస్సు అట్లాంటిక్ మహా సముద్రాని కన్నా పసిఫిక్ మహాసముద్రానికే దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా వుంది అంటే సరస్సు మధ్యలో గల ఒమెటెప్ ద్వీప పర్వతాల నుండి చూస్తే పసిఫిక్ మహాసముద్రం కనిపిస్తుంది. ఇది పసిఫిక్ నుండి కనిష్ఠ దూరంలో (19 కి.మీ.) వున్నప్పటికీ సరస్సుకి పసిఫిక్ మహాసముద్రానికి మధ్య ప్రత్యక్ష కలయిక లేదు. రైవాస్ భూసంధి ఈ రెండిటిని వేరు చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం-నికరాగువా సరస్సు ల మధ్యన ఏర్పడిన రైవాస్ భూసంధి, కేవలం 19 కిమీ వెడల్పుతో ఒక సన్నని ఇరుకైన కారిడార్ మాదిరిగా వుంటుంది. అయితే సరస్సుకి అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్య మాత్రం ఒక నదీ రూపంలో సహజసిద్ధంగా ప్రత్యక్ష కలయిక ఏర్పడింది. శాన్ జువాన్ నది ఈ సరస్సును కరేబియన్ సముద్రంతో కలుపుతుంది.

ఆవిర్భావం

[మార్చు]

ఈ సరస్సు ఆవిర్భావ మూలాలు ప్రధానంగా టెక్టోనిక్, అగ్నిపర్వత కారణ సంబందమైనవి. టెక్టోనిక్ ప్రభావ కారణంగా మధ్య అమెరికా భూభాగం లోని గల్ఫ్ అఫ్ ఫోన్సెకా నుండి లిమోన్ (కోస్టారికా) వరకు వ్యాపించి వున్న ఒక విస్తృత ప్రాంతం గ్రాబెన్ (Graben) విన్యాసంలో కుంగుబాటు (depression) కు గురయ్యింది. ఇలా కుంగుబాటుకు గురైన ప్రాంతం క్రమేణా ఒక లోతైన బేసిన్ మాదిరిగా మారింది. సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన అగ్నిపర్వత విస్ఫోటనాల వలన ఈ లోతైన బేసిన్ లోని భూమి లావాతో నిండిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ లోతైన బేసిన్ లోనే మనాగువా, నికరాగువా మంచినీటి సరస్సులు ఏర్పడ్డాయి. సరస్సు తీరం, అడుగుభాగాలలో బసాల్ట్, ఆండిసైట్ వంటి అగ్ని శిలలు (volcanic rocks) విస్తృతంగా ఏర్పడ్డాయి. ఈ శిలలు సరస్సు జలాలతో రసాయనిక సంయోగం చెందుతూ వున్న కారణంగా, ఇక్కడి జలాలలో మెగ్నీషియం, పొటాషియం తదితర లవణాలు అధికంగా కనిపిస్తాయి.

పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా, దాని అంచున ఏర్పడిన ఒక పెద్ద అఖాతమే నికరాగువా సరస్సుగా పరిణామం చెందినదని ఒకప్పుడు కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు భావించారు. వీరి ప్రకారం మొదట్లో పసిఫిక్ మహాసముద్రం వెంబడి దాని తీరంలో ఒక అఖాతం ఉండేది. ఈ అఖాతం క్రమేణా ఫసిఫిక్ నుండి విడిపోయి ఒక భూపరివేష్టిత మహా సరస్సుగా మారింది. ఈ మహా సరస్సు ప్రాంతం క్రమంగా మనగువా, నికరాగువా అనే రెండు సరస్సులుగా విడిపోయింది. తరువాత ఈ రెండు సరస్సులను టిపిటాపా నది అనుసంధానించింది. ఉప్పునీటి సరస్సులుగా వున్న ఈ రెండు సరస్సులు సముద్రం నుండి వేరుపడిన తరువాత క్రమేణా మంచినీటి సరస్సులుగా మార్పు చెందాయి. ఈ క్రమంలో భాగంగా ఇక్కడి సరస్సుల లోని ఉప్పునీరు క్రమంగా మంచినీటి జలాలుగా మారడంతో ఈ సరస్సులో చిక్కుకుపోయిన సముద్రపు చేపలు కూడా కాలక్రమేణా మంచినీటికి అలవాటు పడి తమంతట తాముగా మంచినీటి చేపలుగా మార్పు చెందాయి. అయితే ఇది తప్పు అని తేలింది. నిజానికి ఇక్కడ కనిపించే షార్క్ చేపలు సరస్సులో చిక్కుకుపోయినవి కావని, నిజానికి అవి శాన్ జువాన్ నదీ వెంబడి ప్రవాహానికి ఎదురీది మరీ ఈ మంచినీటి సరస్సులో ప్రవేశించాయని 1960 లలో నిర్ధారించారు.

మనాగువా సరస్సుతో సంబంధం

[మార్చు]

నికరాగువా సరస్సుకి వాయువ్యంగా మనగువా సరస్సు ఉంది. సుమారు 25 కి.మీ వెడల్పుతో వున్న ఒక చదునైన లోతట్టు ప్రాంతం ఈ రెండు సరస్సులను వేరుచేస్తుంది. మనగువా సరస్సు వైశాల్యం 1049 చ.కి.మీ. ఇది నికరాగువా సరస్సు కంటే 9 మీ. ఎత్తులో ఉంది. గతంలో ఈ రెండు సరస్సులు కలసిపోయి ఒక మహా సరస్సులో భాగంగా ఉండేవి. "ది గ్రేట్ లేక్ ఆఫ్ నికరాగువా" అని పిలువబడే ఆ మహా సరస్సు మొదట్లో 15 మీ. అధిక మట్టంలో ఉండేది. తరువాత రెండు సరస్సులు విడివిడిగా కనిపించేంత వరకు ఈ మహా సరస్సు యొక్క మట్టం పడిపోతూ వచ్చింది. సాధారణంగా మనగువా సరస్సు లోని నీరు టిపిటాపా నది ద్వారా నికరాగువా సరస్సు లోనికి ప్రవహిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎడతెరపి లేకుండా విపరీతమైన వర్షాలు కురిసిన సందర్భాలలో మాత్రమే ఈ రెండు సరస్సుల మధ్య నీటి ప్రవాహం జరుగుతున్నది. టిపిటాపా పట్టణం దాటిన తరువాత ఈ నది అడుగుభాగం అకస్మాత్తుగా అనేక మీటర్లు పడిపోతుంది. ఇటువంటిచోట నదీ జలాలు పరవళ్లతో క్రిందకు దుముకుతూ ప్రవహిస్తాయి. అందువలన ఈ నదికి వర్షాకాలంలో "జలపాతాలు" ఏర్పడతాయని భావించేవారు. ఇటువంటి జలపాతం ఒకటి టిపిటాపా నదిపై 12 అడుగుల ఎత్తునుండి క్రిందకు దూకుతూ పారడం వలన నికరాగువా సరస్సులో ప్రవేశించిన బుల్ షార్క్ లు, రంపం చేపలు లాంటివి మనగువా సరస్సు లోకి వలస వెళ్ళలేకపోయాయి. అందువలనే రెండు సరస్సుల మధ్య పూర్వ సంబంధం వున్నప్పటికీ, నికరాగువా సరస్సులో ఉన్నటువంటి సముద్ర జీవజాలం మనగువా సరస్సులో కనిపించదు.

సరస్సు తీరరేఖ లక్షణాలు

[మార్చు]

నికరాగువా సరస్సు తీరం మొత్తం 450 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాంతపు భౌమ చరిత్ర ప్రకారం దీని తీరరేఖ లక్షణాలు మారుతూ ఉంటాయి.

టిపిటాపా నదీ సంగమప్రాంతమైన పనలోయ (panaloya) నుండి గ్రెనడా వరకు వున్న సరస్సు తీరం, ఇసుకమయంగా వుండి, నిమ్న భూముల (low lands) తో కూడి ఉంది. వరదతాకిడికి, ముంపుకు తేలికగా గురయ్యే లోతట్టు ప్రాంతం ఇది. ఇక్కడ సరస్సు జలాలను టిస్మా చిత్తడి నేలల నుండి వేరుచేసే పొడవైన బార్ (దీర్ఘ తీర రోధిక) ఉంది.

గ్రెనడా ప్రాంతంలో, తీరం క్రమరహితంగా మారుతుంది ఇక్కడ తీరం, చాపాకారంలో ఉన్న ఒక రాతి ద్వీపకల్పంగా ఏర్పడింది. దీని చుట్టూ అనేక ద్వీపాలు (గ్రెనడా ఆర్చిపెలాగో) ఏర్పడ్డాయి. సమీపంలోని మొంబాచో అగ్నిపర్వత విస్ఫోటనం నుండి విరజిమ్మబడిన ఒకానొక భారీ శిలాపాతం వలన ఈ ద్వీపాలు ఏర్పడ్డాయి. మొంబాచో యొక్క తూర్పు భాగం నేరుగా సరస్సు తీరానికి వాలుగా వుండి, రాతి లోయ (rocky ravines) లను ఏర్పరుస్తుంది.

మరింత దక్షిణాన, చార్కో మ్యుర్టోలో వద్ద, దీని తీరం మూడు అర్ధ వృత్తాకారాలను ఏర్పరుస్తుంది. ఈ అర్ధ వృత్తాకారాలను, ఒకప్పుడు సరస్సులో పాక్షికంగా మునిగిపోయిన కొన్ని పాత అగ్నిపర్వతాల యొక్క ముఖ (craters) అవశేషాలుగా పేర్కొనవచ్చు.

రైవాస్ భూసంధి వెంబడి వున్న తీరం చిత్తడినేలలతో, తీర మడుగు (Nocarime) గా ఏర్పడింది. అగ్నిపర్వత సంబంధమైన పైరోక్లాస్టిక్ పదార్థంతో ఏర్పడిన ఇసుక బీచ్‌గా ఇది కొనసాగుతుంది.

ఈ సరస్సు యొక్క దక్షిణ తీరం కోస్టారికాన్ సరిహద్దుకు సమాంతరంగా ఉంది. ఇక్కడ తీరరేఖ వంకర టింకరగా వుండి, నిమ్న భూములతో కూడి ఉంటుంది. ఇక్కడ అనేక ప్రాంతాలలో ముఖ్యంగా నదీ ముఖద్వారాలలో శాశ్వత చిత్తడినేలలు ఏర్పడ్డాయి. ఈ లోతట్టు భూములు, చిత్తడి నేలలు ఫ్రియో నదీ ముఖద్వారం వరకు విస్తరించాయి.

సరస్సు యొక్క తూర్పు తీరం, ముఖ్యంగా పనలోయా నుండి శాన్ కార్లోస్ వరకు వున్న తీరాన్ని చిన్న చిన్న పాయింట్ల వారీగా గుర్తించవచ్చు. ఈ పాయింట్ల మధ్య వున్న ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశాలను కలిగివుంటాయి. నికరాగువా సెంట్రల్ పీఠభూమి నుండి ఈ సరస్సులోకి ప్రవహించే చిన్న, చిన్న నదుల యొక్క డెల్టాలతో ఈ పాయింట్లు దాదాపుగా ఏకీభవిస్తాయి. చోంటలేస్ తీరమంతా (లా పెలోన నుండి మొర్రిటో వరకూ వున్న తీరం) నిమ్న భూములు, చిత్తడినేలలతో కూడి ఉంటుంది. ఇది వరిసాగుకి అనుకూలమైన తీరం.

సరస్సు బేసిన్

[మార్చు]

తీర నదులు

[మార్చు]

నికరాగువా సరస్సు లోనికి 40 కి పైగా చిన్న చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో టిపిటాపా నది ముఖ్యమైనది. ఇది నికరాగువా సరస్సును మనాగువా సరస్సుతో కలుపుతుంది. మిగిలినవన్నీ చిన్నా చితకా నదులు.

సరస్సు యొక్క తూర్పు తీరం (పనలోయ ప్రాంతం నుండి శాన్ కార్లోస్ వరకూ వున్న తీరం) నుండి సరస్సులోనికి అనేక చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో మలకతోయ (Malacatoya), టెకలోస్టోతే (Tecolostote), మేయల్ (Mayales), అకోయాప (Acoyapa), ఓయటే (Oyate), తాపేనగునాసాప (Tapenaguasapa), పియెడ్ర (Piedra), తులే (Tule) నదులు చెప్పుకోదగినవి. ఇవన్నీ నికరాగువా సెంట్రల్ పీఠభూమి లోని వర్షపాతారణ్యాలనుండి ప్రవహిస్తూ తూర్పు వైపు నుండి సరస్సు లోనికి కలుస్తాయి.

నికరాగువా సరస్సు నుండి బయటకు ప్రవహిస్తున్న శాన్ జువాన్ నది
నికరాగువా సరస్సు నుండి బయటకు ప్రవహిస్తున్న శాన్ జువాన్ నది

రైవాస్ ప్రాంతం నుండి ప్రవహిస్తున్న ఒకోమొగో (Ochomogo) నది జపాటెరా ద్వీపానికి అభిముఖంగా సరస్సులో కలుస్తుంది. దక్షిణతీరం నుండి సరస్సులోనికి ప్రవహించే నదులలో సపోయా (Sapoa), సబలోస్ (Sabalos), నినో (Nino), జపోటే (Zapote), ఫ్రియో (Frio) నదులు ముఖ్యమైనవి. ఇవన్నీ కోస్టారికన్ భూభాగం నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదులు, సరస్సులో కలుస్తున్న ప్రాంతాలలో శాశ్వతమైన చిత్తడినేలలు ఏర్పడ్డాయి. ఫ్రియో నదీ నుంచి వచ్చే జలాలు ఇలా సరస్సులోనికి ప్రవేశించగానే, దానికి అతి సమీపంలోనే సరస్సు నుంచి జలాలు పెద్దఎత్తున ఖాళీ అవుతూ, శాన్ జువాన్ నదీ లోనికి ప్రవహిస్తాయి. అందువల్ల ఫ్రియో నది నుండి వచ్చే నీరు వెంటనే శాన్ జువాన్‌లో కలిసిపోతుంది.

నికరాగువా సరస్సు నుండి వెలుపలకు ప్రవహించే నదులలో శాన్ జువాన్ నది అతి ముఖ్యమైనది. సరస్సు యొక్క ఆగ్నేయ తీరం నుండి బయటకు ప్రవహించే శాన్ జువాన్ నది, తన ప్రవాహ మార్గంలో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతం గుండా 180 కి.మీ దూరం పైగా ప్రయాణించి చిట్ట చివరకు కరేబియన్ సముద్రంలోకి కలిసిపోతుంది. అట్లాంటిక్ మహా సముద్రంలో సంగమించడానికి ముందు శాన్ జువాన్ నది, నికరాగువా-కోస్టారికా దేశాల మధ్య కొంత దూరం వరకు సహజ సరిహద్దుగా ప్రవహిస్తుంది.

పరివాహం (Drainage)

[మార్చు]

మధ్య అమెరికాలోని అతిపెద్ద అంతర్జాతీయ డ్రైనేజ్ బేసిన్ వ్యవస్థలో నికరాగువా సరస్సు ఒక ముఖ్యమైన భాగం. నికరాగువా సరస్సు, మనాగువా సరస్సు, శాన్ జువాన్ నది-ఈ మూడింటి కలయికతో ఏర్పడిన డ్రైనేజ్ బేసిన్, సుమారు 41 వేలకు పైగా చదరపు కిమీ విస్తీర్ణంతో మధ్య అమెరికాలోకెల్లా ఒక అతిపెద్ద అంతర్జాతీయ డ్రైనేజ్ బేసిన్ వ్యవస్థగా ఉంది. మొత్తం వాటర్ షెడ్ 41,638 చదరపు కిమీ విస్తీర్ణంలో మూడు విభాగాల వాటా క్రింది విధంగా ఉంది.

  • 1. నికరాగువా లేదా కోసిబోల్కా సరస్సు వాటర్ షెడ్ విస్తీర్ణం 23,844 చ.కి.మీ.
  • 2. మానాగువా సరస్సు వాటర్ షెడ్ విస్తీర్ణం 6,669 చ.కి.మీ.
  • 3. శాన్ జువాన్ నదీ వాటర్ షెడ్ విస్తీర్ణం 11,125 చ.కి.మీ.

నికరాగువా సరస్సు బేసిన్ మొత్తం విస్తీర్ణం (23,844 చ.కి.మీ.) లో, 19,693 చ.కి.మీ. (83%) నికరాగువా దేశపు భూభాగం లోను, 4,151 చ.కి.మీ. (17%) కోస్టారికా భూభాగంలోను వ్యాపించి ఉంది.

చరిత్ర

[మార్చు]

16వ శతాబ్దంలో స్పానిష్ విజేతలు నికరాగువా దేశాన్ని ఆక్రమించక పూర్వం, ఈ సరస్సు దాని చుట్టుప్రక్కల వున్న ప్రాంతం నాహువా (Nahua) అనే స్థానిక గిరిజన తెగ అధీనంలో ఉండేది. ఈ రెడ్ ఇండియన్ తెగ అధిపతి మాకుయిల్మిక్విజ్ట్లీ. ఇతని పేరునే నికారాగో అని పొరపాటుగా పేర్కొనడం జరిగింది.

గిల్ గొంజాలెజ్ డెవిలా
గిల్ గొంజాలెజ్ డెవిలా

స్పానిష్ నావికుడు, అన్వేషకుడు అయిన గొంజాలెజ్ డెవిలా, 1520 లో మధ్య అమెరికాలోని పసిఫిక్ తీరాన్ని అన్వేషిస్తూ ఒక సాహస యాత్రను చేపట్టాడు. దీనిలో భాగంగా 1523 లో వంద మంది సైనికులతో కలసి తొలిసారిగా ఈ సరస్సు వద్దకు చేరుకొన్నాడు. స్పెయిన్ దేశపు చక్రవర్తి ఛార్లెస్ V తరుపున ఈ సరస్సు వున్న ప్రాంతాన్ని స్వాధీనం చేసికొన్నాడు. స్థానిక గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చి, అక్కడి ధనరాశులను, బంగారాన్ని దోచుకొని స్పెయిన్ చక్రవర్తికి పంపించాడు. తెగ అధిపతి నికారాగో పేరుమీదుగా ఈ ప్రాంతాన్ని నికరాగువా అనే పేరుతొ వ్యవహరించాడు. సముద్రం వలె కనిపిస్తున్న ఈ సరస్సును "లా మార్ డుల్సే" (స్వీట్ సీ) గా పేర్కొన్నాడు. అప్పటినుండి నికరాగువా సరస్సు, దాని పరిసరప్రాంతాలు స్పానిష్ ఆక్రమణలోనికి వెళ్ళిపోయాయి.

చారిత్రక కాలం నుంచి మధ్య అమెరికా లోతట్టు ప్రాంతాలనుండి అట్లాంటిక్ మహా సముద్రాన్ని చేరుకోవడానికి, నికరాగువా సరస్సు ఒక కీలకమైన రవాణా మార్గంగా ఉపయోగపడింది. దక్షిణ అమెరికా ఖండాన్ని స్పానిష్ విజేతలు ఆక్రమించుకుంటున్న సమయంలో, స్థానికంగా దోచుకున్న సంపదలను నికరాగువా సరస్సు, శాన్ జువాన్ నదుల ద్వారానే స్పెయిన్‌కు రవాణా చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే సరస్సు తీరంలో గ్రెనడా వంటి గొప్ప సంపన్న వలస నగరాలు, ఇతర రేవు పట్టణాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత కాలిఫోర్నియా గోల్డ్ రష్ (1848–1855) కాలంలో దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరాలలో కనుగొనబడిన సంపదను తరలించడానికి శాన్ జువాన్ నదితో పాటు నికరాగువా సరస్సును రవాణా మార్గంగా ఉపయోగించుకోవడం జరిగింది.

స్పెయిన్ దేశస్థులు మధ్య అమెరికా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, సముద్రపు దొంగలు నికరాగువా సరస్సును ఆక్రమించడం ప్రారంభించారు. 16 వ శతాబ్ధంలో శాన్ జువాన్ నది మీదుగా ఈ సరస్సులో ప్రవేశించిన కరేబియన్ సముద్రపు దొంగలు, స్థానిక ప్రజలను దోచుకొని తరిమివేసి సరస్సు ఒడ్డున ఆవాసాలు నిర్మించుకున్నారు. సముద్రపు దొంగలు ఈ సరస్సు మీదుగా తరుచుగా వస్తూ, పోతూ వలస నగరాలపై దాడులు చేసేవారు. వీరు గ్రెనెడా వలస నగరంపై మూడు సార్లు భీకరంగా దాడి చేశారు.[3] చివరకు 16 వ శతాబ్దపు చివరిలో స్పానిష్ విజేతలు ఈ సరస్సు పైన, సరస్సులోని దీవులపైన ఆధిపత్యం పొంది స్థిరపడ్డారు.

నికరాగువా కాలువ ప్రాజెక్టు
నికరాగువా సరస్సు ద్వారా పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలుపుతూ ఒక అంతర మహాసముద్ర జల మార్గం నిర్మించాలనే ఆలోచన స్పానిష్ వలసపాలనా కాలం నాటినుంచే మొలకెత్తింది. రెండు మహా సముద్రాలను కలుపుతూ ఒక అంతర మహాసముద్ర కాలువ (inter oceanic canal) ను నిర్మించాలని 1504 నుండి నేటివరకు పదికి పైగా భారీ ప్రయత్నాలు జరిగాయని తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు ఏవీ కార్యరూపం దాల్చలేదు.

పనామా కాలువ నిర్మాణానికి చాలా ముందుగానే, యాక్సెసరీ ట్రాన్సిట్ అనే రవాణా సంస్థ తొలిసారిగా అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు రైవాస్ భూసంధి ద్వారా ప్రయాణమార్గం ఏర్పాటు చేసింది. 1853 లో అమెరికన్ వ్యాపారవేత్త కార్నెలియస్ వాండర్‌బిల్ట్ కు చెందిన యాక్సెసరీ ట్రాన్సిట్ అనే రవాణా కంపెనీ శాన్ జువాన్ నది నుండి నికరాగువా సరస్సుకు స్టీమ్ బోట్ ల ద్వారా ఒక నౌకా ప్రయాణమార్గం (స్టీమ్ షిప్ లైన్) ఏర్పరిచింది. దీనికి కొనసాగింపుగా నికరాగువా సరస్సు లోని 'వర్జిన్ బే' ప్రాంతం నుండి పసిఫిక్ తీర పట్టణం 'శాన్ జువాన్ డెల్ సుర్' లను కలుపుతూ ఇరుకైన రివాస్ భూసంధి మీదుగా గుర్రపు బగ్గీల ద్వారా 12 మైళ్ళ భూ ప్రయాణమార్గం (స్టేజ్‌కోచ్ లైన్) కూడా ఏర్పాటుచేసింది. దానితో నికరాగువా సరస్సు నుండి పసిఫిక్ మహా సముద్రాన్ని కలుపుతూ ఒక భూ రవాణా మార్గం ఏర్పడింది.

తరువాతి కాలంలో 'నికరాగువా కాలువ ప్రాజెక్టు' పేరుతొ ఈ సరస్సు ద్వారా రెండు మహా సముద్రాలను కలుపుతూ ఒక అంతర మహాసముద్ర కాలువను నిర్మించడానికి అనేక ప్రణాళికలు రూపొందించారు. అయితే దానికి బదులుగా పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలుపుతూ పనామా కాలువ 1914 లో నిర్మించబడింది. దానితో ట్రాన్స్ నికరాగువా కాలువ ప్రాజెక్టు పై ఆసక్తి మరోసారి తగ్గింది.

అయితే భవిష్యత్తులో పనామా కాలువతో రాబోయే పోటీని అరికట్టే ఉద్దేశంతో అమెరికా దేశం 1914 లో బ్రయాన్-చమోరో ఒప్పందం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ మార్గంలో పనామా కాలువ వంటి మరో కాలువను ముందుగానే నిర్మించుకునే సర్వ హక్కులను నికారాగువా ప్రభుత్వం నుండి పొందింది. 1970 లో ఈ ఒప్పందాన్ని అమెరికా, నికరాగువా దేశాలు పరస్పరం రద్దు చేసుకున్నాయి. అప్పటినుండి నికరాగువా కాలువ నిర్మాణం గురించిన ప్రతిపాదనలు మళ్ళీ తలెత్తాయి.

నికరాగువా కాలువకు ప్రతిపాదనలు-HKND ప్రతిపాదిత కాలువ మార్గం ఎరుపు రంగులో చూపించబడింది

పనామా కాలువకు ప్రత్యామ్నాయంగా ఈ సరస్సు మీదుగా రెండు మహాసముద్రాలను కలిపే 286 కిలోమీటర్ల నికరాగువా కాలువను, 40 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించి అభివృద్ధి చేయాలనే తలంపుతో 2014 లో చైనా దేశానికి చెందిన 'హాంకాంగ్ నికరాగువా కెనాల్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ' (HKND), నికరాగువా ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.[4] అయితే కాలువ నిర్మాణం వల్ల ఏర్పడే పర్యావరణ, సామాజిక దుష్ప్రభావాల గురించి పలు విమర్శలు తలెత్తడంతో పాటు, ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల లభ్యతపై సందేహాలు తలెత్తి నిరసనలకు దారితీశాయి.[5] చివరికి 2018 లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా హెచ్‌కెఎన్‌డి కంపెనీ ఈ భారీ ప్రాజెక్టును విరమించుకొంది. ఈ విధంగా నికరాగువా సరస్సు గుండా పసిఫిక్-అట్లాంటిక్ లను కలుపుతూ ఒక అంతర మహాసముద్ర కాలువను నిర్మించాలనే ప్రతిపాదనలు నేటికీ కార్యరూపంలోకి దాల్ఛలేకపోయాయి.

శీతోష్ణస్థితి-ఉద్భిజ్జ సంపద

[మార్చు]

సరస్సు ప్రాంతంలో ఉష్ణమండల శీతోష్ణస్థితి (tropical climate) నెలకొని ఉంది. నవంబరు నుంచి ఏప్రిల్ నెలల మధ్య వాతావరణం పొడిగా వుంటుంది. ఇది శుష్క కాలం (dry season). మే నుండి అక్టోబరు నెలల మధ్య వర్షాలు మితంగా కురుస్తాయి. సాధారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. సాంవత్సరిక సగటు ఉష్ణోగ్రత 33°C వరకు ఉంటుంది. అయితే సరస్సు మధ్యలో గల పర్వత సానువులలో మాత్రం తేలికపాటి వాతావరణం ఉంటుంది.

సరస్సు బేసిన్ లో వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు వెళ్తున్నప్పుడు, 160 కి.మీ. కొద్దీ దూరానికే అవపాత ప్రవణత నిట్రంగా ఉంటుంది. వాయువ్య కొసలో వున్న 'పనలోయా' వద్ద సాంవత్సరిక సగటు వర్షపాతం 120 సెం.మీ. వుంటుంది. ఇక్కడ సాధారణంగా ఉష్ణమండల సవానా రకానికి చెందిన ఉద్భిజ్జ సంపద కనిపిస్తుంది. అయితే అక్కడక్కడా ఎడారి మొక్కలతో వున్న అడవులు పట్టీల మాదిరిగా కనిపిస్తాయి. రొబ్లే (roble-Tabebuia) అడవులకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ చొంటలేస్ తీరంతో పాటు సరస్సు యొక్క ఈశాన్య తీరమంతా జికారో (Crescentia) అడవులతో వ్యాపించి ఉంది.

ఓయటే నది నుండి శాన్ కార్లోస్ వరకూ వెళ్తున్నకొద్దీ సగటు వర్షపాతం 190 సెం.మీ.కు పెరుగుతూ వస్తుంది. ఈ వర్షపాతం వర్షపాతారణ్యాల వృద్దికి అనువైనదైనప్పటికీ మానవ ప్రమేయం వలన ఈ ప్రాంతంలో సహజ ఉద్భిజ్జం తీవ్రంగా చెదిరిపోయి చివరకు ద్వితీయ అడవుల ప్రాంతంగా (second growth forests) మారిపోయింది.

కోస్టారికాన్ సరిహద్దుకు సమాంతరంగా నున్న దక్షిణ తీరమంతటా, ముఖ్యంగా పెనాస్ బ్లాంకాస్ వద్ద గల కస్టమ్స్ పోర్టు వరకు అధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంతం పసిఫిక్‌కు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, ఇక్కడి వృక్ష, జంతుజాలంపై కరేబియన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సరస్సుకి దక్షిణంగా వున్న చిత్తడి తీరాల నుండి కోస్టారికాన్ భూభాగంలోని గ్వానాకాస్ట్ అగ్నిపర్వత వాలుల వరకు ఒక చిత్తడి అడవి (hygrophytic forest) విస్తరించి ఉంది. సాధారణంగా ఈ చిత్తడి అటవీ నేలలు ఎల్లప్పుడూ నీటిలో మునిగే వుంటాయి. దీనివల్ల ఇక్కడ పెరిగే చెట్లు తమకు కావాల్సిన ఆక్సిజన్ కోసం, నేరుగా వాతావరణం నుంచి నీటిని పీల్చుకొని తమలో నిలుపుకొగలిగే సామర్ధ్యాన్ని కలిగివుంటాయి.

రైవాస్ నుండి గ్రెనడా వరకు వున్న సరస్సు యొక్క పశ్చిమ తీరంలో, సగటున 140 సెం.మీ. వర్షపాతం ఉంటుంది. ఇది ప్రధానంగా ఉష్ణమండల సవన్నా ప్రాంతం. అయితే ఇక్కడ పచ్చిక బయళ్ళ పెంపకం, వ్యవసాయ కార్యకలాపాలు మొదలగునవి క్రమంగా పెరుగుపోతుండటంతో ఈ ప్రాంతం చాలా వేగంగా మార్పులకు లోనవుతూ వస్తున్నది. "మొంబాచో" విలుప్త అగ్నిపర్వతం నుండి శిఖరానికి పోయే కొద్దీ, వర్షపాతం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల శిఖరభాగంలో పర్వతం చుట్టూ ఒక క్లౌడ్ ఫారెస్ట్ ఏర్పడుతుంది. ఈ రకమైన శీతోష్ణస్థితి కాఫీ తోటల పెంపకానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఒమెటెప్ ద్వీపంలో గల "మదేరా" విలుప్త అగ్నిపర్వతం మీద కూడా ఇదే రకమైన క్లౌడ్ ఫారెస్ట్ పరిస్థితులు ఏర్పడతాయి.

పవన వ్యవస్థ

[మార్చు]

నికరాగువా సరస్సుపై వీచే పవనాలు ఋతువులను బట్టి, సరస్సుకు వున్న మండలాలను బట్టి మారుతూ వుంటాయి. కరేబియన్ సముద్రం నుండి వీచే ఈశాన్య వ్యాపార పవనాలు, ముందుగా నికరాగువా దేశపు తూర్పు తీరాన్ని తాకుతాయి. నికరాగువా సరస్సు యొక్క భౌగోళిక స్థానం కారణంగా ఈ పవనాలు సరస్సు పైనుండి సులభంగాను, నిరాఘాటంగాను ప్రయాణించి దేశ నైరుతి తీరానికి చేరతాయి. సరస్సు యొక్క ఉష్ణమండల శీతోష్ణస్థితిని కరేబియన్ సముద్రాలనుండి వీచే ఈ వ్యాపార పవనాలు కొంతవరకు ప్రభావితం చేస్తాయి.

క్రమం తప్పకుండా వచ్చే అనూహ్యమైన, బలమైన తుఫానులకు ఈ సరస్సు ప్రసిద్ధి. డిసెంబరు-మార్చి నెలల మధ్య, ఈశాన్య వ్యాపార పవనాలు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో బలంగా వీస్తాయి. దీనివల్ల గ్రెనడా నుండి రైవాస్ వరకు వున్న తీరంలో పెద్ద పెద్ద అలలు ఏర్పడతాయి. ఇవి నౌకాయానానికి ఆటంకం కలిగించడమే కాక చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మరోవైపు, ఈశాన్యం నుండి వీచే ఈ వ్యాపార పవనాలను ఈశాన్య పర్వత శ్రేణులు అడ్డగించడం వలన సరస్సు యొక్క ఈశాన్య తీరం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సంవత్సరంలో మిగిలిన కాలమంతా ఈశాన్య వ్యాపార పవనాలు అస్థిరంగా వీస్తున్నప్పటికి, బలహీనంగా ఉంటాయి. దానివలన సరస్సు ఏ విధమైన అలజడులకు లోనవదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సరస్సు ఉపరితలం, తరుచుగా ప్రశాంతంగా నిర్మలంగా వుంటుంది.

ఈశాన్యం నుండి నైరుతి దిశగా వచ్చే పవనాల వలన నిరంతరం చోంటలేస్ తీరం నుండి వృక్షజాలపు తెప్పలు రైవాస్ తీరం వరకు కొట్టుకు వస్తాయి. ఈ కారణం చేతనే ఒమేటెప్ ద్వీపం రైవాస్ తీరానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, ఈ ద్వీపం యొక్క వృక్ష, జంతు జాలాలు రైవాస్ కంటే చోంటలేస్ ప్రాంతంతోనే ఎక్కువ సన్నిహితంగా వుంటాయి.

శాన్ జువాన్ లోయ మీదుగా వీచే వ్యాపార పవనాల ప్రభావం వలన ఈ సరస్సు లోని నీటిమట్టంలో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నప్పటికి, నిజానికి ఈ సరస్సు అలలు (tides) లేనిదనే చెప్పాల్సివుంటుంది. సరస్సు నీటి మట్టంలో భేదం దైనికంగానే కాక సాంవత్సరికంగా కూడా కనిపిస్తుంది. వేసవి కాలంలో ముఖ్యంగా డిసెంబరు నుండి ఏప్రిల్ వరకు ఈ సరస్సు లోని నీటి మట్టం పడిపోతుంది. తిరిగి వర్షాకాలంలో అనగా మే నుండి అక్టోబరు వరకు సరస్సులోని నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది.

జలప్రవాహ వ్యవస్థ

[మార్చు]

నికరాగువా సరస్సులో అనేక జలప్రవాహాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన జల ప్రవాహం సరస్సు ఉపరితలంపై ఆగ్నేయం నుండి ఈశాన్యం వరకు ప్రవహిస్తుంది, దాని క్రింద ఒక లోతైన జలప్రవాహం, పై దానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. సరస్సు ఉపరితలంలో జల ఉష్ణోగ్రత సాధారణంగా 24°C వరకు ఉంటుంది. సరస్సు అడుగుభాగంలో జల ఉష్ణోగ్రత తక్కువగా సుమారు 16°C వరకు ఉంటుంది.

దీవులు-ద్వీప సమూహాలు

[మార్చు]

నికరాగువా సరస్సు గుండా ఒక అగ్నిపర్వత శృంఖలం వ్యాపించి ఉంది. దానికి సంబంధించిన అగ్నిపర్వత ప్రక్రియల కారణంగా ఈ సరస్సులో అనేక అందమైన దీవులతో పాటు ద్వీప సమూహాలు కూడా విస్తృతంగా ఏర్పడ్డాయి. మొత్తం మీద ఈ సరస్సులో 400 కి పైగా దీవులు ఉన్నాయి. వీటిలో 365 పైగా చిన్న చిన్న దీవులు, సరస్సుకి వాయువ్య తీరంలో నెలకొని వున్న గ్రెనడా నగరానికి కేవలం 8 కి.మీ దూరంలోనే విస్తరించి ఉన్నాయి.

ఒమెటెప్ ద్వీపం

సరస్సు నుండి ఒమెటెప్ ద్వీపం కనిపిస్తున్న దృశ్యం
సరస్సు నుండి ఒమెటెప్ ద్వీపం కనిపిస్తున్న దృశ్యం
సరస్సు నుండి కాన్సెప్సియన్ అగ్నిపర్వతం కనిపిస్తున్న దృశ్యం
సరస్సు నుండి కాన్సెప్సియన్ అగ్నిపర్వతం కనిపిస్తున్న దృశ్యం

నికరాగువా సరస్సులో అతి పెద్ద దీవి ఒమెటెప్ ద్వీపం. ఇది సరస్సుకు పడమట వైపున ప్రధాన భూభాగానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 26 కిమీ పొడవు, 13 కిమీ వెడల్పుతో వున్న ఈ ఉష్ణమండల ద్వీపం 276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది ప్రపంచంలో పదవ అతి పెద్ద సరస్సు దీవి (Lake Island). నిజానికి ఒమెటెప్ ద్వీపాన్ని ఒక అగ్నిపర్వత దీవిగా అభివర్ణించివచ్చు. ఇది 'కాన్సెప్సియన్' (1,610 మీటర్లు), 'మదేరా' (1,394 మీటర్లు) అనే రెండు పెద్ద అగ్నిపర్వతాలు చేత ఏర్పడింది. పూర్వ కాలాలలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి వెలువడిన లావా, ఈ రెండు అగ్నిపర్వతాల మధ్య ఒక వంతెన మాదిరి భూభాగాన్ని ఏర్పరిచింది. దీనిని టిస్టియన్ భూసంధి అని పిలుస్తారు. లోతట్టు ప్రాంతం కావడం వలన టిస్టియన్ తరుచుగా వరదలకు గురవుతుంది. అగ్నిపర్వతాల నుండి విరజిమ్మబడిన బూడిద (volcanic ash) వలన ఒమెటెప్ దీవి లోని మట్టి బాగా సారవంతమైంది. ఫలితంగా ఈ రెండు అగ్నిపర్వతాలు చుట్టూ సారవంతమైన నేలలు విస్తారంగా ఏర్పడ్డాయి.

దీవిలో ఎక్కడ నుంచి చూసినా ప్రతీచోటా ఈ అగ్ని పర్వతాలు కనిపిస్తూనే వుంటాయి. వీటిలో అతి పెద్దది అయిన 'కాన్సెప్సియన్' అగ్నిపర్వతం, క్రియాశీలకమైనది. స్ట్రాటో అగ్నిపర్వత రకానికి చెందినది. దీని శంకువు (cone) నిర్దిష్టంగా ఏర్పడింది. ఇది నిరంతరం ఆవిర్లను వెలువరిస్తుంది. కాలక్రమరీతిలో ఇసుక, లావాలను బయటకు విడుదల చేస్తుంది. రెండవది అయిన 'మదేరా' విలుప్తమైన అగ్నిపర్వతం. ఖండితమైనది. ప్రస్తుతం దట్టమైన వృక్షసంపదతో కప్పబడి ఉంది. దీని వాలు భాగం, కాఫీ తోటలతో విస్తారంగా నిండి ఉంది. ఈ రెండు అగ్నిపర్వతాలు తొలి హోలోసిన్ యుగంలో ఏర్పడి వుండవచ్చని భావిస్తున్నారు.

ఈ దీవిలో ప్రీ-హిస్పానిక్ కాలానికి చెందిన పురావస్తు అవశేషాలు అనేకంగా లభ్యమయ్యాయి. ఇక్కడి అగ్నిపర్వత బూడిదలోను, దట్టమైన సహజ ఉధ్భిజాలలోను పూడుకుపోయి మరుగున పడిన కళాఖండాలను నేడు వెలికితీస్తున్నారు. ఈ దీవిలో మోయోగల్ప, అల్ట్రాగ్రేసియాలు ప్రధాన పట్టణాలు.

మనస్సులను ఆకట్టుకొనే ఈ రెండు అగ్నిపర్వతాలు, వాటి చుట్టూ పెనవేసుకున్నట్లున్న అతి సారవంతమైన నేలలు, ఉష్ణమండల అడవులు (Tropical forests), అభయారణ్యాలతో కూడిన ఒమెటెప్ ద్వీపం ఆసాంతం ఒక మనోహరమైన ప్రకృతి రమణీయ దృశ్యం మాదిరిగా కనిపిస్తుంది.

జపాటెరా ద్వీపం
నికరాగువా సరస్సులో వున్న మరొక దీవి జపాటెరా ద్వీపం. ఇది కూడా అగ్నిపర్వత దీవి. ఒమెటెప్ కంటే కొద్దిగా చిన్నది. ఇది ఒమెటెప్ ద్వీపానికి దగ్గరలో, ప్రధాన భూభాగానికి కాస్త దగ్గరగా ఉంది. ఈ ద్వీపంలో వున్న అగ్నిపర్వతం "జపాటెరా" (629 మీటర్లు) షీల్డ్ రకానికి చెందినది. దీనిని బాగా క్షీణించిపోయిన ఒక పురాతన అగ్నిపర్వత అవశేషంగా పేర్కొనవచ్చు. ఈ దీవి యొక్క రాతి తీరం చుట్టూ అర్ధ వృత్తాకార ద్వీపాలు ఏర్పడ్డాయి. సరస్సులో వరదలకు గురై పాక్షికంగా మునిగిపోయిన ఒకప్పటి పాత అగ్నిపర్వత ముఖ (craters) అవశేషాలే, నేడు ఈ అర్ధ వృత్తాకార ద్వీపాలుగా కనిపిస్తున్నాయి. స్పానిష్ వలసలకు పూర్వకాలంలో ఈ ద్వీపం సమాధి భూమి (mausoleum island) గా ఉండేది.

మొంబాచో అగ్నిపర్వతం
మొంబాచో అగ్నిపర్వతం

ఈ సరస్సుతో సంబంధం ఉన్న మూడవ అగ్నిపర్వతం మొంబాచో (1,350 మీటర్లు). ఇది స్ట్రాటో రకానికి చెందినది. అయితే ఈ అగ్నిపర్వతం సరస్సులో కాకుండా, సరస్సుకి వాయువ్య తీరంలో ఉంది. దీని బేసిన్ వద్దనే గ్రెనెడా వలస నగరం ఏర్పడింది.

గ్రెనడా ద్వీపసమూహం (గ్రెనడా ఆర్చిపెలాగో):
నికరాగువా సరస్సుకి వాయువ్య తీరంలో నెలకొని వున్న గ్రెనడా నగరానికి కేవలం 8 కి.మీ దూరంలో 365 పైగా చిన్న చిన్న దీవులు విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవైన సన్నని అసెసీ (Asese) ద్వీపకల్పం చుట్టూ చెల్లా చెదురుగా ఆవరించి ఉన్నాయి. బసాల్ట్, ఆండసైట్ వంటి శిలలతో కూడి వున్న ఈ దీవులు అగ్నిపర్వత విస్ఫోటన కారణంగా ఏర్పడ్డాయని తెలుస్తుంది.

సుమారు 20 వేల సంవత్సరాల క్రితం ప్రధాన భూభాగంలోని మొంబాచో అగ్నిపర్వతం అత్యంత భారీగా విస్ఫోటనం చెందింది. ఆ సందర్భంలో ఎగిసిపడిన లావా, అగ్నిశిలలు సమీపంలో వున్న సరస్సులోకి చెల్లా చెదురుగా విరజిమ్మబడినపుడు, ఈ చిన్న చిన్న దీవులు ఏర్పడ్డాయి. వీటిని గ్రెనడా ద్వీపాలు (స్పానిష్‌లో ఐలెటాస్ డి గ్రెనడా) అని పిలుస్తారు. అనేక రకాల పళ్లచెట్లతో నిండిన ఈ దీవులు పక్షులకు సహజ ఆశ్రయంగా నిలుస్తున్నాయి.

సోలెంటినేమ్ ద్వీపసమూహం

సోలెంటినేమ్ ద్వీపసమూహంలో భాగమైన మన్‌కారోన్ దీవి వద్ద నికరాగువా సరస్సు యొక్క దృశ్యం
సోలెంటినేమ్ ద్వీపసమూహంలో భాగమైన మన్‌కారోన్ దీవి వద్ద నికరాగువా సరస్సు యొక్క దృశ్యం

సరస్సు యొక్క ఆగ్నేయ భాగంలో సోలెంటినేమ్ ద్వీపసమూహం ఉంది. ఈ ఆర్చిపెలాగో కూడా అగ్నిపర్వత క్రియల కారణంగా ఏర్పడిదే. ఈ ఆర్చిపెలాగోలో 36 చిన్న చిన్న దీవులున్నాయి. కొండలమయంగా వున్న ఈ దీవులు (hilly islands) తృతీయ అగ్నిశిలలతో ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇవి వన్యప్రాణుల అభయారణ్యాలకు నిలయాలు.

నాన్సిటల్ ద్వీపసమూహం
సరస్సు యొక్క ఈశాన్య భాగంలో నాన్సిటల్ అనే మరో చిన్న ద్వీపసమూహం ఉంది. అగ్నిపర్వత ప్రక్రియల కారణంగానే ఈ దీవులు కూడా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ ద్వీపాల అభివృద్ధి ప్రాథమిక దశలోనే ఉంది

తీర పట్టణాలు

[మార్చు]

నికరాగువా సరస్సు ఒడ్డున నాలుగు ప్రధాన ఓడరేవు పట్టణాలు ఉన్నాయి. అవి గ్రెనడా, శాన్ కార్లోస్, శాన్ జార్జ్, శాన్ మిగ్యులిటో. సరస్సులోని ఒమెటెప్ ద్వీపంలో మోయోగల్ప, అల్ట్రాగ్రేసియా రేవులు, సోలెంటినేమ్ ద్వీపసమూహంలో సోలెంటినేం రేవు మొదలైనవి ఉన్నాయి.

గ్రెనడా నగరం
గ్రెనడా నగరం

గ్రెనడా: సరస్సు తీర నగరాలలో గ్రెనడా ప్రముఖమైనది. ఇది సరస్సు యొక్క వాయువ్య తీరంలో ఏర్పడిన వలసరాజ్యపు నగరం. స్పానిష్ విజేతలచే 1524 లో స్థాపించబదిన తొలి నికరాగువాన్ నగరం ఇది. ప్రస్తుతం సుసంపన్నమైన స్పానిష్ సాంస్కృతికి వారసత్వ చిహ్నంగా నిలిచింది. నిజానికి గ్రెనడా నగరం (అలాగే మొత్తం సరస్సు) భౌగోళికంగా అట్లాంటిక్ మహా సముద్రాని కన్నా పసిఫిక్ మహాసముద్రానికే దగ్గరగా ఉంది. తూర్పున ఫసిఫిక్ సముద్రంతో ఈ నగరానికి ప్రత్యక్ష కలయిక లేనప్పటికి, పశ్చిమంగా మాత్రం ఈ నగరం నికరాగువా సరస్సు-శాన్ జువాన్ నదుల ద్వారా కరేబియన్ సముద్రంతో ప్రత్యక్షంగా కలుస్తుంది. దానితో గ్రెనడా నగరం కీలకమైన అట్లాంటిక్ నౌకాశ్రయంగా మారిపోయింది. "సరస్సు ఒడ్డున ఉన్న సముద్ర ఓడరేవు"గా ప్రసిద్ధికెక్కింది. స్పానిష్ వలసపాలన కాలంలో ఈ సంపన్న నగరం తరుచుగా కరేబియన్ సముద్రపు దొంగల దాడులకు గురయ్యేది.

శాన్ కార్లోస్ నుండి శాన్ జువాన్ నది సంగమ ప్రాంత దృశ్యం
శాన్ కార్లోస్ నుండి శాన్ జువాన్ నది సంగమ ప్రాంత దృశ్యం

శాన్ కార్లోస్: నికరాగువా సరస్సు-శాన్ జువాన్ నది సంగమ ప్రాంతంలో శాన్ కార్లోస్ పట్టణం ఉంది. ​​నికరాగువా సరస్సు ఒడ్డున, సరస్సు నుండి శాన్ జువాన్ నదీ ప్రవాహం మొదలయ్యే చోట స్థాపించిన ఈ పట్టణాన్ని శాన్ జువాన్‌ నదికి ప్రవేశ ద్వారంగా పేర్కొంటారు. 1526 లో స్పెయిన్ దేశీయులు తొలుత ఈ పట్టణాన్ని న్యువా జాన్ అనే పేరుతొ స్థాపించారు. 1542 లో రేవు పట్టణంగా మారింది. 1550 నాటికి స్పానిష్ వాణిజ్య స్థావరమైంది. తరువాత ఈ పట్టణం అనేక దశాబ్దాల పాటు పూర్తిగా అలక్ష్యం చేయబడింది. తిరిగి 17 వ శతాబ్దంలో శాన్ కార్లోస్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1670 లో సముద్రపు దొంగలు ఇక్కడి కోటను కొల్లగొట్టారు. ప్రస్తుతం ఇది ఒక ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.

శాన్ జార్జ్: ఇది అతి చిన్న రేవు పట్టణం. ఇక్కడి ఓడ రేవు ప్రధానంగా ఓమెటెప్ ద్వీపంతో అనుసంధానించబడింది. దీని తీరం నుండి నికరాగువా సరస్సును, దాని మధ్యలో వున్న ఓమెటెప్ ద్వీపాన్ని, అక్కడి అగ్నిపర్వతాలను చక్కగా వీక్షించే అవకాశం వుంది. పర్యాటక ప్రదేశం కావడంతో ఇక్కడి బీచ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువ.

మోయోగల్ప రేవు (ఒమెటెప్ ద్వీపం)
మోయోగల్ప రేవు (ఒమెటెప్ ద్వీపం)

శాన్ మిగ్యులిటో: ఇది కూడా చిన్న రేవు పట్టణం. ఈ పట్టణానికి సరస్సు అంచున ఉన్న తీరప్రాంతాన్ని మినహాయిస్తే, చుట్టూ మిగిలిన ప్రాంతమంతా పర్వతమయంగా వుంటుంది. 1850-55 ల మధ్య కాలంలో ఈ ప్రాంతంలో రబ్బరు తోటలను, రైసిల్లా వేర్లను సాగు చేసే ప్రజలు, తమ తొలి ఆవాసాన్ని "లాస్ ఆల్డియాస్" (The Hamlet) పేరుతో ఏర్పాటు చేసుకొన్నారు. ఇక్కడి రబ్బరు తోటలనుండి పుష్కలంగా సంగ్రహించిన రబ్బరును పెద్ద ఎత్తున రవాణా చేయడం కోసం, గత శతాబ్దంలోనే ఈ రేవును అట్లాంటిక్ సముద్ర తీరంలోని పుంటా మికో (Punta Mico) రేవుతో కలుపుతూ ఒక రైల్ రోడ్ ప్రాజెక్ట్ ను నిర్మించారు. దానితో శాన్ మిగ్యులిటో పట్టణం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారింది.

పర్యావరణ వ్యవస్థ

[మార్చు]

పర్యావరణపరంగా, నికరాగువా సరస్సు, నికరాగువాన్ ప్రకృతి దృశ్యంలో ఒక కీలకమైన అంశం. ఈ సరస్సు అద్భుతమైన జల వన్యప్రాణులకు ఆవాస ప్రాంతమే కాక, దీని ఒడ్డున ఉన్న అటవీ వృక్షసంపదకు ఒక ముఖ్యమైన నీటి వనరు. ఈ సరస్సుకు 425 కిలోమీటర్ల పైగా చుట్టుకొలతతో కూడిన విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఈ సరస్సు తీరంలో అనేక రకాల పర్యావరణ వ్యవస్థలను గమనించవచ్చు.

వృక్షజాలం

[మార్చు]

సరస్సు తీరభాగంలో ఆర్ద్ర, అనార్థ్ర ఉష్ణమండలపు అడవులు:
నికరాగువా సరస్సు యొక్క దక్షిణ నైరుతిలో ఆర్ద్ర ఉష్ణమండలపు అడవులు (moist tropical forests) ఉన్నాయి. సరస్సు యొక్క తూర్పు, ఉత్తరం, పడమర వైపు అనార్థ్ర ఉష్ణమండలపు అడవులు (tropical dry forests) విస్తరించి ఉన్నాయి. అయితే ఈ అనార్థ్ర ఉష్ణమండలపు అడవుల స్థానాన్ని క్రమేణా ద్వితీయ అడవులు (second growth forests), వ్యవసాయ భూములు భర్తీ చేస్తున్నాయి.

సరస్సు మధ్యభాగంలో అనార్థ్ర ఉష్ణమండలపు అడవులు:
సరస్సు మధ్యన గల దీవులలోని అడవులు అనార్థ్ర ఉష్ణమండలపు అడవుల (tropical dry forest) తరగతికి చెందినవి.

అగ్నిపర్వత శిఖరాలపై క్లౌడ్ ఫారెస్ట్ వ్యవస్థ:
సరస్సుకి చెందిన రెండు అగ్నిపర్వతాల (ఒమేటెప్ ద్వీపంలోని మదేరా అగ్నిపర్వతం, సరస్సు ఒడ్డున వున్న మొంబాచో అగ్నిపర్వతం) శిఖరాలలో ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ నెలకొంది. ఆర్ధ్ర మేఘాలు ఇక్కడి పర్వతీయ అడవుల పైన నిరంతరం ఒక పందిరి వలె కమ్ముకొని వుండటం కనిపిస్తుంది. ఫలితంగా ఈ రెండు అగ్నిపర్వత శిఖరాల వద్ద అరుదైన వృక్షజాలం ఏర్పడింది. నికరాగువాలో పసిఫిక్ మహాసముద్ర దిశ వైపున క్లౌడ్ ఫారెస్ట్ (cloud forest) లు కనిపించే ఏకైక ప్రదేశాలు ఇవి.

పక్షులు

[మార్చు]
గ్రెనడా దీవుల వద్ద సరస్సులో సేద తీరుతున్న నీటి పక్షులు
గ్రెనడా దీవుల వద్ద సరస్సులో సేద తీరుతున్న నీటి పక్షులు

నికరాగువా సరస్సు వందలాది పక్షి జాతులకు ఆవాస ప్రాంతం. ముఖ్యంగా సరస్సు మధ్యన గల దీవులలోనూ, ఆ దీవుల పరిసర ప్రాంతాలలోనూ పక్షులు సందడి చేస్తూ పుష్కలంగా కనిపిస్తాయి. ఇవి సరస్సులోని చేపలు, మొక్కలు, చిన్న చిన్న నీటి జంతువులపై ఆధారపడి జీవిస్తాయి. ఇక్కడ కార్మోరెంట్ నీటి పక్షులు, కొంగ జాతికి చెందిన పక్షులు (తెల్ల కొంగలు, ఎగ్రెట్,హెరన్ మొదలైనవి) చేపలను వేటాడుతూ, ఎండలో నిలబడి తమ ఈకలను ఆరబెట్టుకుంటూ ఉంటాయి. సరస్సు చుట్టూ గ్రద్దలు, డేగలు వంటి ప్రిడేటర్ పక్షులు వేటాడుతూ కనిపించడం ఇక్కడ సర్వ సాధారణం. అయితే ఒమెటెప్ ద్వీపంలోని రియో ఇష్టియన్ వంటి ప్రదేశాలలోను, సోలెంటినేమ్ ద్వీపసమూహం చుట్టూ వున్న ప్రదేశాలలోను, గ్రెనడా ద్వీపాలలోను విలక్షణమైన పక్షి జాతులు విశేషంగా కనిపిస్తాయి.

చేపలు

[మార్చు]

నికరాగువా సరస్సు ప్రకృతి దృశ్యంలో అత్యంత ఆసక్తికరమైన అంశం, ఈ సరస్సు లోపల నివసించే వన్యప్రాణులే అని చెప్పవచ్చు. నిజానికి ఇది ఒక సరస్సు మాత్రమే అయినప్పటికి, అందులోను మంచినీటి జలాశయం మాత్రమే అయినప్పటికి, దీనిలో సముద్ర జాతులకు చెందిన అనేక చేపలు కనిపించడం విశేషం.[2] కరేబియన్ బుల్ షార్క్ చేపలు, టార్పాన్ (tarpon) చేపలు, పెద్ద పళ్ల రంపం చేపలు (Large tooth sawfish), ఫైన్ టూత్డ్ రంపం చేపలు (fine-toothed sawfish) వంటి రంపం చేపలు సముద్ర చేప జాతులైనప్పటికి మంచినీటికి అలవాటుపడే నిర్మాణం కలిగి వుండటం వల్ల, ఈ మంచినీటి సరస్సులో చక్కగా జీవించగలుగుతున్నాయి. అందువలన ఈ సరస్సును ప్రపంచంలో షార్క్, రంపపు చేపలు వంటి సముద్ర జాతులను కలిగి ఉన్న ఏకైక మంచినీటి సరస్సుగా పేర్కొంటారు.

సిచ్లిడ్ చేపలు

[మార్చు]
రెడ్ డెవిల్ (Amphilophus labiatus)
రెడ్ డెవిల్ (Amphilophus labiatus)

నికరాగువా సరస్సు సుమారు 40 కి పైగా విభిన్న చేప జాతులకు ఆవాసప్రాంతం. వీటిలో 16 జాతులు ఒక్క సిచ్లిడ్ (cichlids) జాతికి చెందినవే. సరస్సులో సిచ్లిడ్ జాతికి చెందిన చేపలే ప్రధానంగా కనిపిస్తాయి. ఈ సరస్సుకు సంబంధించిన సిచ్లిడ్ జాతి చేపలలో యాంఫిలోఫస్ లాబియాటస్ (Amphilophus labiatus) మాత్రమే స్థానికమైనది.[6][7] కాగా టిలాపియా, రెడ్ డెవిల్ (Amphilophus labiatus), మిడాస్ సిచ్లిడ్ (Amphilophus citrinellus) వంటి ఇతర సిచ్లిడ్ జాతి చేపలన్నీ స్థానికేతరమైనవి. ఆహారపుటవసరాల కోసం సిచ్లిడ్ జాతి చేపలను భారీ ఎత్తున వేటాడుతూ రావడంతో, 1995 లో సరస్సు యొక్క మొత్తం జీవపదార్థం (బయోమాస్) లో 58%గా అంచనా వేయబడిన సిచ్లిడ్ జాతి చేపల వాటా క్రమేణా తగ్గిపోతున్నది.

కరేబియన్ బుల్ షార్క్ లు

[మార్చు]
కరేబియన్ బుల్ షార్క్
కరేబియన్ బుల్ షార్క్

నికరాగువా మంచినీటి సరస్సులో కనిపించే షార్క్ చేపలు (సొరచేపలు) అత్యంత విశిష్టమైనవి. కార్చార్హినస్ ల్యూకాస్ (Carcharhinus leucas) జాతికి చెందిన ఇవి మంచినీటి షార్క్ చేపలుగా ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా షార్క్ చేపలు సముద్రాలలో, లవణ జలాలలో తిరుగాడుతూ కనిపిస్తాయి. కానీ నికరాగువా సరస్సు, సముద్రం కానప్పటికీ, మంచినీటి జలాశయం (fresh water body) అయినప్పటికీ షార్క్ చేపలు ఈ సరస్సులో విశిష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా వీటిని 'కరేబియన్ బుల్ షార్క్' లేదా 'నికరాగువా షార్క్' లని పిలుస్తారు.

కరేబియన్ సముద్రంలో తిరుగాడే షార్క్ చేప జాతులకు మంచినీటికి చక్కగా అలవాటుపడే గుణం ఉంది. కరేబియన్ సముద్రంలో, శాన్ జువాన్ నదీ సంగమించే ప్రాంతానికి చేరువలో వచ్చిన ఈ షార్క్ చేపలు, మంచినీటి జలాలకు ఇమిడిపోయే తమ విశిష్ట గుణం వల్ల శాన్ జువాన్ నదిలో ప్రవేశించడమే కాకుండా అక్కడి నుండి శాన్ జువాన్ నదికి ఎదురీదుతూ ప్రయాణించి నికరాగువా సరస్సు లోకి కూడా ప్రవేశించాయి. అవి తిరిగి సముద్రం లోకి వెళ్ళిపోయినప్పటికి, మళ్ళీ ఒక అలవాటుగా నదికి ఎదురీదుతూ, ప్రయాణిస్తూ, తరుచుగా ఈ సరస్సు లోకి ప్రవేశించేవి. కాలక్రమేణా,ఈ షార్క్ చేపలలోని తర్వాత తరాలకు చెందిన మెరుగైన జాతులు ఇక్కడి మంచి నీటికి చక్కగా అలవాటుపడి, జీవిస్తూ వుండటమే కాకుండా, ఆ మంచినీటిలోనే పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం సైతం పొందాయి. దానితో ఈ షార్క్ జాతులకు పునరుత్పత్తి కోసం ఇక ఉప్పగా వుండే కరేబియన్ సముద్ర జలాలకు తిరిగి ప్రయాణించాల్సిన అవసరం కలగలేదు. దానితో కరేబియన్ బుల్ షార్క్ చేపలు ఈ సరస్సులో మంచినీటి షార్క్ చేపలుగా పరిణమించాయి. ఈ విధంగా మంచినీటి షార్క్ చేపలకు నికరాగువా సరస్సు ఒక శాశ్వత ఆవాసంగా మారిపోయింది.

పెద్ద పళ్ళ రంపం చేప
పెద్ద పళ్ళ రంపం చేప

అయితే షార్క్ చేపలకు దాడిచేసే స్వభావం వున్న కారణంగా స్థానిక ప్రజలు వీటికి భయపడి అకారణంగా పట్టి చంపడం జరిగింది. దీనికి తోడు శాన్ జువాన్ నది ఒడ్డున నిర్మించబడిన షార్క్-ఫిన్ ప్రాసెసింగ్ ప్లాంట్, వేలాదిగా షార్క్ చేపలను పట్టి వధించడంతో, షార్క్ చేపల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఈ సరస్సులో కొద్దిపాటి షార్క్ లు మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తున్నారు. మిగిలివున్న ఆ షార్క్ చేపలు కూడా భయపడేటంత ప్రెడేటర్లు కావు. నిజానికి షార్క్ చేపను ఈ సరస్సులో చూసినవారెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికి ఈ సరస్సును పేర్కొనేటప్పుడు, స్థానికులకు ఒకప్పటి మంచినీటి షార్క్ చేపను గురించి ప్రస్తావించడం ఒక పరిపాటి అయ్యింది. స్టానికులు అడపాదడపా శాన్ జువాన్ నదిలో ఈ షార్క్ ను చూసినట్లుగా చెపుతున్నప్పటికి, నిజానికి 2000 సంవత్సరం తరువాత ఈ షార్క్ ను చూసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. ఇటీవల జరిగిన శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ సరస్సులో షార్క్ జనాభా వాస్తవంగా తుడిచిపెట్టుకుపోయిందనే వెల్లడిస్తున్నాయి.

మంచినీటి షార్క్ చేపల మాదిరిగానే ఈ సరస్సులో అంతరించిపోతున్న ఇతర చేప జాతులలో పెద్ద పళ్ల రంపం చేపలు, ఫైన్ టూత్డ్ రంపం చేపలు కూడా ఉన్నాయి. విచక్షణారహితమైన చేపల వేట కారణంగా ఈ మత్స్య జనాభా తగ్గిపోతున్నందువల్ల నికరాగువా ప్రభుత్వం ఇటీవల కరేబియన్ షార్క్, రంపం చేప జాతుల వంటి మంచినీటి చేపల వేటను నిషేధించింది.

జంతుజాలం

[మార్చు]
తెల్లటి ముఖ కాపుచిన్ కోతి
తెల్లటి ముఖ కాపుచిన్ కోతి

ఈ సరస్సు ఆవరణం అరుదైన వన్యప్రాణులకు నివాసప్రాంతంగా ఉంది. ఇక్కడి జంతుజాలంలో జీవవైవిధ్యత చాలా అధికం. వన్యప్రాణులలో చాలావరకు రక్షిత ప్రాంతాల్లో నివసిస్తున్నాయి.

సరస్సు పరిసర అభయారణ్యాలు, ఉష్ణమండల అడవులలో మధ్య అమెరికాకు మాత్రమే ప్రత్యేకమైన కోతి జాతులు కనిపిస్తాయి. వీటిలో చక్కని తెలివితేటలు ప్రదర్శించే తెల్లటి ముఖ కాపుచిన్ కోతి (white-faced capuchin monkey), కేవలం చెట్ల ఆకులని తినే మాంట్లేడ్ హౌలర్ కోతి (Alouatta palliata), నికరాగువా స్పైడర్ మంకీ, పొడవాటి చేతులు గల జియోఫ్రాయ్స్ స్పైడర్ మంకీ, నల్లతల గల స్పైడర్ మంకీ, మెక్సికన్ స్పైడర్ మంకీ మొదలగు స్పైడర్ కోతులు (spider monkey) ముఖ్యమైనవి. ప్రస్తుతం ఇవన్నీ అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఇతర అరుదైన వన్యప్రాణులలో నీటిలో అద్భుతంగా ఈదగలిగే కూజెస్ రైస్ ఎలుక (Oryzomys couesi), చెట్లపైన సునాయాసంగా ఎగబ్రాకే మార్గే (Margay) అడవిపిల్లి, చిత్తడినేలలలో నివసించే వైట్ కైమాన్ (Spectacled Caiman) లు ముఖ్యమైనవి. .

సరస్సు-జలకాలుష్యం

[మార్చు]

మధ్య అమెరికాలో ప్రధాన మంచినీటి జలవనరు అయిన నికరాగువా సరస్సు నేడు జల కాలుష్యానికి తీవ్రంగా గురవుతున్నది. ఈ సరస్సు కాలుష్యానికి ప్రధానంగా మూడు సమస్యలు కారణమవుతున్నాయి. అవి

పట్టణ మురుగునీరు:: సరస్సు తీర సమీప పట్టణాల నుండి సరస్సులోకి విడుదలవుతున్న మురుగునీరు ప్రధాన సమస్యగా ఉంది. నికరాగువా సరస్సులో ప్రతిరోజూ సుమారు 32 టన్నుల శుద్ధి చేయని మురుగునీరు విడుదలవుతున్నట్లు ఒక అంచనా. అయితే ఆర్థిక వనరుల కొరత కారణంగా నికరాగువా ప్రభుత్వం మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా చేపట్టే స్థితిలో లేదు .

రసాయనిక ఎరువులు:: తీరప్రాంతాల్లోని వ్యవసాయ పరిశ్రమ నుండి ఉత్పన్నమవుతున్న రసాయనిక అవశిష్టాల వలన సరస్సు తన స్వచ్ఛతను క్రమేణా కోల్పోతున్నది. సరస్సుకు సమీపంలో గల సారవంతమైన భూములలో జరుగుతున్న వ్యవసాయ ప్రక్రియల కారణంగా రసాయనిక ఎరువులు వాడకం మితిమీరి జరుగుతూ, సమీప సరస్సు జలాలను తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. పురుగుమందుల అవశిష్టాలు సైతం, సరస్సు యొక్క అవక్షేప బేసిన్ (సెడిమెంటరి బేసిన్) లో ప్రమాదకర స్థాయిలో పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య సమస్య సరస్సు యొక్క దక్షిణ భాగంలోనే కాకుండా, కోస్టారికన్ భూభాగంలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.

టిలాపియా ఆక్వా సాగు:: సరస్సులో కొత్తగా ప్రవేశ పెట్టిన 'తేలియాడే బోనుల్లో (floating cages) చేపల పెంపకం' పద్ధతి కూడా సరస్సులో జల కాలుష్యం పెరగడానికి దారితీస్తున్నది. ఈ సరస్సులో కేజ్ పద్ధతిలో టిలాపియా అనే సిచ్లిడ్ జాతికి చెందిన ఆఫ్రికన్ చేపలను వాణిజ్య సరళిలో విస్తృతంగా పెంచుతున్నారు. అయితే కేజ్ లలో పెరిగిన టిలాపియా చేపల వలన, ఈ సరస్సులో భారీ ఎత్తున వ్యర్ధ పదార్ధాలు ఉత్పన్నమై, క్రమేణా సరస్సులో పేరుకుపోతున్నాయి. దీనివల్ల ఈ వ్యర్ధ పదార్ధాలను శోషించుకునే సామర్ధ్యం సరస్సుకు క్రమేణా తగ్గిపోతున్నది. పైగా తిలాపియా చేపల పెంపకం వలన స్థానిక చేపలలో మునుపెన్నడూ లేని సరికొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయని జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.[8]

కానీ ఇప్పటివరకు ఈ కాలుష్య సమస్యను జాతీయ స్థాయిలో అరికట్టే కార్యక్రమానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రాముఖ్యత గాని, నిధులు గాని ఇవ్వలేదు. అయినప్పటికి అనేక స్వచ్ఛంద సంస్థలు నికరాగువా సరస్సును సంరక్షించే కార్యకలాపాలను చేపడుతూ ప్రోత్సహిస్తున్నాయి

సహజ వనరులు, ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

నికరాగువా సరస్సు యొక్క అతి ముఖ్యమైన సహజ వనరులు దాని మంచినీటి జలవనరులు, సమీపంలోని సారవంతమైన నేలలు, అడవులు.

నికరాగువా సరస్సు మంచినీటి సరస్సు కావడంతో మధ్య అమెరికాలోనే ఇది ఒక ముఖ్యమైన త్రాగునీటి జలవనరుగా ఉంది. ఈ సరస్సు శాన్ జువాన్ నది లోకి సెకనుకు 478 క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుంది అని అంచనా. అంటే రోజుకు 41.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల మంచి నీటిని విడుదల చేస్తుంది. ఈ మంచి నీటి జలాలను దేశీయంగా త్రాగునీటి అవసరాలకే కాక వాణిజ్యపరంగా ఎగుమతి చేసే అవకాశం కూడా వుండటంతో ఈ సరస్సు భవిష్యత్తులో నికరాగువా దేశానికి ఒక ముఖ్యమైన పునరుత్పాదక ఆదాయ వనరుగా మారగలదు. సెంట్రల్ అమెరికన్ కమిటీ ఆఫ్ రిసోర్సెస్ వారి ప్రాంతీయ అధ్యయనాలు కూడా, శాన్ జువాన్ నదీ పరీవాహకంలోని ఉప శుష్క ప్రాంతం యొక్క భవిష్యత్ అభివృద్ధిని, అవసరాలను తీర్చగల ఏకైక మంచినీటి వనరు, ఈ నికరాగువా సరస్సు జలాలేనని నిర్ధారించాయి.

ఈ సరస్సులోని అగ్నిపర్వతాల నుండి విరజిమ్మబడిన బూడిద (volcanic ash) వలన ఇక్కడి నేలలు మిక్కిలి సారవంతమైనాయి. విస్ఫోటనం ద్వారా వెలువడిన లావా క్రమేణా విఘటనం చెంది మట్టికి విలువైన పోషకాలను చేకూరుస్తుంది. ఎగిసిపడిన బూడిద సమీప ప్రాంతాలలోనే కాక దూర ప్రాంతాలలో సైతం నిక్షేపించబడి నేలలకు మంచి సహజమైన ఎరువుగా పనిచేస్తుంది. ముదురురంగులో వున్న ఈ నేలలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పైగా బూడిదను కలిగివున్న కారణంగా ఈ నేలలు తేమను సైతం తమలో ఎక్కువకాలం నిలుపుకొనే సామర్ద్యాన్ని కలిగి ఉంటాయి. దున్నడానికి సైతం ఈ నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా సరస్సు చుట్టూ సారవంతమైన నేలలు విస్తారంగా ఏర్పడ్డాయి. సరస్సుకు చెందిన పుష్కలమైన మంచినీటి జలాల వలన ఈ ప్రాంతానికి నీటిపారుదల వసతులు చేకూరడంతో, ఈ సారవంతమైన భూములు వ్యవసాయ పంటలకు, వాణిజ్య తోటలకు అత్యంత అనువుగా మారాయి.

నికరాగువా సరస్సు చుట్టూరా ముఖ్యంగా తూర్పు, దక్షిణ ప్రాంతాలలో సహజ ఉద్భిజ సంపద విస్తారంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉష్ణమండల సవానా గడ్డిభూములతో పాటు ఆర్ద్ర ఉష్ణమండలపు అడవులు (moist tropical forests), అనార్థ్ర ఉష్ణమండలపు అడవులు (tropical dry forests), క్లౌడ్ ఫారెస్ట్, చిత్తడి అడవులు వంటి విభిన్న తరగతులకు చెందిన అడవులు ఏర్పడ్డాయి.

పవన విద్యుతుత్పత్తి

[మార్చు]

అట్లాంటిక్ నుండి వీచే వ్యాపార పవనాలు నికరాగువా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కొరియాలసిస్ ప్రభావం వల్ల ఆ గాలులు నికరాగువా దేశపు తూర్పు నుంచి పశ్చిమానికి కొనసాగుతాయి. మార్గ మధ్యంలో ఇవి సరస్సు యొక్క తూర్పు తీరంలో ప్రవేశించి, సరస్సు మీదుగా ప్రయాణిస్తూ, చివరకు సరస్సు పశ్చిమ తీరానికి చేరుకొంటాయి. ఈ విధంగా సరస్సు ఉపరితలంపై వీచే గాలులు, సరస్సుపై ఈ విధమైన అడ్డంకులు లేకపోవడంతో అవిఛ్ఛన్నంగా, నిరాటంకంగా అవతలి తీరాన్ని (సరస్సు యొక్క పశ్చిమ తీరాన్ని) చేరుకొనేసరికి పెను గాలులుగా మారతాయి. దీనివల్ల ముఖ్యంగా సరస్సు యొక్క పశ్చిమ తీరంలో ఉధృతమైన గాలులు నిరంతరం వీస్తాయి. ఈ కారణంగా సరస్సు తీరప్రాంతంలో వందలాది కిలోమీటర్ల పొడవైన తీరం, గాలి మరల (విండ్ మిల్) ప్రొజెక్ట్ నిర్మాణానికి ఎంతో అనుకూలంగా ఉంది. తద్వారా కాలుష్య రహితమైన పవన విద్యుత్ ను సుస్థిరంగాను, చౌకగా ఉత్పత్తి చేయవచ్చు. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్నిపెంచుకొంటూ వస్తున్న క్రమంలో భాగంగా, రైవాస్ రాష్ట్రంలో నికరాగువా సరస్సు తీరం వెంబడి 3వ దశ విండ్ ప్లాంట్ (EOLO-ఎలో) ను నెలకొల్పారు. ఇది 44 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది.ఇది నికరాగువా యొక్క వార్షిక విద్యుత్ అవసరాలలో సుమారు 7 శాతానికి సమానం.

జల విద్యుతుత్పత్తి

[మార్చు]

ఈ సరస్సు సముద్రమట్టానికి 29 మీటర్ల ఎత్తులో ఉంది. దీని బేసిన్ లో నీరు ఎత్తుపల్లాలలో ప్రవహించడం మూలాన నీటి ప్రవాహ రేట్లు గణనీయంగా మారుతున్నాయి. దానితో దీని బేసిన్ లో జల విద్యుతుత్పత్తికి అపార అవకాశాలున్నాయి. ముఖ్యంగా సరస్సు నుండి ఖాళీ అవుతూ శాన్ జువాన్ నదిలోకి ప్రవహించే నీటిని విద్యుతుత్పత్తికి వినియోగించడం కోసం ఎస్.జె.ఆర్.బి. (SJRB) ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా టిపిటాపా-తమరిండో, బ్రిటో, బ్రిటో రెసిడ్యుల్, ఇంటర్‌లాగోస్-అనే నాలుగు ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల శాన్ జువాన్ నది ప్రవాహ రేటు 36% వరకు తగ్గిపోవచ్చు అని ఒక అంచనా. ఇది నదిలో నావిగేషన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేగాక సరస్సులోని జలచరాల మనుగడపై కలిగే ప్రభావం, ఆనకట్టల వల్ల మునిగిపోయే ప్రాంతంలోని వృక్ష, జంతుజాలం, దానివలన కలిగే పర్యావరణ ప్రభావం ఇత్యాది అంశాలను పరిగణనలోనికి తీసుకొన్నమీదట పై 4 ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు అదనంగా అనేక చిన్న తరహా ప్రైవేట్ జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.

పర్యాటక కేంద్రాలు

[మార్చు]

నికరాగువా సరస్సు, దాని మధ్యలోని దీవులు, సరస్సు చుట్టూరా వున్న తీర ప్రాంతం-మొత్తం మీద ఇది మధ్య అమెరికాలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు నిలయమైన ఈ ప్రాంతంలో పురాతన నాగరికత ఆనవాళ్లు కూడా వెలికి తీయబడుతున్నాయి.

ఒమేటోప్ ద్వీపం: ఈ దీవిలో గల రెండు అగ్నిపర్వతాలు పర్యాటకులను గొప్పగా ఆకట్టుకొంటాయి. ఇక్కడ జరిగే అగ్నిపర్వత హైకింగ్, బైకింగ్, సర్ఫింగ్, ఫిషింగ్, కయాకింగ్, ఈత మొదలగు సాహస క్రీడలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఉష్ణమండల అడవులు, అభయారణ్యాలు, సహజ పార్క్ లతో కూడిన ఈ దీవి, తన చెక్కు చెదరని ప్రకృతి అందాలతో, అద్భుతమైన దృశ్యాలతో, విలక్షణమైన వన్యప్రాణులతో మొత్తం మీద ప్రకృతి ప్రేమికులకు గొప్ప పర్యాటక ప్రదేశంగా నిలుస్తుంది. ఒమెటెప్ ద్వీపంలో ప్రీ కొలంబియన్ కాలానికి చెందిన విగ్రహాలు, పింగాణి తదితర పురావస్తు అవశేషాలు అనేకంగా లభ్యమయ్యాయి. ఇక్కడ సేకరించబడిన వాటిలో కొన్ని, దక్షిణ అమెరికాకు చెందినవే కాక ఉత్తర అమెరికా ఖండానికి చెందిన పురాతన నాగరికతలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి.

జపాటెరా ద్వీపం: ఇది కూడా ఒక స్వదేశీ అభయారణ్యం. ఇక్కడ కూడా వందలాది పురాతన కళాఖండాలు కనుగొన్నారు. ఇక్కడ లభ్యమైన ప్రీ కొలంబియన్ కాలం నాటి పురాతన విగ్రహాలు, కళాఖండాలను దేశ, విదేశాలలోని అనేక పురావస్తు మ్యూజియంలలో ప్రదర్శిస్తున్నారు.

గ్రెనెడా దీవులు
గ్రెనెడా దీవులు

గ్రెనెడా ద్వీపసమూహం: ఇది మధ్య అమెరికాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం. నికరాగువా సరస్సులో 365 పైగా చిన్న చిన్న దీవులతో కూడి వున్న ఈ గ్రెనెడా ద్వీపసమూహం, గ్రెనడా యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రెనెడా సమీపంలో వున్న మొంబాచో అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందినపుడు, దాని నుండి విరజిమ్మబడిన బూడిద, అగ్నిశిలల వల్ల ఈ సరస్సులో వందలాది దీవులు చెల్లాచెదురుగా ఏర్పడ్డాయి. ఇక్కడి విభిన్న దీవులలో ఇళ్ళు, పాఠశాలలు, దుకాణాలు మొదలైనవి విస్తరించినందువల్ల, ఈ దీవులలో నివసించే స్థానిక ప్రజలకు పడవలే ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయి. పడవలలో గ్రెనడా ద్వీపాలలో పర్యటించడం నిజంగా ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. చాలా ద్వీపాలు పచ్చని వృక్షసంపదతో అలరారుతూ, అనేక జాతుల పక్షులకు ఆవాసప్రాంతాలుగా ఉన్నాయి. ఈ దీవుల చుట్టూ పడవల్లో ప్రయాణించేటప్పుడు, అందమైన పక్షులను గమనిస్తూ, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ నీరెండలో సరస్సులో విహరించడం గొప్ప పర్యాటక అనుభవం.

సోలెంటినేమ్ ద్వీపసమూహం: సరస్సు యొక్క ఆగ్నేయ మూలలో సందర్శనీయమైన మరో పర్యాటక ప్రాంతం సోలెంటినేమ్ ఆర్చిపెలాగో. ఇది 36 ద్వీపాలను కలిగి ఉంది. వీటిలో కొన్ని అతితక్కువ జనావాసాలతో వున్నవి కాగా మరికొన్ని జనావాసాలే లేనివి. వీటిలో పక్షుల, వన్యప్రాణుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి అభయారణ్యాలు పచ్చని అటవీ కొండలకు, అద్భుతమైన వన్యప్రాణులకు, అరుదైన పక్షులకు నెలవు. ఈ ద్వీపసమూహానికి చెందిన వివిధ దీవులలో నివసిస్తున్న ఆదిమ సమాజాలు ఒక ప్రత్యేకమైన ఆదిమ కళను తమదైన శైలిలో సృష్టించుకున్నాయి. ఇక్కడి ఆదిమ కళకు చెందిన పెయింటింగ్స్, హస్తకళాఖండాలలో అతి సరళమైన రూపాలను, ఆకృతులను ప్రకాశవంతమైన రంగులతో తీర్చిదిద్దిన శైలి విశిష్టంగా ఆకట్టుకుంటుంది.

శాన్ కార్లోస్: ఇది వలసపాలనా కాలంలో శాన్ జువాన్ నదీ జన్మస్థల ప్రాంతంలో ఏర్పడిన ఒక చిన్న రేవు పట్టణం. స్థానిక వాణిజ్య కేంద్రం. ఇక్కడనుండే శాన్ జువాన్ నది సరస్సు నుండి వెలుపలకు ప్రవహిస్తూ, తూర్పు దిశగా మళ్లుతుంది. ఈ రేవు తీరం నుండి అపారమైన సరస్సు దృశ్యాన్ని, నదీ జన్మస్థానాన్ని, సోలెంటినేమ్ ద్వీపసమూహంలోని కొన్ని ద్వీపాలను చూస్తూ, అద్భుతమైన సూర్యోదయాలను ఆస్వాదించవచ్చు. శాన్ జువాన్ నది-ఉపనదుల యొక్క ప్రశాంత జలాలలో జరిగే స్పోర్ట్ ఫిషింగ్ కార్యక్రమాలు, ప్రపంచం నలుమూలల నుండి స్పోర్ట్స్ ఫిషింగ్ ఔత్సాహికులను ఆకర్షిస్థాయి. ఇక్కడి ప్రశాంత జలాలలో అట్లాంటిక్ టార్పాన్ తదితర సముద్ర చేపలను పట్టుకోవాలనుకొనే వారిని ప్రోత్సాహించడంకోసం ప్రతీ ఏటా సెప్టెంబరు నెలలో ఒక అంతర్జాతీయ ఫిషింగ్ టోర్నమెంట్ సైతం జరుగుతుంది. ఈ పట్టణం మధ్యలో గల 'జోస్ కరోనెల్ ఉర్టెకో' సాంస్కృతిక కేంద్రం, సందర్శకులకు ఈ ప్రాంతం యొక్క చరిత్ర, సంస్కృతులను, ఇక్కడి వన్య ప్రాణుల విశేషాలను తెలియచేస్తుంది.

ప్రాముఖ్యత

[మార్చు]

అనేక శతాబ్దాలుగా ఈ సరస్సు నికరాగువా లోతట్టు ప్రాంతానికి, కరేబియన్ సముద్రానికి మధ్య ఒక ముఖ్యమైన వారధిగా ఉంది. ముఖ్యంగా వలసపాలనా కాలంలో పసిఫిక్, కరేబియన్ సముద్రాల మధ్య వ్యూహాత్మక బంధం (strategic link) గా కొనసాగిన ఈ సరస్సు ఆధునిక రవాణా మార్గాల అభివృద్ధితో కొంతవరకు తన ప్రాముఖ్యతను కోల్పోయింది. అయితే సహజ సౌందర్యంలోనూ, పర్యావరణ ప్రాముఖ్యత లోను ఈ సరస్సు నికరాగువా దేశానికి మాత్రమే కాకుండా మధ్య అమెరికా భూభాగానికే తలమానికంగా నిలిచింది. సముద్ర జీవజాతులను సైతం తనలో నిలుపుకొన్న ఈ మంచినీటి సరస్సు అరుదైన జల, వన్యప్రాణులకు ఆవాస ప్రాంతం. ఆకట్టుకొనే అగ్నిపర్వతాలు, 400 కి పైగా వున్న దీవులు, ద్వీపసమూహాలను కలిగివున్న ఈ సరస్సు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు నిలయమై. మధ్య అమెరికాలో గొప్ప పర్యావరణ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది.

చిత్రమాల

[మార్చు]

రిఫరెన్సులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Salvador Montenegro-Guillén (2003). "Lake Cocibolca/Nicaragua" (PDF). Lake Basin Management Initiative: Experience and Lessons Learned Brief. LBMI Regional Workshop for Europe, Central Asia and the Americas. Saint Michael's College, Colchester, Vermont. pp. 1–29. Retrieved 2014-01-01.
  2. 2.0 2.1 2.2 "Cocibolca (Nicaragua)". LakeNet. Retrieved 2009-01-14.
  3. "History of Granada: The oldest city in Central America". Granada Nicaragua. Archived from the original on 2019-03-29. Retrieved 2009-01-14.
  4. Oakland Ross, "Nicaragua-Chinese partnership announces planned route for proposed inter-oceanic canal" Archived 2014-09-03 at the Wayback Machine, The World Daily Blog (thestar.com), Jul 14 2014. Accessed Oct 27, 2014.
  5. W. Alejandro Sanchez, "Protests against Nicaragua’s ambitious canal" Archived 2014-10-28 at the Wayback Machine, voxxi.com, Oct 26, 2014.
  6. Homziak, Jurij. CAFTA Interim Environmental Review – Lake Nicaragua Archived 2017-11-13 at the Wayback Machine. lasuerte.org. Accessed 2008-04-06
  7. Colodney, D: The Cichlids of Lake Nicaragua – Part I. Archived 2014-12-26 at the Wayback Machine Badman's Tropical Fish. Retrieved 26 December 2014.
  8. Lake Nicaragua. vianica.com. Accessed 2008-04-06