పరిమి వేంకటాచలకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగమేశ్వర శతకం- పరిమి వేంకటాచలకవి

వేంకటాచల కవి పరిమి 19 వ శతాబ్దానికి చెందిన కవి. అతను ప్రథమ శాఖ నియోగి. తుంగభద్ర నది సమీపంలోని జాగర్లమూడి ప్రాంతం నివాసి. అతను సంగమేశ్వర శతకం రచించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు మండలంలోని తెనాలి తాలూకాకు చెందిన చినపరిమి గ్రామంలో రఘునాయకుడు, సూరమాంబ దంపతులకు జన్మించాడు. తరువాత ఇతడు తుంగభద్ర నదీ తీరంలోని జాగర్లమూడి గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. ఈ కవి తన గురించి తన శతకం చివర ఈ క్రింది పద్యం ద్వారా తెలియజేసాడు.[1]

నరహరిభక్తిమించు రఘునాయకమంత్రికి సూరమాంబకున్
వరసుతుడన్ ధరన్ పరిమివంశజుడన్ భవదీయదసుడన్
హరితనగోత్రజుండ చెలువంద జనించితి నాదిశాఖయం
దరయగ వేంకటాచల సమాఖ్యుడ కూడలి సంగమేశ్వరా

శతక పరిచయం "కూడలి సంగమేశ్వరా" మకుటంతో చంపకమాల, ఉత్పలమాల వృత్తాలతో రచిందిన ఈ శతకం భక్తి రస ప్రధానమైనది. ప్రతీ పద్యంలో భక్తిరసం ఉట్టిపడుతుంది. సంగమేశ్వర శతకం - పరిమి వేంకటచలకవి

భక్తిరస పద్యం

పాములు భూషణంబులు కపాలముపళ్ళెర మద్రిగేహమున్ సామజచర్మ మంబరము సారెకుగల్గిన బిచ్చగాని నే నే మని వెంబడింతు సిరులిమ్మని యింతియచాలు చాలునా స్వామి త్వదీయభక్తియమొసంగవె కూడలి సంగమేశ్వరా!

ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే పద్యం

కాసుకుఁ గందపద్య మఱకాసుకు వృత్తము గుడ్డీగవ్వకున్ సీసముగా నిటు ల్చవుకఁ జెందెఁ గవిత్వము గావున న్మనో ల్లాసితిలౌ ధరాధిపతుల నంది రోసి నినుస్సదా నుతుల్ చేసెద వేగ నన్ను దయసేయవె కూడలి సంగమేశ్వరా!

కంటకులౌ ధరాధిపుల గాంక్షల గొల్చుచుంతినిగాని నీ వంటి దయాళూ భక్తజను వత్సలు నామది గొల్వనైతి ని ష్కంటకవృత్తిగా కెటులగల్గు భవచ్ఛరణంబుదక్క నీ బంటుగ నెలుకోమ్మఖిలపావన కూడలి సంగమేశ్వరా!

ప్రాచీన కవులను పోలిన పద్యాలు - ఈక్రింది పద్యం "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలయందు" పద్యాన్ని పోలి ఉంటుంది.

ఎవ్వనిచే జగంబు జనియించు, వసించు నశించు, నవ్యయుం డెవ్వడు కార్యకారణము లెవ్వడు భూతనమాశ్రయుండువా డెవ్వడు చిత్కళాసహితుడెవ్వ డపారదాత డీవెకా యివ్వసుధాస్థలిన్ వెదుకనేనిక కూడలి సంగమేశ్వరా!


మూలాలూ[మార్చు]

  1. "సంగమేశ్వర శతకం - పరిమి వెంకటాచలకవి - దేవరకొండ సుబ్రహ్మణ్యం".