వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 16వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరిద్వార్

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ. క్రీ.శ.1888 డిసెంబర్ 28 హరిద్వార్‌కు జిల్లా స్థాయి ఇవ్వబడింది. క్రీ.శ.2000 సెప్టెంబర్ 9 హరిద్వార్ ఉత్తరఖాండ్ లో ఒక భాగమైంది. ఉత్తరాఖండ్ ఇండియన్ రిపబ్లిక్‌లో 27వ రాష్ట్రం. ఆధ్యాత్మిక క్షేత్రం నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పథంలో ఉంది. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని మరియు గోదావరి జన్మ స్థలమైన నాసిక్. సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. 12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ.ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.

(ఇంకా…)