వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 11వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.వి.రంగారావు

ఎస్.వి.రంగారావుగా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) తెలుగు సినీ నటుడు. అతను నిర్మాత దర్శకుడు, రచయితగా కూడా వ్యవహరించాడు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశాడు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనికి నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశాడు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల అతను ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో అతని నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. అతను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఇతని బిరుదులు. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే 1950-65 మధ్యలో ఎన్నో విజయవంతమైన, విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో మంచి నటన కనబరచడంతో ఎందరో తెలుగువారికి అభిమాన నటునిగా నిలిచాడు.

(ఇంకా…)