పూర్ణ స్వరాజ్
పూర్ణ స్వరాజ్ లేక భారత స్వాతంత్ర్య ప్రకటన అన్నది 1929 డిసెంబరు 19న బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి అన్ని విధాలా తెగతెంపులు చేసుకునే పూర్ణ స్వరాజ్యం లేక పూర్తి స్వయం పరిపాలన సాధించేందుకు పోరాటం చేయనున్నట్టు భారత జాతీయ కాంగ్రెస్ చేసిన తీర్మానం. లాహోర్ కాంగ్రెస్‌లో ఈ తీర్మానం ఆమోదమైంది. 1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్‌లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. జవాహర్, గాంధీ రాసిన పన్నుల నిరాకరణకు సైతం సిద్ధంగా ఉండడం కలిగివున్న స్వాతంత్ర్య ప్రమాణాన్ని అందరూ చదివి ప్రమాణాలు చేశారు. కాంగ్రెస్ పక్షానికి అనుకూలురైన శాసన సభ్యులు ఈ ప్రకటనకు అనుగుణంగా రాజీనామా చేశారు. లాహోర్ కాంగ్రెస్‌లో 1930 జనవరి ఆఖరి ఆదివారం (అది జనవరి 26 అయింది) పూర్ణ స్వాతంత్ర్య ఆకాంక్షను వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు పట్టణాలు, పల్లెల్లో క్రమశిక్షణతో ఆరోజున స్వాతంత్ర్యేచ్ఛ వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకున్నారు.
నేపథ్యం
[మార్చు]గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి వరకూ ఉపయోగిస్తూ వచ్చిన స్వరాజ్యమనే పదాన్ని అధినివేశ ప్రతిపత్తి కోరడం అనే సాంకేతిక అర్థంలో వాడుతూ వచ్చారు. అధినివేశ ప్రతిపత్తి అన్నది బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే అంతర్గతంగా కొంత స్వతంత్రాన్ని పొందే ఒక ఏర్పాటు. కాంగ్రెస్ వంటి సంస్థ అధినివేశ ప్రతిపత్తి కోసం పాకులాడడం ఐరోపా నుంచి వచ్చాకా జవాహర్‌లాల్‌కి నిరర్థకమని తోచింది. కాంగ్రెస్‌తో వీలైనంత త్వరగా సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యం అని అంగీకరింపజేయడం కనీసం మొదటి మెట్టుగా తోచింది. అధినివేశ ప్రతిపత్తిలో విడిపోయే హక్కు ఉంటుందని చేసే వాదాల్లోని యుక్తి అతను అంగీకరించేవాడు కాదు. అసలు అధినివేశ ప్రతిపత్తికి అంగీకరించడమే భారతదేశ మానసిక భ్రష్టత్వానికి నిదర్శనమని భావించాడు. ఇది ఐరోపాలో అతనికి కలిగిన నూతన రాజకీయ, ఆర్థిక చైతన్యానికి సరిగా సరిపోయే కార్యాచరణ అని తోచింది.
జవాహర్‌లాల్ మద్రాసు కాంగ్రెస్ మహాసభలో పూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేయగలిగాడు. పూర్ణ స్వాతంత్ర్యానికి రక్షణ, ద్రవ్య, ఆర్థిక విషయాలు, విదేశాంగ విధానంపై పూర్తి అదుపు అని తీర్మానంలో అర్థం చెప్పాడు. అయితే ఈ తీర్మానాన్ని కేవలం జవాహర్‌లాల్‌ని సంతోషపరిచి, సంతృప్తుణ్ణి చేయడానికే గాంధీ ప్రధానంగా ఉద్దేశించాడు. కనుక కాంగ్రెస్ నియమావళిలో పూర్వ అర్థంలో స్వరాజ్యం అన్న పదమే కనిపిస్తుంది. అందుకే బ్రిటీష్ వారితో పూర్తి తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడని వారు కూడా కాంగ్రెస్‌లో కొనసాగ సాగారు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా జవాహర్ నెగ్గించిన తీర్మానం పూర్తిగా పరిహాసాస్పదం అయింది. మహాత్మా గాంధీకి కానీ, అప్పటికి నెహ్రూ రిపోర్టు రాస్తున్న మోతీలాల్‌కి కానీ పూర్ణ స్వాతంత్ర్యం అనే లక్ష్యం ఆమోదయోగ్యం కాదు.[1]
కాంగ్రెస్‌లో ఉంటూనే స్వాతంత్ర్యం కోసం ఒత్తిడి తీసుకువచ్చే పక్షంగా ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ నెలకొల్పాడు. జవాహర్ ఉద్దేశంలో ఈ లీగ్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాక స్వాతంత్ర్యానంతరం భారతదేశం పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రాతిపదికలు మార్చివేసి, రాజ్యాన్ని సహకార ప్రాతిపదికపై వ్యవస్థీకరించేందుకు పనిచేయాలి. అంటే భారత స్వాతంత్ర్యంతో పాటుగా సామ్యవాద, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వవాదం వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనిని అంతర్జాతీయ వాదానికి ముడిపెడుతూ ఒక పెద్ద ప్రపంచ సహకార కామన్వెల్తుకు ఈ పరిణామాలు దారితీయాలని కూడా ఆశించాడు. తన ఉద్దేశాలను కాంగ్రెస్ నాయకత్వంలో చాలామంది ఆమోదించట్లేదని తెలిసిన జవాహర్ తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. జవాహర్ చేస్తున్న ఈ కార్యాచరణకు కాంగ్రెస్ వారెవరూ పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకపోవడంతో అతని రాజీనామా అంగీకరించలేదు. ఆ మాటకి వస్తే ఈ స్వాతంత్ర్యం అన్న డిమాండ్ అధినివేశ ప్రతిపత్తిని సాధించుకునేందుకు మంచి ఎత్తుగడగా వారు భావించారు.
మోతీలాల్ నెహ్రూ తయారుచేసిన నెహ్రూ రిపోర్టును 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించినట్టుగా అధినివేశ ప్రతిపత్తితో సంతృప్తి పడడం జవాహర్‌కు సరిపడని సంగతి. అయితే కాంగ్రెస్‌ను ఆ ప్రాతిపదికన చీల్చడం ఇటు జవాహర్‌కు,[2] అటు గాంధీకి కూడా ఇష్టం లేదు. జవాహర్‌లాల్, సుభాష్ చంద్ర బోస్, తదితరులు కాంగ్రెస్‌ను చీల్చకుండా చూసేందుకు - రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం నెహ్రూ రిపోర్టును అంగీకరించి అధినివేశ ప్రతిపత్తిని ఇవ్వకపోతే కాంగ్రెస్ పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరవచ్చని గాంధీ అన్నాడు. జవాహర్‌లాల్‌తో ఇంకొంత చర్చించాకా ఆ కాలావధిని ఏడాదికి తగ్గించారు. [3] ఏడాది పాటు అధినివేశ ప్రతిపత్తి కోరే అంశంపై రాజీని కమిటీ స్థాయిలో అంగీకరించిన జవాహర్‌లాల్, సుభాష్ చంద్ర బోస్ బహిరంగ సమావేశంలో వ్యతిరేకించడంతో నొచ్చుకున్న గాంధీ "మీరు మీ మాటపై నిలవకపోతే ఇక స్వాతంత్ర్యం పరిస్థితి ఏమిటి?" అని ఆక్షేపించాడు.[4] అయితే జవాహర్‌లాల్ మనస్థితిలో పరిస్థితికి తలవంచినా, సాంకేతికంగా కూడా అధినివేశ ప్రతిపత్తికి రాయితీ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే జవాహర్‌లాల్ ఏదోమేరకు అయిష్టంతో అంగీకరించినా, కనీసం కాగితంపై కూడా అధినివేశ ప్రతిపత్తి తనకు సమ్మతం కాదన్న విషయాన్ని చెప్పడానికి తీర్మానం ఆమోదించిన ఆఖరు సమావేశానికి హాజరు కాలేదు.[3]
లాహోర్ కాంగ్రెస్ - భారత స్వాతంత్ర్య ప్రకటన
[మార్చు]కాంగ్రెస్-వైశ్రాయ్‌ల నడుమ జరిగిన సంప్రదింపులు పూర్తిగా విఫలం కావడంతో జవాహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, తదితరుల వైఖరే సరైనదని నిర్ధారణ అయ్యి పార్టీ అంతా అతని వైఖరినే అవలంబించారు.[5] జవాహర్‌లాల్ లాహోరు కాంగ్రెస్ అధ్యక్షత వహించేనాటికి అతని వైఖరి పట్ల ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి పూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా అంగీకరించడం అనివార్యమే అయింది.[6]
జవాహర్‌లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటన చిత్తుప్రతిని తానే తయారుచేశాడు. దీనిని లాహోర్ కాంగ్రెస్ ఆమోదించింది. ఇందులో ఒక భాగం ఇలా పేర్కొంటూంది:
స్వేచ్ఛ, శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవించగలగడం, జీవితావసరాలు సంపాదించుకుని ఎదగడానికి అవకాశాలు పొందడం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల్లాగానే భారత ప్రజల మార్చలేని హక్కు. ఈ హక్కులను ఏ ప్రభుత్వం అయినా నిరాకరించి అణచివేస్తూంటే దాన్ని మార్చడానికి కానీ, ఆ ప్రభుత్వాన్ని రద్దుచేయడానికి కానీ ప్రజలకు హక్కు ఉంటుందని మేం నమ్ముతున్నాం. భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం కేవలం భారత ప్రజలకు స్వేచ్ఛను నిరాకరించడమే కాదు, దేశంలోని ప్రజలను దోపిడీ చేసి, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేస్తున్నది. దాంతో మేం నమ్మేదేంటంటే: భారతదేశం బ్రిటీష్ వారితో సంబంధాలు తెంపివేసుకుని, పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్ర్యం సంపాదించాలి.[7]
1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్‌లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.[8] జవాహర్, గాంధీ రాసిన పన్నుల నిరాకరణకు సైతం సిద్ధంగా ఉండడం కలిగివున్న స్వాతంత్ర్య ప్రమాణాన్ని అందరూ చదివి ప్రమాణాలు చేశారు. 172 మంది కేంద్ర, ప్రాంతీయ శాసన సభ్యులు ఈ ప్రకటనకు అనుగుణంగా రాజీనామా చేశారు. లాహోర్ కాంగ్రెస్‌లో 1930 జనవరి ఆఖరి ఆదివారం (అది జనవరి 26 అయింది) పూర్ణ స్వాతంత్ర్య ఆకాంక్షను వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. తన స్వీయచరిత్రలో జవాహర్‌లాల్ ఆరోజును ఇలా వర్ణించాడు - "1930 జనవరి 26న స్వాతంత్ర్య దినం వచ్చింది, ఒక్క మెరుపులో దేశపు పట్టుదల, కుతూహలపు చిత్తవృత్తి మాకు తెలియవచ్చిందీ. ప్రతిచోటా పెద్ద సమావేశాలు జరిగాయి, వాటిల్లో ఆకర్షవంతమైందేదో ఉంది. అక్కడ ఉపన్యాసాలు లేవు, ఉద్బోధలు లేవు. ప్రశాంతంగా, గంభీరంగా స్వాతంత్ర్య ప్రమాణాలు స్వీకరించటం జరిగింది." కలకత్తా, బొంబాయిల్లో పెద్ద పెద్ద సమావేశాలు జరిగాయి. చిన్న పట్నాల సమావేశాలకు కూడా జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ టంగుటూరి ప్రకాశం (1972). " గాంధీ - ఇర్విన్ ఒడంబడిక, మా విడుదల". నా జీవిత యాత్ర-3. వికీసోర్స్.
- ↑ సర్వేపల్లి గోపాల్ & 1993 108.
- ↑ 3.0 3.1 సర్వేపల్లి గోపాల్ & 1993 109.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 1997, p. 132.
- ↑ సర్వేపల్లి గోపాల్ & 1993 115.
- ↑ సర్వేపల్లి గోపాల్ & 1993 117.
- ↑ "Declaration of independence". Archived from the original on 17 మే 2013. Retrieved 20 ఆగస్టు 2018.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ & 1997 140.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 4.