ప్రపంచ సాంస్కృతిక మండలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏదైనా ఒక సమాజంలోని ప్రజల జీవనశైలిని ఆ సమాజం యొక్క సంస్కృతిగా అభివర్ణించవచ్చు. సంస్కృతి పరంగా ఒకే విధమైన సజాతీయ లక్షణాలు గల భూప్రాంతాలన్నిటిని కలిపి ఒక సాంస్కృతిక మండలం (Cultural Realm) అని వ్యవహరిస్తారు. అంటే ఒక సాంస్కృతిక మండలం, దాదాపుగా ఒక విలక్షణమైన సంస్కృతిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక మండలం అనేది సాంస్కృతిక మానవ శాస్త్రంలో ఒక భావన. ఏదైనా ఒక కాలక్రమంలో పర్యావరణం పరంగాను, సంస్కృతి పరంగాను ఏకరూపకత కలిగివున్న భౌగోళిక ప్రాంతాన్ని సాంస్కృతిక మండలం గా పేర్కొనవచ్చు.[1]

సాంస్కృతిక అంశాల సజాతీయత ఆధారంగా గా ప్రపంచంలో వివిధ సాంస్కృతిక మండలాలను గుర్తించడానికి టానీబీ (Toynbee), బ్రోక్ వెబ్ (Brock Webb), డి-బ్లిజ్ వంటి శాస్త్రజ్ఞులు ప్రయత్నించారు. సాంస్కృతిక మండలాల వర్గీకరణలలో డి-బ్లిజ్ వర్గీకరణను సమగ్రమైనది. ఇతని ప్రకారం ప్రపంచం 12 ప్రధాన సాంస్కృతిక మండలాలుగా విభజితమైంది. సాంస్కృతిక ప్రపంచీకరణ ప్రక్రియలపై సామాజిక శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల కారణంగా నేడు సాంస్కృతిక మండలాల నిర్వచనం సైద్ధాంతికంగానే కాక ఆచరణాత్మకంగాను కొత్త ఆసక్తులను రేకెత్తిస్తుంది.[2]

సాంస్కృతిక మండలాలు-ప్రభావిత అంశాలు[మార్చు]

సాంస్కృతిక మండలాల అధ్యయనంలో పెక్కు అంశాలను పరిగణలోకి తీసుకొంటారు. ప్రజల యొక్క భాష, ఆహార్యం, ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలు,జాతి, కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన స్థాయి వంటి అంశాలు ఆయా సమాజాల యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ విధమైన అంశాలలో ప్రబలంగా కనిపించే సజాతీయత, సహ సంబందాలను ఆధారంగా చేసుకొని ప్రపంచ సాంస్కృతిక మండలాలను వర్గీకరించారు.

అయితే సాంస్కృతిక మండలాల అధ్యయనంలో కేవలం మానవ సమాజాల సాంస్కృతిక లక్షణాలనే కాకుండా, ఆయా భౌగోళిక ప్రాంతాల చారిత్రిక నేపధ్యాన్ని, నైసర్గిక స్వరూపం వంటి భోగోళికాంశాలను కూడా పరిగణనలోకి తీసుకొనవలసి ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో వర్గీకరించడానికి వాస్తు నిర్మాణ శైలి వంటి అంశాలను కూడా ఆధారంగా తీసుకోవచ్చు. వర్గీకరణకు ఆధారమైన సాంస్కృతిక అంశాలను నిర్ణయించేటప్పుడు జాతిని పరిగణనలోకి తీసుకోవచ్చు కాని జన్యుపరమైన వారసత్వగుణాలు, మానవుల ప్రాధమిక సహజాతాలను పరిగణనలోనికి తీసుకోకూడదు.

ఒక సాంస్కృతిక వ్యవస్థ మొత్తంపై మత విలువల ప్రభావం అపారంగా ఉందని బ్రోక్ వెబ్ విశ్లేషించాడు. ఆ మత ప్రభావం తొలగిపోయినప్పుడు క్రమేణా ఆ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంస్కృతి కూడా ప్రభావహీనమవుతుందని సాంస్కృతిక-మత పరిశోధన వెల్లడించింది.[3]

సాంస్కృతిక మండలాలు-లక్షణాలు[మార్చు]

  • ఒక సాంస్కృతిక మండలం మత విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, వేషధారణ, ఆహారపుటలవాట్లు, భాష, జాతి, కళలు, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన సాంస్కృతిక అంశాల పరంగా అంతర్గత సజాతీయతను, బహిర్గత వైవిధ్యతను కలిగి వుంటుంది.
  • సాధారణంగా ఇవి అవిచ్ఛిన్న భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. సంస్కృతి గతిశీలకమైనది కావడం వల్ల సాంస్కృతిక మండలాల సరిహద్దులు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి వీటి భౌగోళిక సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించలేము. ఉదాహరణకు రష్యన్ సాంస్కృతిక మండలానికి యూరప్ మండలానికి మధ్య సరిహద్దు నిర్ధారణ కష్టం. పూర్వపు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంకావడంతో ఆ మండలానికి పశ్చిమ సరిహద్దులో వున్న దేశాలు తరువాత కాలంలో యురోపియన్ యూనియన్ కు దగ్గర కావడంతో సాంస్కృతికంగా అవి నెమ్మదిగా యూరప్ మండలానికి సన్నిహితంగా జరుగుతున్నాయి.
  • ఒక సాంస్కృతిక మండలం గతిశీలకమైనది కావున నిరంతరం మార్పులు చెందుతుంది. ఆ క్రమంలో అది అదృశ్యం కావచ్చు లేదా అప్పటికే కొనసాగుతున్న వేరొక సాంస్కృతిక మండలంలో కలిసి పోవచ్చు. లేదా మరింత విస్తరించవచ్చు. టోనీబీ ప్రకారం ప్రపంచంలో ఒకప్పుడు విలసిల్లిన 25 నాగరికతలలో నేడు 10 మాత్రమే కొనసాగుతున్నాయి. ఆధునిక యుగంలో అరబ్, పాశ్చాత్య మండలాలు బాగా విస్తరిస్తున్నాయి.
  • రెండు వేర్వేరు సాంస్కృతిక మండలాల మధ్య పరివర్తనా మండలాలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు ఆఫ్రికన్ నీగ్రో సాంస్కృతిక మండలానికి అరబ్ సాంస్కృతిక మండలానికి మధ్య సూడాన్, చాద్, నైజీరియా, మాలె ప్రాంతాలలో ఒక స్పష్టమైన పరివర్తన మండలం గమనించవచ్చు.
  • ప్రాచ్య సంస్కృతులు కలిగిన ఓరియంటల్ మండలంలో తాత్విక చింతన, సాంఘిక కుటుంబ వ్యవస్థలు ఇప్పటికీ బలంగా వున్నాయి. పాశ్చత్య సంస్కృతులు కలిగిన ఆక్సిడెంటల్ మండలాల్లో వస్తువ్యామోహం పెరిగితాత్విక చింతన లోపిస్తూ వుంది. గ్రీకు-రోమన్ నాగరికతలలో తాత్విక చింతన కనుమరుగు కావడంతో యూరప్ సాంస్కృతిక పునాదులు కదులుతున్నాయి.
  • సాంస్కృతికపరమైన అంశాలలో సజాతీయత ఉన్నంత మాత్రాన, ఒక సాంస్కృతిక మండలం సుస్థిరంగా ఉంటుందని భావించడానికి అవకాశం లేదు. ఉదాహరణకు యూరప్ సాంస్కృతిక మండలంలోని ప్రజలందరు కాకసాయిడ్ జాతికి, క్రైస్తవ మతానికి చెందినవారైనప్పటికీ ఈ మండలంలోని పలు దేశాల మధ్య చారిత్రకంగా అనేక యుద్ధాలు జరిగాయి.
  • ఒక సాంస్కృతిక మండలంలో సాంస్కృతిక అంశాల పరంగా అంతర్గత సజాతీయతలే కాకుండా కొన్ని అంతర్గత వైవిద్యాలు కూడా అనివార్యంగా ఉంటాయి. అయితే అంతర్గత వైరుధ్యాలను అనుసంధానించే ఏకీకరణ శక్తులు బలహీనపడితే ఆ సాంస్కృతిక మండలం విచ్ఛిన్నమవుతుంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ సాంస్కృతిక మండలం విచ్ఛిన్నమవడాన్ని దీనిని ఉదాహరణగా పేర్కొనవచ్చు.
  • ప్రపంచ సాంస్కృతిక మండలాలలో సాంస్కృతిక వైవిధ్యత, భిన్నత్వం ఏర్పడటానికి మానవ వలసలు (Migrations) ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రాచీనకాలం నుండి అలలు అలలు గా వచ్చిన ఆర్యుల వలసల వల్ల ఇండియన్ సాంస్కృతిక మండలంలో సాంస్కృతిక వైవిధ్యత అపారంగా కనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా కఠినమైన వలస విధానాలు అనుసరించే ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ సాంస్కృతిక మండలంలో భిన్నత్వం తక్కువగా కనిపిస్తుంది.
  • రవాణా, సమాచార వ్యవస్థల అభివృద్ధి సంస్కృతుల వ్యాప్తికి దోహదపడుతుంది.
  • సాంస్కృతిక వైవిధ్యత అధికంగా వున్నప్పుడు ఉదార విధానాలు, సర్దుబాటు తత్త్వం వున్న సంస్కృతుల వలన సాంస్కృతిక మండలం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంది. ఆంగ్లో-అమెరికన్, భారతీయ సాంస్కృతిక మండలాలలో జాతి వైవిధ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అవి ఉదారవిధానాలతో ఈ మండలాల్లో బహుళ సమాజాలు (Plural Societies) రూపొందించడానికి కృషి చేస్తున్నాయి.

సాంస్కృతిక మండలాల వర్గీకరణ[మార్చు]

రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక తదితర కోణాలనుండి పరిశీలించడం ద్వారా అనేకమంది, ప్రపంచాన్ని ప్రాంతీకరించడానికి ప్రయత్నించారు. సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా ప్రపంచాన్ని వివిధ సాంస్కృతిక మండలాలుగా ప్రాంతీకరించడానికి భౌగోళిక శాస్త్రవేత్తలతో పాటు, చరిత్రకారులు, మానవ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అనేక మంది అనేక విధాలుగా కృషి చేశారు. ఇలా సాంస్కృతిక కోణంలో ప్రపంచాన్ని వర్గీకరించినవారిలో వారిలో హంటింగ్టన్ (1996), డి-బ్లిజ్, ముల్లెర్ (1997), ఫెల్మాన్ (2008) మొదలైనవారు ముఖ్యులు. హంటింగ్టన్ ప్రపంచాన్ని 8 సాంస్కృతిక మండలాలు గాను, డి-బ్లిజ్ & ముల్లెర్ లు 12 సాంస్కృతిక మండలాలు గాను, ఫెల్మాన్ 11 సాంస్కృతిక మండలాలు గాను వర్గీకరించారు. [4] బ్లాచే, స్పెన్సర్ (Blache and Spencer) వంటి భౌగోళిక శాస్త్రవేత్తలు సాంస్కృతిక మండలాల అధ్యయనాన్ని మానవ భౌగోళిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశంగా భావించారు. [3]

ప్రపంచ సాంస్కృతిక మండలాలకు సంబంధించి ప్రధానముగా 3 వర్గీకరణలు వున్నాయి. అవి

1) టానీబీ (Toynbee)
2) బ్రోక్ వెబ్ (Brock Webb)
3) డి-బ్లిజ్ (De-Blij)

టానీబీ ప్రపంచంలో 26 నాగరికతలు గుర్తించి, ప్రస్తుతం వాటిలో 10 మాత్రమే విలసిల్లుతున్నాయని అభిప్రాయపడ్డాడు.

బ్రోక్ వెబ్ (Brock Webb) వర్గీకరణ[మార్చు]

ఇతని ప్రకారం ప్రపంచంలో నాలుగు ప్రధాన సాంస్కృతిక మండలాలు, రెండు ఉప సాంస్కృతిక మండలాలు వున్నాయి. అవి
ఇతని ప్రకారం ప్రధాన సాంస్కృతిక మండలాలు

  • పాశ్చాత్య (ఆక్సిడెంటల్) మండలం
  • ఇస్లామిక్ మండలం
  • భారతీయ మండలం
  • తూర్పు ఆసియా మండలం

ఉప సాంస్కృతిక మండలాలు

  • ఆగ్నేయాసియా మండలం
  • నీగ్రో లేదా మధ్య ఆఫ్రికా మండలం

పాశ్చాత్య సాంస్కృతిక మండలం (Occidental Realm)[మార్చు]

యూరప్, ఉత్తరమెరికా, లాటిన్ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లతో కలసి పాశ్చాత్య మండలం రూపొందింది. ఈ మండలానికి వాయువ్య యూరప్, మధ్యధరా యూరప్ ప్రాంతం కేంద్రం వంటిది. ఈ మండలం క్రైస్తవ మతం ద్వారా బాగా ప్రభావితమయ్యింది. అయినప్పటికి మతపరమైన విలువలను పెద్దగా పట్టించుకోకపోవడం, సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టడంతో ఇక్కడి సంస్కృతి, అతి త్వరగా ఆధునీకరణ ప్రభావానికి లోనయ్యింది. నూతన భౌగోళిక ప్రాంతాలను అన్వేషించిన యూరోపియన్లు వలసల ద్వారా తమ సంస్కృతిని సుదూర ప్రాంతాలకు విస్తరించారు. పారిశ్రామికీకరణ అనంతరం బహుముఖంగా విలసిల్లిన ఇక్కడి అభివృద్ధి, మిగిలిన సాంస్కృతిక మండలాలపై ఏదో ఒక రూపేణా ఆధిపత్యం కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నది.

ఈ సాంస్కృతిక మండలంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న పారిశ్రామికీకరణ, వాణిజ్యేకరణ, నగరీకరణ స్థాయీ భేదాలు, వలస పాలనలు, ఆర్ధిక, రా జకీయ వ్యవస్థలు తదితర అంశాల కారణంగా ఈ సువిశాల మండలాన్ని తిరిగి 6 ఉప ప్రాంతాలుగా విభజించారు.

i) వాయువ్య యూరప్ ఉప మండలం:
ii) మధ్యధరా యూరప్ ఉప మండలం:
iii) ఖండాంతర్గత యూరప్ ఉప మండలం:
iv) ఆంగ్లో-అమెరికన్ ఉప మండలం:
v) లాటిన్ అమెరికా ఉప మండలం:
vi) ఆస్ట్రేలియన్ ఉప మండలం:

'వాయువ్య యూరప్ ఉప మండలం'లో ఇంగ్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, స్కాండినేవియా తదితర దేశాలు వున్నాయి. ఇది అత్యంత పారిశ్రామికీకరణ, నగరీకరణ చెందిన ఉపమండలం. పాశ్చాత్య సాంస్కృతిక మండలానికి ఇది గుండెకాయ వంటిది. ఇక్కడి ప్రజలు నూతన భౌగోళిక ప్రాంతాల అన్వేషణలో ప్రగతి చూపడమే కాక, వలస రాజ్య స్థాపనలో ఉదృతిగా చొచ్చుకు పోయారు. ఈ సాంస్కృతిక మండలంలోనే పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ప్రారంభమైనది.

ఆల్ప్స్ పర్వతాలకు దక్షిణంగా వున్న దేశాలు (పోర్చుగీస్, స్పెయిన్, దక్షిణ ఇటలీ) 'మధ్యధరా యూరప్ ఉప మండలం' యొక్క సాంస్కృతిక పరిధిలోకి వస్తాయి. ఈ ఉప మండలం 15 వ శతాబ్దం వరకూ పాశ్చాత్య సాంస్కృతిక మండలానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. నూతన భౌగోళిక అన్వేషణలకు నాంది పలికిన ఈ సాంస్కృతిక మండలం, లాటిన్ అమెరికాలో వలసలు స్థాపించడమే కాక, అక్కడి పురాతన రెడ్ ఇండియన్ల సంస్కృతిని రూపుమాపి లాటిన్ అమెరికాలో తమ సంస్కృతులను ప్రవేశపెట్టింది. రోమన్ కాథలిక్ మత చర్చి ప్రభావం ఎక్కువగా వున్న ఈ మండలంలో ప్రజలు పాతుకుపోయిన సాంప్రదాయిక భావాలతోను, మార్పుకు అంగీకరించని సాంఘిక వ్యవస్థలతోను కొనసాగవలసి వచ్చింది. దీనివల్ల ఈ ఉపమండలం, వాయువ్య యూరప్ ఉప మండలంతో పోలిస్తే పరిమితమైన అభివృద్ధి మాత్రమే సాధించింది. సాధించిన వృద్ధి కూడా చాలా వరకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలోనే జరిగింది.

'ఖండాంతర్గత యూరప్ ఉప మండలం'లో రష్యా, మధ్య యూరప్ దేశాలు (పోలాండ్, చెక్-స్లావేకియా,యుగోస్లేవియా, హంగేరి, రుమేనియా, ఉక్రేనియా తదితర దేశాలు) వున్నాయి. ఈ సాంస్కృతిక ఉప మండలంలో ప్రధానంగా క్రైస్తవమతంతో పాటు వివిధ ఆర్ధిక, రాజకీయ సిద్ధాంతాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. కేంద్రీకృత ఆర్ధిక వ్యవస్థలు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఈ మండలంలోని సాంస్కృతిక వైరుధ్యాలను నియంత్రించలేకపోయాయి.

'ఆంగ్లో-అమెరికన్ ఉప మండలం'లో ఉత్తరమెరికా ఖండ దేశాలు (కెనడా, అమెరికా) వస్తాయి. చారిత్రకంగా యూరప్ ఖండం నుంచి వచ్చిన వలస ప్రజలచే ఈ మండలం రూపుదిద్దుకొన్నది.

మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలలో 'లాటిన్ అమెరికా ఉప మండలం' విస్తరించింది. ఇది మధ్యధరా సంస్కృతితో సన్నిహిత సంబంధాలు కలిగి వుంది. ముఖ్యంగా వలస పాలనా కాలంలో స్పానిష్, పోర్చుగీస్ సంస్కృతులు ఇక్కడి స్థానిక సంస్కృతితో సమ్మేళనమవడం వలన ఈ సాంస్కృతిక ఉప మండలం రూపొందింది. ఈ ఉప మండలానికి సంబందించిన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు, భాషలు, కళలు, వాస్తు నిర్మాణ శైలి దాదాపుగా అన్ని అంశాలు స్పానిష్, పోర్చుగీస్ దేశాలచే విశేషంగా ప్రభావితమయ్యాయి. అందువలన ఈ మండలంలోని దేశాలన్నీ మధ్యధరా దేశాలతో ధృడమైన సంబంధాలు కలిగివున్నాయి.

'ఆస్ట్రేలియన్ ఉప మండలం' యొక్క సంస్కృతి దాదాపుగా బ్రిటిష్ సంస్కృతిని పోలి ఉంటుంది. బ్రిటీష్ లేదా వాయువ్య యూరప్ సంస్కృతితో సన్నిహితంగా వున్న కారణంగా ఈ ఉప మండలాన్ని 'వాయువ్య యూరప్ సాంస్కృతిక ఉప మండలం'లో ఒక భాగంగా పరిగణించవచ్చు.

ఇస్లామిక్ సాంస్కృతిక మండలం (Islamic Cultural Realm)[మార్చు]

ఈ సాంస్కృతిక మండలం ఉత్తర ఆఫ్రికా, నైరుతి ఆసియా లలో మొరాకో-పాకిస్తాన్-ఇథియోపియాల మధ్య విస్తరించింది. ఉత్తరాఫ్రికా లోని అరబ్ దేశాలు, మధ్య ప్రాచ్య (Middle East) దేశాలు, పాకిస్థాన్ ఈ మండల పరిధిలోకి వస్తాయి. ఈ మండలం శుష్క (arid), అర్ధ శుష్క (semi-arid) ప్రాంతానికి చెందింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా ఇక్కడ జనాభా తక్కువగా వుంది. ఒయాసిస్లు, నదీ పరివాహక ప్రాంతాలు, తీర ప్రాంతాలు అరబ్ సంస్కృతికి పుట్టినిల్లు వంటివి. ఈ మండలానికి ఇస్లాం మత విశ్వాసాలు సజాతీయతను ఆపాదించినప్పటికీ ప్రాంతీయ వైవిధ్యతలు కూడా అనివార్యంగా కనిపిస్తాయి. ఇక్కడి సంస్కృతి అత్యంత సనాతనమైనది. ప్రజలు సాంప్రదాయిక విశ్వాసాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల, వాటికి సరైన ఆధునిక భాష్యం లేకపోవడంతో, ఇక్కడి స్త్రీలలో అత్యధిక నిరక్షరాస్యత నెలకొంది. ఒకప్పుడు మధ్యయుగాలలో ప్రపంచ సాంస్కృతిక కేంద్రాలుగా పరిఢవిల్లిన ఈ దేశాలు, కాలానుగుణంగా వచ్చే మార్పులకి సంసిద్ధం కాకపోవడంతో ప్రస్తుతం వెనుకబడి వున్నాయి. ఈ సాంస్కృతిక మండలం ఇటీవల కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావానికి లోనవుతున్నప్పటికీ, ఇక్కడి రాజకీయ, సామాజిక వ్యవస్థలు ఆధునికంగా స్థిరపడలేదని చెప్పవచ్చు.

భారతీయ సాంస్కృతిక మండలం (Indian Cultural Realm)[మార్చు]

ఇది భారత ఉపఖండపు సంస్కృతి. ఉత్తరాన హిమాలయాల నుండి, దక్షిణాన హిందూ మహా సముద్రం వరకూ, పశ్చిమాన హిందూకుష్ పర్వతాల నుండి ప్రారంభమై విస్తరించిన హిందూ మత ప్రాబల్యం గల భారత ఉపఖండాన్ని భారతీయ సాంస్కృతిక మండలంగా వ్యవహరిస్తారు. ఇక్కడి సంస్కృతిని బేకర్ 'ఉపఖండపు సంస్కృతి'గా, స్టాంప్ 'వరి సంస్కృతి' (Paddy Culture) గా పేర్కొన్నారు.సనాతన వైదిక విలువలతో అమితంగా ప్రభావితమైన ఇక్కడి సంస్కృతి కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, గ్రామీణ సాంఘిక వ్యవస్థ, కాఠిన్యమైన కులవ్యవస్థ, జీవనాధార సాగు, రుతుపవన వ్యవస్థ మొదలైనవి ఈ సాంస్కృతిక మండలం యొక్క ప్రధాన లక్షణాలుగా వున్నాయి.

తూర్పు ఆసియా సాంస్కృతిక మండలం[మార్చు]

తూర్పు ఆసియా లోని చైనా, మంగోలియా, కొరియా, జపాన్ దీవులలో కూడి బౌద్ధ-కన్ఫ్యూషియస్,తావో, షింటో మత విశ్వాసాల మేళవింపుతో ఏర్పడిన తూర్పు ఆసియా సాంస్కృతిక మండలం సెమిటిక్ మండలంగా అభివర్ణించబడింది.

బ్రోక్ వెబ్ ఆగ్నేయాసియా మండలం, మధ్య ఆఫ్రికా మండలాలను ఉప సాంస్కృతిక మండలాలుగా పరిగణించాడు.

డి-బ్లిజ్ (De Blij) వర్గీకరణ[మార్చు]

సాంస్కృతిక మండలాల వర్గీకరణలోకెల్లా డి-బ్లిజ్ వర్గీకరణను సమగ్రమైనదిగా పేర్కొంటారు. 1997 లో ముల్లర్ తో కలసి హెచ్.జె. డి-బ్లిజ్ ఆధునిక ప్రపంచాన్ని 12 సాంస్కృతిక మండలాలుగా విభజించాడు. అవి

డి-బ్లిజ్ వర్గీకరించిన 12 ప్రపంచ సాంస్కృతిక మండలాలు
డి-బ్లిజ్ వర్గీకరించిన 12 ప్రపంచ సాంస్కృతిక మండలాలు

1) అరబ్ మండలం
2) యూరప్ మండలం
3) భారతీయ మండలం
4) చైనీస్ మండలం
5) ఆగ్నేయాసియా లేదా ఓరియంటల్ మండలం
6) నీగ్రో ఆఫ్రికన్ మండలం లేదా సబ్ సహారా మండలం
7) ఆంగ్లో-అమెరికన్ మండలం
8) లాటిన్-అమెరికన్ మండలం
9) ఆస్ట్రేలియన్ మండలం
10) రష్యన్ మండలం
11) జపానీస్ మండలం
12) పసిఫిక్ మండలం

ఈ 12 మండలాలలో అరబ్, నీగ్రో-ఆఫ్రికన్, రష్యన్, పసిఫిక్-ఈ నాలుగు మండలాలను మినహాయిస్తే మిగిలిన మండలాలలో యూరప్, ఆంగ్లో-అమెరికన్, లాటిన్-అమెరికన్, ఆస్ట్రేలియా మండలాలను ఆక్సిడెంటల్ (పాశ్చాత్య) మండల సమూహానికి చెందినవిగా, భారతీయ, ఆగ్నేయాసియా, చైనీస్, జపానీస్ మండలాలను ఓరియంటల్ (ప్రాచ్య) మండల సమూహానికి చెందినవిగాను పరిగణిస్తారు.

డి-బ్లిజ్ వర్గీకరించిన ఈ 12 సాంస్కృతిక మండలాల వ్యాపనాన్ని ఖండాల వారీగా పరిశీలిస్తే యూరప్ ఖండంలో (యూరప్ మండలం), రష్యా భూభాగంలో (రష్యా మండలం), ఆసియా ఖండంలో (అరబ్, భారతీయ, ఆగ్నేయాసియా, చైనీస్, జపానీస్ మండలాలు), ఆఫ్రికా ఖండంలో (అరబ్, నీగ్రో ఆఫ్రికన్ మండలాలు), ఉత్తరమెరికా ఖండంలో (ఆంగ్లో అమెరికన్ మండలం), లాటిన్ అమెరికాలో (లాటిన్ అమెరికన్ మండలం), ఆస్ట్రేలియా ఖండంలో (ఆస్ట్రేలియన్, పసిఫిక్ మండలాలు) వ్యాపించాయి. ఆసియా ఖండంలో అత్యధికంగా ఐదు సాంస్కృతిక మండలాలు వ్యాపించి వున్నాయి. అరబ్ సాంస్కృతిక మండలం ఆసియా, ఆఫ్రికా-రెండు ఖండాలలోను వ్యాపించి వుంది.

అరబ్ సాంస్కృతిక మండలం[మార్చు]

అరబ్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు

మొరాకో-టర్కీ-ఉజ్బెకిస్తాన్-సోమాలియాల మధ్య నైరుతి ఆసియా, మధ్య ఆసియా, ఉత్తరాఫ్రికాలలో విస్తరించి వున్న ఈ సాంస్కృతిక మండలాన్ని ఇస్లామిక్ లేదా శుష్క మండలం అని కూడా వ్యవహరిస్తారు. ఈ సువిశాల సాంస్కృతిక మండల పరిధిలోకి ఉత్తరాఫ్రికా లోని అరబ్ దేశాలు (మొరాకో, అల్జీరియా, ట్యునీసియా, లిబియా, ఈజిప్టు, సుడాన్, ఉత్తర ఇథియోపియా, ఎరిత్రియా, సోమాలియా దేశాలు) మధ్య ప్రాచ్య (Middle East) దేశాలయిన టర్కీ, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయేల్, సౌదీఅరేబియా, యెమెన్, ఒమన్, యూఏఈ, ఇరాక్, ఇరాన్ వంటి దేశాలు, మధ్య ఆసియా లోని తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్ వంటి దేశాలు వస్తాయి. డి-బ్లిజ్ ఈ అరబ్ మండలాన్ని SWAs+NAf పేరుతొ సూచించాడు. ఇది నైరుతి ఆసియా(South West Asia), ఉత్తరాఫ్రికా (North Africa) ప్రాంతాలను సూచిస్తుంది. రెండు ప్రధాన ఖండాలలో (ఆఫ్రికా, ఆసియా) వ్యాపించిన ఈ సువిశాల మండలం ఆధునిక కాలంలో మరింతగా విస్తరిస్తున్నది.

ఈ సాంస్కృతిక మండలానికి ఇస్లాం మత విశ్వాసాలు సజాతీయతను ఆపాదించినప్పటికీ అనేక ప్రాంతీయ వైవిధ్యతలను స్పష్టంగా గమనించవచ్చు. ఉత్తరాఫ్రికాలోని సోమాలియా, ఇథియోపియా, సుడాన్, లిబియా లలో నీగ్రెటో జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. మండలంలోని మిగతా ప్రాంతీయులు మధ్యధరా జాతికి చెందినవారు. మొత్తంమీద ఈ మండలంలో అరబ్బులు, టర్కులు, పర్షియన్లు, కజక్ లు, ఉజ్బేగ్ లు, తజిక్ లు, మొదలైన జాతుల సమూహాలున్నాయి. మధ్య ఆసియా లోని తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలలో పూర్వపు సోవియట్ యూనియన్ ప్రభావం వలన సామాజిక-సాంస్కృతిక, ఆర్ధిక వ్యవస్థలలో విలక్షణత గోచరిస్తుంది. ఈ మండలంలోని ఇజ్రాయెల్ లో యూదు జాతీయులు కేంద్రీకృతమైనారు. విశిష్టమైన మూడు మతాలు-క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు.

చారిత్రిక కాలంలో మెసపటోనియన్ నాగరికత ఈ మండలంలో యూఫ్రేటిస్-టైగ్రిస్ నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ది చెందింది. ఈజిప్టు నాగరికత నైలూ నదీ నదీ పరివాహక ప్రాంతంలో విలసిల్లింది. ప్రాచీన, మధ్య యుగాలలో ఈ ప్రాంతమంటా సంచార జాతులతో కూడివుంది. రెండవ ప్రపంచయుద్ధానంతరం ఈ మండలంలోని వివిధ ప్రాంతాలలో చమురు-సహజ వాయువు నిక్షేపాల వెలికితీత ప్రారంభమవడంతో ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. దీనితో 1960 దశకం నుంచి ఈ మండలంలోని ప్రజల యొక్క వేషధారణ, ఆహారపుటలవాట్లు, సాంప్రదాయాలు, జీవనశైలిపై పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం ప్రబలంగా కనపడుతుంది. కానీ పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం ఈ మండలంలోని రాజకీయ వ్యవస్థలపై అంతగా కనపడదు. అంతేకాక సనాతన సాంప్రదాయిక విశ్వాసాలపై ఎక్కువగా ఆధారపడిన ఇక్కడి ప్రజలు, సాంఘిక వ్యవస్థలలో వచ్చే మార్పులను సకాలంలో స్వాగతించకపోవడంతో ఇక్కడి స్త్రీలు అక్షరాస్యతలో బాగా వెనుకబడి వున్నారు. ఫలితంగా ఈ మండలంలోని దేశాలు ఆర్ధికంగా వృద్ధిని సాధిస్తున్నప్పటికీ రాజకీయ, సామాజిక వ్యవస్థలలో మాత్రం ఆధునీకకరణ స్థాయి చాలా తక్కువగా వుంది.

యూరప్ సాంస్కృతిక మండలం[మార్చు]

పూర్వపు సోవియట్ యూనియన్ మినహా మిగిలిన యూరప్ ఖండంతో కూడిన ఈ సాంస్కృతిక మండలాన్ని పాశ్చాత్య లేదా ఆక్సిడెంటల్ (Occidental) సాంస్కృతిక మండలంగా కూడా వ్యవహరిస్తారు. గ్రీన్లాండ్ ఈ మండల పరిధిలోకే వస్తుంది. క్రైస్తవ మత ప్రాబల్యం కలిగిన ఈ మండలం గ్రీకో-రోమన్ సంస్కృతుల వలన విశేషముగా ప్రభావితమైంది. ప్రధానంగా కాకాసాయిడ్ జాతి ప్రజలతో కూడిన ఈ సాంస్కృతిక మండలం యొక్క శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపం వైవిధ్య భరితంగా ఉంటుంది. ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి అనేక భాషలను ఈ మండలంలో మాట్లాడతారు.

మధ్యయుగాలలో క్రైస్తవ మత చర్చి ప్రభావం వలన సాంప్రదాయిక భావాలతో కొనసాగినప్పటికీ, ఆధునిక యుగంలో శాస్త్రీయ దృక్పదానికి, మార్పులకు పెద్దపీట వేయడంతో, ఉదారవాద రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలతో కూడిన ఈ సాంస్కృతిక మండలం ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విప్లవాత్మకమైన ఆవిష్క్రణలకు నాంది పలికింది. ఈ ఆవిష్కరణలు యూరప్ సాంస్కృతిక మండలాన్ని ఒక బలీయమైన రాజకీయ, ఆర్ధిక శక్తిగా రూపొందించాయి.

పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఈ సాంస్కృతిక మండలంలోనే ప్రారంభమైనది. ఈ మండలానికి చెందిన పశ్చిమ లేదా వాయువ్య యూరప్ ప్రాంతం పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందగా, మధ్యధరా యురప్ ప్రాంతాలు వ్యవసాయికంగా తోటలపెంపకంతో విశేషమైన ప్రగతిని సాధించాయి.

భౌగోళిక అన్వేషణలకు శ్రీకారం చుట్టిన ఇక్కడి ప్రజలు సుదూర ప్రాంతాలలో వలస రాజ్యాలు స్థాపించడమే కాక అక్కడి స్థానిక సంస్కృతులని దాదాపుగా రూపుమాపి, తమ సంస్కృతిని వ్యాప్తి చేశారు. ఈ దేశాలు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో ముందంజ వేయడంతో ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలను వలసల రూపంలో తమ అదుపులోకి తీసుకున్నాయి. వినాశకరమైన రెండు ప్రపంచయుద్ధాలకు ఈ మండల సైనిక,రాజకీయాలు కారణభూతంగా నిలిచాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ మండలం ప్రాధాన్యత కొంతమేరకు తగ్గినట్లు కనపడుతున్నప్పటికీ సైనిక, ఆర్ధిక పాటవాలలో ఈ మండలం ఇప్పటికీ బలీయమైనదే.

క్రమంగా బలహీనపడుతున్న భౌతికవాద భావనలు, తాత్విక చింతనా ధోరణిలు ఈ సాంస్కృతిక మండల భవిష్యత్తును కొంతమేరకు సందేహంలో పడేస్తున్నాయి. ఈ మండలంలో కొన్ని వర్గాల ప్రజలలో మాత్రమే గ్రీకుల తాత్విక చింతన వారసత్వంగా కొనసాగడాన్ని గమనించవచ్చు.

భారతీయ సాంస్కృతిక మండలం[మార్చు]

హిమాలయ పర్వతాలకు దక్షిణంగా హిందూ మహా సముద్రం వరకూ భారత ఉపఖండంలో విస్తరించిన ఈ సాంస్కృతిక మండలం ప్రాచీన సింధులోయ నాగరికతకు పుట్టినిల్లు. వివిధ చారిత్రిక కాలాలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి ప్రజలు తెరలు తెరలుగా ఈ మండలానికి వలస రావడంతో ప్రపంచంలో మరెక్కడా లేని స్థాయిలో సాంస్కృతిక వైవిధ్యత ఏర్పడింది. బౌద్ధ, జైన, సిక్కు, హైందవ ధర్మాలకు నిలయమవడమే కాకుండా, ఈ సాంస్కృతిక మండలం క్రైస్తవ, ఇస్లాం సంస్కృతులను కూడా తనలో మమేకం చేసుకుంది.

వ్యవసాయ ప్రధానమైన ఈ మండలం ప్రాచీన కాలంలో ప్రపంచానికి ఆదర్శప్రాయంగా వుండేది. వలసపాలన కాలంలో పారిశ్రామిక విప్లవ ఫలాలు అందుకోలేకపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పేదరికం, నిరక్షరాస్యతతో సతమతమైంది. తాత్విక చింతన బలంగా వ్రేళ్ళూనుకొన్న ఇక్కడి సమాజం ప్రధానంగా కర్మ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఉంటుంది. విస్తృతమైన సహజ వనరులు, మానవనరులతో వున్న ఈ సాంస్కృతిక మండలం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి.

చైనీస్ సాంస్కృతిక మండలం[మార్చు]

చైనీస్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు

ఎగువ హువాంగ్ హో (Upper Huang He) నదీ బేసిన్ కేంద్రంగా కలిగిన చైనీస్ సాంస్కృతిక మండలం చైనా, మంగోలియా, కొరియా ద్వీపకల్పాలలో విస్తరించింది. నైసర్గికంగా ఈ మండలం చుట్టూ దాదాపు పూర్తిగా పర్వత శ్రేణులచే ఆవరించబడి ఉండటంతో, ఇతర ప్రాంతాల సాంస్కృతిక ప్రభావం ఈ మండలంపై అంతగా ప్రసరించలేదు. 19 వ శతాబ్దంలో యూరోపియన్లు పసిఫిక్ మహా సముద్రం ద్వారా ఈ మండలంలో ప్రవేశించినప్పటికీ యూరప్ సంస్కృతి ప్రభావం ఈ మండలంపై లేనట్లే లెక్క. కొంతమేరకు భారత ఉపఖండం నుండి ప్రవేశించిన బౌద్ధమత ప్రభావం ఈ సాంస్కృతిక మండలంపై విస్పష్టంగా కనిపిస్తుంది.

సాధారణంగా మాండరిన్ ప్రధాన భాష. కొన్ని ప్రాంతాలలో ప్రజలు కాంటోనిస్, టిబెటియన్, మంగోలియన్ వంటి ఇతర భాషలను మాట్లాడటం కనిపిస్తుంది. ఈ మండలంలోని ప్రజలు దాదాపుగా మంగోలాయిడ్ జాతికి చెందినవారు. జాతి, మత పరంగా ఈ మండలం వైవిధ్యతలను కలిగివుంది. ఇక్కడి నివసించే ప్రజలలో 91 శాతం హాన్ జాతివారు కాగా మిగిలిన 9 శాతం ప్రజలు జువాంగ్, మంఛూ, హుయి, మియావో, ఉయ్ఘర్ లతో పాటు కజక్, కిర్గిజ్, తార్ తార్,ఉజ్బెక్, తజిక్, డాంగ్జియాంగ్ వంటి జాతి సమూహాలకు చెందినవారుగా వున్నారు.[5] మత పరంగా చూస్తే హుయి, యునర్, కజక్,కిర్గిజ్, తార్ తార్,ఉజ్బెక్, తజిక్, డాంగ్జియాంగ్, సోలార్, బోనాన్ జాతులు సాధారణంగా ముస్లింలు. టిబెటియన్లు, మంగోలియన్లు, లోబా, మోయన్బా, టు జాతులు బౌద్ధులు. డాయ్, బ్లాంగ్, డియాంగ్ లు థేరవాద బౌద్ధాన్ని అనుసరిస్తారు. మిమావో, యావో జాతులు క్రైస్తవులు.[5] బహుళ జాతుల మండలంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వైరుధ్యాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, తీవ్ర అణిచివేతల నేపథ్యంలో ముఖ్యంగా ఈ మండల పశ్చిమభాగంలో ప్రత్యేక అస్తిత్వవాదాలు క్రమంగా తలెత్తుతూ అలజడులకు దారితీస్తున్నాయి.

ఈ మండలం యొక్క మత విశ్వాసాలను ముఖ్యంగా కన్ఫ్యూజియనిజం, తావోయిజం, మహాయాన బౌద్ధమతాల యొక్క మేలు కలయికగా అభివర్ణించవచ్చు.కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తరువాత మతరహితమైన సమాజ స్థాపనకు ప్రయత్నాలు సాగినప్పటికీ, పై మూడు తాత్విక భావనలు సమ్మిళతమై సమాజంలో ప్రబలంగా వ్రేళ్ళూనుకొన్నాయి. అయితే 1949 నుంచి కమ్యూనిస్టుల ప్రభావంతో ఈ మండలంలో ప్రజల జీవనశైలిలోనూ, సాంస్కృతిక వికాసంలోను పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మత,సాంఘికాచారాలు, కట్టుబాట్లకు ప్రాధాన్యత కోల్పోవడమే కాక ప్రాచీన సాంఘిక కుటుంబ వ్యవస్థ, సామ్యవాద సాంఘిక వ్యవస్థగా రూపొందింది. అయితే చైనాతో పోలిస్తే కొరియా ద్వీపకల్పం కొంతవరకూ తన సాంస్కృతిక ప్రత్యేకతను నిలుపుకొంది.

20 వ శతాబ్దంలో ఈ మండలంలోని అపారమైన సహజ వనరులను క్రమంగా వెలికి తీయడంతో ఈ సాంస్కృతిక మండలం ఒక ప్రబలమైన ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. పారిశ్రామికంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ మండలం ఇప్పటికీ వ్యవసాయ ప్రధానమైనదే. ఇప్పటికే ఆసియా ఖండంలో ప్రముఖ ప్రాంతీయ శక్తిగా ఏర్పడిన ఈ మండలం భవిష్యత్తులో ఒక ప్రధాన ప్రపంచశక్తిగా అవతరించే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

ఆగ్నేయాసియా సాంస్కృతిక మండలం[మార్చు]

ఆగ్నేయాసియా సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు

ఆగ్నేయాసియా లోని మయన్మార్, మలేషియా, సింగపూర్, లావోస్, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, ఫిలిఫీన్స్, ఇండోనేషియా దేశాలలో ఈ సాంస్కృతిక మండలం విస్తరించింది. దీనినే ప్రాచ్య (Oriental) మండలమని కూడా వ్యవహరిస్తారు.

వివిధ సంస్కృతుల సమ్మేళనంగా వున్న ఈ మండలంలో ఒక నిర్దిష్టమైన సంస్కృతి అంటూ ఏర్పడలేదు. ఈ ప్రాంతం చైనీస్, భారతీయ, ఇస్లామిక్, యూరప్ సంస్కృతులతో ప్రభావితమైంది. అందువలన ఈ మండలంలో జాతి, మత, భాషా పరమైన వైవిధ్యతలు సుస్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు జాతి పరంగా ఈ మండలం మంగోలాయిడ్ చైనాకు సన్నిహితంగా వున్నప్పటికి, ఇతర సాంస్కృతిక అంశాల పరంగా భారత ఉపఖండానికి దగ్గరగా ఉంటుంది. భారత ఉపఖండం నుండి ఈ మండలం లోనికి హైందవ, బౌద్ధ, ఇస్లాం ధర్మాలు వ్యాపించాయి. మతపరంగా మయన్మార్, లావోస్, వియత్నాం, థాయిలాండ్ లలో బౌద్ధమతం, ఫిలిఫీన్స్ లలో క్రైస్తవ మతం, ఇండోనేషియా లో ఇస్లాం మతం, బాలి వంటి ఇండోనేషియన్ దీవులలో హిందూ మతం కేంద్రీకృతమై వున్నాయి. ఒక విధంగా ఈ మండలం యొక్క సంస్కృతిని, వివిధ సంస్కృతుల వలన ప్రభావితమై, పరివర్తన చెందిన ఒక కొత్త సంస్కృతిగా పరిగణించవచ్చు. ఇతర సాంస్కృతిక మండలాలలో ఇటువంటి ప్రత్యేకత కానరాదు.

వలస పాలనా కాలంలో విస్తృతంగా చేపట్టిన తోటల పెంపకం వల్ల ఈ మండలంలో జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయంగా మార్పు చెందింది. అపారమైన భూ, జల అటవీ వనరులతో కూడిన ఈ సాంస్కృతిక మండలం అధిక జనసాంద్రత, అధిక జనాభా వృద్ధి రేట్ల కారణంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఆర్ధిక, రాజకీయ రంగాలలో ఈ మండలంపై అదుపు సాధించడానికి పొరుగును వున్న చైనా, జపాన్, ఇండియా వంటి ప్రాంతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండలం[మార్చు]

నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండల ప్రాంతం

నీగ్రాయిడ్ జాతికి చెందిన ప్రజలతో వున్న ఈ సాంస్కృతిక మండలం సహారా ఎడారి నుండి గుడ్ హోప్ అగ్రం వరకు వున్న ఆఫ్రికా ఖండమంతా విస్తరించి వుంది. ఈ మండలానికి, అరబ్బు మండలానికి మధ్య సూడాన్, చాద్, నైజీరియా, మాలె ప్రాంతాలలో ఒక పరివర్తన మండలం గమనించవచ్చు. డి-బ్లిజ్ ఈ మండలాన్ని సబ్ సహారా మండలంగా పేర్కొన్నాడు.

ఈ సాంస్కృతిక మండలంలోని ప్రజలు అనేకానేక తెగలకు చెందినవారు. వివిధ తెగల మధ్య ఏర్పడిన భాష, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, సామాజిక వ్యవస్థల పరంగా వైవిధ్యత విశేషంగా కనిపిస్తుంది. వివిధ తెగల మధ్య వైరుధ్యాలు, కలహాల వలన ఈ మండలంలో అధిక ప్రాంతాలలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనమై చాలా దేశాలు సైనిక నియంతల పాలనలో వున్నాయి.

ఈ సాంస్కృతిక మండలంలో పోడు వ్యవసాయం, పశువుల పెంపకం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దట్టమైన అడవుల వలన వ్యవసాయాభివృద్ధి జరగలేదు. వలసపాలకుల ప్రభావంతో కెన్యా, ఉగాండా వంటి తూర్పు ఆఫ్రికా దేశాలలో కొంతవరకు వాణిజ్య పంటల ప్రగతి కనిపిస్తుంది. విస్తృతమైన సహజ, ఖనిజ వనరులను కలిగి వున్నప్పటికీ ఈ సాంస్కృతిక మండలం ఆర్ధికంగా చాలా వెనుకబడివుంది. ఎక్కువ మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో నివసిస్తున్నారు. ఈ మండలం వెనుకబాటుతనానికి రాజకీయ అస్థిరత, విభిన్న తెగలను అంతర్గతంగా ఒక త్రాటిపై నడిపించే ఏకీకరణ శక్తుల లేమి, సాంకేతిక పరిజ్ఞానం కొరత, పెట్టుబడుల కొరతలను ముఖ్య కారణాలుగా పేర్కొనవచ్చు. అయితే బ్రిటన్, డచ్ వలస పాలకుల ప్రభావం అధికంగా వున్న దక్షిణాఫ్రికా, మొజాంబిక్, జింబాబ్వే దేశాలలోని కొన్ని పరిమిత ప్రాంతాలు మాత్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందాయి.

ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండలం[మార్చు]

ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండల ప్రాంతం

ఈ సాంస్కృతిక మండలంలో ఉత్తర అమెరికా లోని కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రధానంగా వున్నాయి. బెలిజ్, బెర్ముడా, గయానా ప్రాంతాలు కూడా ఈ మండల పరిధిలోకి వస్తాయి. యూరప్ ఖండం నుంచి వచ్చిన వలస ప్రజలచే, ప్రధానంగా ఆంగ్ల భాషను మాతృభాషగా గల వారిచే ఈ సాంస్కృతిక మండలం నిర్మించబడింది.అందువలన ఈ మండలాన్ని కొంతవరకు పాశ్చాత్య (ఆక్సిడెంటల్) సంస్కృతి నుండి ఉత్పన్నమైనదిగా పరిగణిస్తారు. నిజానికి ఒక్క యూరప్ నుండే కాక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల నుండి కూడా ప్రజలు వలస వచ్చి స్థిరపడటంతో ఈ సాంస్కృతిక మండలం ఒక బహుళ సంస్కృతీ సమాజం (Plural Societies)గా రూపుదిద్దుకొంది.

రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యేసరికి అప్పటివరకు శక్తివంతమైన వాయువ్య యూరప్ మండల స్థానాన్ని తోసివేసి ఆ స్థానాన్ని ఈ మండలం కైవశం చేసుకొని, అత్యున్నత శక్తివంతంగా మారింది. అత్యున్నత స్థాయి పారిశ్రామికీకరణ, నగరీకరణలతో అభివృద్ధి చెందిన ఈ మండలం, ఈనాడు ప్రపంచంలోకెల్లా బలీయమైన ఆర్ధిక, సైనిక శక్తిగా ఏర్పడింది.అత్యధిక స్థాయిలో వనరులను వినియోగిస్తున్న ఈ ప్రాంతపు సమాజాలు వాస్తు వ్యామోహ ప్రపంచానికి మంచి ఉదాహరణలు. విశిష్టమైన జీవన ప్రమాణస్థాయిని అందుకొన్నప్పటికీ, జాతిపరమైన వైరుధ్యాలు ఈ సాంస్కృతిక మండలాన్ని ఆటుపోట్లకు గురి చేస్తున్నాయి.

లాటిన్-అమెరికన్ సాంస్కృతిక మండలం[మార్చు]

లాటిన్-అమెరికన్ సాంస్కృతిక మండల ప్రాంతం

మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలలో లలో విస్తరించిన ఈ మండలం యొక్క సాంస్కృతిక మూలాలు ప్రాచీన కాలంలోని ఇన్కా (INCA) సామ్రాజ్య దశలో నిర్మించబడ్డాయి. మెక్సికో, వెస్ట్ ఇండీస్, మధ్య అమెరికా (బెలీజ్ మినహాయింపు) ప్రాంతం, దక్షిణమెరికా ఖండం (గయానా మినహాయింపు) ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి. వలసవాద కాలంలో స్పానిష్, పోర్చుగీస్ సంస్కృతులు స్థానిక సంస్కృతితో సమ్మేళనం చెందడంవలన ఈ విలక్షణమైన సాంస్కృతిక మండలం ఏర్పడింది. ఈ మండలపు స్థానిక జాతులు వలస వచ్చిన కాకాసాయిడ్ జాతితో మిశ్రమం చెంది విలక్షణమైన మెస్తిజో జాతిగా రూపొందింది.అలాగే ఇక్కడి స్థానిక జాతులు, వలసవచ్చిన కాకసాయిడ్ జాతి, నిగ్రిటో జాతులతో మిశ్రమంచెంది మోరెనో జాతిగా రూపొందారు.

స్పానిష్, పోర్చుగీస్ సంస్కృతులు ఈ మండలం సంస్కృతిని దాదాపు అన్ని అంశాలలోను అమితంగా ప్రభావితం చేశారు. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వైవాహిక సంబంధాలు, భాషలు, కళలు, వాస్తు నిర్మాణ శైలి మొదలైన అంశాలన్నీ స్పానిష్, పోర్చుగీస్ సంస్కృతులతో ముడిపడివున్నాయి. ప్రజలు స్పానిష్, పోర్చుగీస్ వంటి ఇబేరియన్ భాషలు మాట్లాడతారు. మధ్య అమెరికా, వెస్ట్ ఇండీస్ ప్రాంతాలలో మాత్రం స్థానిక భాషలు మాట్లాడతారు. సాంస్కృతిక సాన్నిహిత్యం దృష్యా ఈ మండలపు దేశాలన్నీ మధ్యధరా దేశాలతో చక్కని సంబంధాలు కలిగివున్నాయి.

ఈ మండలంలో దక్షిణంగా వున్న అర్జెంటీనా ప్రాంతం ఆర్ధికంగా ఎక్కువ అభివృద్ధి సాధించింది. ఆర్ధిక ప్రగతిలో పశుపోషణ కీలకపాత్ర వహిస్తున్నది. సమశీతోష్ణస్థితి, విస్తృతమైన పంపా గడ్డిమైదానాలు, యురోపియన్ల ప్రభావం దీనికి ముఖ్య కారణాలుగా పేర్కొనవచ్చు. అర్జెంటీనాతో పోలిస్తే, బ్రెజిల్ ఉష్ణమండల దేశం కావడం, దట్టమైన అడవుల కారణంగా పరిమితమైన అభివృద్ధిని సాధించింది. వలస వచ్చిన యురోపియన్ల వల్ల బ్రెజిల్ లో కాఫీ తోటలు, క్యూబాలో చెరకు తోటలు బాగా అభివృద్ధి చెందాయి.

ఆస్ట్రేలియా సాంస్కృతిక మండలం[మార్చు]

ఆస్ట్రేలియన్ సాంస్కృతిక మండలం

ఈ సాంస్కృతిక మండలంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలు వున్నాయి. ఈ సాంస్కృతిక మండలంపై పాశ్చత్య (Occidental), ఆంగ్లో-అమెరికన్ మండలాల ప్రభావం చాలా ఎక్కువగా వుంది. ఇక్కడి సంస్కృతి దాదాపుగా బ్రిటీష్ వారి సంస్కృతిని పోలివుంటుంది. కఠినమైన వలస విధానాలవల్ల ఈ సాంస్కృతిక మండలపు జనాభా కేవలం బ్రిటన్ నుండి వలస వచ్చిన కాకసాయిడ్ జాతికి మాత్రమే పరిమితమైంది. ఇతర మండలాలతో పోలిస్తే ఈ మండలంలో భిన్నత్వం చాలా తక్కువ.

స్థానిక అబారిజన్ జాతికి చెందిన ప్రజలు పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారులు, కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనారు. ఈ సాంస్కృతిక మండలంలో నగరీకరణ అత్యున్నత స్థాయిలో వుంది. నగరాలలో కేంద్రీకృతమైన జనాభా ఈ మండలంలో కనిపించినంత విశిష్టంగా మరేతర మండలంలోనూ కనిపించదు. వీరి జీవన ప్రమాణస్థాయి చాలా హెచ్చు స్థాయిలలో ఉంటుంది. సమశీతోష్ణస్థితి, విస్తృతమైన గడ్డి మైదానాలు కలిగి వున్న కారణంగా ఈ మండల ఆర్ధిక వ్యవస్థలో పశుపోషణ కీలకపాత్ర వహిస్తుంది.

రష్యన్ సాంస్కృతిక మండలం[మార్చు]

రష్యన్ సాంస్కృతిక మండలం

పూర్వపు సోవియట్ యూనియన్ ప్రాంతంలో విస్తరించి వున్న ఈ సాంస్కృతిక మండలం యొక్క పశ్చిమ సరిహద్దులను నిర్దిష్టంగా పేర్కొనలేము. ఈ మండలం వివిధ జాతులకు, వివిధ మతాలకు, వివిధ భాషా సమూహాలకు చెందినప్పటికీ, సంస్కృతీ పరంగా రష్యా ఒక ప్రత్యేక మండలంగా రూపొందింది.

1917 లో బోల్షెవిక్ విప్లవం జార్ చక్రవర్తుల పాలనను అంతం చేయడంతో, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మండలంగా అభివృద్ధి చేశారు. రాజకీయ నియంత్రణలతో, కమ్యూనిస్టు ఆర్ధిక వ్యవస్థలతో కూడిన ఈ సాంస్కృతిక మండలంలో శ్రీఘకాలంలో పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. స్వల్ప కాలంలో ఈ సాంస్కృతిక మండలంలో సంభవించినన్ని సాంస్కృతిక, రాజకీయ, ఆర్ధిక మార్పులు ప్రపంచంలో మరెక్కడా చోటుచేసుకోలేదు.

ముఖ్యంగా ప్రభుత్వరంగంలోని ఉత్పత్తి వ్యవస్థలతో కూడిన ఈ సమాజాలలో కేంద్రీకృత ఆర్ధిక వ్యవస్థ బలంగా రూపుదిద్దుకుంది. తద్వారా సహజంగానే అపారమైన వనరులతో కూడివున్న ఈ సాంస్కృతిక మండలం ఒక బలీయమైన రాజకీయ, సైనిక శక్తిగా రూపొందడమే కాక మిగిలిన మండలాలలోని రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలను సోషలిస్టు భావజాలంతో ప్రభావితం చేసింది. ఇతర మండలాలు వలసలతో ప్రపంచంలోని పలు ప్రాంతాలలో తమ భౌతిక సంస్కృతులను వ్యాప్తి చేస్తే, ఈ మండలం వలసలతో సంబంధం లేకుండానే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో తనదైన రాజకీయ, ఆర్ధిక భావజాల సంస్కృతిని వ్యాప్తి చేసింది.

ఈ మండలంలో జాతి, మత, భాషా పరమైన వైవిధ్యాలను రూపుమాపడానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నించింది. కానీ కమ్యూనిస్ట్ రాజకీయ వ్యవస్థలు అంతర్గత వైరుధ్యాలను అభివృద్ధి చట్రంలో సమతుల్యం చేయటంలో విఫలమవడం వలన 1990 వ దశకంలో ఈ సాంస్కృతిక మండలం రాజకీయంగా విచ్ఛిన్నమైంది. ఏకధృవ ప్రపంచంలోను, ఇటీవలి అంతర్జాతీయ ఆర్ధిక రాజకీయాల్లో ఈ సాంస్కృతిక మండలపు ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ మండలం రాజకీయ, సైనిక పాటవాలలో ఇప్పటికీ శక్తివంతంగానే వుంది.

జపానీస్ సాంస్కృతిక మండలం[మార్చు]

జపాన్ సాంస్కృతిక మండల ప్రాంతం

భౌగోళిక విస్తీర్ణత పరంగా అతి చిన్నదైన ఈ సాంస్కృతిక మండలం చైనీస్ మండలానికి, ఆగ్నేయాసియా మండలాలకు సన్నిహితంగా ఉన్నప్పటికీ, తనదైన ప్రత్యేకతను కొనసాగిస్తున్నది. ప్రజలు ప్రధానంగా మంగోలాయిడ్ జాతికి చెందినప్పటికీ యమటో, చైనీస్, కొరియన్ జాతులతో పాటు ఐను, బొనిన్, రుకుయన్ వంటి స్థానిక జాతి సమూహాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ మండలం యొక్క మత విశ్వాసాలను మహాయాన బౌద్ధమతం, షింటోయిజాల సమ్మేళవింపుగా అభివర్ణించవచ్చు. పాశ్చాత్య స్థాయిలో ఇక్కడి ఆర్ధిక వ్యవస్థలు అభివృద్ధి చెందినప్పటికీ, ప్రాచీన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, సాంఘిక వ్యవస్థలు ఇక్కడి సమాజాలలో ఇప్పటికీ సుస్థిరంగా వున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తీవ్రంగా నష్టపోయినప్పటికే, అమెరికా ఆర్ధిక సహకారంతో 1970 దశకం కెల్లా బలీయమైన శాస్త్ర, సాంకేతిక, ఆర్థికశక్తిగా రూపొందింది. ఎలక్ట్రానిక్స్, మెషినరీ, టెక్సటైల్స్, ఆటోమొబైల్స్, నౌకా నిర్మాణ తదితర పరిశ్రమలలో ప్రపంచ ప్రఖ్యాతి సాధించి పారిశ్రామికంగా ప్రపంచంలో అగ్రస్థానంలో వుంది. ప్రాచ్య సంస్కృతులలో కెల్లా అత్యున్నత స్థాయి పారిశ్రామికీకరణ, నగరీకరణ, ఆధునికీకరణ, జీవన ప్రమాణస్థాయిలను ఈ సాంస్కృతిక మండలంలో గమనించవచ్చు.

పసిఫిక్ సాంస్కృతిక మండలం[మార్చు]

పసిఫిక్ సాంస్కృతిక మండలంలోని దీవులు

సువిశాల పసిఫిక్ మహా సముద్రంలో చెదురుమదురుగా వున్న అనేక ద్వీప సమూహాలలో ఈ సాంస్కృతిక మండలం విస్తరించింది. ఈ మండలంలోని దీవులను పాలినేసియా, మెలనేసియా, మైక్రోనేసియా లుగా విభజించవచ్చు. పాలినేసియాకు చెందిన సమోవా, టోంగా, తువాలు, ఫ్రెంచ్ పాలినేసియా, ఈస్టర్ దీవులు; మెలనేసియాకు చెందిన పపూవా న్యూ గినియా, పశ్చిమ న్యూ గినియా, ఫిజి, వనౌటు, సాలమన్ దీవులు; మైక్రోనేసియాకు చెందిన మెరియానా దీవులు, పలావు, కిరిబాటి, నౌరు, మార్షల్ దీవులు మొదలైనవి ఈ మండలపరిధిలోకి వస్తాయి. న్యూజీలాండ్ పాలినేసియాకు చెందినప్పటికీ అది ఆస్ట్రేలియా సాంస్కృతిక మండలం పరిధిలోకి వస్తుంది. 1521 లో స్పానిష్ యాత్రికుడు మాజిలాన్ రాకతో ఇక్కడ స్పానిష్ వలసలు ప్రారంభమయ్యాయి. తరువాత కాలంలో ఈ దీవులు కొంతమేరకు యూరప్, ఆంగ్లో-అమెరికన్ మండలాల సాంస్కృతిక ప్రభావానికి లోనయ్యాయి.

ఈ మండలంలోని ప్రజలు వివిధ మానవ జాతులకు చెందినవారు పలు స్థానిక భాషలను మాట్లాడుతూ, అనేక ప్రాచీన విలక్షణ సంస్కృతులను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.పాలినేసియా ప్రజలు ఓషియానిక్ భాషా కుటుంబానికి చెందిన భాషలను, మెలనేసియా ప్రజలు పపువా భాషా కుటుంబానికి చెందిన భాషలను ప్రధానంగా పిడ్గిన్, క్రియోల్ వంటి స్థానిక భాషలను మాట్లాడతారు. మైక్రోనేసియా ప్రజలు ప్రధానంగా ఇంగ్లీష్ తో పాటు చమర్రో (Chamorro), చూకిస్ (Chuukis), ఫిజిపినో, మారషెల్లీస్, వలావున్, నౌరువన్ నటి స్థానిక భాషలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రజలలో అత్యధికులు క్రైస్తవమత విశ్వాసాలు కలవారు. నౌరులో క్రైస్తవంతోపాటు బౌద్ధమత విశ్వాసాలు కూడా స్వల్పంగా కనిపిస్తాయి. పారిశ్రామికీకరణ దాదాపుగా లేదు. అత్యల్ప స్థాయి ఆధునికీకరణ, జీవన ప్రమాణస్థాయిలు ఈ సాంస్కృతిక మండలంలో కనిపిస్తాయి.

సాంస్కృతిక మండలాలు-మనుగడ[మార్చు]

ప్రతీ సాంస్కృతిక మండలంలోనూ సాంస్కృతిక అంశాల పరంగా సజాతీయతలే కాక వైవిధ్యతలూ కలగలసి ఉంటాయి. అయితే ఈ సాంస్కృతిక వైవిధ్యతలు, వైరుధ్యాలుగా , చివరకు వైషమ్యాలుగా మారితే అవి ఆయా సాంస్కృతిక మండలాల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయారవుతాయి. సాంస్కృతిక వైవిధ్యత స్పష్టంగా కనిపిస్తున్న మండలాల్లో పాలనా వ్యవస్థలు చేపట్టే ఉదారవాద, సహనశీలక విధానాలు ఆ సాంస్కృతిక మండలం సుస్థిరంగా కొనసాగడానికి, స్థిరమైన అభివృద్ధి సాధించడానికి తోడ్పడతాయని చారిత్రకంగా నిరూపించబడింది. సర్దుబాటు తత్త్వం, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్పు చెందే తత్త్వం వున్న సంస్కృతులు మాత్రమే దీర్ఘకాలం పాటు మనగలుగుతాయి.

రిఫరెన్సులు[మార్చు]

  • Human Geography by Majid Hussain, 1999, Rawat Publications, New Delhi
  • Human geography: landscapes of human activities by Fellmann JD, A Getis, J Getis, McGraw-Hill, New York. Ed 2008
  • Geography: Regions and Concepts by De Blij, HJ & Muller, 1997, Wiley, New York.
  • Introduction to Human Geography, Edited by David Dorrell & Joseph P Henderson, University System of Georgia, USA ISBN 978-1-940771-60-1

బయట లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Brown, Nina "Friedrich Ratzel, Clark Wissler, and Carl Sauer: Culture Area Research and Mapping" University of California, Santa Barbara, CA.Brown, Nina "Friedrich Ratzel, Clark Wissler, and Carl Sauer: Culture Area Research and Mapping" University of California, Santa Barbara, CA. Webarchive of http://www.csiss.org/classics/content/15;
  2. Gupta, Akhil and James Ferguson (1997). Culture, Power, Place: Explorations in Critical Anthropology. Durham, NC: Duke University Press.
  3. 3.0 3.1 "Human Geography" (PDF). amu.ac.in/. Aligarh Muslim University. Retrieved 21 August 2020.
  4. J, Anděl1; I., Bičík; JD, Bláha1 (2017). "MISCELLANEA GEOGRAPHICA – REGIONAL STUDIES ON DEVELOPMENT". Concepts and delimitation of the worldʼs macro-regions. 22 (1): 16. Retrieved 21 August 2020.{{cite journal}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 5.0 5.1 Sreemati, Chakrabarti. China (2008 ed.). New Delhi: National Book Trust. p. 71. Retrieved 23 August 2020.