వికీపీడియా:సంతకం
చర్చాపేజీల్లోను, ఇతర చర్చల్లోను సంతకం చెయ్యడం చక్కటి వికీ మర్యాదే కాకుండా, ఇతర సభ్యులకు తామెరివరితో చర్చిస్తున్నామో కూడా తెలుస్తుంది. సదరు సభ్యుని చర్చాపేజీకి వెళ్ళి వారికే ప్రత్యేకించిన సమాధానాలు రాసే అవకాశమూ ఉంటుంది. సమష్టిగా రాసే ఈ రచనల్లో రచన స్థాయి మెరుగుపడే విషయంలో చర్చకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.
వ్యాసాల పేజీలు, వ్యాసేతర పేజీల చర్చ పేజీల్లో, మీ పోస్టులపై సంతకం చేయడం తప్పనిసరి. దీనివలన వ్యాఖ్య ఎవరు రాసారో తెలుస్తుంది. ఇతర వాడుకరులు తమ వ్యాఖ్యలను ఎవరికి ఉద్దేశించారో వారిని ఉదహరించే వీలు కలుగుతుంది. పరస్పర సహకారంతో చేసే వికీపీడియా దిద్దుబాట్లలో చర్చ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది పని పురోగతిని, పరిణామాన్నీ అర్థం చేసుకోవడంలో వాడుకరులందరికీ తోడ్పడుతుంది.
చర్చ పేజీల్లో, ప్రత్యుత్తర సాధనాన్ని గానీ, లేదా క్రొత్త అంశాన్ని చేర్చు సౌకర్యాన్ని గానీ ఉపయోగిస్తున్నప్పుడు సంతకాలు ఆటోమాటిగ్గా చేరతాయి. ఈ సాధనాలను ఉపయోగించకుండా సోర్స్ టెక్స్ట్ మోడ్లో రాసేటప్పుడు, సంతకం మానవికంగా చేర్చాలి. సంతకం నాలుగు "టిల్డె" లను (~~~~
) టైపు చేయడం ద్వారా చేయవచ్చు. లేదా దిద్దుబాటు పరికరాల పట్టీ లోని సంతకం చిహ్నాన్ని 22px క్లిక్ చేయడం ద్వారా కూడా సంతకాన్ని చేర్చవచ్చు.
సంతకాలు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు కూడదు
[మార్చు]సభ్యుని చర్చాపేజీలు, వ్యాసాల చర్చాపేజీలు లాంటి అన్ని చర్చాపేజీల్లోను రాసే జాబులపై సంతకం చెయ్యాలి. వ్యాసాల పేజీల్లో మాత్రం సంతకాలు చెయ్యకూడదు; ఎందుకంటే, వికీపీడియా వ్యాసాల కర్తృత్వం ఎవరికీ చెందదు కాబట్టి. ఏ సభ్యుడు/సభ్యురాలు ఏయే రచనలు చేసారనేది పేజీ చరితంలో ఎలాగూ కనిపిస్తుంది. దిద్దుబాటు సారాంశాల్లో కూడా సంతకాలు చెయ్యరాదు; అక్కడ ~~~~
లు సంతకాలుగా మార్పుచెందవు. పోస్టులపై సంతకాలు పెట్టకూడని సందర్భాల్లో, ఆయా పేజీల్లో ఆ విధంగా ప్రత్యేక సూచనలు, ఆదేశాలు ఇస్తాము.
సంతకం ఎలా చెయ్యాలి
[మార్చు]సంతకం చేసేందుకు రెండు పద్ధతులున్నాయి:
1. మీ వ్యాఖ్యల చివర, నాలుగు టిల్డెలను (~) టైపు చెయ్యండి, ఇలాగ: ~~~~
.
2. మీరు దిద్దుబాటు టూలుబారు వాడుతుంటే, అందులోని సంతకం ఐకనును () నొక్కండి.
మీరు చేసిన మార్పులను భద్రపరిచాక, సంతకం కనిపిస్తుంది.
పై రెండు సందర్భాల్లోనూ కనిపించే సంతకం ఒకేలా ఉంటుంది. నాలుగు టిల్డెలను టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది:
వికీమార్కప్ | నేపథ్యంలోని కోడు | పేజీలో కనపడేది |
---|---|---|
~~~~ |
[[సభ్యుడు:ఉదాహరణ|ఉదాహరణ]] 05:24, డిసెంబరు 22 2024 (UTC)
|
ఉదాహరణ 05:24, డిసెంబరు 22 2024 (UTC) |
నాలుగు టిల్డెలను టైపు చెయ్యడం వలన సంతకంతో పాటు తేదీ, సమయం కూడా కనిపిస్తాయి కాబట్టి, చర్చల్లో సంతకం పెట్టడానికి ఇది బాగా అనువైనది.
మూడు టిల్డెలను టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది:
వికీమార్కప్ | నేపథ్యంలోని కోడు | పేజీలో కనపడేది |
---|---|---|
~~~ |
[[సభ్యుడు:ఉదాహరణ|ఉదాహరణ]]
|
ఉదాహరణ |
ఈ సంతకంలో తేదీ, సమయం కనపడవు కాబట్టి, మీ సభ్యుని పేజీ, లేదా మీ చర్చాపేజీలో ఏదైనా నోటీసులు పెట్టడానికి ఇది పనికొస్తుంది. మీ సభ్యుని పేజీకి ఎక్కడి నుండైనా లింకు ఇవ్వాలంటే ఇది సౌకర్యవంతమైన మార్గం.
ఐదు టిల్డెలను టైపు చేస్తే సంతకం లేకుండా కేవలం తేదీ, సమయం కనిపిస్తాయి, ఇలా:
వికీమార్కప్ | నేపథ్యంలోని కోడు | పేజీలో కనపడేది |
---|---|---|
~~~~~ |
05:24, డిసెంబరు 22 2024 (UTC)
|
05:24, డిసెంబరు 22 2024 (UTC) |
లాగిన్ కాకుండానే వికీలో రాస్తున్నప్పుడు కూడా, సంతకం చెయ్యాలి. ఆ సందర్భంలో, మీ సభ్యనామం స్థానంలో ఐ.పి.అడ్రసు కనిపిస్తుంది.
మీ ఐ.పి.అడ్రసు ఇలా కనిపిస్తుంది: 192.0.2.58. ఐ.పి.అడ్రసు నుండి రచనలు చేస్తే గోప్యత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కొంతమంది సభ్యులు అలా రాయడానికే ఇష్టపడతారు. కానీ నిజానికి, ఖాతా సృష్టించుకుని లాగిన్ అయి రాయడం ద్వారానే ఎక్కువ గోప్యత లభిస్తుంది. ఐ.పి.అడ్రసును ఎవరైనా తేలిగ్గా అనుసరించి, పట్టుకోవచ్చు.
--అజ్ఞాత అంటూ అజ్ఞాత వ్యక్తిగా సంతకం చేయబూనినా, అంత గోప్యత లభించదు. ఎందుకంటే ఐ.పి. అడ్రసు ఎలాగూ పేజీ చరితంలో నిక్షిప్తమౌతుంది. ఇతర సభ్యులు మీతో సంప్రదించడం కూడా కష్టమే. ఈ పద్ధతి వాడదలచినా, మీరు నాలుగు టిల్డేలు టైపు చెయ్యడం తప్పనిసరి, ఇలాగ: --అజ్ఞాత ~~~~.
సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవడం
[మార్చు]మీ ప్రత్యేక:అభిరుచులు పేజీకి వెళ్ళి "సంతకం" ఫీల్డును ఎంచుకుని, మీ సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు.
సంతకాన్ని మార్చేటపుడు కింది విషయాలను మననం చేసుకోండి: దృష్టి మరల్చేలా, తికమకగా ఉన్న సంతకాలు ఇతర సభ్యులపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. కొందరు సభ్యులు దీన్ని తమ పనికి ఆటంకంగా భావించవచ్చు. మరీ పొడుగ్గా ఉన్న సంతకాలు చర్చాపేజీలను చదివేందుకు ఇబ్బంది కలిగించవచ్చు కూడా.
ఎట్టి పరిస్థితులలోను వేరే సభ్యుని పేరు పెట్టుకుని మోసగించేలా సంతకాన్ని మార్చరాదు: ముఖ్యంగా, సంతకం ఖచ్చితంగా వేరే సభ్యుని సభ్యనామంలా ఉండరాదు. సంతకం సంబంధిత సభ్యనామాన్ని కొంతవరకు పోలి ఉండాలి; అయితే ఇది నియమమేమీ కాదు.
ఇతర సభ్యుల సంతకాన్ని మార్చమని కోరే సందర్భంలో మర్యాదగా అడగండి. మిమ్మల్ని ఎవరైనా అలా కోరిన సందర్భంలో మర్యాదకరమైన అభ్యర్ధనను దాడిగా భావించకండి. వికీపీడియా పరస్పర సుహృద్భావ వాతావరణంలో జరిగే పని కాబట్టి, రెండు పార్టీలు కూడా సామరస్యకమైన పరిష్కారం దిశగా పనిచెయ్యాలి.
రూపు, రంగూ
[మార్చు]మీ సంతకం వెలిగి ఆరుతూ ఉండరాదు, లేదా ఇతర సభ్యులకు చిరాకు తెప్పించేదిగా ఉండకూడదు.
<big>
లాంటి ట్యాగులు (పేద్ద టెక్స్టును చూపిస్తాయి), లైనుబ్రేకులూ (<br />
tags) మొదలైనవాటిని వాడరాదు.- సూపరుస్క్రిప్టు, సబ్ స్క్రిప్టులను తక్కువగా వాడండి. కొన్ని సందర్భాల్లో ఇందువలన చుట్టుపక్కల పాఠ్యం కనపడే విధానం మారిపోతుంది.
- మరీ కనబడనంత చిన్న అక్షరాలను సంతకంలో వాడకండి.
- వర్ణాంధత్వం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రంగులను తక్కువగా వాడండి. వాడక తప్పని పరిస్థితులలో, వారికి కూడా కనపడే విధమైన జాగ్రత్తలు తీసుకోండి.
బొమ్మలు
[మార్చు]సంతకంలో బొమ్మలను వాడరాదు.
సంతకాల్లో బొమ్మలు వాడకూడదనేందుకు చాలా కారణాలున్నాయి:
- అవి సర్వరు మీద అనవసరమైన భారం కలుగజేసి, సర్వరును నీరసపరుస్తాయి
- మీరు వాడే బొమ్మ స్థానంలో వేరే బొమ్మను అప్లోడు చేసి, దుశ్చర్యలకు పాల్పడవచ్చు
- అన్వేషణ వీలును తగ్గించి, పేజీలు చదవడం కష్టతరం చేస్తాయి
- పేజీనుండి టెక్స్టును కాపీ చెయ్యడం కష్టతరం చేస్తాయి
- అసలు విషయం మీద నుండి దృష్టిని మరలుస్తాయి
- చాలా బ్రౌజర్లలో ఈ బొమ్మలున్న లైన్లు మిగతా లైన్ల కంటే పెద్దవిగా కనబడి, చూపులకింపుగా ఉండవు
- మీరు సంతకాలు పెట్టిన ప్రతీ పేజీ, బొమ్మకు సంబంధించిన "ఫైలు లింకులు" పేజీలో చేరి పేజీని నింపేస్తాయి
- బొమ్మలు సదరు సభ్యుని రచనలకు అనవసరమైన ప్రాముఖ్యతనిస్తాయి
బొమ్మలకు బదులుగా సింబల్స్ అయిన యూనికోడు కారెక్టర్లను వాడవచ్చు. ఇలాంటివి: ☂☆♥♫☮☎☢.
పొడవు
[మార్చు]సంతకాలను మార్కప్ లోను, కనపడేటపుడూను చిన్నవిగా ఉంచండి.
బోలెడు మార్కప్ తో కూడుకుని ఉన్న పొడుగాటి సంతకాలు దిద్దుబాట్లను కష్టతరం చేస్తాయి. ఓ 200 కారెక్టర్ల సంతకం, చాలా సందర్భాల్లో వ్యాఖ్యల కంటే పెద్దదిగా ఉండి, చర్చకు ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే:
- ఒకటి రెండు లైన్లకు మించి పొడుగున్న సంతకాలు పేజీ అంతా నిండిపోయి, వ్యాఖ్యలను వెతుక్కోవడం కష్టమై పోతుంది
- పొడవాటి సంతకాలు సభ్యుని రచనలకు అనవసరమైన ప్రాముఖ్యత నిచ్చే అవకాశం ఉంది
- చేంతాడంత కోడు కలిగిన సంతకాల్లో స్పేసులు లేనట్లయితే మొత్తం సంతకమంతా ఒకే లైనులో ప్రింటయి, మిగతా సభ్యుల ఎడిటర్లలో కూడా హారిజాంటలు స్క్రోలుబారు వచ్చే అవకాశం ఉంది.
- పొడవాటి సంతకాలు అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి, స్క్రోలుబార్ల ఆవశ్యకతను పెంచుతాయి.
అంతర్గత లింకులు
[మార్చు]సభ్యుని పేజీకి గానీ, సభ్యుని చర్చాపేజీకి గానీ, లేదా రెంటికి గానీ సంతకం నుండి లింకులు ఇవ్వడం పరిపాటి. మార్పు చేర్పులు చేసేటపుడు పొరపాటున ఈ లింకులను అచేతనం చేస్తే, సంతకాన్ని రిపేరు చెయ్యడం ఎలా పేజీని చూడండి. మీ సంతకాన్ని మీ సభ్యుని పేజీలోగానీ, లేదా చర్చాపేజీలో గానీ పెడితే సంతకం లోని సభ్యుని పేజీ లేదా చర్చాపేజీ లింకు బొద్దుగా కనిపిస్తుంది తప్ప లింకు కనపడదు కాబట్టి, సంతకాన్ని పరీక్ష చేసేందుకు వేరే పేజీని ఎంచుకోండి.
బయటి లింకులు
[మార్చు]సంతకంలో బయటి వెబ్ సైట్లకు లింకులు ఇవ్వకండి. ఏదైనా వెబ్ సైటుకు అదేపనిగా లింకులు ఇవ్వడాన్ని వికీపీడియా అంగీకరించదు. మీరు సంతకం పెట్టే ప్రతి చోట నుండి బయటి సైట్లకు లింకు ఇవ్వడాన్ని లింకు స్పాముగాను లేదా సెర్చి ఇంజన్లలో మీ వెబ్ సైటు ర్యాంకును మెరుగుపరచే పనిగాను వికీపీడియా భావిస్తుంది. అదెలాగూ పనిచెయ్యదులెండి. అయినా అలాంటి పనులు చెయ్యకపోవడం మంచిది. మీరేదైనా మంచి వెబ్ సైటు గురించి చెప్పదలిస్తే ఆ సంగతిని మీ సభ్యుని పేజీలో పెట్టండి.
టెంప్లేట్ల ట్రాన్స్ క్లూజను
[మార్చు]టెంప్లేటు ట్రాన్స్ క్లూజను వంటి వాటిని సంతకాల్లో వాడరాదు. ఇవి సర్వర్ల మీద భారం వేస్తాయి. సంతకాన్ని మార్చిన ప్రతీసారీ, ఆ సంతకం ఉన్న ప్రతిపేజీని తిరిగి కాషె చెయ్యాల్సి ఉంటుంది.
ఈ సంతకం మూసలు దుశ్చర్యకు శాశ్వత లక్ష్యాలు. సభ్యుడు వికీని వదలి వెళ్ళిపోయినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. మామూలు టెక్స్టు సంతకాలు పెద్దగా సర్వరు వనరులను వాడకుండా, ఎటువంటి ఇబ్బందులను కలిగించకుండా ఉంటాయి.
వర్గాలు
[మార్చు]సంతకాలలో వర్గాలు ఉండకూడదు. చర్చాపేజీల్లో ఎవరెవరు రాసారనేదాన్ని బట్టి వర్గీకరించడం వలన ఉపయోగమేమీ లేదు. పైగా ఈ విషయం మీ రచనల జాబితాకు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. అనేక ఇతర ఉపకరణాలు కూడా ఈ సంఖ్యను చెబుతాయి.